కరోనా వైరస్ కచ్చితంగా చైనాలోనే పుట్టిందా? అమెరికా అధ్యక్షుడికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయిన ఇంటెలిజెన్స్

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా వైరస్ మూలాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోరిన ఇంటెలిజెన్స్ నివేదిక అసంపూర్తిగా ఉందని ఆ దేశ మీడియా నివేదికలు చెబుతున్నాయి.

చైనాలో మొట్టమొదటగా బయటపడిన ఈ వైరస్ సహజసిద్ధంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందా లేదా ప్రమాదవశాత్తూ ల్యాబ్‌లో పుట్టిందా అన్న విషయంపై ఏజెన్సీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

ఈ నివేదిక సారాంశాన్ని కొద్దిరోజుల్లో ప్రచురిస్తారని భావిస్తున్నారు.

ఈ రిపోర్టు 'సైన్సుకు వ్యతిరేకం' అని చైనా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.

కేవలం తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చిపెట్టే ఒక నివేదిక కోసం అమెరికా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్వహించిన పరిశోధనను సైతం పక్కనపెట్టేసిందని వాంగ్ యి అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మందికి పైగా ప్రాణాలు తీసిన మహమ్మారి 2020 ప్రారంభంలో చైనాలోని వుహాన్ నగరంలో తొలుత బయటపడింది.

ఆయా దేశాలు కోవిడ్-19ను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, శాస్త్రవేత్తలు దాని పుట్టుక రహస్యాన్ని చేధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఏడాది ఆరంభంలో వుహాన్‌ను సందర్శించిన డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం మార్కెట్లో అమ్మకానికి వచ్చిన ఓ జీవి నుంచి వైరస్ వ్యాప్తి చెందినట్లు పేర్కొంది.

ఓ దశాబ్దానికి పైగా గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లను అధ్యయనం చేసిన వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఈ వైరస్ అనుకోకుండా లీక్ అయ్యే అవకాశాన్ని ఈ నివేదిక తోసిపుచ్చింది.

అయితే, కొందరు శాస్త్రవేత్తలు ఈ నివేదికను తిరస్కరించారు.

అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హెయిన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హెయిన్స్

డేటాను పరిశీలించి, వైరస్ మూలాలపై ‘ఖచ్చితమైన ముగింపుకు దగ్గరగా ఉండే’ ఒక నివేదిక తయారు చేయాలని ఈ ఏడాది మే నెలలో అధ్యక్షుడు బైడెన్ అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలను ఆదేశించి, 90 రోజుల గడువు ఇచ్చారు.

వుహాన్ ల్యాబ్‌లోని చాలా మంది పరిశోధకులు నవంబర్ 2019లో ఆసుపత్రి పాలయ్యారనే రిపోర్టులు వచ్చాయి. దాంతోపాటు ల్యాబ్ సిద్ధాంతంపై సమగ్ర విచారణకు చైనా అనుమతించకపోవడంతోనే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ ఏడాది జూన్‌లో, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హెయిన్స్ యాహూ న్యూస్‌తో మాట్లాడుతూ కరోనావైరస్ ఎక్కడ పుట్టింది? అని స్పష్టంగా చెప్పగలిగే ఆశలు అంతగా లేవని అన్నారు. 'ఇదంతా ఎక్కడ మొదలైందో కనుగొనాలని ఆశిస్తున్నాం, కానీ అది జరగకపోవచ్చు' అని ఆమె వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ కచ్చితంగా ఎక్కడ పుట్టిందో కనుగొనేందుకు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

''దీన్ని ఇక్కడితో వదిలేయాలనో, పక్కనపెట్టేయాలనో మనం అనుకోకూడదు. మన ప్రయత్నాలను ఇంకా ముమ్మరం చేయాలి'' అని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజిస్ట్ డేవిడ్ రెల్మాన్ వాషింగ్టన్ పోస్ట్‌కు చెప్పారు.

ఇదే సమయంలో అమెరికా సైన్యానికి చెందిన ఫోర్ట్ డెట్రిక్ నుంచే కరోనా వైరస్ పుట్టిందనే ఆలోచనను రేకెత్తించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు ఫోర్ట్ డెట్రిస్ అమెరికా జీవ ఆయుధాల కార్యక్రమానికి కేంద్రం. ప్రస్తుతం ఇక్కడ ఎబోలా, మశూచి లాంటి వైరస్లను పరిశోధించే బయోమెడికల్ ల్యాబ్స్ ఉన్నాయి.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం ఈ విషయాన్ని మళ్లీ ప్రస్తావించారు. 'ఫోర్ట్ డెట్రిక్‌పై విచారణ ప్రారంభించడానికి అమెరికా డబ్ల్యూహెచ్ఓ నిపుణులను ఆహ్వానించాలి' అని అన్నారు.

కరోనా వైరస్ మూలాలపై రూపొందించిన నివేదికను అమెరికా ఇంటెలిజెన్స్ సోమవారం అధ్యక్షుడు బైడెన్‌కు అందజేసింది. రిపోర్టు సారాంశాన్ని బహిర్గతం చేసేందుకు కనీసం రెండు రోజులు సమయం పడుతుందని వైట్ హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)