ఇమ్రాన్ ఖాన్‌కు పక్కలో బల్లెంలా తయారైన పాకిస్తాన్ తాలిబాన్‌.. అఫ్గాన్ తాలిబాన్‌కు మొరపెట్టుకున్న ప్రభుత్వం

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, EPA

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ పాలనపై పాకిస్తాన్ చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. కానీ, అక్కడ అధికారం మారిన తర్వాత వారిని ఒక ఆందోళన కూడా తొలిచేస్తోంది.

పాకిస్తాన్ హోంమంత్రి షేక్ రషీద్ అహ్మద్ సోమవారం తాము ఎదుర్కొంటున్న ఆ సమస్య గురించి ప్రస్తావించారు.

దాని పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం అఫ్గాన్ తాలిబాన్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు.

పాకిస్తాన్‌ ప్రభుత్వంలో గుబులు రేపుతున్న ఆ సమస్య పేరు 'తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్'(టీటీపీ).

టీటీపీ మిలిటెంట్లు పాకిస్తాన్‌లో ఎన్నో దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థను పాకిస్తాన్ తాలిబాన్‌ అని కూడా అంటారు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో దీని కార్యకలాపాలు చురుగ్గా ఉన్నాయి.

టీటీపీ మిలిటెంట్లు పాకిస్తాన్‌లో దాడులకు అఫ్గానిస్తాన్‌ నేలను ఉపయోగించుకుంటున్నారని కూడా చెబుతున్నారు.

ఐక్యరాజ్యసమితి జులైలో విడుదల చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం అఫ్గానిస్తాన్‌లోని 'తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్‌'కు ఆరు వేల మందికి పైగా సుశిక్షితులైన మిలిటెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

టీటీపీకి అఫ్గాన్ తాలిబాన్‌తో మంచి సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. అఫ్గానిస్తాన్‌లో అమెరికా మద్దతుతో ఏర్పడిన గత ప్రభుత్వంతో తాలిబాన్‌ చేసిన యుద్ధంలో కూడా టీటీపీ వారికి మద్దతు, సహకారం అందించింది.

పాకిస్తాన్ సైన్యం

ఫొటో సోర్స్, BANARAS KHAN/GETTYIMAGES

పాక్‌కు అంత ఆందోళన ఎందుకు

పాకిస్తాన్ మీడియా రిపోర్టుల ప్రకారం కాబుల్‌పై తాలిబాన్ నియంత్రణ సాధించిన తర్వాత అఫ్గానిస్తాన్‌ జైళ్లలో ఉన్న తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్‌ మిలిటెంట్లు చాలా మందిని విడుదల చేశారు.

దీనిపై ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అఫ్గాన్ తాలిబాన్‌ను సంప్రదించిందని, టీటీపీ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్ భూమిని ఉపయోగించకుండా చూస్తామని వారు తమకు భరోసా ఇచ్చారని పాకిస్తాన్ హోంమంత్రి షేఖ్ రషీద్ అహ్మద్ చెప్పారు.

"పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ వారిని నియంత్రించాలని మేం అఫ్గాన్ అధికారులను కోరాం. టీటీపీ ఎట్టి పరిస్థితుల్లో అఫ్గానిస్తాన్ నేలను ఉపయోగించకుండా చూస్తామని వారు మాకు భరోసా ఇచ్చారు" అని హోంమంత్రి షేఖ్ రషీద్ అహ్మద్ ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో చెప్పారు.

టీటీపీ మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ల జాబితాను పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్‌ తాలిబాన్‌కు అందించినట్లు పాక్ హోంమంత్రి ప్రకటనకు ముందు మీడియాలో కథనాలు వచ్చాయి.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో యాక్టివ్‌గా ఉన్న పలువురి పేర్లు ఆ జాబితాలో ఉన్నట్టు చెబుతున్నారు.

'ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' దీనిపై ఒక కథనం ప్రచురించింది. తాలిబాన్ కాబుల్ మీద పట్టు సాధించిన తర్వాత పాకిస్తాన్ టీటీపీ మిలిటెంట్ల జాబితాను వారికి అందించినట్లు అందులో చెప్పారు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

దర్యాప్తు కమిటీ ఏర్పాటు

"మేం అఫ్గాన్ తాలిబాన్ దగ్గర ఈ అంశాన్ని లేవనెత్తాం. అఫ్గానిస్తాన్ నుంచి టీటీపీ కార్యకలాపాలు నడిపిస్తున్న మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ల ఒక జాబితాను వారికిచ్చాం" అని ఒక పాక్ అధికారి తమకు చెప్పారని పత్రిక ఆ కథనంలో పేర్కొంది. కానీ అందులో ఆ అధికారి పేరు రాయలేదు.

అఫ్గాన్ తాలిబాన్ చీఫ్ హీబాతుల్లా అఖుంద్‌జాదా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారని.. అది పాకిస్తాన్ ఫిర్యాదులను పరిశీలిస్తుందని, సరిహద్దుకు అవతల దాడులకు టీటీపీ అఫ్గానిస్తాన్ నేలను ఉపయోగిస్తోందా లేదా అనేది తెలుసుకుంటుందని మరికొన్ని రిపోర్టుల్లో చెప్పారు.

అఫ్గాన్ తాలిబాన్ నేతలు

ఫొటో సోర్స్, AFGHAN ISLAMIC PRESS

పాకిస్తాన్ తాలిబాన్ ఎవరు

తహ్రీక్-ఎ-తాలిబాన్ అంటే.. పాకిస్తాన్ తాలిబాన్ సంస్థను 2007 డిసెంబర్‌లో 13 మిలిటెంట్ గ్రూపులను కలిపి ఏర్పాటుచేశారు. పాకిస్తాన్‌లో షరియా ఆధారిత సనాతన ఇస్లాం పాలనను తీసుకురావడమే దాని లక్ష్యం.

పాకిస్తాన్ తాలిబాన్-పాక్ సైన్యానికి మధ్య ఎప్పుడూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కొంత కాలం క్రితం టీటీపీ ప్రభావం ఉన్న ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న ఒక పోలీసును దారుణంగా కొట్టిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

2004లో పెషావర్‌లోని ఒక స్కూల్ మీద జరిగిన కాల్పుల్లో దాదాపు 200 మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే. ఈ ఘటనకు టీటీపీనే కారణం అని చెబుతున్నారు.

పాకిస్తాన్ 2014 నుంచి టీటీపీ స్థావరాలను ధ్వంసం చేస్తూ వస్తోంది. కానీ పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో టీటీపీ ప్రభావం చాలా ఉంది.

టీటీపీ మిలిటెంట్లు ఎక్కువగా అఫ్గానిస్తాన్‌లో ఉన్నారని, అక్కడ నుంచే సరిహద్దుకు అవతల దాడులకు పథకాలు వేస్తున్నారని చెబుతున్నారు.

తాలిబాన్

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

ఏం జరగవచ్చు?

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి జులైలో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం అఫ్గానిస్తాన్‌లో టీటీపీకి దాదాపు ఆరు వేల మంది సుశిక్షితులైన మిలిటెంట్లు ఉన్నారు.

అఫ్గాన్ తాలిబాన్‌తో టీటీపీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అఫ్గాన్ గత ప్రభుత్వంతో జరిగిన యుద్ధంలో వీరు తాలిబాన్‌కు సహకరించారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ బలోపేతం అవుతున్నప్పుడు కూడా పాకిస్తాన్‌లో టీటీపీ గురించి ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి.

దీనిపై పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ హారూన్ రషీద్ జూన్‌లో బీబీసీ ప్రతినిధి కమలేష్ మఠేనీతో మాట్లాడారు.

టీటీపీ గురించి పాకిస్తాన్‌కు ఆందోళన ఉండడం సహజమేనన్న ఆయన, అఫ్గాన్ తాలిబాన్ టీటీపీకి పూర్తి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువేనని చెప్పారు.

"అఫ్గానిస్తాన్‌లో గతంలో తాలిబాన్ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్‌లో తాలిబాన్ ఉనికి లేదు. అలాంటప్పుడు పాకిస్తాన్‌ తాలిబాన్ పట్ల వారి వైఖరి ఎలా ఉంటుందనేది అప్పుడే చెప్పడం కష్టం. అఫ్గాన్ తాలిబాన్ టీటీపీతో పోరాడి వారిని బలవంతంగా అడ్డుకోడానికి చూస్తుంది అని చెప్పగలిగే ఎలాంటి ఆపరేషన్ కనిపించడం లేదు. రెండింటి భావజాలాలు ఒకటే, వాటిలో సారూప్యత కూడా ఉంది. అందుకే పాకిస్తాన్ మీద ఈ ప్రతికూల ప్రభావం పడడం సహజమే" అన్నారు.

అయితే, పాకిస్తాన్ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, ఆ దేశానికి వ్యతిరేకంగా టీటీపీ తమ నేలను ఉపయోగించకుండా చూసుకుంటామని అఫ్గాన్ తాలిబాన్ నేతలు తమకు భరోసా ఇచ్చారని చెప్పారని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)