హిక్మత్‌యార్: "అఫ్గాన్ భవిష్యత్తుపై కాదు.. మీ దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి"... భారత్‌కు 'కాబుల్ కసాయి' సలహా

ఫొటో సోర్స్, EPA
అఫ్గానిస్తాన్ భవిష్యత్తు గురించి ప్రకటనలు జారీ చేయడానికి బదులు, భారత్ తమ దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని ఒకప్పుడు 'కాబుల్ కసాయి'గా పాపులర్ అయిన అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాని గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్ అన్నారు.
అఫ్గానిస్తాన్‌లోని మరో తీవ్రవాద గ్రూప్ హిజ్బ్-ఎ-ఇస్లామీ నేత హిక్మత్‌యార్ ఆదివారం కాబుల్‌లో పాకిస్తాన్ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్తాన్ సౌర్వభౌమాధికారాన్ని భారత్ గౌరవించాలని అన్నారు.
పాకిస్తాన్ వార్తా సంస్థ ఏపీపీ వివరాల ప్రకారం.. భారత ప్రభుత్వం అఫ్గానిస్తాన్ నేలపై నుంచి కశ్మీర్ కోసం పోరాటం చేయకూడదని ఆయన అన్నారు.
అయితే, అఫ్గానిస్తాన్‌లో శాంతిస్థాపనకు భారత్ సానుకూల పాత్ర పోషించాల్సి ఉంటుందని కూడా ఆయన అన్నారు.
అఫ్గానిస్తాన్ ఘర్షణను శాంతియుతంగా పరిష్కరించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కృషిని ఈ అఫ్గాన్ నేత ప్రశంసించారని కూడా ఏపీపీ చెప్పింది.
కాబుల్‌లో త్వరలో అఫ్గానిస్తాన్ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి కూడా ఆమోదయోగ్యంగా ఉండే ఒక ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్ ఆదివారం కాబుల్‌లో గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్‌తో సమావేశం అయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చర్చల తర్వాత ఒక ట్వీట్ చేసిన ఆయన గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్‌తో అఫ్గానిస్తాన్ ప్రస్తుత పరిస్థితిపై, తాలిబాన్, ఇతర అఫ్గాన్ సమాజాలతో సమీకృత సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేయడంపై చర్చించానని తెలిపారు.
తాలిబాన్ ప్రతినిధులు గత వారం తమ నేత అనస్ హక్కానీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై అఫ్గానిస్తాన్ అగ్ర నేతలతో చర్చలు జరిపారు. ఈ అగ్ర నేతల్లో దేశ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అబ్దుల్లా, సెనేట్ అధ్యక్షుడు ఫజుల్‌హాదీ ముస్లింయార్‌తోపాటూ గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్ కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP
గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్ ఎవరు?
అఫ్గానిస్తాన్ చరిత్రలోని అత్యంత వివాదాస్పద వ్యక్తుల్లో గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్‌ను ఒకరుగా భావిస్తారు. ఒకప్పుడు ఆయనను 'బుచర్ ఆఫ్ కాబుల్' అంటే కాబుల్ కసాయి అనేవారు.
అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాని అయిన హిక్మత్‌యార్ 80వ దశకంలో అఫ్గానిస్తాన్ మీద సోవియట్ యూనియన్ ఆక్రమణ తర్వాత ముజాహిద్దీన్లకు నేతృత్వం వహించారు.
ఆ సమయంలో అలాంటి దాదాపు ఏడు గ్రూపులు ఉండేవి. ఆ తర్వాత 90వ దశకంలో అఫ్గానిస్తాన్‌లో జరిగిన అంతర్యుద్ధాలలో గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్ పాత్ర చాలా వివాదాస్పదమైంది.
90వ దశకంలో కాబుల్‌పై పట్టు కోసం ఆయన సంస్థ గ్రూప్ హిజ్బ్-ఎ-ఇస్లామీ ఫైటర్లు, మిగతా గ్రూపుల మధ్య చాలా హింసాత్మక యుద్ధాలు జరిగేవి.
ఆ సమయంలో జరిగిన రక్తపాతానికి చాలావరకూ ఈ గ్రూపులే కారణం అని చెబుతారు. అంతర్యుద్ధం సమయంలో హిక్మత్‌యార్ గ్రూపు కాబుల్ మీద ఎన్నో రాకెట్లు ప్రయోగించింది. అందుకే కాబుల్ ప్రజలు ఆయన్ను 'రాకెట్ఆర్' అని కూడా పిలిచేవారు.
అఫ్గానిస్తాన్‌లోని చాలా మంది ఆయన్ను ఇప్పటికీ క్షమించరని చెబుతారు. అప్పుడు జరిగిన హింస తర్వాతే అఫ్గాన్ ప్రజలు తాలిబాన్‌కు స్వాగతం పలికారు.
అదే అంతర్యుద్ధం వల్ల గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్ ఏకాకిగా మారారు. తాలిబాన్ అధికారంలోకి రాగానే, ఆయన కాబుల్ నుంచి పారిపోవాల్సి వచ్చింది.
20 ఏళ్ల తర్వాత 2017లో హిక్మత్‌యార్ తిరిగి కాబుల్ వచ్చారు. దానికి ఏడాది ముందే ఆయన అఫ్గాన్ ప్రభుత్వంతో ఒక డీల్ చేసుకుని, స్వదేశంలో అడుగుపెట్టారు.
గుల్‌బుద్దీన్ హిక్మత్‌యార్‌ను అమెరికా 2003లో తీవ్రవాదిగా ప్రకటించింది. ఆయన తాలిబాన్ దాడులను సమర్థించారని ఆరోపించింది.
2016లో అప్పటి అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ఆయనకు పాత కేసుల్లో క్షమాభిక్ష పెట్టింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కట్టుబట్టలు, ఒక్క సూట్‌కేస్‌తో దేశం వదిలి వెళ్తున్నారు
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పామాయిల్ మిషన్’ ఏంటి? ఎలా పని చేస్తుంది?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)













