Afghanistan: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు

- రచయిత, షుమైలా జాఫ్రీ
- హోదా, బీబీసీ న్యూస్
అఫ్గానిస్తాన్ సరిహద్దులలో పాకిస్తాన్‌లో ఉన్న చమన్ ఒక చిన్న గ్రామం. కానీ, అఫ్గాన్ సంక్షోభంతో ఈ గ్రామం పరిస్థితి మారిపోయింది.
అఫ్గానిస్తాన్ నుంచి చమన్‌కి వస్తున్న ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మరో వైపు, సరిహద్దులు దగ్గర వేచి చూస్తున్న వేలాది మంది నిస్సహాయత కూడా కనిపిస్తోంది.
బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ చమన్ సరిహద్దు దగ్గర ఉన్న అఫ్గాన్ శరణార్థులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు.
సరిహద్దు దాటిన వారు కాస్త ఊపిరి తీసుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, వారి భవిష్యత్తును ఊహించుకుని పూర్తిగా ఆవేదన చెందుతున్నారు. కొంత మంది శరణార్థులు తమ కష్టాలను బీబీసీతో పంచుకున్నారు.
భద్రత దృష్ట్యా శరణార్ధుల పేర్లను మార్చాం.

ఇద్దరు తల్లుల కథ
‘జర్కూన్ బీబీ’ కాబుల్‌లోని తన సొంత ఇంటిని వదిలిపెట్టి ఇక్కడకు వచ్చారు. సరిహద్దు దగ్గర ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో ఇరుకుఇరుకుగా ఉన్న స్థలంలో కూర్చున్నారు.
తమ తెగకు చెందినవారు ఎవరైనా అక్కడకు వచ్చి తనను తీసుకువెళ్తారని ఆమె ఎదురు చూస్తున్నారు. ఆమెకు పాకిస్తాన్‌లో బంధువులెవరూ లేరు.
జర్కూన్ హజారా తెగకు చెందినవారు. ఆమె జీవితంలో శరణార్థిగా మారడం ఇది రెండోసారి.
‘ఎలా ఉన్నారు’ అని అడగ్గానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది.
"నా గుండె దుఃఖంతో మండిపోతోంది".. "నా కొడుకు, నా ఒకే ఒక్క కొడుకుకు ఏమి జరుగుతుందో అని భయంగా ఉంది" అన్నారు.
జర్కూన్ కొడుకు బ్రిటిష్ సంస్థ కోసం పని చేస్తున్నారు. ఆయన ఇంకా అఫ్గానిస్తాన్ విడిచిపెట్టి రాలేదు.
"నా కోడలిని చంపేసినప్పుడు నేను చాలా రోజులు నిద్రపోలేకపోయాను"
తాలిబాన్లు కొన్నేళ్ల కిందట హజారా తెగ వారిని లక్ష్యంగా చేసుకుని చేసిన బాంబు దాడిలో ఆమె కోడలు మరణించినట్లు ఆమె చెప్పారు.
"తాలిబాన్లు భయంకరమైన మనుషులు. నాకు వారంటే భయం. నా కోడలు వాళ్ళ వల్లే చనిపోయింది. వాళ్ళ పట్ల ఎటువంటీ సానుభూతి లేదు. వారికి హృదయం లేదు" అని అన్నారు.
జర్కూన్ కూతుర్లిద్దరూ ఆమె వెనుక ఇరుక్కుని కూర్చున్నారు. ఆమె ఒడిలో మనుమరాలు ఉన్నారు.
తన కోడలి అంత్యక్రియలు తన చేతుల మీదుగానే చేశానని.. అలాంటి కష్టం మళ్లీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేనని అన్నారు.
"నా ఇల్లు, వస్తువుల గురించి నాకు చింత లేదు. నేను కేవలం నా కొడుకు, మనుమరాలి కోసం మాత్రమే ఆందోళన చెందుతున్నాను" అని తన మనుమరాలి భుజాలు తడుముతూ చెప్పారు.
"నేనెక్కడికి వెళ్ళగలను? నేనేమి చేయగలను? ఈ చిన్నారి తల్లిని నా చేతులతోనే సమాధి చేశాను. పిల్లలను పెంచడానికి చాలా శ్రమ, ప్రేమ అవసరం. నేను మరొకరిని పోగొట్టుకునే పరిస్థితిలో లేను" అని అన్నారు.

ఘజినిలో షియా తెగకు చెందిన జర్మీని బేగం కూడా కొంత మంది మహిళలతో కలిసి అక్కడకు వచ్చారు. గతంలో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు షియాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె వయస్సు 60 సంవత్సరాలపైనే ఉంటుంది. తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించిన వెంటనే ఏమనిపించిందో ఆమె బీబీసీకి వివరించారు.
‘‘మేం దిగ్బ్రాంతికి లోనయ్యాం. వెంటనే మా ఇళ్లను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాం".
"సరిహద్దుల దగ్గర పరిస్థితి బాగోలేదు. మహిళలకు గోప్యత అవసరం. కానీ, అఫ్గానిస్తాన్ వదిలిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు" అని అన్నారు.
"తాలిబాన్లు తిరిగి దేశాన్ని ఆక్రమించారు. వారి తీవ్రవాద కార్యకలాపాలను తిరిగి మొదలుపెడతారేమోనని భయంగా ఉంది. వాళ్లు మా ఇళ్ల పై దాడులు చేస్తారు. వారు ప్రభుత్వ అధికారుల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఏ క్షణంలోనైనా బాంబు దాడులు మొదలవ్వవచ్చని అనిపిస్తుంది" అని భయపడ్డారు.
జర్కూన్ మాదిరిగానే జర్మీని కూడా తన ఇంటిని వదిలి శరణార్థిగా రావడం ఇది రెండోసారి.
1980లలో కాలంలో తొలిసారి శరణార్థిగా వెళ్లినప్పుడు తక్కువ వయసే కావడంతో పరిస్థితులను తట్టుకోగలిగానని చెప్పారు.
"కానీ, ఇప్పుడు నాలుగు అడుగులు వేసినా ఆయాసం వస్తోంది" అని చెప్పారు.

"ఆశ వదులుకున్న ప్రజలు"
పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ సరిహద్దులలోని చమన్ రద్దీగా ఉంటుంది. ఈ సరిహద్దు మీదుగా రోజూ కొన్ని వేల మంది వ్యాపారులు, ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. కానీ, ఇటీవల కాలంలో పాకిస్తాన్ వైపు వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
పొద్దున్న నుంచి రాత్రి వరకూ కొన్ని వందల మంది పురుషులు తమ భుజాల మీద సరకులు మోస్తూ, బురఖాలు ధరించిన మహిళలు, పురుషుల వెంట నడుస్తూ, తల్లులకు అతుక్కుని ఉన్న పిల్లలు, ఎండలో అలసిపోయి, కొంత మంది కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, చక్రాల కుర్చీలపై కొంత మంది రోగులు పాకిస్తాన్ లోకి రావడం కనిపిస్తోంది.
అందులో చాలామంది యుక్త వయస్సులో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు.
18 ఏళ్ల జమాల్ ఖాన్ కాబుల్‌లో 11వ తరగతి చదువుతున్నాడు. కాబుల్ పతనాన్ని ఆ అబ్బాయి స్వయంగా చూశాడు.
ఎటువంటి ప్రతిఘటన ఎదుర్కోకుండా తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడం పట్ల చాలా నిరాశ చెందాడు.
"అందరికీ ఎవరి ఇళ్లల్లో వారికి ఉండాలని అనిపిస్తుంది. కానీ, మేం అఫ్గానిస్తాన్ వదిలిపెట్టాల్సి వచ్చింది. మేమిలా పాకిస్తాన్‌కి కానీ, మరో దేశానికి కానీ వలస వెళ్లడం పట్ల సంతోషంగా లేం. అందరూ ఆందోళనగానే ఉన్నారు. ఎవరికీ ఎటువంటి ఆశా లేదు" అని అన్నారు.
తాలిబాన్ల పాలనలో మహిళల పరిస్థితి ఎలా మారిందో జమాల్ వివరించారు.
"తాలిబాన్లు కాబుల్‌ని స్వాధీనం చేసుకున్న రెండో రోజుకే వీధుల్లో మహిళలు కనిపించలేదు. మొదట ఎవరూ కనిపించలేదు. తర్వాత పూర్తిగా బురఖాలు ధరించిన కొంత మంది అక్కడక్కడా కనిపించారు" అని చెప్పారు.
"గతంలోలా తాలిబాన్లు మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం ఇంకా మొదలుపెట్టలేదు. కానీ, మహిళలు మాత్రం భయంతో వణుకుతున్నారు" అని చెప్పారు.

పంజ్‌షీర్‌కు చెందిన ముహమ్మద్ అహ్మర్ చదువుకుంటూ, కాబుల్‌లో ఇంగ్లిష్ నేర్పించే పని చేస్తున్నారు.
"ఇది నమ్మశక్యంగా అనిపించటం లేదు. కానీ, నిజానికి వారు ఒక్క రాత్రిలోనే కాబుల్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటారని మాకు తెలియదు. కానీ, నేను నా స్కూలు, నా చదువు గురించే భయపడుతున్నాను" అని చెప్పారు.
తన ప్రయాణంలో తాలిబాన్లు ఎక్కడా ఆటంకం కలిగించలేదని చెప్పారు. ఈసారి వారు భిన్నంగా ఉండొచ్చన్నారు. అయితే, తాలిబాన్ల చేతిలో గతంలో బాధపడిన వారు మాత్రం వారిని నమ్మడానికి సిద్ధంగా లేరు" అని చెప్పారు.
"నా జీవితం గురించి నేను సొంత నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాను. నాకు స్వతంత్రం కావాలి. నేను వెనక్కి వెళ్లాలని అనుకోవడం లేదు" అని అన్నారు అహ్మర్.
అలీ ఛంగేజి ఘజనీలో ఒక ప్రభుత్వ ఉద్యోగి. అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయిన రోజు నుంచి అఫ్గానిస్తాన్ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
సరైన ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల ఇప్పటికే మూడు సార్లు ఆయనను వెనక్కు పంపేసినట్లు చెప్పారు. చివరకు మానవతా దృక్పథంతో పాకిస్తాన్‌లోకి వచ్చేందుకు అనుమతించారని చెప్పారు.
ప్రస్తుతానికి ప్రాణాలను రక్షించుకోవడమే ప్రాధాన్యమని, అందుకే వలస వచ్చేందుకు నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఇక్కడ మా ప్రాణాలకు భయం లేదనిపించి ఇక్కడకు వచ్చామని చెప్పారు.

‘మాజీ సైనికుడు, తాలిబాన్’
మేం సరిహద్దు సమీపంలో ఉండగా తజక్ జాతికి చెదిన అఫ్గాన్ మాజీ సైనికుడు ఒకరు తన కొడుకును మాతో మాట్లాడేందుకు పంపించారు.
ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అప్పుడే సరిహద్దు దాటారు.
తాలిబాన్లు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా వారు వెంటాడి వేధించక మానరని అన్నారాయన.
కాందహార్‌కు చెందిన క్షేత్రస్థాయి తాలిబాన్ ఒకరు కూడా బీబీసీ బృందంతో మాట్లాడారు. ఆయన తెల్లని సల్వార్ కమీజు, నడుము వరకు ఉండే నల్లని కోటు ధరించి స్థానిక వస్త్రధారణలో ఉన్నారు. భుజాల వరకూ నల్లని జుట్టుతో, గెడ్డం దగ్గరకు కత్తిరించి ఉంది. ఆయన ధీమాగా కనిపించారు.
అయితే, ఆయన పేరు, వివరాలు రికార్డు చేసేందుకు అంగీకరించలేదు.
తనకు 24 ఏళ్లన, గత 15 ఏళ్లుగా తాలిబాన్ల కోసం పోరాడుతున్నట్లు చెప్పారు.
అఫ్గానిస్తాన్ లో పరిస్థితి పూర్తిగా శాంతియుతంగా ఉందని, విదేశీ సేనలు దేశాన్ని విడిచి పెట్టి వెళుతుండటంతో అఫ్గాన్ ప్రజల వేదన త్వరలోనే అంతమవుతుందని చెప్పారు.
"ఇదంతా నమ్మకానికి సంబంధించిన విషయం. మేం హామీ ఇచ్చినవన్నీ చేస్తామని ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు" అని చెప్పారాయన.

నిరాశ, నిరుత్సాహం
పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో తాలిబాన్ల జెండా ఎగురుతోంది. మరోవైపు సరిహద్దులు దాటుతున్న శరణార్థులు మాత్రం తమ భవిష్యత్తు అగమ్యగోచరమంటూ రోదిస్తున్నారు.
ఇప్పటికే పాకిస్తాన్ కొన్ని లక్షల మంది అఫ్గాన్ శరణార్ధులకు ఆశ్రయం కల్పిస్తోంది. మరో సారి ఈ ప్రవాహాన్ని ఎదుర్కోలేమని చెబుతోంది.
పాకిస్తాన్ త్వరలోనే శరణార్ధుల ప్రవేశాన్ని అడ్డుకునే రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తోంది.
శరణార్ధుల కోసం శిబిరాలను సరిహద్దుల్లోనే నెలకొల్పుతామని, వారిని ప్రధాన భూభాగంలోకి రానివ్వబోమని చెబుతోంది.
ప్రస్తుతానికి చమన్ సరిహద్దు దగ్గర సానుకూల విధానాన్నే అవలంబిస్తున్నప్పటికీ, ఎంతోకాలం అలాంటి సానుకూలత ఉండదని శరణార్ధులకు కూడా తెలుసు.
వారు మాత్రం అఫ్గానిస్తాన్ నుంచి బయటపడేందుకు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. కొంత మంది తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగు పెడుతుంటే, మరి కొందరు పేదరికం నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నారు.
వ్యాపారాలు నాశనమై పోయాయని, ప్రభుత్వం లేదని, ఆర్థిక వ్యవస్థ చిందరవందరగా మారిందని కాందహార్‌కు చెందిన కార్మికుడు ఒబైదుల్లా చెప్పారు.
"కాందహార్ లో పరిస్థితి సాధారణంగానే ఉంది. కానీ, మాకు పని లేదు. నేనిక్కడకు పని దొరుకుతుందేమోనని వచ్చాను. నేను రిక్షా నడుపుకొంటాను"అని చెప్పారు.

స్పిన్ బోల్డక్ పట్టణం, చమన్ ద్వారం దగ్గర ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అఫ్గాన్ సరిహద్దు దగ్గర కిక్కిరిసి ఉంది. వారిని నెట్టేస్తున్నారు. అక్కడ నుంచి సరిహద్దు దాటి పాకిస్తాన్ వచ్చేందుకు ప్రజలు క్యూ కట్టారు.
సంగీన్ ఖాన్ అఫ్గాన్ జాతీయుడు. కానీ, ఆయన పాకిస్తాన్‌లో స్థిరపడ్డారు. ఆయన ఈ మధ్యే నంగర్హర్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడున్న సోదరిని చూడటానికి వెళ్లారు. అక్కడ తాలిబాన్ల కంటే కూడా ప్రజలను పేదరికం చంపేస్తోందని చెప్పారు.
"ప్రజలకు తినడానికి ఏమి లేదు. ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి సరిగ్గా లేదు. దాంతో, వారు పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలకు వలస వెళ్లిపోతున్నారు" అని చెప్పారు.
బాఘ్లన్‌లో బొగ్గు గనుల్లో పని చేసే పర్షియా భాష మాట్లాడే ఒక వ్యక్తి భుజాలపై సంచి మోస్తూ నడుస్తుండగా, భార్య బురఖా ధరించి ఆయన వెనకే నడుస్తున్నారు.
సొంతూరిలో గనులను మూసివేయడంతో, ఆయనకిప్పుడు పని లేదని చెప్పారు. ఆయన చమన్ సరిహద్దు నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోని కుచలక్ అనే ఊరు వెళుతున్నారు. అక్కడున్న బొగ్గు గనుల్లో పని కోసం ఆయన వెళుతున్నారు.

"అమరుల సమాధులు"
ఈ శరణార్థులంతా తాలిబాన్ల నుంచి తప్పించుకుని వస్తున్నారు. కానీ, కెట్టా- కాందహార్ రోడ్డుపై వివిధ ప్రదేశాల్లో అఫ్గానిస్తాన్ జెండా ఎగురుతూ కనిపిస్తోంది.
కుచలక్ , పీర్ అలీ జాయ్ అడవి మధ్యలోనున్న ప్రాంతాన్ని తాలిబాన్లకు స్థావరంగా చెబుతారు.
కెట్టా- కాందహార్ రోడ్డు పై కనీసం 4 సమాధులు కనిపించాయి. వాటిని స్థానికులు "అమరుల సమాధులు " అని పిలుస్తారు. అవి అఫ్గాన్ తాలిబాన్ల సమాధులు. అందులో కొన్ని చాలా పాతవి ఉన్నాయి. కొన్ని కొత్తవి ఉన్నాయి. ఇటీవల మరణించిన వారిని కూడా ఇక్కడకు తీసుకుని వచ్చి ఖననం చేసినట్లు స్థానిక డ్రైవర్ చెప్పారు.
తాలిబాన్లతో ఉన్న సంబంధాల గురించి, పాకిస్తాన్ నేలపై తాలిబాన్లు ఉండడంపై పాకిస్తాన్ బహిరంగంగానే అంగీకరిస్తోంది.
ఇక్కడ తాలిబాన్లు మాత్రమే కాదు, 30 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు కూడా ఉన్నారని చెబుతోంది.
అందులో సగం మంది శరణార్ధుల వివరాలు అధికారికంగా నమోదు కాలేదు.
అఫ్గాన్‌లో అన్ని రాజకీయ పక్షాలతో కూడిన ప్రభుత్వాన్ని సమర్థిస్తామని పాకిస్తాన్ చెబుతోంది.
తాలిబాన్లు కాలంతో పాటు మారారని పాకిస్తాన్‌లోని విశ్లేషకులు కొందరు చెబుతున్నారు.
‘‘వారు ఒక రాజకీయ సంస్థగా మారారు. కానీ, గతంలో చేసిన పనిని సరిదిద్దుకోవడానికి కొంత సమయం పడుతుంది’’ అంటూ తాలిబాన్‌లకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కట్టుబట్టలు, ఒక్క సూట్‌కేస్‌తో దేశం వదిలి వెళ్తున్నారు
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పామాయిల్ మిషన్’ ఏంటి? ఎలా పని చేస్తుంది?
- పాకిస్తాన్‌లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








