అఫ్గానిస్తాన్: కాబుల్ పరిస్థితులు చక్కబడుతున్నాయా, వీసాల కోసం జనం ఎందుకు బారులు తీరుతున్నారు?

- రచయిత, ముదస్సిర్ మలిక్
- హోదా, బీబీసీ, కాబుల్
కాబుల్‌లో మరో రోజు బిజీగా గడిచిపోయింది. మంగళవారం నాడు ఇక్కడి నుంచి ఖతర్ వెళ్లే ప్రయాణికులతో హోటల్ నిండిపోయింది. అదే సమయంలో తేనెటీగల గుంపులాగా పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ జర్నలిస్టులు ఇక్కడికి చేరుకున్నారు.
మరోవైపు విదేశీ జర్నలిస్టులు తిరిగి తమ దేశాలకు బయలుదేరేందుకు చూస్తున్నారు.
హోటల్‌లోని డైనింగ్ ఏరియాలో ఒక కుర్చీలో నేను కూర్చొగానే... సిబ్బంది వచ్చి బ్రేక్‌ఫాస్ట్ పదార్థాలు అయిపోయాయని చెప్పారు.
బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గరే కాదు, ఎక్కడికెళ్లినా మా ధ్యాసంతా ఎయిర్‌పోర్ట్ వైపే మళ్లుతోంది. అక్కడి నార్త్, సౌత్, ఈస్ట్ గేట్ల దగ్గర నెలకొన్న పరిస్థితుల గురించే చర్చ వస్తోంది.
నేను మరోసారి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి వచ్చింది. కానీ, అంతకన్నా ముందు మేం మేయర్ కార్యాలయానికి వెళ్లాం. అక్కడ పనులు ప్రారంభమయ్యాయి. కానీ 70 శాతం మంది ఇంకా విధులకు హాజరు కాలేదు.
అక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. కానీ వారితో మాట్లాడటం, ఇంటర్వ్యూ చేయడం మాకు సాధ్యం కాలేదు. ఒక మహిళను పలకరించగా, తన ఉద్యోగ స్వభావం రీత్యా మాట్లాడలేనని ఆమె నాతో చెప్పారు. మరో వ్యక్తి తమకు 2 నెలలుగా జీతాలు అందలేదని చెప్పారు.

సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నాలు
కాబుల్‌లో వీధులను శుభ్రపరిచే పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ తాలిబాన్లు ప్రత్యేక మేయర్‌ను నియమించారు. మాజీ మేయర్ కూడా ఆయనతో కలిసి పనిచేస్తున్నారు.
అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోని నార్త్ గేట్ వైపు వెళ్లాం. అక్కడ భారీగా వాహనాలు కనిపించాయి. ఆ లైన్ దాదాపు 3 కి.మీ. వరకు ఉంటుంది. వారంతా ఆ గేట్ నుంచి లోపలికి వెళ్లాలని అనుకుంటున్నారు. ఆ గేట్ దగ్గరే అఫ్గాన్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.
మేం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నప్పుడు కాల్పుల శబ్ధాలు మరింత ఎక్కువగా వినిపించాయి.
ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అఫ్గాన్ పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లాలంటూ గద్దించారు. సైనికులు చాలా కోపంగా ఉన్నారు. వారి చేతిలో కొరడా లాంటిది ఉంది. దాంతో మమ్మల్ని రెండుసార్లు కొట్టారు. తర్వాత గుర్తింపు కార్డులు తనిఖీ చేసి మమ్మల్ని వెళ్లనిచ్చారు.

ఫొటో సోర్స్, Anas Malik
మతాధికారులు సమావేశం
తాజా పరిణామంలో తాలిబాన్ల నాయకత్వంలో తొలి లోయా జిర్గా (మతాధికారుల సమావేశం) జరిగింది. ఇందులో 500లకు పైగా మతాధికారులు పాల్గొన్నట్లు కొందరు జర్నలిస్టు మిత్రులు చెప్పారు. ఆ సమావేశంలో తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ కూడా మాట్లాడారు.
ఆయన మదర్సాలు, పాఠశాలల్లో విద్యాబోధనా పద్ధతుల గురించి చెప్పారు. అఫ్గాన్‌లో జీవించడం ప్రమాదకరం కాదన్న ఆయన, బయట పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు.
కొంతమంది అఫ్గాన్‌ను విడిచిపెట్టాలని కోరుకుంటుండగా, మరికొంత మంది అఫ్గాన్‌ను విడిచిపెడుతున్నందుకు ఉద్వేగంగా ఉన్నారు.
మంగళవారం నాడు 4 విమానాలు ఇక్కడ నుంచి బయలుదేరాయి. కానీ పాకిస్తాన్‌కు చెందిన పీఐఏ విమానాన్ని ఎందుకు రద్దు చేశారో మాత్రం తెలియలేదు.

ఫొటో సోర్స్, Getty Images
వీసాల కోసం ప్రయత్నాలు
మేం హోటల్‌కు తిరిగి వచ్చేసరికి అక్కడ ప్రత్యేక ఇమ్మిగ్రేషన్ వీసాల కోసం ప్రజలు గుమిగూడారు. వీరంతా విదేశీయులతో కలిసి మీడియాలో లేదా వ్యాఖ్యాతలుగా పని చేసినవారి కుటుంబాలకు చెందిన వారు. ఖతార్ గార్డ్‌లు హోటల్ భద్రతను నియంత్రిస్తున్నారు.
ఎవరో వారిని తమ సొంత దేశం నుంచి బలవంతంగా తరిమివేస్తున్నట్లుగా వారి ముఖాలు బాధతో నిండి ఉన్నాయి. ఇక తమకు మరో దారి లేదన్నట్లుగా వారు అక్కడికి వచ్చారు.
హోటల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు అక్కడే లాబీలో నిల్చొన్న తాలిబాన్లలో ఒకరితో నేను మాట్లాడాను. మాటల సందర్భంగా నేను పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తినని చెప్పాను. వెంటనే అతను కోపంగా 'చాలా మంది పాకిస్తానీలు ఎందుకు అఫ్గానిస్తాన్‌కు వస్తున్నారు?' అని నన్ను అడిగారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా: బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా?
- మోదీకి ప్రజాదరణ ఒక్కసారిగా ఎందుకు తగ్గింది
- కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?
- కరోనావైరస్: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ ఎలా సిద్ధం అవుతోంది?
- బ్రిటన్‌లోని భారతీయులు దైవభాష సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు?
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








