కరోనావైరస్ పశ్చిమ బెంగాల్‌లోని ఈ పల్లెపై ఎలాంటి ప్రభావం చూపించింది

ఫొటో సోర్స్, అమితాభ భట్టశాలి
- రచయిత, అమితాభ భట్టశాలి
- హోదా, బీబీసీ కోసం
కరోనావైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్ నగరానికి సరిగ్గా 2,799 కిలోమీటర్ల దూరంలో ఉన్న భగవాన్‌పూర్ కరోనావైరస్ ప్రభావానికి గురైంది.
ఈ పల్లె పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మిడ్నపూర్ జిల్లాలో ఉంది. భౌగోళికంగా చైనాకు అంత దూరంలో ఉన్న ఈ గ్రామంపై వైరస్ ప్రభావం ఎలా పడింది?


భగవాన్‌పూర్ ప్రజలు ప్రధానంగా జుట్టు సేకరించి విగ్గులు తయారు చేసే వృత్తిలో ఉన్నారు. ఇక్కడ ఏటా సుమారు 50 టన్నుల సరకు ఉత్పత్తవుతుంది.
వాటిని ప్రధానంగా చైనాకు ఎగుమతి చేస్తుంటారు. అయితే, చైనాలో కరోనావైరస్ వ్యాపించడంతో గత రెండు వారాలుగా ఎగుమతులు నిలిచిపోయాయి.
"వైరస్ ప్రభావం చైనాలో అంతగా ఉంటుందని మేము ఊహించలేదు. దాంతో వేల రూపాయిలు వెచ్చించి జుట్టు కొనుగోలు చేశాం. ఇప్పుడు ఎగుమతులు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం" అని భగవాన్‌పూర్ వ్యాపారి రీటా మైటీ చెప్పారు.
మరో వ్యాపారి పుతుల్ బెరా దగ్గర రూ. 40 వేల విలువైన ముడి సరకు నిల్వ ఉండిపోయింది.
‘‘చైనాకు ఎగుమతి చేయాల్సిన ఉత్పత్తుల అమ్మకాలు ఆగిపోవడంతో, పెద్ద వ్యాపారస్థులు, ఎగుమతిదారులు బకాయిలు చెల్లించలేకపోతున్నారు’’ అని పుతుల్ అంటున్నారు.

ఫొటో సోర్స్, అమితాభ భట్టశాలి
ఈ ప్రాంతంలో జుట్టు కొనడం, అమ్మడానికి వందల మంది ఏజెంట్లు ఉన్నారు. సాధారణంగా పంజాబ్, కశ్మీర్ ప్రాంతాల వారి జుట్టు పొడవుగా ఉండటం వలన ఖరీదు ఎక్కువగా ఉంటుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఈ జుట్టు గోనె సంచుల్లో చండీపూర్, భగవాన్‌పూర్‌లకు చేరుతుంది.
ఆ జుట్టును శుభ్రం చేసి 6 నుంచి 26 అంగుళాల పరిమాణంలో చిన్నచిన్న కట్టలుగా కట్టి చైనాకు ఎగుమతి చేస్తారు. ఈ పనిని ఫ్యాక్టరీలలో, ఇళ్ల దగ్గరా చేస్తారు. కానీ, ఇపుడు కరోనావైరస్ దెబ్బతో ఈ పనులన్నీ ఆగిపోయాయి.
"కరోనావైరస్ వల్ల చైనాతో వ్యాపార సంబంధాలు ఆగిపోయాయి. చైనా నుంచి కొనుగోలుదారులు ఇక్కడకి రాలేకపోతున్నారు. మేం సరకుని ఎగుమతి చేయలేకపోతున్నాం. 80 శాతానికి పైగా ప్రజలకు ఇపుడు చేతిలో పని లేదు" అని వ్యాపారి షేక్ హసీఫర్ రెహ్మాన్ చెప్పారు.
గతంలో రోజూ 25 నుంచి 30 మంది పనిచేసే ఆయన ఫ్యాక్టరీలో పెద్ద హాల్ ఇపుడు ఖాళీగా ఉంది.
ఇక్కడికి చైనా నుంచి వ్యాపారస్తులు ఏడాది పొడవునా వస్తూ ఉంటారు.
చాలా మంది వ్యాపారులు ఈసారి చైనీస్ కొత్త సంవత్సరం వేడుకల కోసం వెళ్లి తిరిగి రాలేదని రెహ్మాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, అమితాభ భట్టశాలి
పుతుల్, రీటా లాంటి చిన్న వ్యాపారులకు గణేశ్ పట్నాయక్ అనే వ్యాపారి ముడి సరకు (జుట్టు) సరఫరా చేస్తూ ఉంటారు.
"గత రెండు వారాల నుంచి రావాల్సిన చెల్లింపులు ఆగిపోయాయి. ఈ నెల 20కల్లా డబ్బులు ఇచ్చేస్తామని అంటున్నారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే నాకు ఏ మాత్రం నమ్మకం కుదరటం లేదు. ఈ వ్యాపారం పూర్తిగా మూత పడిపోతుందేమోనని భయంగా ఉంది" అని పట్నాయక్ అన్నారు.
ఈ పల్లె ఆర్ధిక వ్యవస్థకు జుట్టు వ్యాపారమే ఆధారం. ఇది ఒకేసారి ఆగిపోయేసరికి దీని ప్రభావం చుట్టు పక్కల గ్రామాలపైనా పడింది.
షేక్ సికందర్ భగవాన్‌పూర్ బస్సుస్టాండులో పొగాకు అమ్ముతారు. "కరోనావైరస్ ప్రభావం నా వ్యాపారం మీద కూడా చూపించింది. నా అమ్మకాలు బాగా పడిపోయాయి" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, అమితాభ భట్టశాలి
ఒక జాతీయ బ్యాంకుకు ఏజెంట్‌గా పనిచేసే ప్రజ్వల్ మైతీ ఆర్ధిక వ్యవస్థపై ఈ వైరస్ ప్రభావం ఎలా పడిందో వివరించారు.
"ఈ వైరస్ ప్రభావం పడక ముందు నా ఒక్క కౌంటర్‌లోనే రోజుకు పది లక్షల రూపాయిల లావాదేవీలు జరిగేవి. కానీ, ఇపుడు అవి 90 శాతానికి పైగా పడిపోయాయి" అని ఆయన చెప్పారు.
ప్రజల దగ్గర కనీసం అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొందని అనుపమ్ సర్కార్ అనే డాక్టర్ చెప్పారు.
ఇక్కడ ప్రజలు ఆందోళనతో ఉన్నారు. కానీ, మళ్లీ పరిస్థితులు చక్కబడతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
- సొమాలియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం.. మిడతల దండయాత్రే కారణం
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- బడ్జెట్ 2020: కొత్త ఆదాయపన్ను శ్లాబులు.. నిజంగానే పన్ను ఆదా చేస్తాయా
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- BBC Indian Sportswoman of the Year-2019: అవార్డ్ నామినీలు వీరే; 'భారత మహిళలు చరిత్ర లిఖిస్తున్నారు' -రూపా ఝా, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








