తెలంగాణ - హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?

ఫొటో సోర్స్, TelanganaCMO/FB
- రచయిత, అబ్బూరి సురేఖ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వేడికి కేంద్ర స్థానం హుజూరాబాద్. ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానం కోసం జరగబోయే ఉప ఎన్నిక కోసం ఎవరి ప్రణాళికల్లో వాళ్లున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు పథకం చర్చనీయాంశం అయింది.
రాజకీయ వ్యూహాల పరంగా ఎలా ఉన్నా, ఎన్నికలకు ముందు ప్రభుత్వ సొమ్మును రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా ఖర్చు చేస్తారనేదానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిపోతుందని విశ్లేషకులు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అసలేంటీ దళిత బంధు?
'దళిత బంధు' అని పిలిచే ఈ పథకం కింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని, ఆ కుటుంబానికి నేరుగా పది లక్షల రూపాయల నగదు బ్యాంకులో వేసేస్తారు. ఆ మొత్తాన్ని వారు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు.
మొదటి దశలో, 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేయబడిన 11,900 అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందించాలనుకున్నారు.
"ఈ బడ్జెట్‌లో సిఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకానికి 1200 కోట్లు కేటాయించాం. రాబోయే మూడు నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇది ఎస్సీ సబ్ ప్లాన్‌కు అదనం'' అని కేసీఆర్ అఖిలపక్షంలో చెప్పారు.
ఈ కార్యక్రమం గురించి కేసీఆర్ తనదైన శైలిలో ఏకంగా 11 గంటల పాటూ అఖిలపక్షం నిర్వహించారు. అంతేకాదు, ప్రతిపక్షాలు కాదుకదా, సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అరుదుగా అపాయింట్‌మెంట్ ఇచ్చే కేసీర్, ఏకంగా అఖిలపక్షం నిర్వహించడం కూడా ఒక విశేషమే.

రాష్ట్రమంతా ఒకేసారి ఈ పథకం ప్రారంభం అవుతుందనుకున్న సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.
"గతంలో అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే మొదలుపెట్టారు. అలాగే, ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకాన్ని కూడా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని, సెంటిమెంటును కొనసాగిస్తూ 'తెలంగాణ దళిత బంధు' పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు" అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ఈ పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గం... హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలోని 2586 కుటుంబాలకు.. మొత్తంగా చూస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
"నిబంధనల ప్రకారం, ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారుల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో (సాచురేషన్ మోడ్‌లో) వర్తింప చేస్తారు" అని సీఎం కార్యాలయం ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం రూ.1200 కోట్లతో అమలవుతుందని సిఎం తెలిపారు.
అయితే, పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందన్నారు.
దీనికోసం అదనంగా మరో రూ.1500 నుంచి రూ.2000 కోట్లను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో ఖర్చు చేయనున్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్తాయి వివరాలను త్వరలో విడుదల చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్ అక్కడితో ఆగలేదు. ఓ రకంగా హుజూరాబాద్ పరోక్ష ప్రచారం కూడా ప్రారంభించేశారు. అదెలా అంటే, ముఖ్యమంత్రి ఈ సోమవారం (జూలై 26న) హుజూరాబాద్ నుంచి దాదాపు 400 పైగా దళితులను తన ఆఫీసుకు పిలిపించి మాట్లాడబోతున్నారు. వారితో కలసి భోజనం చేయబోతున్నారు.
''ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) , ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళితులు పాల్గొంటారు. వారితో పాటు 15 మంది రిసోర్సు పర్సన్స్ కూడా దీనికి రానున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన మొత్తం 427 మంది దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటారు. వారు ముఖ్యమంత్రితో కలసి భోజనం చేస్తారు. దళిత బంధు గురించి సీఎం వారికి అవగాహన కల్పిస్తారు.'' అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఫొటో సోర్స్, EetalaNewsOfficial/Youtube
ఓ వైపు హుజూరాబాద్ లో ఎన్నికలు జరగబోతున్న వేళ ఆ ఒక్క నియోజకవర్గంలోనే రూ.2 వేల కోట్ల వరకు ప్రభుత్వ సొమ్మును నేరుగా 20 వేల మంది అకౌంట్లలో వేస్తానని కేసీఆర్ ప్రకటించడం రాజకీయంగా నైతికత అంశంపై చర్చకు దారి తీసింది.
ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి, ఎన్నికల వేళ ఖజానా నుంచి ఎంత కావాలంటే, అంత మొత్తాన్ని తమకు నచ్చిన ప్రాంతానికి తరలించవచ్చా? అనే ప్రశ్న వస్తోంది.
ఈ పథకం, అందునా పైలెట్ ప్రాజెక్టు ఎంపిక కచ్చితంగా హుజూరాబాద్‌లో రాజకీయంగా లబ్ది కోసం ఉద్దేశించినదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు.
''గత బడ్జెట్లో 'దళిత సాధికారత' అనే పథకం ప్రకారం జిల్లాకి 100 కుటుంబాలను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చెప్పున నగదు ఇవ్వాలని, రూ.12వేల కోట్లు ఈ పథకానికి ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ నియోజక వర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా మార్చారు. ఈ డబ్బును వారు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, దేనికి ఖర్చు పెట్టుకోవాలనే నిబంధనలేవీ పెట్టలేదు. తన ఎదుగుదల కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది. ఇది 20 వేల కుటుంబాలు, 40 వేల ఓట్లు అన్నట్లుగా ఉంది'' అని ఆయన అన్నారు.
''ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 2 లక్షల కోట్లు ఈ ఒక్క పథకానికి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వ పథకానికి ఇంత మొత్తాన్ని డబ్బు రూపంలో లబ్ధిదారుల ఖాతాలోకి వేయలేదు. '' అని ఆయన అన్నారు.
ఒక అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 18 శాతం మంది దళితులు ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితుల సంఖ్యపై రకరకాల లెక్కలున్నాయి.
హుజూరాబాద్‌లో 2004 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తూ వస్తోంది. 2009 నుంచి ఈటల రాజేందర్ ఇక్కడ పోటీ చేస్తూ వచ్చారు.

ఫొటో సోర్స్, FB/telangana CMO
ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ పంతం
తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా, అది సాధారణ ఎన్నికల స్థాయిలో మారిపోతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు తమ ఉనికి చాటుకోవడం, ప్రభుత్వం తన బలం చాటుకోవడం అనే ప్రశ్నలు వస్తున్నాయి. నాగార్జున సాగర్, దుబ్బాక ఎన్నికల హోరులో అది తెలిసింది. ఒకప్పుడు దుబ్బాకే పెద్ద ఉప ఎన్నిక అనుకుంటే, సాగర్ దానిని మించింది. ఆ రెండే గొప్ప అనుకుంటూ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక అంతకు మించి జరగబోతోంది.
గత ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి గెలిచిన రాజేందర్ ఇప్పుడు బీజేపీలో చేరారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ ఇప్పుడు టిఆర్ఎస్‌లో చేరారు. రాజేందర్ తన విజయంపై నమ్మకంతో ఉన్నట్టు బీబీసీతో చెప్పారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. మంత్రి కమలాకర్ నాయకత్వంలో టిఆర్ఎస్ అక్కడ తన శ్రేణులను మోహరించింది.
ఎన్నికల బరిలో దిగిన ఏ పార్టీ అయినా తమ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి వరాలు ప్రకటించడం సహజమే. కానీ, అధికారంలో ఉన్న పార్టీ ఇంత పెద్ద మొత్తంలో హామీలు కురిపించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
రూల్స్ ప్రకారం ఎన్నికల కోడ్ రాలేదు కాబట్టి, ప్రభుత్వం ఎక్కడైనా పథకాలు ప్రారంభించవచ్చు. కానీ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని తెలిసీ హుజూరాబాద్‌లో పథకం ప్రారంభించాలనుకోవడం నైతిక ప్రశ్నలను ముందుంచుతోంది.
"స్కీమ్ తెలంగాణ వ్యాప్తంగా అమలవుతుంది. కాకపోతే అది హుజూరాబాద్ నుంచి ప్రారంభమవుతోంది. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చాక ఏ పథకాన్ని ప్రారంభించ లేరు. ఇప్పుడు పోటీ ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఉంది కాబట్టి, అధికార పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈటల గెలిస్తే టీఆర్ఎస్‌లో అసంతృప్తులకు బలం పెరుగుతుంది. బీజేపీ స్పీడును నాగార్జున సాగర్ ఎన్నికల్లో కొంత వరకు తగ్గించగలిగారు. ఈ ఎన్నికలు బీజేపీకి కూడా చాలా ముఖ్యం. ప్రతిపక్షాల వేడిని తట్టుకోవాలంటే ఎత్తుగడలు వేయాల్సిందే. కానీ, ఒక్క పథకంతోనే ఎన్నికలు గెలవలేరు ''అని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఎం కేసీఆర్ ప్రకటించిన స్కీమ్ పైనా, దాన్ని వెల్లడించిన సమయం పైనా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ''కేసీఆర్ గారికి ఒక్కసారిగా హుజురాబాద్ నియోజకవర్గం పై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఇక తెలంగాణలోని సుమారు 20 లక్షల దళిత కుటుంబాల కోసం రూ.2 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. అసలు అంత బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందా?'' అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు.
''దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల భూమిలాగే ఇది కూడా ప్రకటనలకు పరిమితమయ్యే పథకంలా కనిపిస్తోంది. విపక్షాలు కోర్టుకెక్కితే దళితులకు వచ్చే సొమ్మును అడ్డుకున్నారంటూ వారిపై నిందమోపాలన్నది సీఎం ఆలోచన'' అన్నారామె.
ఇటు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ పథకంపై విమర్శలు చేసింది. "కోకాపేట్ దళితులకు అన్యాయం చేసి హుజూరాబాద్ ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారు. కోకాపేట్‌లో 260 దళిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది. మరి వారి సంగతి ఏంటి" అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- 1971 యుద్ధంలో భారత్ ముందు లొంగిపోయిన పాక్ ఫొటోను అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు ఇప్పుడెందుకు షేర్ చేశారు?
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









