కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?

గబ్బిలాల మీద ప్రపంచవ్యాప్తంగా అనేక అపోహలున్నాయి
ఫొటో క్యాప్షన్, గబ్బిలాల మీద ప్రపంచవ్యాప్తంగా అనేక అపోహలున్నాయి
    • రచయిత, హెలెన్‌ బ్రిగ్స్‌
    • హోదా, బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్‌

జింబాబ్వేలోని కొన్ని ప్రాంతాలలో గబ్బిలాలను రెక్కలున్న డ్రాగన్లనీ, ఎగిరే ఎలుకలనీ, దుష్ట శక్తులనీ అభివర్ణిస్తుంటారు.

అక్కడే కాదు. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో గబ్బిలాలపై ప్రజల్లో అనేక అపోహలుంటాయి. కానీ జంతు ప్రేమికుల దృష్టిలో మాత్రం అవి చాలా అమాయకమైన ప్రాణులు.

“అవి అద్భుతమైన జీవులు. చాలామంది నిజాలు తెలుసుకోకుండా వాటికి భయపడుతుంటారు’’ అని డాక్టర్‌ మాథ్యూ బౌగారెల్ అంటున్నారు. ఫ్రెంచ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ‘సిరాడ్‌’లో బౌగారెల్ పరిశోధకుడిగా పని చేస్తున్నారు.

జింబాబ్వేలోని గబ్బిలాలు ఎక్కువగా ఉండే ఒక గుహ దగ్గర శాస్త్రవేత్తలు పర్యటిస్తున్నారు. తిరిగి లేబరేటరీకి వచ్చిన తర్వాత, గబ్బిలాలు వ్యాపింపజేసే వైరస్‌ల జన్యక్రమాన్నిఆయన, సహచర పరిశోధకులు పరిశీలిస్తారు.

ఈ బృందం ఇప్పటికే సార్స్‌ ఫ్యామిలీకి చెందిన సార్స్‌-CoV-2 అనే వైరస్‌ గబ్బిలాలలో ఉన్నట్లు గుర్తించింది.

ఈ బృందం పరిశోధన ముఖ్య ఉద్దేశం గబ్బిలాల వల్ల వ్యాపించే వైరస్‌ల జన్యుక్రమాన్ని గుర్తించడం. అందులోనూ మనుషులను తీవ్రమైన అనారోగ్యంపాలు చేసే వైరస్‌ల జన్యువులను గుర్తించడం వారి విధి.

“స్థానికులు చాలమంది ఈ గుహలకు వెళ్లి గబ్బిలాల మలాన్ని ఎత్తుకొచ్చి తమ పొలాల్లో ఎరువులుగా వాడుకుంటుంటారు. అందుకే అవి మోసుకెళ్లే వ్యాధికారక వైరస్‌లను, క్రిములను గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే అవి మనుషులకు వ్యాపిస్తాయి’’ అన్నారు యూనివర్సిటీట ఆఫ్ జింబాబ్వేలో పని చేస్తున్న డాక్టర్‌ ఎలిజబెత్ గోరి.

గబ్బిలాల మీద ఉండే వైరస్ ల జన్యు క్రమాన్ని గుర్తించే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు

ఫొటో సోర్స్, M Bourgarel/Cirad

ఫొటో క్యాప్షన్, గబ్బిలాల మీద ఉండే వైరస్ ల జన్యు క్రమాన్ని గుర్తించే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు

గబ్బిలాల మీద అనుమానమెందుకు?

వైరస్‌ల విషయంలో అనవసరంగా గబ్బిలాల మీద నిందలు మోపుతున్నారని స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “డోంట్ బ్లేమ్‌ బ్యాట్స్‌’’ పేరుతో ఏర్పడిన ఒక స్వచ్ఛంద సంస్థ గబ్బిలాల చుట్టూ ముసురుకుంటున్న అనుమానాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. “ఈ భూమి మీద ఎక్కువగా అపోహలకు గురవుతున్న జంతువులు గబ్బిలాలే’’ అంటున్నారు ఆ సంస్థ సభ్యులు.

మానవ జాతి చరిత్రలో చాలాకాలం నుంచి గబ్బిలాలపై అనేక అనుమానాలు, భయాలు కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా అవి మరింత పెరిగాయి.

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌కు మూలం ఏంటో, ఎక్కడి నుంచి వచ్చిందో ఇంత వరకు ఎవరూ చెప్పలేకపోయారు. కానీ అది జంతువులు నుంచే వచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు చాలామంది భావిస్తున్నారు. బహుశా గబ్బిలాల నుంచే అన్నది వారి ప్రధాన అనుమానం.

గబ్బిలాల నుంచి వచ్చి ఉండొచ్చు అన్న సందేహాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే వ్యాప్తికి కారణం అనే స్థాయి నుంచి అసలు వైరస్‌ పుట్టిందే వాటి నుంచి అనేదాకా వెళుతున్నారు కొందరు. దీనిపైనే జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే వైరస్‌ల పుట్టుకకు మనిషి ప్రకృతిని నాశనం చేయడమే ప్రధాన కారణమన్న వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. అడవులలో పశువులను ఎక్కువగా మేపడం, చెట్లను నరికి రోడ్లు,నిర్మాణాలు చేపట్టడంతో అటవీ జంతువులు తిండి కోసం మానవ ఆవాసాలకు దగ్గరగా వస్తున్నాయి. ఆ సమయంలోనే వాటి నుంచి వైరస్‌లు మనుషులకు సోకుతున్నాయి.

“గబ్బిలాలు ప్రమాదకరమైన వైరస్‌లను మోసుకొస్తాయన్నది ఎవరూ కాదనలేని నిజం” అంటున్నారు పోర్చుగల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ పోర్టోలో పని చేస్తున్న రికార్డో రోచా.

కానీ గబ్బిలాలలో వందల సంఖ్యలో ఉన్న జాతులను ( సుమారు 1400కన్నా ఎక్కువ )అదుపు చేయడం ద్వారా వాటి నుంచి పక్షులకు, తద్వారా మనుషులకు వైరస్‌లు వ్యాపించకుండా అదుపు చేయవచ్చని ఒక వాదన వినిపిస్తోంది.

భూమి మీద 50 మిలియన్ సంవత్సరాలుగా గబ్బిలాలు జీవిస్తున్నాయి

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్, భూమి మీద 50 మిలియన్ సంవత్సరాలుగా గబ్బిలాలు జీవిస్తున్నాయి

గబ్బిలాలు వైరస్‌ను ఎలా మోసుకొస్తాయి?

ప్రతి నాలుగు వైరస్‌లలో మూడు వైరస్‌లు జంతువుల నుంచే మనుషులకు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2002 సంవత్సరంలో చైనాలో వచ్చిన సార్స్‌ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సుమారు 800మందిని చంపేసింది. అప్పట్లో దానిని ఓ అంతు చిక్కని వ్యాధిగా భావించారు.

2017లో చైనా యునాన్‌ ప్రావిన్స్‌లోని గుహల్లో నివసించే గబ్బిలాల మీద ఒక కొత్త వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. అందులో మనుషులకు సోకిన సార్స్‌ వైరస్ జన్యు మూలాలున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి మరో భయంకరమైన వైరస్‌ పుట్టవచ్చని అప్పట్లోనే శాస్త్రవేత్తలు అనుమానించారు. ఇప్పుడది నిజమైంది.

వైరస్‌ వ్యాప్తి విషయంలో ఇతర జీవులను నిందించడంకన్నా వాటితో మనకున్న అనుబంధాన్ని కూడా గుర్తించాలని డాక్టర్‌ రోచా అంటున్నారు. గబ్బిలాలు మనుషులకు చాలా మేలు చేస్తాయని, జీవవైవిధ్యాన్ని కాపాడతాయని రోచా అన్నారు.

పంటల మీద వాలే కీటకాలను తినేది గబ్బిలాలే. కోకో, వెనిల్లా, డ్యురెయిన్‌లాంటి పండ్లచెట్ల పరాగ సంపర్కంలో గబ్బిలాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రెయిన్‌ ఫారెస్ట్‌లలో కనిపించే అనేక మొక్కల విత్తనాలను ఇతర ప్రాంతాలకు మోసుకుని వెళ్లి అక్కడ ఆ మొక్కలు మొలవడానికి, తద్వారా పర్యావరణ సమతుల్యతను సాధించడానికి గబ్బిలాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఈ వైరస్‌ వ్యాప్తికి గబ్బిలాలను నిందించడం దారుణమంటారు యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గోలో పనిచేస్తున్న డాక్టర్‌ డేవిడ్‌ రాబర్ట్సన్‌. మనిషే అదుపు తప్పి ప్రకృతిని నాశనం చేస్తున్నాడని ఆయన అన్నారు.

సార్స్‌-CoV-2లాంటి వైరస్‌లను ఇతర జంతువుల మీదకు గబ్బిలాలు మోసుకెళ్లడం ఇవాళ కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా అది జరుగుతోంది. కానీ మనిషికి ఆ సమస్య ఎందుకు వచ్చిందో ఆలోచించాలంటారు డాక్టర్‌ రాబర్ట్సన్‌.

బోర్నియో అడవి

గబ్బిలాలను చంపేస్తున్నారు

కోవిడ్‌-19 వ్యాప్తికి గబ్బిలాలే కారణమన్న భయంతో చైనా, ఇండియా, ఇండోనేషియా, పెరూ, ఆస్ట్రేలియాలాంటి దేశాలలో వాటిని విపరీతంగా చంపినట్లు కూడా వార్తలు వచ్చాయి. తెలిసీ తెలియకుండా ఇలా గబ్బిలాలను చంపడం వల్ల కూడా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

“గబ్బిలాలలో కొన్ని జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని విచక్షణారహితంగా చంపేయడం వల్ల మనిషికి ఎంతో అవసరమైన జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది’’ అన్నారు యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌లో పని చేస్తున్న డగ్లస్‌ మాక్‌ఫార్లేన్‌.

శతాబ్దాలుగా గబ్బిలాలు మనుషులతోపాటే తిరుగుతున్నాయి. పరస్పర సహకారంతో జీవనం కొనసాగిస్తున్నాయి. పోర్చుగల్‌లోని 18వ శతాబ్దంనాటి యూనివర్సిటీ లైబ్రరీలో 300 సంవత్సరాలుగా గబ్బిలాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ పుస్తకాలను పాడుచేసే కీటకాలను తింటూ ఇవి బతుకుతుంటాయి.

ఈ భూమి మీద జీవవైవిధ్యాన్ని కాపాడటంలో గబ్బిలాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు డాక్టర్‌ రికార్డో రోచా. “ ఈ పరిస్థితుల్లో మన నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది’’ అన్నారు రోచా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)