దానిష్ సిద్దిఖీ: అఫ్గాన్‌లో భారత ఫొటో జర్నలిస్ట్ హత్యకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది?

దానిష్ సిద్ధిఖీ

ఫొటో సోర్స్, Anadolu Agency/getty

ఫొటో క్యాప్షన్, దానిష్ సిద్దిఖీ
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత ఫొటోగ్రాఫర్ దానిష్ సిద్దిఖీ ఇటీవల అఫ్గానిస్తాన్‌లో హత్యకు గురికావడంతో ఆయన కుటుంబం, స్నేహితులు జర్నలిస్టులు షాక్ అయ్యారు.

జులై 16న ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారనే ప్రశ్నలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

దానిష్ సిద్దిఖీ మరణానికి ముందు, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోడానికి కాబూల్, కాందహార్, స్పిన్ బోల్డక్‌లో ఉన్న అధికారులు, జర్నలిస్టులు, స్థానికులతో బీబీసీ మాట్లాడింది.

వారిలో చాలామంది భద్రతా కారణాల వల్ల తమ పేర్లు రాయవద్దని కోరారు.

స్పిన్ బోల్డక్ పాకిస్తాన్ పక్కనే ఉన్న ఒక చిన్న టౌన్. అక్కడ తాలిబన్లు, ప్రభుత్వ దళాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి రిపోర్ట్ చేయడానికి అఫ్గాన్ దళాలతో కలిసి వెళ్లే ముందు దానిష్ కాందహార్ గవర్నర్ కార్యాలయంలో ఉన్నారు.

భద్రతా కారణాల వల్ల దానిష్, కాందహార్ గవర్నర్, మిగతా వారిని కార్యాలయం లోపలే ఉండాలని చెప్పారు.

కాందహార్ గవర్నర్ ప్రతినిధి బహీర్ అహ్మది, పులిట్జర్ విజేత దానిష్ సిద్దిఖీతో అదే ఆఫీసులో మూడు రోజులు గడిపారు.

"ఆ రోజు మేమంతా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోలో ఉన్నట్టు ఒకే ఇంట్లో ఒకే గదిలో గడిపాం" అని ఆయన ఆ రోజును గుర్తు చేసుకున్నారు.

"దానిష్ చాలా ధైర్యవంతుడు. ఒక సాహసికుడైన ఫొటోగ్రాఫర్. తనలా ఎవరూ ఉండరు. ఆ మూడు రోజుల్లో మేమంతా ఒకే దగ్గర కలిసున్నాం" అని ఆయన చెప్పారు.

దానిష్, నేను అఫ్గానిస్తాన్, కాందహార్, దేశంలోని తాజా పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. మేం మంచి స్నేహితులం అయిపోయాం. తనతో కలిసి గడిపిన సమయం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని అహ్మదీ అన్నారు.

తాలిబన్లు వారిపై దాడి చేసినప్పుడు దానిష్ సిద్దిఖీ అఫ్గాన్ సైన్యంలోని ఒక దళంతోపాటు ఉన్నారు.

దానిష్ సిద్దిఖీ

ఫొటో సోర్స్, Getty Images

శవాలను ప్రదర్శించారు

కాందహార్‌కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పిన్ బోల్డక్ శివార్లలో జరిగిన దాడిలో దానిష్ సిద్దిఖీతోపాటూ ఇద్దరు అఫ్గాన్ సైనికులు చనిపోయారు.

మృతుల్లో అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ సెదీక్ కర్జాయ్ కూడా ఉన్నారు.

అధికారులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఈ ముగ్గురినీ జులై 16న ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య తుపాకీతో కాల్చి చంపారు.

దానిష్ మరణంపై స్పిన్ బోల్డక్‌లో ఉంటున్న ఒక వ్యక్తి బీబీసీతో మాట్లాడారు.

"తాలిబన్లు ముగ్గురి శవాలను అక్కడ చౌరస్తాలోకి తీసుకొచ్చారు. వాటిని అక్కడ ప్రదర్శిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు నేను చౌరస్తా దగ్గరకు వెళ్లాను. అప్పటికి దానిష్ శవాన్ని వికృతంగా చేశారు" అని చెప్పారు.

తాము ఒక భారత గూఢచారిని పట్టుకున్నామని, అతడిని చంపేశామని అక్కడున్న తాలిబన్లు అన్నారని ఆయన చెప్పారు. తాలిబన్లు ఇప్పటికీ అదే మాట చెబుతున్నారు. దానిష్ సిద్దిఖీని తాము హత్య చేశామనే ఆరోపణలను నిరాకరిస్తున్నారు.

దానిష్ రాయిటర్స్ వార్తా సంస్థ కోసం పని చేశారు.

"భీకర యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఒక జర్నలిస్టు రిపోర్ట్ చేస్తున్న విషయం తాలిబన్లకు తెలీదని తాలిబన్ ప్రతినిధి జబీహ్-ఉల్లాహ్ ముజాహిద్ తమకు చెప్పారని, సిద్దిఖీ హత్య ఎలా జరిగిందో ఇప్పటికీ తమకు తెలీడం లేదు" అని రాయిటర్స్ తన రిపోర్టులో తెలిపింది.

దానిష్ సిద్దిఖీ

ఫొటో సోర్స్, danish siddiqui/instagram

మొదట శవాలను కూడా ఇవ్వలేదు

బహీర్ అహ్మదీ చెప్పిన వివరాల ప్రకారం తాలిబన్లు మొదట ముగ్గురి శవాలను తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరించారు. తర్వాత వాటిని ఇవ్వమని వారిని కోరాల్సి వచ్చింది. ప్రభుత్వ అభ్యర్థనతో రెడ్ క్రాస్‌కు చెందిన ఒక టీమ్ శవాలను స్పిన్ బోల్డక్ నుంచి కాందహార్‌లోని మీర్వాయిజ్ ఆస్పత్రికి తరలించింది.

బహీర్ అహ్మదీ, కాందహార్ ఆస్పత్రిలో మూడు శవాలను చూసిన ఒక జర్నలిస్ట్ చెబుతున్న వివరాల ప్రకారం తాలిబన్లు ఆ మూడు శవాల్లో సెదిక్ కర్జాయ్ శవాన్ని మాత్రం ఏం చేయలేదు.

మాకు దానిష్ మృతదేహం ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ లభించలేదు. కానీ కాందహార్‌కు చెందిన జర్నలిస్ట్ చెప్పిన వివరాల ప్రకారం దానిష్ గొంతు కింద బుల్లెట్ గుర్తులేవీ కనిపించలేదు.

వీడియో క్యాప్షన్, ముస్లిం మహిళలు రాజకీయ పార్టీల నుంచి ఏం కోరుకుంటున్నారు

దానిష్ మృతదేహాన్ని దారుణంగా ఛిద్రం చేశారని వస్తున్న కొన్ని మీడియా రిపోర్టులపై తాలిబన్లు ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

కానీ తాలిబన్లు ఆ పని చేసుంటే, అలా ఎందుకు చేశారనేది కూడా స్పష్టంగా తెలీడం లేదు.

"దానిష్ సిద్దిఖీ శవాన్ని ఎంత దారుణంగా చేశారంటే, దానిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం" అని అఫ్గాన్ జర్నలిస్ట్ సేఫ్టీ కమిటీ చీఫ్ నజీబ్ షరీఫీ అన్నారు.

దానికి రెండు కారణాలు ఉండవచ్చు. మొదటిది ఆయన జర్నలిస్ట్, రెండోది ఆయన భారతీయుడు.

దానిష్ సిద్దిఖీది ఏ దేశమో తెలుసుకోవడం తాలిబన్లకు పెద్ద కష్టం కాదు. ఆయన ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన తనతోపాటూ పాస్‌పోర్ట్, మీడియాకు సంబంధించిన పత్రాలు కూడా కచ్చితంగా తీసుకుని వెళ్తుంటారు.

నిజానికి, ఆయన తన హత్యకు కొన్ని గంటల ముందు ఆ ప్రాంతంలో యుద్ధ పరిస్థితి గురించి ఒక ట్వీట్ కూడా చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

జులై 16న ఏం జరిగింది?

జులై 16న వేకువజామున బహీర్ అహ్మదీ కాందహార్ గవర్నర్ కార్యాలయంలో ఉన్నారు. ఆయన, గవర్నర్‌తోపాటూ మిలిటరీ కమాండర్ కూడా అక్కడ ఉన్నారు. ఆయన అఫ్గానిస్తాన్ సైన్యానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారు.

అఫ్గాన్ స్పెషల్ ఫోర్సెస్ కమాండర్ సెదీక్ కర్జాయ్.. ఆఫీసులో ఉన్న ఒక వ్యక్తికి క్షేత్రస్థాయిలో పరిస్థితి గురించి నిరంతరం అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఆఫీసులో ఉన్న వారికి అక్కడి పరిస్థితి గురించి ఆయన అప్‌డేట్స్ చెబుతున్నారు.

ఆయన తమకు ఏం చెప్పారో అహ్మదీ వివరించారు.

"ఆ సమయంలో యుద్ధ పరిస్థితి ఉంది. తాము ముందుకు కదులుతున్నామని, తాలిబన్లను చంపుతున్నామని, చాలా బాగా పోరాడుతున్నామని సెదీక్ మాకు సమాచారం ఇచ్చారు. దాంతో మేమంతా చాలా ధైర్యంగా ఉన్నాం"

"కానీ తర్వాత సెదీక్ కర్జాయ్ ఫోన్‌తో సంబంధాలు తెగిపోయాయి. కొన్ని నిమిషాలకే ఆయన చనిపోయారని, ఆయన శవాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది"

సెదీక్ కర్జాయ్

ఫొటో సోర్స్, Bahir Ahmadi

ఫొటో క్యాప్షన్, సెదీక్ కర్జాయ్

"అత్యంత సాహసంతో పోరాడే మా ఫైటర్లలో సెదీక్ కర్జాయ్ ఒకరు. గత 20 ఏళ్ల యుద్ధంలో ఆయన తన కుటుంబంలోని 13మందిని కోల్పోయారు. కొన్ని నిమిషాల తర్వాత దానిష్ సిద్దిఖీ కూడా చనిపోయినట్లు వార్త వచ్చింది"

"గవర్నర్, కమాండర్స్ అందరూ షాక్ అయ్యారు. మనం ఇప్పుడే(దానిష్‌తో) కలిసి లంచ్, డిన్నర్ చేశాం కదా అన్నారు"

"దానిష్ ప్రాణాలు కోల్పోతారని మేం అస్సలు అనుకోలేదు. ఎందుకంటే సెదీక్ కర్జాయ్ విజయం సాధిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది" అని అహ్మదీ చెప్పారు.

దానిష్ సిద్దిఖీ ఏ కారణాలతో చనిపోయారనేది ధ్రువీకరించడం కష్టం. ఎందుకంటే ఆ సమయంలో అక్కడి మిషన్‌లో పాల్గొన్న ఏ ఒక్క అఫ్గాన్ సైనికుడు కూడా సజీవంగా మిగల్లేదు.

వారందరిపై దొంగచాటుగా కాల్పులు జరిపారని లేదా ఆర్పీజీతో దాడి చేసుంటారని, దాంతో వారందరూ చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు.

లేదంటే వారి సాయుధ వాహనం తాలిబన్ల దాడులతో ఆగిపోవడంతో వారు దాన్నుంచి దిగి ఉంటారని, అప్పుడు వారిపై కాల్పులు జరిగుంటాయని కూడా భావిస్తున్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

స్పిన్ బోల్డక్‌కు చెందిన ఒక వ్యక్తి తమ ఇల్లు దానిష్ సిద్దిఖీని చంపిన ప్రాంతానికి కాస్త దూరంలోనే ఉంటుందని చెప్పారు. ఇంట్లో ఉన్నప్పుడు తమకు కాల్పులు జరిపిన శబ్దం వినిపించిందని తెలిపారు.

"అక్కడ కాల్పుల శబ్దం ఎంత ఘోరంగా ఉందంటే మేం భయపడిపోయాం" అని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫొటోలో దానిష్ శవం నేలపై ఉండడం కనిపిస్తోంది. అందులో ఆయన ముఖం బాగానే ఉంది.

"ముగ్గురిని చంపిన తర్వాత తాలిబన్లు సాయుధ వాహనంలో వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ తిరిగొచ్చిన తాలిబన్లు వాహనాన్ని దానిష్ మృతదేహం మీద మాత్రమే ఎక్కించి తొక్కించారు" అని స్పిన్ బోల్డక్ ప్రజలు తనకు చెప్పినట్లు ఒక కాందహార్‌ జర్నలిస్ట్ తెలిపారు.

దానిష్ సిద్దిఖీ

ఫొటో సోర్స్, danish siddiqui/instagram

రెడ్‌క్రాస్ టీమ్ శవాలను తీసుకోడానికి వెళ్లింది

రెడ్ క్రాస్ టీమ్ ఆ ముగ్గురి శవాలను తీసుకోడానికి అక్కడికి వచ్చేవరకూ.. అవి స్పిన్ బోల్డక్‌లోని ఒక చౌరస్తాలో కొన్ని గంటలపాటు నేలపైనే పడి ఉన్నాయని అధికారులు, స్పిన్ బోల్డక్ ప్రజలతో మాట్లాడిన తర్వాత తెలిసింది.

స్థానిక మీడియా ద్వారా భారత జర్నలిస్ట్ చనిపోయిన విషయం తెలీడంతో, సాయంత్రం సుమారు నాలుగు గంటలకు శవాలు ఉన్న చౌరస్తా దగ్గరకు వెళ్లానని స్పిన్ బోల్డక్‌లోని మరో వ్యక్తి చెప్పారు.

"అక్కడ చౌరస్తా దగ్గర జనం భారీగా గుమిగూడి ఉన్నారు" అని ఆయన చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లోని చిన్న పట్టణమైన స్పిన్ బోల్డక్ సరిహద్దు పాకిస్తాన్‌కు ఆనుకుని ఉంటుంది. అదిప్పుడు తాలిబన్ల స్వాధీనంలో ఉంది. రిపోర్టుల ప్రకారం తాలిబన్లు ఈ ప్రాంతంలో కొత్త పన్నులు అమలు చేశారు. సరిహద్దులు దాటే సామాన్లపై పన్నులు వసూలు చేస్తున్నారు.

"శుక్రవారం యుద్ధం గురించి రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు తన చేతికి బాంబు శకలాలు తగిలాయని దానిష్ మాకు చెప్పారు. గాయానికి చికిత్స చేయించుకున్నానని, తర్వాత స్పిన్ బోల్డక్‌లో జరిగిన యుద్ధంలో తాలిబన్లు వెనక్కు వెళ్లిపోయారని తెలిపారు" అని జులై 17న ప్రచురితమైన ఒక రిపోర్ట్‌లో రాయిటర్స్ పేర్కొంది.

తాలిబన్లు మళ్లీ దాడి చేసినప్పుడు సిద్ధిఖీ అక్కడ షాపుల వాళ్లతో మాట్లాడుతున్నట్లు ఒక కమాండర్ చెప్పినట్లు ఆ రిపోర్టులో తెలిపారు.

కానీ, దానిష్ సిద్దిఖీ గాయపడినప్పుడు ఆయన్ను ఆ ప్రాంతంలో ఎందుకు ఉంచారని స్థానిక అఫ్గాన్ జర్నలిస్టులు రాయిటర్స్‌ను ప్రశ్నించారు.

"ఆయన గాయపడిన విషయం తెలిసినప్పుడు రాయిటర్స్‌ ఆయన్ను అక్కడ్నుంచి వెనక్కి రప్పించి ఉండాల్సింది" అని అఫ్గాన్ జర్నలిస్టుల సేఫ్టీ కమిటీ చీఫ్ నజీబ్ షరీఫీ అన్నారు.

"మా సహచరుడు దానిష్ సిద్దిఖీ మరణం మాకు తీరని విషాదం. దానిష్ అసలు ఎలా చనిపోయారనే వాస్తవాలను తెలుసుకోడానికి మేం ప్రయత్నిస్తున్నాం" అని బీబీసీకి పంపిన ఒక ప్రకటనలో రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పింది.

"దానిష్‌ను బందీగా చేసుకున్న తర్వాత హత్య చేశారా లేక ఆయన కాల్పుల్లో చనిపోయారా అనేది తెలుసుకోడానికి మేం ప్రయత్నిస్తున్నాం" అని నజీబ్ షరీఫీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)