నరేంద్ర మోదీ: పాపులారిటీ తగ్గడానికి కారణమేంటి? కరోనాయా, కోలుకోని ఆర్థిక వ్యవస్థా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ ఓటర్లు అందించిన విజయాలతో నరేంద్ర మోదీ పాలనాకాలంలో చాలా భాగం సజావుగా సాగిపోయింది.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వరుసగా రెండు ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో విజయం సాధించింది.
హిందూ జాతీయవాదుల మద్దతు కూడగట్టుకున్న ఆయన తన ఛరిష్మాతో ఓటర్లను ఆకర్షించి, ప్రత్యర్థులపై పైచేయి సాధించారు.
అదృష్టం కూడా మోదీ వైపే ఉంది. 2016లో డీమానిటైజేషన్‌తో పెద్ద నోట్లను రద్దు చేయడం, ఆర్థిక వ్యవస్థ మందగించడం లాంటి తప్పిదాలను సైతం ఆయన మద్దతుదారులు క్షమించారు.
వీటి వల్ల మోదీకి మద్దతు తగ్గినట్లు కనిపించలేదు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చింది.
అయితే, మోదీ సాధించుకున్న తిరుగులేని ప్రజాదరణ ఇప్పుడు తగ్గుతోందా?
ఇండియా టుడే మేగజీన్ ఈ జులైలో చేసిన సర్వేలో పాల్గొన్న 14,600 మందిలో కేవలం 24 శాతం మంది మాత్రమే 70 ఏళ్ల మోదీని వచ్చే ఎన్నికలలో కూడా భారత్‌కు ప్రధానిగా సరిపోతారని పేర్కొన్నారు.
భారత్‌లో సాధారణ ఎన్నికలు 2024లో జరగనున్నాయి.
గత ఏడాది సర్వే గణాంకాలతో పోల్చితే ఆయనకు మద్ధతు 42 పాయింట్లు తగ్గింది. 'ఒపీనియన్ పోల్స్‌లో నాకున్న ఇరవై ఏళ్ల అనుభవంలో ఎన్నడూ ఓ ప్రధాని పాపులారిటీ ఇంత తక్కువ సమయంలో దిగజారిపోవడం చూడలేదు' అని రాజకీయ నాయకుడు, మోదీ విమర్శకుడు యోగేంద్ర యాదవ్ అన్నారు.
మోదీకి ఈ ఏడాది అంతగా బాగాలేదు. కోవిడ్ రెండో వేవ్‌ను సరిగా అదుపు చేయలేని కారణంగా వేలాది మంది మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన ఖ్యాతి దిగజారింది.
ఆర్థికవ్యవస్థ కూడా కుదురుగా లేదు. ద్రవ్యోల్బణం పెరిగింది. ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఉద్యోగాలు, వినియోగం తదితర సమస్యలు దేశాన్ని వెంటాడుతున్నాయి.

ఫొటో సోర్స్, EPA
సర్వేలో ఈ అంశాలపైనే అపనమ్మకం వ్యక్తమైంది. మహమ్మారి కారణంగా తమ ఆదాయం పడిపోయిందని 70 శాతం మంది చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం కోవిడ్ మరణాలు 4.30 లక్షలు. కానీ వాస్తవ సంఖ్య దీని కంటే అధికంగా ఉంటుందని భావిస్తున్నారు.
36 శాతం మంది మహమ్మారిని మోదీ బాగానే కట్టడి చేశారని అభిప్రాయపడ్డారు. కోవిడ్ విషయంలో వైఫల్యానికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యతని 13 శాతం మంది అభిప్రాయపడగా, 44 శాతం మంది మాత్రం కేంద్రంతోపాటూ రాష్ట్ర ప్రభుత్వాలదీ బాధ్యత ఉందన్నారు.
మహమ్మారిని పక్కనపెడితే, మోదీ పాపులారిటీ తగ్గడానికి గల మరికొన్ని కారణాలను ఈ సర్వే వెల్లడించింది. ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కొరత ప్రజలందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట రెండొంతుల మంది ధరలను అదుపు చేయలేకపోవడం ప్రభుత్వ అతి పెద్ద వైఫల్యం అని చెప్పారు.
‘‘మోదీకి ఉన్న ప్రజాదరణ తగ్గడం నాకు ఆశ్చర్యకరంగా లేదు’’అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఫెలో రాహుల్ వర్మ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ ఓ ప్రజాకర్షణ గల నాయకుడు. అతని పాలనలో, మీడియా స్వేచ్ఛ గణనీయంగా తగ్గిపోయిందని విమర్శకులు అంటున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రధానమంత్రి ఒక్క విలేకరుల సమావేశం కూడా నిర్వహించలేదు. ఆయనపై అసమ్మతి స్పష్టంగా ఉంది.
మోదీ, ఆయన పార్టీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి రాజకీయాలను పావుగా వాడుకున్నారని, సాంకేతికతను అడ్డం పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పౌరసత్వ చట్టం, వ్యవసాయ సంస్కరణలపై వ్యక్తమైన వ్యతిరేకత, నిరసనలు మోదీ అజేయుడనే భావనకు తూట్లు పొడిచాయి. ఈ ఏడాది మే నెలలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఓటమి ప్రత్యర్ధుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపింది.
బిల్ బోర్డులు, వ్యాక్సిన్ సర్టిఫికేట్లు, న్యూస్ పేపర్లు, టీవీ ప్రకటనల్లోనూ కనిపించే ఓ వ్యక్తి రేటింగ్స్ పడిపోవడం ఆయన ఆదరణ తగ్గిపోవడం ప్రారంభమైందని సూచిస్తోంది. కానీ, ఇలాంటి సర్వేలు నిజంగా దేశం ఏమనుకుంటోందో చెప్పగలవా?
13 దేశాల్లో ఎన్నికైన నాయకుల రేటింగులను గమనిస్తోన్న 'మార్నింగ్ కన్సల్ట్' ప్రకారం.. గతేడాది మే నుంచి మోదీ రేటింగ్ 25 పాయింట్లు పడిపోయింది. ఆగస్ట్ మధ్యలో ఆయన 47 శాతం మంది ఆమోదంతో ఇతరుల కంటే ముందున్నారు.
భారత్‌కే చెందిన పోలింగ్ ఏజెన్సీ ప్రశ్నమ్ ఈ జూన్‌లో విడుదల చేసిన సర్వేలో 33 శాతం మంది ప్రధాన మంత్రి అభ్యర్ధిగా నరేంద్రమోదీని కోరుకున్నారు.

ఫొటో సోర్స్, AFP
దేశంలోని 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో వారానికి 10 వేల ఇంటర్వ్యూలు చేసే దిల్లీకి చెందిన సీఓటర్ సంస్థ ఈ ఏడాది మేలో మోదీ రేటింగ్స్ 37 శాతం మేర తగ్గాయని తెలియజేసింది.
ఏప్రిల్‌తో పోల్చితే 20 పాయింట్లు పడిపోయాయని వివరించింది. ఆ సమయంలోనే బీజేపీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అపజయం పాలైంది. ఇదే సమయంలో కరోనా వైరస్ దేశంలో రెండోసారి విజృంభిస్తోంది.
ఆ తర్వాత మోదీ రేటింగ్స్ మెల్లగా పుంజుకుంటూ 44 శాతానికి చేరాయని సీఓటర్స్‌కి చెందిన యశ్వంత్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ‘‘ఆయనకు ఓటర్ల మద్దతు ఏనాడూ 37 శాతం కంటే తగ్గలేదు’’ అన్నారాయన.
సాధారణ ఎన్నికలు మాత్రమే నాయకుల సామర్థ్యాలను కచ్చితంగా అంచనా వేయడానికి అవకాశం కల్పిస్తాయని దేశ్‌ముఖ్ వివరించారు.
బీజేపీ ముఖ్యమంత్రుల ప్రదర్శన ఎన్నికల్లో అంతగా బాగాలేదు. సీఓటర్ సర్వేలో పాపులర్ ముఖ్యమంత్రులుగా స్థానాలు దక్కించుకున్న 10 మందిలో తొమ్మిది మంది బీజేపీయేతర పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. అయితే, మోదీ ఇంకా దేశంపై పట్టును కోల్పోలేదు. ‘‘చాలామంది ఆయన్ను నమ్ముతున్నారు. ఆయన ఆలోచన విధానం సరైనదేనని భావిస్తున్నారు’’ అని దేశ్‌ముఖ్ చెప్పారు.
‘‘కేవలం రేటింగ్స్ పడిపోవడం వల్ల మోదీ పదవికి ప్రమాదం లేదు. మోదీ రేటింగ్స్ అత్యంత కనిష్ఠానికి పడిపోయినా, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పోల్చితే రెండింతలు ఉన్నాయి. నమ్మకమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల మోదీకి అదనపు పాయింట్లు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి’’
‘‘మోదీ రేసులో ఇంకా ముందంజలోనే ఉన్నారు. కానీ రేటింగ్స్ పడిపోవడం ఆయనకు కొంత ఆందోళన కలిగించొచ్చు’’ అని రాహుల్ వర్మ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- హాజీ మస్తాన్, వరదరాజన్ నుంచి కరీమ్ లాలా దాకా... ముంబయిలో ఒకప్పుడు డాన్లు ఎలా రాజ్యమేలారు?
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- 'తాలిబాన్లు కూడా సాధారణ ప్రజలే, కాబుల్ ఇప్పుడు సురక్షిత నగరంగా మారింది' - రష్యా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








