అఫ్గాన్ మహిళల జీవితం: మినీ స్కర్టుల్లో నిర్భయంగా తిరిగిన కాలం నుంచి బురఖాలో బందీ అయినంతవరకు

1970ల కాలంలో కాబుల్ వీధుల్లో స్వేచ్ఛగా వెళ్తున్న అమ్మాయిలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1970ల కాలంలో కాబుల్ వీధుల్లో స్వేచ్ఛగా వెళ్తున్న అమ్మాయిలు
    • రచయిత, సుశీల సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌పై తాలిబాన్ పట్టు సాధించగానే సోషల్ మీడియాలో అక్కడి అరాచక పరిస్థితికి అద్దం పట్టే ఫొటోలు వైరల్ కావడం మొదలైంది.

అదే సమయంలో కొన్ని పాత ఫొటోలు కూడా షేర్ అయ్యాయి. ఒకప్పుడు కాబుల్ రోడ్లపై మినీ స్కర్టులతో నిర్భయంగా తిరుగుతున్న యువతుల ఫొటోలు కూడా కనిపించాయి.

ఆ ఫొటోలను 1970ల నాటివిగా చెబుతున్నారు. అఫ్గానిస్తాన్‌లో శతాబ్దాల నుంచి ముస్లిం సంప్రదాయాలు ఉన్నా, ఒకప్పుడు అక్కడి మహిళలకు తమకు నచ్చినట్టు జీవించే హక్కు ఉండేదని ఆ ఫొటోలు పోస్ట్ చేసినవారు చెబుతున్నారు.

ఇప్పుడు చాలా మందికి 1996 నుంచి 2001 వరకూ సాగిన తాలిబాన్ పాలనాకాలం కూడా గుర్తొస్తోంది. అప్పట్లో మగవారు గడ్డం పెంచడం, మహిళలు బురఖా ధరించడం తప్పనిసరిగా ఉండేది.

అప్పటి తాలిబాన్ పాలనలో టీవీ, సంగీతం, సినిమాలపై నిషేధం విధించారు. పదేళ్లు దాటిన అమ్మాయిలు స్కూలుకు వెళ్లడాన్ని నిషేధించారు.

తాలిబాన్ ఇప్పుడు తమను మళ్లీ అదే కాలంలోకి తీసుకెళ్తారేమో అని అందరిలో భయం ఆవరించింది. మహిళల పరిస్థితి మళ్లీ ఇంతకు ముందు లాగే అవుతుందేమోనని చాలా మంది భయపడుతున్నారు.

తాలిబాన్ పాలనలో మహిళలపై జరిగిన సామాజిక, మానసిక, శారీరక అకృత్యాల కథలు బయటకు వస్తున్నాయి.

కానీ అక్కడి మహిళల స్థితి ఒకప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న పాత ఫొటోలు చెబుతున్నట్లే అంత స్వేచ్ఛాయుతంగా ఉండేదా?

1978లో

ఫొటో సోర్స్, Getty Images

1970ల నాటి ఫొటో ఏం చెబుతోంది

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న భారత సంతతి మహిళ డాక్టర్ హుమా అహ్మద్ ఘోష్ అఫ్గానిస్తాన్‌లో మహిళల జీవితంపై పరిశోధన పత్రం సమర్పించారు.

తన పరిశోధనలో భాగంగా ఆమె 2003 నుంచి 2013 వరకూ వరుసగా ఎన్నోసార్లు అఫ్గానిస్తాన్ వెళ్లొచ్చారు.

శాండియాగో స్టేట్ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ విమెన్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన హుమా అహ్మద్ ఆనాటి విషయాలను బీబీసీతో పంచుకున్నారు.

"కాబుల్ నా మొదటి విదేశీ పర్యటన. నేను దిల్లీలోని జేఎన్‌యూలో చదువుతున్నప్పుడు మొదటిసారి 1978, 79లో కాబుల్ వెళ్లాను" అని చెప్పారు.

బీబీసీతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె... ‘కాబుల్ చాలా అందమైన నగరం, ఆ నగరం చాలా వరకూ వెస్టర్న్(పాశ్చాత్య నగరం)లా కనిపించేది’ అని చెప్పారు.

"కాబుల్‌లో సంపన్నులు, మహిళలు పాశ్చాత్య దుస్తుల్లో కనిపించేవారు. వారంతా చదువుకున్నవారు. కాబుల్ కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పాశ్చాత్యీకరణ కనిపించేది. కానీ మేం కాబుల్ బయటకు వెళ్లినపుడు అంటే బమియాన్, గజనీ వెళ్తే అక్కడ సంప్రదాయవాదం కనిపించలేదు కానీ, మహిళలు తమను పూర్తిగా కప్పుకుని కనిపించేవారు. వారి తలకు స్కార్ఫ్ ఉండేది. అక్కడి సమాజంలో ఆ సంప్రదాయం ఉండేది. అక్కడ పేదరికం కనిపించేది" అన్నారు.

కాబుల్‌లో తాను మొదటిసారి ఒక ఇంటర్నేషనల్ రివాల్వింగ్ రెస్టారెంట్‌లో కూచుని లాజాన్యా( ఒక రకం పాస్తా) తిన్నట్లు ఆమె చెప్పారు. అప్పట్లో భారత్‌లో దొరకని విదేశీ బ్రాండ్స్ కాబుల్‌లో దొరికేవని హుమా చెప్పారు. ఆమె కాబుల్‌లో లెవిస్ జీన్స్ కొన్నారు. తన స్నేహితుల కోసం విదేశీ కాస్మటిక్స్ కొని తీసుకొచ్చేవారు.

హుమా అహ్మద్ ఘోష్

ఫొటో సోర్స్, HUMA AHMED GOSH

సమాజంలో విభజన

70లలో అఫ్గానిస్తాన్‌లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండేదని అక్కడ చాలా స్వేచ్ఛ ఉండేదని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన కబీర్ తనేజా చెప్పారు. ఆనాటి కాబుల్ పొటోలు చూస్తే మనకు లండన్, పారిస్ పాత ఫొటోలు చూస్తున్నట్టే అనిపిస్తుందని అన్నారు.

కానీ మనం గమనిస్తే అఫ్గానిస్తాన్ మిగతా ప్రాంతాల్లో ఉన్న సమాజాల్లో ఇలాంటి ఫొటోలు కనిపించవు.

మధ్యప్రాచ్య అంశాల నిపుణుడైన కబీర్ తనేజా దీనికి గల కారణాలను బీబీసీకి వివరించారు.

"అఫ్గానిస్తాన్‌లో ఒక విభజన కనిపిస్తుంది. కాబుల్ లేదా నగరాల్లో ఉంటున్న వారు బాగా సంపాదించేవారు. అక్కడ ఆధునికత ఉండేది. అక్కడ మగవారికి ఉండే హక్కులు మహిళలకు కూడా ఉండేవి. కానీ, అవి అత్యున్నత వర్గాలకు లేదా ఉన్నత తరగతుల వారికి మాత్రమే ఉండేవి" అన్నారు.

"మరోవైపు, గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో వివిధ జాతులు, తెగలవారు నివసించేవారు. తాలిబాన్ అనే ఆలోచన ఆ కాలంలో కూడా ఉంది. తేడా ఏంటంటే ఇప్పటిలా అప్పుడు ఆ ఆలోచన బయటకు రాలేదు" అని చెప్పారు.

అమానుల్లా ఖాన్, రాణి సొరాయా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమానుల్లా ఖాన్, రాణి సొరాయా

మహిళల హక్కులు

అఫ్గానిస్తాన్‌లో మహిళల పరిస్థితి గురించి తెలుసుకోడానికి మనం చరిత్రను ఒకసారి తిరగేస్తే 1880-1901 వరకూ ఆ దేశాన్ని పాలించిన అబ్దుర్ రహమాన్ ఖాన్ తన పదవీకాలంలో మహిళల జీవితాలను మెరుగు పరచడానికి చాలా కృషి చేసినట్లు తెలుస్తుంది.

ఆయన సంప్రదాయ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. భర్త చనిపోయిన తర్వాత భార్యలు అతడి సోదరుడిని పెళ్లి చేసుకునే సంప్రదాయాన్ని అంతం చేయడం, వివాహ వయసును పెంచడం, ప్రత్యేక పరిస్థితుల్లో మహిళలకు విడాకులు తీసుకునే హక్కు కల్పించడం లాంటివి చేశారు.

మహిళలకు తండ్రి, భర్త ఆస్తిలో హక్కు కూడా ఆయన అందించారు. అబ్దుర్ రహమాన్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు అమీర్ హబీబుల్లా ఖాన్ అధికారంలోకి వచ్చారు. తన తండ్రి ఆశయాలను ఆయన మరింత ముందుకు తీసుకెళ్లారు.

"ఎ హిస్టరీ ఆఫ్ విమెన్ ఇన్ అఫ్గానిస్తాన్: లెసన్ లెర్న్‌డ్ ఫర్ ఫ్యూచర్ అండ్ యస్టర్ డే అండ్ టుమారో" పేరుతో రాసిన పరిశోధనా పత్రంలో హుమా అహ్మద్ వాటిని వివరించారు.

వివాహాల్లో జరిగే అనవసర ఖర్చులపై అమీర్ హబీబుల్లా నిషేధం విధించారని, ఆయన భార్య మొదటిసారి బయట ఎలాంటి ముసుగూ ధరించకుండా పాశ్చాత్య వస్త్రధారణలో కనిపించారని హుమా అందులో చెప్పారు.

అమీర్ హబీబుల్లా మొదట హబీబియా కాలేజ్ ప్రారంభించారు. అందులో పనిచేయడానికి భారత్, టర్కీ, జర్మనీ నుంచి లెక్చరర్లను పిలిపించారు. దానితోపాటూ ఆయన ఆస్పత్రి కూడా తెరిచారు.

అఫ్గాన్ నిర్వాసితులు తిరిగిరావడానికి ఆమిర్ హబీబుల్లా దారులు తెరిచారని, అందులో ప్రగతిశీల భావాలున్న మహమూద్ బేగ్ తార్జీ ప్రముఖులని ఆమె చెప్పారు.

సిరియా, టర్కీలో చదువుకున్న తార్జీ.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, వారికి పూర్తి పౌరసత్వం అందించాలని గళమెత్తారు. విద్యావంతులైన మహిళలు దేశానికి భవిష్యత్ సంపదగా వర్ణించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించడంపై ఇస్లాంలో ఎలాంటి నిషేధం లేదన్నారు.

హబీబుల్లా హత్య తర్వాత ఆయన కొడుకు అమానుల్లా గిరిజన సంస్కృతి చట్టాల నుంచి మహిళలకు విముక్తి కల్పిస్తానని చెప్పారు.

పరదా, బహుభార్యత్వం ఆచారాలను అమానుల్లా వ్యతిరేకించారు. కాబుల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాలికల విద్యను ప్రోత్సహించారు.

మహిళలు తమ శరీరం కప్పుకోవాలని, ఒక ప్రత్యేక రకం ముసుగు ధరించడం అవసరమని ఇస్లాంలో చెప్పలేదని అమానుల్లా ఒక బహిరంగ కార్యక్రమంలో చెప్పారు.

అమానుల్లా ఆలోచనలు, చర్యల పట్ల వ్యతిరేకత కూడా మొదలైందని హుమా అహ్మద్ తన పరిశోధన పత్రంలో చెప్పారు.

అఫ్గానిస్తాన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సంప్రదాయవాదులు అమానుల్లా సంస్కరణలు తమ సమాజాన్ని పాశ్చాత్య పోకడలవైపు తీసుకెళ్తున్నాయని భావించడం మొదలైంది.

కాబుల్‌లో మహిళలకు లభిస్తున్న స్వేచ్ఛపై 1928లో గిరిజన నేతలు గ్రామీణ ప్రాంతాల్లో నిరసనలు ప్రారంభించారు.

ఆ కాలంలో కాబుల్ బయట ఉంటున్న గిరిజన, గ్రామీణ మహిళలకు ఆధునికీకరణ వల్ల ఎలాంటి ప్రయోజనాలూ లభించేవి కావు అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి.

లోయా జిర్గా అంటే గిరిజన నేతల జనరల్ కౌన్సిల్ బాలికల వివాహ వయసు పెంచడం, బహుభార్యత్వం సంప్రదాయం అడ్డుకోవడాన్ని వ్యతిరేకించింది. బాలికల విద్యకు వ్యతిరేకంగా గళమెత్తింది. దాంతో, చివరికి అమానుల్లా తన విధానాల్లోనే మార్పులు తీసుకురావాల్సి వచ్చింది.

ఆ తర్వాత కాబుల్ గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లు మూతపడ్డాయి. అమ్మాయిలు హిజాబ్ ధరించాల్సి వచ్చింది. వ్యతిరేకత ఎంతగా పెరిగిందంటే, అమానుల్లా చివరికి దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. రెండు దశాబ్దాల్లోనే అఫ్గాన్ పాలకులు మారిపోయారు. కానీ మహిళాభివృద్ధి ఎజెండా ఎక్కడా కనిపించలేదు.

50వ దశకం రాగానే సోవియట్ యూనియన్ విదేశీ, సాంకేతిక సహకారంతో అఫ్గానిస్తాన్ మళ్లీ తన గమనం మార్చుకుంది. 1950లలో మహిళలను ఆర్థికంగా సమర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం తెలిసొచ్చింది.

అమానుల్లా ఖాన్ సోదరుడు ఇనయతుల్లా ఖాన్ కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమానుల్లా ఖాన్ సోదరుడు ఇనయతుల్లా ఖాన్ కుటుంబం

మహిళల ఆర్థిక సాధికారత

మహిళలు ముసుగు ధరించడమనేది స్వచ్ఛందమని ప్రధాన మంత్రి మొహమ్మద్ దావూద్ చెప్పారు. 1940, 1950ల కాలంలో మహిళలు నర్సులు, డాక్టర్లు, టీచర్లు అయ్యారు. 1964లో అఫ్గానిస్తాన్ మూడో రాజ్యాంగంలో మహిళల రాజకీయ ప్రవేశానికి అనుమతి లభించింది. వారికి ఓటు హక్కు కూడా వచ్చింది.

అఫ్గానిస్తాన్ మొదటి మహిళా మంత్రి ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టారు. ఆమెతోపాటూ మొత్తం ముగ్గురు మహిళా ఎంపీలు పార్లమెంటులో అడుగుపెట్టారు.

అదే ఏడాది దేశంలో మొదటి మహిళా గ్రూప్ 'డెమొక్రటిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ అఫ్గాన్ విమెన్' ఏర్పడింది. మహిళా నిరక్షరాస్యతను నిర్మూలించడం, బలవంతపు పెళ్లిళ్లను అడ్డుకోవడం, పెళ్లి చేసుకోడానికి బాలికలను వేలం వేసే ఆచారాన్ని అంతం చేయడమే ఈ సంస్థ లక్ష్యం.

70ల చివరి వరకూ మహిళల జీవితాలు మెరుగు పడుతున్నట్టే కనిపించింది. వారు విద్యారంగంలో కనిపించారు. పార్లమెంటులో కూడా ప్రాతినిధ్యం వహించారు.

కానీ, తర్వాత 1970 చివర్లలో అప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి సాయం చేయాలనే లక్ష్యంతో సోవియట్ యూనియన్ సైన్యం అఫ్గానిస్తాన్ వచ్చింది.

అఫ్గాన్ మహిళ

ఫొటో సోర్స్, AFP

ముజాహిదీన్, తాలిబాన్

సోవియట్ సైన్యం అప్పుడు ముజాహిదీన్‌లకు వ్యతిరేకంగా పోరాడుతోంది. మరోవైపు ముజాహిదీన్ గ్రూపులకు అమెరికా, పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియా సహా చాలా ఇతర దేశాల మద్దతు ఉండేది.

సోవియట్ రష్యా సైన్యం 1989లో అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కు వెళ్లిపోయింది. కానీ దేశంలో అంతర్యుద్ధం కొనసాగింది. దానివల్ల వ్యాపించిన అరాచకత్వం తాలిబాన్ బలోపేతం కావడానికి అవకాశమిచ్చింది.

"1992-1996 మధ్య కాలంలో ముజాహిదీన్ అరాచకాలు కొనసాగాయి. హత్యలు, అత్యాచారాలు, అవయవాలు నరికేయడం లాంటి హింసాత్మక ఘటనలు రోజురోజుకూ పెరిగాయి. అత్యాచారాలు, బలవంతపు పెళ్లిళ్ల నుంచి కాపాడుకోడానికి అమ్మాయిలు ఆత్మహత్యలు కూడా చేసుకునేవారు" అని డాక్టర్ హుమా అహ్మద్ తన పరిశోధనా పత్రంలో రాశారు.

అఫ్గాన్ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గాన్ మహిళలు

తాలిబాన్ తర్వాత మార్పులు

తాలిబాన్ అధికారంలోకి వచ్చాక తాను 2003లో అఫ్గానిస్తాన్ అంతా పర్యటించానని హుమా చెప్పారు.

"అప్పటికి మొత్తం కాబుల్ మారిపోయి ఉంది. అక్కడ ఒక్క రాయిని గుర్తించడం కూడా కష్టమైపోయింది. కాబుల్‌లో కూడా మహిళలు బురఖాల్లోనే కనిపించారు. ఆ తరువాత మెల్లమెల్లగా అక్కడ కాస్త అభివృద్ధి కనిపించింది. మహిళలు బురఖాల్లో పెద్దగా కనిపించేవారు కాదు. కానీ, తల మొత్తం కప్పుకుని కనిపించేవారు అన్నారు.

నేను కూడా పరిశోధన కోసం తల పూర్తిగా కప్పుకుని తిరిగేదాన్ని. అక్కడక్కడా మహిళల కోసం పనిచేసే సంస్థలు కనిపించడం మొదలైంది. బాలికల కోసం స్కూళ్లు తెరుచుకున్నాయి. వాళ్లు ఉద్యోగాలు కూడా చేసేవారు. కానీ జలాలాబాద్ లేదా కాబుల్‌కు దూరంగా వెళ్తే అక్కడ సంప్రదాయవాదం కనిపించేది.

మహిళలు బురఖాల్లో కనిపించేవారు. అక్కడ ఇస్లాం, గిరిజన సంప్రదాయాలు కలగలిసి కనిపించేవి. కాబుల్‌లో మార్పులు కనిపించినా, ఆ చుట్టూ పరిస్థితి అంతకుముందులాగే ఉండేది.

హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్ ప్రకారం 2002 నాటికి అఫ్గాన్ ప్రభుత్వ నియంత్రణ ఉన్న ప్రాంతాల్లో లక్షల మంది బాలికలు స్కూళ్లలో చదువుతున్నారు. అది 2001 తర్వాత ఒక పెద్ద మార్పును చూపించింది.

రాకేశ్ సూద్ 2006 నుంచి 2008 వరకూ అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. తాలిబాన్ పాలన ముగిసిన తర్వాత దేశంలో సామాజిక సంప్రదాయవాదం ఉండేదని, కానీ దానితోపాటూ ఒక ఉదారవాద సమాజానికి కూడా పునాదులు పడ్డాయని తెలిపారు.

బీబీసీతో మాట్లాడిన ఆయన 2001లో తాలిబాన్ పాలన ఉన్నప్పుడు ప్రైమరీ, సెకండరీ స్కూళ్లలో దాదాపు 9 లక్షల మంది పిల్లలు చదువుకునేవారని, వారంతా అబ్బాయిలేనని చెప్పారు.

"2004లో అఫ్గానిస్తాన్ కొత్త రాజ్యాంగం ఏర్పడినప్పుడు, అందులో మహిళలకు కూడా సమాన హక్కులు అందించాలనే నిబంధన జోడించారు. మహిళలకు చాలా రంగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. పార్లమెంటులో 27 శాతం రిజర్వేషన్ ఉండేది. మహిళలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి అనే అవగాహన కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలు చాలా రంగాల్లో ముందుకు వెళ్లారు" అన్నారు.

"అఫ్గానిస్తాన్ ఇటీవలి పరిస్థితి విషయానికి వస్తే అమ్మాయిలు ప్రతి రంగంలో పనిచేయడం కనిపించింది. అంటే సైన్యం, ఎయిర్ ఫోర్స్, పోలీస్, జడ్జిలుగా కూడా ఉన్నారు. పార్లమెంటులో ఉన్నారు. కానీ తజిక్ అమ్మాయిలు మరింత అభివృద్ధి చెందినట్లు తనకు కనిపించిందని, వారున్న ప్రాంతాల్లో బాలికలు ముందుకు రావడం మనకు ఎక్కువగా కనిపిస్తుంది" అని ఆయన చెప్పారు.

అఫ్గానిస్తాన్ ఉత్తర భాగంలో ఎక్కువగా నివసించే తజిక్‌లు చాలాకాలం నుంచీ తాలిబాన్లను వ్యతిరేకిస్తున్నారు.

ఇరాన్‌కు దగ్గరగా ఉండడం, ఆ దేశ సంస్కృతిని అనుసరించడం వల్ల తజిక్‌లకు ప్రయోజనం లభించిందని కూడా చెబుతారు.

అఫ్గానిస్తాన్‌లో దాదాపు 20 పెద్ద నగరాల్లో 14 ప్రాంతాల్లో తాజిక్ ఆధిక్యం ఉంది. దేశంలో మిగతా ప్రాంతాలకంటే ఇక్కడివారు ఎక్కువ ఉదారవాదంతో ఉంటారని చెబుతున్నారు.

మహిళల విషయంలో పెద్ద నగరాల్లో కనిపించిన పురోగతి గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం లేదని రాకేశ్ సూద్ చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వెనకబడ్డారు

డాక్టర్ల బరఖా

ఫొటో సోర్స్, Barakha

ఫొటో క్యాప్షన్, డాక్టర్ల బరఖా వర్షా

ఇదే విషయంపై డాక్టర్ బరఖా వర్షా కూడా మాట్లాడారు. ఆమె ఐక్యరాజ్యసమితి యునెస్కో సభ్యురాలు, అభిజ్ఞాన్ ఫౌండేషన్ డైరెక్టర్.

అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిల విద్య, వారి సంక్షేమం కోసం బరఖా కృషి చేస్తున్నారు.

డాక్టర్ బరఖా వర్షా అఫ్గానిస్తాన్‌లోని 16 ప్రాంతాల్లో పనిచేశారు. వాటిలో హేరాత్, మజార్-ఎ-షరీఫ్, జలాలాబాద్, కాందహార్, బల్ఖ్, కాబుల్ లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి.

"పెద్ద నగరాల్లో అమ్మాయిల కోసం యూనివర్సిటీలు ఉన్నాయి. బాలికలు చదువుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు ఐదు లేదా ఆరో తరగతి వరకే చదవగలుగుతున్నారు. అక్కడ ఇప్పటికీ బాలికలను వారికంటే రెండు మూడు రెట్లు వయసున్న వారికి ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారు. మహిళలు బురఖాల్లో కనిపిస్తున్నారు" అని ఆమె చెప్పారు.

"గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే ఆమె పుట్టక ముందే అబ్బాయితో వివాహం నిశ్చయం చేసేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ అమ్మాయి తండ్రి అబ్బాయి తండ్రికి డబ్బు ఇస్తున్నారు. అక్కడ కూతుళ్లను అమ్ముతున్నారు అనడానికి నేను ఏమాత్రం సంకోచించను" అని ఆమె చెప్పారు.

రాకేశ్ సూద్ మాటతో బరఖా ఏకీభవించారు. అమ్మాయిలు ప్రతి రంగంలో కనిపిస్తున్నారని, అందులో ఇప్పుడు కార్పొరేట్ కూడా ఉందని చెప్పారు. కానీ, వారి సంఖ్య చాలా తక్కువని అన్నారు. అమ్మాయిలు ఎక్కువగా విద్యా, వైద్య రంగాల్లో కనిపిస్తున్నారని తెలిపారు.

నా దగ్గర ఒక రోజు మా సంస్థ కారు లేదు, దాంతో నేను టాక్సీలో వెళ్లాల్సి వచ్చింది. అందరూ నన్ను బురఖాలో వెళ్లమని సలహా ఇచ్చారు. అయితే నేను దుపట్టా తలపై కప్పుకుని బయటికి వెళ్లేదాన్ని. ఒకసారి నేను బురఖా వేసుకోవాల్సి వచ్చంది. ఆ నీలి రంగు బుర్ఖాను నేను కొన్ని నిమిషాలే వేసుకున్నా. నాకు దానితో ఊపిరాడనట్టు అయ్యింది. అంటే నాకొక జైల్లో ఉన్నట్టు అనిపించింది. అఫ్గానిస్తాన్‌లోని మహిళలు తమ జీవితాంతం అది వేసుకుని ఉంటారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు" అని బరఖా అన్నారు.

జులై 18న నాకు బెదిరింపులు వచ్చాయి. నన్ను టార్గెట్ చేసుకున్నారు. నా ఫొటో సర్కులేట్ చేసి నా గురించి వివరాలు అడిగారని అని ఆమె చెప్పారు.

అయితే, తాలిబాన్ మాత్రం తాము షరియా చట్టం ప్రకారం మహిళల హక్కులు నిర్ణయించడానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. కానీ. నిపుణులు ప్రస్తుతం తాలిబాన్ చెప్పే ఏ మాటనూ నమ్మలేమని, అప్పుడే ఏదైనా చెప్పడం కష్టమని అంటున్నారు.

ఇరాన్, టర్కీ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి ఎన్నో ముస్లిం దేశాలు ఉన్నాయి. అక్కడ ఇస్లాం అధారంగానే మహిళలకు హక్కులు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు తాలిబాన్ ఎలాంటి షరియా అమలు చేస్తారోనని అందరూ సందేహాలు వ్యక్త చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)