కరోనావైరస్‌తో వచ్చే వ్యాధికి కొత్త పేరు కోవిడ్-19... దీన్ని ఎలా పెట్టారంటే..

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

చైనాలో పుట్టి, ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త రకం కరోనావైరస్‌తో వచ్చే వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా ఓ పేరు పెట్టింది.

కోవిడ్-19 అని దీనికి నామకరణం చేసింది.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అదనమ్ జీబ్రెయెసస్ ఈ విషయాన్ని జెనీవాలో వెల్లడించారు.

ఈ వైరస్ బారినపడి ఇప్పటికే వెయ్యికిపైగా మంది చనిపోయారు. వ్యాధి సోకినవారు వేలల్లోనే ఉన్నారు.

ఈ వైరస్‌పై వీలైనంత గట్టిగా ప్రపంచం పోరాడాలని జీబ్రెయెసస్ పిలుపునిచ్చారు.

Presentational grey line
Presentational grey line

నిజానికి కరోనావైరస్ అనేది ఓ వైరస్ కుటుంబం పేరు. ఆ కుటుంబం నుంచి పుట్టుకువచ్చిన కొత్త రకం వైరస్ తాజాగా చైనాలో వ్యాపించింది.

టాక్సానమీ ఆఫ్ వైరసెస్ అంతర్జాతీయ కమిటీ దీన్ని సార్స్-సీఓవీ-2గా గుర్తించింది.

అయోమయం లేకుండా ఉండేందుకు, ఈ వ్యాధికి ఓ పేరు అవసరమని పరిశోధకులు అభిప్రాయపడుతూ వచ్చారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Reuters

కరోనా పేరు వ్యక్తులు, నగరాలు, సంస్థలకు కూడా ఉంది.

‘‘ప్రాంతం, జంతువు, వ్యక్తి, సమూహానికి వర్తించకుండా ఆ పేరు ఉండటం అవసరం. వ్యాధికి సంబంధించిందై, పలికేందుకు వీలుగా కూడా ఉండాలి’’ అని జీబ్రెయెసస్ అన్నారు.

‘కరోనా’, ‘వైరస్’, ‘డిసీజ్’ ఆంగ్ల పదాల్లోని కొన్ని మొదటి అక్షరాలను తీసుకుంటూ, వ్యాధి వ్యాప్తి మొదలైన సంవత్సరం కూడా వచ్చేలా.. కోవిడ్-19 అని పేరు పెట్టారు.

డబ్ల్యూహెచ్ఓ‌కు కరోనావైరస్ తొలి కేసు సమాచారం 2019, డిసెంబర్ 31న అందింది.

ప్రస్తుతం తమ దేశంలో 42,200‌కిపైగా మందికి కరోనా‌వైరస్ సోకినట్లు చైనా ధ్రువీకరించింది.

హుబే ప్రావిన్సులో కరోనావైరస్ కారణంగా సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 103 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 1,016కు చేరుకుంది.

సోమవారం కొత్తగా 2,478 మంది కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ బారినపడ్డారు. అంతకు ముందురోజు (3,062) తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 20 శాతం తగ్గింది.

తమ ప్రావిన్సులో సోమవారం 2,097, ముందురోజు 2,618 కొత్త కేసులు నమోదయ్యాయని హుబే హెల్త్ కమిషన్ పేర్కొంది.

2002-03లో సార్స్ వ్యాప్తి తర్వాత చైనాలో తలెత్తిన అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం ఇదే.

కరోనా, చైనా అధికారులు

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ సంక్షోభం విషయంలో చైనా అధికారులు స్పందించిన తీరుపై కొన్ని రోజులుగా విమర్శలు పెరుగుతున్నాయి.

వైరస్ వ్యాప్తి గురించి ముందుగా హెచ్చరించిన ఓ వైద్యుడిపై అధికారులు కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ఆ వైద్యుడు కరోనావైరస్ సోకే మరణించారు.

ఈ నేపథ్యంలో చైనా చాలా మంది సీనియర్ అధికారులను తొలగించింది.

పదవులు కోల్పోయినవారిలో హుబే హెల్త్ కమిషన్‌ హెడ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుంచి దానికి సెక్రటరీ‌గా ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు.

వైద్యుడితో అధికారుల వ్యవహరించిన తీరు గురించి దర్యాప్తు జరిపేందుకు అవినీతి నిరోధక అత్యున్నత విభాగం నుంచి ఓ బృందాన్ని చైనా కేంద్ర ప్రభుత్వం హుబేకు పంపింది.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే మార్గాలపై చర్చించేందుకు వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు జెనీవాలో సమావేశం అవుతున్నారు.

తగినన్ని వనరులను కేటాయిస్తే, ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని జీబ్రెయెసస్ అన్నారు.

చైనా తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. వాటి ఫలితంగానే మిగతా ప్రపంచానికి వైరస్ వ్యాపిస్తున్న వేగం చాలా తక్కువగా ఉందని అన్నారు.

ఈ వైరస్ వ్యాప్తి వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. దీని ప్రభావం మిగతా దేశాలపైనా పడొచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ హెచ్చరించింది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)