'తాలిబాన్లు సహకరిస్తున్నారు.. కానీ, ఇస్లామిక్ స్టేట్‌ దాడి చేయొచ్చు' - బైడెన్

కాబుల్‌లోన హమీద్ కర్జాయ్ విమానాశ్రయంలో చిన్నారులకు సహకరిస్తున్న అమెరికా సైనికులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాబుల్‌లోన హమీద్ కర్జాయ్ విమానాశ్రయంలో చిన్నారులకు సహకరిస్తున్న అమెరికా సైనికులు (ఆగస్ట్ 24)

అఫ్గానిస్తాన్ నుంచి వేలాది మంది ప్రజలు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. తాలిబాన్లు దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న తరువాత ఇప్పటివరకు 82,300 మంది కాబుల్ నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోయారు.

కాబుల్ విమానాశ్రయంలో ప్రజల తరలింపు వేగం పుంజుకుంది. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలను వెనక్కి రప్పించే ప్రక్రియ ముందుగా నిర్ణయించిన ఆగస్ట్ 31వ తేదీ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నామని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

అయితే, తాలిబాన్ల నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న వేలాది మంది అఫ్గాన్లు ఎటూ వెళ్లలేని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు తాలిబాన్లు కూడా అఫ్గాన్ ప్రజలు దేశం దాటి పోయే ప్రయత్నం చేయవద్దని, కాబుల్ విమానాశ్రయానికి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.

మరో 10 వేల మంది ఎదురుచూపులు

వీలైనంత మందిని వీలైనంత సురక్షితంగా అఫ్గానిస్తాన్ నుంచి తరలించాలన్నదే తమ ప్రయత్నమని అమెరికా మేజర్ జనరల్ హ్యాంక్ టేలర్ అన్నారు. పెంటగాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 42 అమెరికా యుద్ధ విమానాలు 11,720 మంది అమెరికా సిబ్బందిని, 7,800 మంది మిత్ర దేశాల సిబ్బందిని నిన్న ఆ దేశం నుంచి తీసుకువచ్చారని చెప్పారు. ప్రతి 39 నిమిషాలకు ఒక విమానం కాబుల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరుతోందని కూడా హ్యాంక్ టేలర్ అన్నారు.

ప్రస్తుతం మరో 10,000 మంది కాబుల్ విమానాశ్రయంలో ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు.

బైడెన్

'తాలిబాన్లు సహకరిస్తున్నారు.. కానీ, ఇస్లామిక్ స్టేట్‌ దాడి చేయొచ్చు' - బైడెన్

గడువు పొడిగించాలని మిత్రదేశాల నుంచి వినతులు వచ్చినప్పటికీ, అఫ్గాన్‌లో తరలింపు ప్రక్రియను ఆగస్టు 31లోగా వేగవంతం చేయాలని అమెరికా భావిస్తున్నట్టు అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.

"మనం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది" అని ఆయన చెప్పారు. కొంతమేర అమెరికన్ దళాలు ఇప్పటికే వెళ్లిపోయాయని అమెరికా మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయినా తరలింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదని తెలిపాయి.

తొమ్మిది రోజుల క్రితం కాబుల్ తాలిబాన్ చేతిలోకి వెళ్లిపోయిన నాటి నుంచి కనీసం 70,700 మందిని విమానంలో తరలించారు.

"తాలిబాన్లు మా ప్రజలను తరలించడానికి సహకారం అందిస్తున్నారు" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తాలిబాన్లు చేసే పనుల ద్వారానే అంతర్జాతీయ సమాజం వారిని గుర్తిస్తుంది అని పేర్కొన్నారు.

తాలిబాన్లు తరలింపు గడువును పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

"మనలో ఎవరూ తాలిబాన్ల నిర్ణయాన్ని అంగీకరించరు" అని బైడెన్ చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుండి పెరుగుతున్న ముప్పు కారణంగానే ఎయిర్‌లిఫ్ట్ త్వరగా ముగించాల్సి వస్తోందని బైడెన్ చెప్పారు.

అఫ్గాన్లో అమెరికా బలగాలు ఎక్కువ సమయం ఉంటే, ఇస్లామిక్ గ్రూప్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కాబుల్ విమానాశ్రయం నుంచి తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుంది

ఫొటో సోర్స్, Reuters

జీ7 సమావేశాల్లో పాల్గొన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ లతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు అఫ్గాన్ సంక్షోభం గురించి వర్చువల్ సమావేశంలో చర్చించిన తర్వాత బైడెన్ మాట్లాడారు.

అఫ్గాన్లో తరలింపు ప్రక్రియ కొనసాగడానికి యూకే, ఇతర మిత్రదేశాలు గడువు ఆగస్టు 31ని పొడిగించాలని అమెరికాను కోరాయి.

చర్చలకు అధ్యక్షత వహించిన యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. బ్రిటన్ చివరి క్షణం వరకు ప్రజలను తరలించడం కొనసాగిస్తుందని వెల్లడించారు. గడువు దాటిన తర్వాత కూడా అఫ్గాన్ల తరలింపునకు అనుమతించాలని ఆయన తాలిబాన్లను కూడా కోరారు.

"అఫ్గాన్ ప్రజలకు సహాయం చేయడం, పరిస్థితుల మేరకు సాధ్యమైనంత సహకారాన్ని అందించడం తమ నైతిక విధి అని జీ7 నాయకులు అంగీకరించారు" అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ తెలిపారు.

కాబుల్ విమానాశ్రయంలో దాదాపు 6,000 మంది అమెరికా సైనికులు, యూకే నుంచి 1,000 మందికి పైగా ఉన్నారు. విదేశీయులు, అర్హతగల అఫ్గాన్లలను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ్రాన్స్, జర్మనీ, టర్కీతో సహా నాటోకు చెందిన బలగాలు కూడా కాబుల్ విమానాశ్రయంలో ఉన్నాయి.

ఆదివారం నుంచి ఎయిర్ లిఫ్ట్ వేగవంతం చేయడంతో 21,000 మందికి పైగా ప్రజలను తరలించారు. గడువు ఆగస్టు 31కంటే ముందు కొంతమంది అమెరికా సైనికులు వెళ్లిపోవడం "మిషన్‌ను ప్రభావితం చేయదు" అని ఒక అమెరికా రక్షణ అధికారి సీఎన్ఎన్ తో పేర్కొన్నారు.

అంతకుముందు మంగళవారం, తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, గడువు పొడిగింపునకు తమ సంస్థ అంగీకరించే అవకాశం లేదన్నారు. అఫ్గాన్లు విమానాశ్రయానికి వెళ్లకుండా ఆపేస్తామని చెప్పారు.

అక్కడ గందరగోళంలో "ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది" అని ఆయన విలేకరులతో అన్నారు.

అయితే, ఆయన వ్యాఖ్యలతో పూర్తి ప్రయాణ పత్రాలతో ఉన్న అఫ్గాన్లు కూడా దేశం విడిచి వెళ్లలేరా అనే దానిపై గందరగోళం నెలకొంది.

కాబుల్ విమానాశ్రయం నుంచి తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాబుల్ విమానాశ్రయం నుంచి తరలింపు ప్రక్రియ వేగం పుంజుకుంది
line

కాబూల్‌లోని చాలా మంది ప్రజల్లో తీవ్ర నిరాశ

బీబీసీ వైట్ హౌస్ రిపోర్టర్తారా మెక్ కెల్వే విశ్లేషణ

సిబ్బంది సమయపాలన పాటించి, అధ్యక్షుడి ప్రసంగానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమైన అఫ్గానిస్తాన్ అంశంపై అధ్యక్షుడు మాట్లాడటానికి సౌండ్ సిస్టమ్ తో పాటూ ఇతర అన్ని ఏర్పాట్లను అనుకున్న సమయానికే పూర్తి చేశారు.

కానీ, అధ్యక్షుడి రాక ఆలస్యమైంది. ఆయన ఓవల్ ఆఫీసులో సహాయకులను కలిసి, తన ప్రసంగ పాఠవానికి తుది మెరుగులు దిద్దారు.

"ఏం జరుగుతోంది?" అని నా సహోద్యోగులు నన్ను అడిగారు. ఆయన ప్రసంగం ఎందుకు ఆలస్యం అవుతోందని పదే పదే మెసేజ్ లు పంపుతూ అడిగారు.

వారు మాత్రమే కాదు, కాబుల్ లోని చాలా మంది ప్రజలు అధ్యక్షుడు ఏం చెబుతారా అని ఆతురతతో ఎదురు చూస్తున్నారు.

చివరకు ఆలస్యంగా అధ్యక్షుడు మాట్లాడారు. ‘ఆగస్టు 31 నాటికి అమెరికా మిషన్‌ను ముగించేలా పనులు జరుగుతున్నాయి’ అని ఆయన చెప్పారు.

ఆయన వ్యాఖ్యలు కాబుల్‌లో చాలా మందికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ నిర్ణయం తరలింపు మిషన్ పై నమ్మకం పెట్టుకున్న వారిని ఒంటరి చేయనుంది.

అధ్యక్షుడి ప్రసంగానికి ముందు అంతా అస్తవ్యస్తంగా సాగింది. బైడెన్ అఫ్గానిస్తాన్ పాలసీ సారాంశాన్ని అర్థం చేసుకున్న వారితో సహా చాలామంది దీనిని వినాశకరమైనదిగా అభివర్ణించారు.

line
వీడియో క్యాప్షన్, తాలిబాన్: ‘‘మహిళలతో ఎలా మాట్లాడాలో మా వాళ్లకు తెలియదు, అందుకే లేడీస్ ఇళ్లలోనే ఉండండి’’

అఫ్గానిస్తాన్‌లో పనిచేసే మహిళలు, వారి భద్రతకు సంబంధించి సరైన పద్దతులు అమలు చేసే వరకు ఇంట్లోనే ఉండాలని ముజాహిద్ సూచించారు.

"మా భద్రతా దళాలకు మహిళలతో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వలేదు. మహిళలతో ఎలా మాట్లాడాలో కొందరికి తెలియదు" అని ఆయన అన్నారు. "భద్రతలో మేము పూర్తిగా మెరుగు పర్చుకునే వరకు.. ఇంట్లోనే ఉండమని మహిళలను కోరుతాము" అని తెలిపారు.

తాలిబాన్లు 2001 కి ముందు అఫ్గానిస్తాన్‌లో అధికారంలో ఉండగా, ఇస్లామిక్ చట్టాలను అనుసరించి కఠినమైన సంస్కరణలను అమలు చేశారు. తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, తాలిబాన్లు మహిళలపట్ల మరింత సంయమనంతో వ్యవహరిస్తున్నట్టు ఒక కొత్త ఇమేజ్‌ కోసం తాపత్రయపడుతున్నారు. మహిళలు, బాలికలకు కొంత వాక్ స్వాతంత్య్రాన్ని ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్ మిచెల్ బాచెలెట్ మాట్లాడుతూ తాలిబాన్ మానవ హక్కుల ఉల్లంఘనలపై తమ వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందన్నారు. వీటిలో ఉరిశిక్షల అమలు, మహిళలపై ఆంక్షలు, బాల-సైనికుల నియామకాలు వంటివి ఉన్నాయన్నారు.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ మంగళవారం మహిళలు, బాలికల హక్కుల సంరక్షణకు తీర్మానాన్ని ఆమోదించింది. కానీ అనేక మానవ హక్కుల సంఘాలు పిలుపునిచ్చినా, అఫ్గానిస్తాన్ కోసం ప్రత్యేక యూఎన్ పరిశోధకుడిని నియమించాలనే ప్రతిపాదనను తీర్మానం సిఫారసు చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)