కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?

భారత్‌లో 3 కోట్లకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారత్‌లో 3 కోట్లకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత సెప్టెంబరులో విపుల్ షా కోవిడ్ బారిన పడి 11 రోజుల పాటు ముంబయిలోని ఒక ఆసుపత్రిలో క్రిటికల్ కేర్‌లో ప్రాణాలతో పోరాడారు.

ఆయనకు అంతకు ముందు డయాబిటిస్ లేదు. కానీ, కోవిడ్ చికిత్సలో భాగంగా ఆయనకు స్టెరాయిడ్లు ఇచ్చారు.

శరీరంలో రోగ నిరోధక శక్తి వైరస్ తో పోరాడలేకపోయినప్పుడు, స్టెరాయిడ్లు ఊపిరితిత్తుల్లో చేరిన ఇన్ఫెక్షన్‌తో పోరాడి అవి పాడవకుండా ఆపగల్గుతాయి.

కానీ, అదే సమయంలో అవి శరీరంలో రోగ నిరోధకశక్తిని కూడా తగ్గించి రక్తంలో మధుమేహ స్థాయిలను పెంచేస్తాయి. ఇది డయాబిటిస్ ఉన్న రోగుల్లో, లేనివారిలో కూడా జరుగుతుంది.

షా కోవిడ్ నుంచి కోలుకుని సంవత్సరం కావస్తున్నా కూడా, డయాబిటిస్ నియంత్రణ కోసం మాత్రం మందులు వాడుతూనే ఉన్నారు.

"నా లాగే, కోవిడ్ తర్వాత డైయాబిటిస్ కోసం మందులు తీసుకుంటున్న వారు చాలా మంది నాకు తెలుసు" అని షా చెప్పారు. ఆయనొక స్టాక్ ట్రేడర్

ప్రపంచంలోని మధుమేహ రోగులు ప్రతి ఆరుగురిలో ఒకరు భారతదేశంలో ఉన్నారు. భారత్‌లో సుమారు 7.7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. చైనాలో 11.6 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు.

తమకు మధుమేహం ఉన్నట్లు గుర్తించని వారి సంఖ్య ఇంకా కొన్ని లక్షలు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

శరీరంలో పాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయలేనప్పుడు, లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు మధుమేహం వస్తుంది.

దీంతో రక్తంలో, గ్లూకోజ్ నిల్వలు పెరిగి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది.

దీని వల్ల కిడ్నీలు, కళ్ళు, గుండె కూడా దెబ్బతినే అవకాశముంది.

మధుమేహ పరీక్ష

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మధుమేహ పరీక్ష

డయాబిటిస్ ఉన్న వారు కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఊబకాయం, రక్తపోటు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలున్నవారికి కూడా కోవిడ్ ముప్పు ఉంది.

అయితే, కోవిడ్ నుంచి కోలుకున్న రోగులకు డైయాబిటిస్ సోకే ముప్పు ఉండవచ్చని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధిక స్థాయిలో కోవిడ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ 3.2 కోట్ల మంది కోవిడ్ బారిన పడ్డారు.

"ఈ మహమ్మారి అంతమయ్యేసరికి భారతదేశంలో డయాబిటిస్ సునామీ వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నాం" అని ముంబయికి చెందిన డైయాబెటాలజిస్ట్ డాక్టర్ రాహుల్ బక్సి చెప్పారు.

ఆయన దగ్గరకు వచ్చిన రోగుల్లో కోవిడ్ సోకినవారిలో 8-10 శాతం మంది ప్రస్తుతం కొత్తగా డయాబిటిస్ తో బాధపడుతున్నారని చెప్పారు.

కోవిడ్ తగ్గిన ఒక నెల తర్వాత కూడా వారు మధుమేహానికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

"కొందరికి బార్డర్ లైన్ డయాబిటిస్ ఉండగా, మిగిలిన వారు మధుమేహం కోసం మందులు తీసుకుంటున్నారు" అని చెప్పారు.

అయితే, కోవిడ్ వల్ల మధుమేహం వస్తుందా రాదా అనే అంశం గురించి ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు రకరకాల వాదనలు చేస్తున్నారు.

టైప్ -2 డయాబెటిస్ ఉన్న వారు వ్యాయమం, ఆహార నియమాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టైప్ -2 డయాబెటిస్ ఉన్న వారు వ్యాయమం, ఆహార నియమాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు

కోవిడ్ చికిత్సలో భాగంగా ఇచ్చిన స్టెరాయిడ్ల వల్ల శరీర రోగ నిరోధక శక్తిలో సైటోకిన్ స్టోర్మ్ తలెత్తుతుంది. దాంతో, ఇన్సులిన్ ను తయారు చేసే పాంక్రియాస్ లో కణాలను వైరస్ గాయపరుస్తుంది.

మ్యూకర్ మైకోసిస్‌ (బ్లాక్ ఫంగస్) నుంచి కోలుకున్న వారి పై భారతదేశంలో డాక్టర్లు నిర్వహించిన అధ్యయనంలో డయాబిటిస్ కు, కోవిడ్ కు సంబంధం ఉన్నట్లు తెలిసింది.

భారతదేశంలో 45 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీని వల్ల కళ్ళు, ముక్కు, కొన్ని సార్లు మెదడు కూడా ప్రభావితమవుతాయి. ఇది కోవిడ్ నుంచి కోలుకున్న 12-18 రోజుల తర్వాత సోకే అవకాశం ఉంది.

ప్రతీ 127 మంది రోగుల్లో 13 మందికి కొత్తగా మధుమేహం సోకినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. వారి సగటు వయసు సుమారు 36సంవత్సరాలు ఉంది. అందులో 7 మందికి చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లు కానీ, ఆక్సిజన్ కానీ వాడలేదు.

కానీ, వీరందరికీ శరీరంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోయాయి.

"ఇదంతా చూస్తుంటే, రానున్న రోజుల్లో చక్కెర వ్యాధిగ్రస్థులు మరింత పెరిగే అవకాశం ఉంది" అని ఐ సర్జన్ డాక్టర్ అక్షయ్ నాయర్ చెప్పారు.

దిల్లీ, చెన్నయ్ లోని రెండు ఆసుపత్రుల్లో 555 మంది రోగులపై నిర్వహించిన అధ్యయనం కూడా కోవిడ్ సోకిన తర్వాత రోగులు డయాబిటిస్ కి గురవుతున్నారని తేల్చింది.

"డయాబెటిస్ కి కోవిడ్ కి మధ్య నున్న సంబంధం చాలా సంక్లిష్టమైన చిత్రాన్ని ఇస్తోంది" అని ఈ అధ్యయన సహ రచయత, డైయాబెటాలజిస్ట్ డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు.

కోవిడ్ చికిత్స

ఫొటో సోర్స్, AFP

మధుమేహ స్థాయిల మూడు నెలల సగటు చూసేందుకు చేసే హెచ్ బి ఏ 1 సి పరీక్షలో రోగులు మధుమేహంతో ఉన్నట్లు తేలింది.

వీరు అంతకు ముందే మధుమేహానికి గురయినప్పటికీ, వారు పరీక్ష చేయించుకోకపోవడం వల్ల బయటపడలేదు.

లేదా, స్టెరాయిడ్లతో చికిత్స మొదలుపెట్టిన వెంటనే మధుమేహానికి గురై ఉండవచ్చు.

"ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కొంత మంది రోగుల్లో మధుమేహ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చాయి. కానీ, కొంత మందిలో మాత్రం ఎక్కువగానే ఉన్నాయి" అని డాక్టర్ షా వివరించారు.

"అలాంటి రోగులు, కుటుంబ ఆరోగ్య చరిత్ర వల్ల గాని, లేదా ఊబకాయం వల్ల గానీ, డ యాబిటిస్ కి గురై ఉంటారని, డాక్టర్ మిశ్రా చెప్పారు.

డయాబెటిస్

ఫొటో సోర్స్, AFP

కరోనా వైరస్ పాంక్రియాస్ ను బాగా గాయపరచడం వల్ల కూడా కొంత మంది తీవ్ర స్థాయిలో మధుమేహానికి గురయ్యారు. ఇది అరుదుగా జరిగింది. అలాంటి వాళ్లకి టైప్ 1 (ఇన్సులిన్ తయారు చేసుకోలేవు) లేదా టైప్ 2 ఇన్సులిన్ (శరీరం అతి తక్కువ స్థాయిలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది) లో ఏదో ఒకటి ఉండవచ్చు.

"ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పాంక్రియాస్ ని కరోనావైరస్ లక్ష్యంగా చేసుకుంటుంది" అని ఇంపీరియల్ కాలేజి లండన్ లో ప్రొఫెసర్ గయ్ రట్టర్ అన్నారు.

"శరీరంలో ఇతర భాగాల కంటే కూడా పాంక్రియాస్ లో వివిధ రిసెప్టర్లను వైరస్ వాడుకుంటూంటుంది. దాంతో, దాని ప్రభావం నేరుగా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల మీద పడుతుంది" అని ప్రొఫెసర్ రట్టర్ చెప్పారు.

కానీ, కోవిడ్ 19 నుంచి కోలుకున్న తర్వాత మధుమేహానికి గురైన వారికి ఇది శాశ్వతంగా ఉంటుందా, తగ్గిపోతుందా అనే అంశం పై మాత్రం స్పష్టత లేదు.

"ఇండియాలో మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉండటంతో, కోవిడ్ 19 బారిన పడి మరణించేవారి సంఖ్య ఇది లేని దేశాల్లో వారి కంటే ఎక్కువగా ఉంటుంది" అని ప్రొఫెసర్ రట్టర్ అన్నారు.

కోవిడ్ అంతమయ్యే నాటికి భారతదేశంలో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని డాక్టర్లు భావిస్తున్నారు.

భారతదేశంలో విధించిన లాక్ డౌన్ల వల్ల చాలా మంది ఇంటి నుంచే పని చేయడం, టేక్ అవే ఫుడ్ ఆర్డర్ చేయడం, వ్యాయామం తగ్గడం తో పాటు, ఇంటికే పరిమితమయ్యారు. చాలా మంది ఆందోళన, మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు.

"అలాంటి వారిలో డయాబిటిస్ రావడం నేను చూస్తున్నాను. ఇది అన్నిటి కంటే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది" అని డాక్టర్ మిశ్రా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)