కరోనావైరస్: చైనాలో వెయ్యిని మించిన మృతుల సంఖ్య.. సీనియర్ అధికారులపై వేటు వేస్తున్న ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ సంక్షోభం విషయంలో వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ చైనా చాలా మంది సీనియర్ అధికారులను తొలగించింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే దేశంలో వెయ్యికిపైగా మంది చనిపోయారు.
పదవులు కోల్పోయినవారిలో హుబే హెల్త్ కమిషన్ హెడ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నుంచి దానికి సెక్రటరీగా ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు.
వేటు పడ్డ అధికారుల్లో అత్యంత సీనియర్ హోదాల్లో ఉన్నవారు వీళ్లే.


స్థానిక రెడ్ క్రాస్ డిప్యూటీ డైరెక్టర్‌ను కూడా విరాళాల విషయంలో అలసత్వం వహించారంటూ చైనా తొలగించింది.
హుబే ప్రావిన్సులో కరోనావైరస్ కారణంగా సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 103 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 1,016కు చేరుకుంది.
సోమవారం కొత్తగా 2,478 మంది కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ బారినపడ్డారు. అంతకుముందు రోజు (3,062) తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 20 శాతం తగ్గింది.
తమ ప్రావిన్సులో సోమవారం 2,097, ముందురోజు 2,618 కొత్త కేసులు నమోదయ్యాయని హుబే హెల్త్ కమిషన్ పేర్కొంది.


ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం... హుబే సహా వివిధ ప్రావిన్సుల్లో వందల మంది అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విచారణలు మొదలుపెట్టింది. హెచ్చరికలు కూడా జారీ చేసింది.
అయితే, తొలగింపు అంటే అన్నిసార్లూ పూర్తిగా తొలగించడం కాదు. ఇవి సస్పెన్షన్ లాంటి చర్యలు కూడా అయ్యుండొచ్చు. హోదాలు తగ్గించొచ్చు.
పదవుల నుంచి తొలగించడంతోపాటు అధికార కమ్యూనిస్టు పార్టీ కూడా అధికారులను శిక్షించవచ్చు.
రెడ్ క్రాస్ డిప్యూటీ హెడ్ ఝాంగ్ ఖిన్‌కు పార్టీ అంతర్గతంగా తీవ్ర హెచ్చరిక జారీ చేసిందని, ఆయన చర్యలను తీవ్రమైన నిర్వహణా లోపంగా గుర్తించిందని చైనీస్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
ఈ నెల ఆరంభంలో వుహాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డిప్యూటీ హెడ్‌పై కూడా ఇలాంటి చర్యలే పార్టీ తీసుకుంది.

ఫొటో సోర్స్, Reuters
హుబే ప్రావిన్సులో వుహాన్ నగరం తర్వాత కరోనావైరస్ తీవ్రత హుంగాంగ్‌లో అత్యధికంగా ఉంది. ఈ నగరం హెల్త్ కమిషన్ హెడ్‌ను కూడా చైనా ప్రభుత్వం తొలగించింది.
కరోనావైరస్ సంక్షోభం విషయంలో చైనా అధికారులు స్పందించిన తీరుపై కొన్ని రోజులుగా విమర్శలు పెరుగుతున్నాయి.
వైరస్ వ్యాప్తి గురించి ముందుగా హెచ్చరించిన ఓ వైద్యుడిపై అధికారులు కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. ఆ వైద్యుడు కరోనావైరస్ సోకే మరణించారు.
ఇప్పటివరకూ చైనాలో 42,200 కరోనాకేసులు నమోదయ్యాయి. 2002-03లో సార్స్ వ్యాప్తి తర్వాత చైనాలో తలెత్తిన అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం ఇదే.
హుబేలో 31,728 కేసులు నమోదైనట్లు అక్కడి హెల్త్ కమిషన్ తెలిపింది. సోమవారం నాటికి 974 మంది మరణించినట్లు పేర్కొంది.
మరణాల్లో మూడింట ఒక వంతు వుహాన్‌లోనే చోటుచేసుకున్నాయి. కరోనావైరస్ వ్యాప్తికి ఈ నగరమే కేంద్రంగా ఉంది. కొన్ని వారాలుగా వుహాన్‌నూ చైనా మూసేసింది.

ఫొటో సోర్స్, EPA
చైనా అధికారులతో కలిసి పనిచేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బృందం సోమవారం చైనాకు వచ్చింది.
ఈ బృందానికి బ్రూస్ అయిల్వార్డ్ నేతృత్వం వహిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో 2014-16లో ఎబోలా వ్యాపించినప్పుడు కూడా ఆయన పర్యవేక్షణలోనే అక్కడ డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలు సాగాయి.
చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సోమవారం బీజింగ్‌లో కరోనావైరస్ బాధితులకు చికిత్సను అందిస్తున్న వైద్య సిబ్బందిని కలిశారు. ముఖానికి మాస్క్ ధరించి ఆయన కనిపించారు. జిన్‌పింగ్ ఇలా బయటకు రావడం చాలా అరుదు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ‘‘ఈ మహమ్మారిని ఓడించగలమని నమ్మకం ఉంది’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.
వుహాన్‌కు మాత్రం ఆయన ఇంతవరకూ వెళ్లలేదు.

ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ఐఫోన్ల తయారీ ఆపేసి మాస్కులు తయారుచేస్తున్నారు
- ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా...
- "మేం రేపటి సూర్యోదయాన్ని చూస్తామో లేదో" - కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఓ మహిళ కథ
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- అమరావతిలో భూముల ధరలు: ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎలా మారాయి?
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- పోర్న్ సైట్లో తనను రేప్ చేసిన వీడియో తొలగించాలని బాధితురాలి పోరాటం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








