కరోనావైరస్: 'అమెరికా సాయం చేయాల్సిందిపోయి భయాన్ని వ్యాపింపచేస్తోంది' - చైనా

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్‌పై అమెరికా స్పందిస్తున్న తీరును చైనా తప్పుబట్టింది. వైరస్ వ్యాప్తిపై పోరాటంలో సాయపడాల్సిందిపోయి, అమెరికా భయాందోళనలు వ్యాప్తి చేస్తోందని ఆరోపించింది.
శుక్రవారం అమెరికా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గత రెండు వారాల్లో చైనాను సందర్శించిన విదేశీయులను తమ దేశంలోకి అనుమతించబోమని చెప్పింది. ఈ పరిణామాల తర్వాత చైనా విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ సోమవారం మీడియా సమావేశంలో తాజా ఆరోపణలు చేశారు. అమెరికా చర్యలు భయాన్ని వ్యాప్తి చేయడానికే పనికొస్తాయన్నారు.
చైనాలో ఇప్పటివరకు 17 వేల మందికి పైగా ప్రజలకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.


చైనా ఇంకా ఏమంది?
చైనా ప్రయాణికులపై నిషేధం విధించిన తొలి దేశం అమెరికానేనని హువా చున్‌యింగ్ విమర్శించారు. చైనాలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిని పాక్షికంగా ఉపసంహరించుకుంటామని చెప్పిన మొదటి దేశం కూడా అమెరికాయేనని ఆమె ఆక్షేపించారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.
అంటువ్యాధుల నివారణ సామర్థ్యాలు బాగా ఉన్న అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే-ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సిఫార్సులకు విరుద్ధంగా మితిమీరిన ఆంక్షలను విధించేందుకు చొరవ తీసుకున్నాయని ఆమె విమర్శించారు.

ఫొటో సోర్స్, AFP
చైనా ప్రయాణికుల ప్రవేశంపై అమెరికా నిషేధం ప్రకటించాక ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాలు కూడా ఈ నిషేధాన్ని విధించాయి.
ఇలాంటి సందర్భాల్లో సరిహద్దుల మూసివేతపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేసింది. వీటిని మూసేస్తే ప్రయాణికులు అనధికారికంగా దేశంలోకి ప్రవేశిస్తే వైరస్ వ్యాప్తి మరింతగా పెరగవచ్చని చెప్పింది.
చైనా ప్రధాన భూభాగంలో బాధితుల్లో 361 మంది చనిపోయారు. చైనా వెలుపల వైరస్ సోకినవారి సంఖ్య 150కి పైగా ఉంది. చైనా వెలుపల ఫిలిప్పీన్స్‌లో ఒకరు చనిపోయారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం (ఫిబ్రవరి 3) అర్ధరాత్రి నుంచి చైనా ప్రధాన భూభాగంతో ఉన్న 13 సరిహద్దు క్రాసింగ్‌లలో 10 క్రాసింగ్‌లు మూసేస్తామని హాంకాంగ్ ప్రకటించింది.

అమెరికా చర్యలు ఏమిటి?
హుయేబ్ రాష్ట్రం వుహాన్ నగరంలో అత్యవసర విధులు నిర్వహిస్తున్నవారు తప్ప అమెరికా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు అందరూ అక్కడి నుంచి వచ్చేయాలని జనవరి 23న అమెరికా ఆదేశించింది. కరోనావైరస్ తొలుత బయటపడింది ఈ నగరంలోనే.
అత్యవసర సేవల సిబ్బంది, అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల బంధువులు చైనా నుంచి వచ్చేయాలనుకుంటే వచ్చేయాలని తర్వాత వారంలోపే అమెరికా చెప్పింది.
కరోనావైరస్ వ్యాప్తిని అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్‌వో జనవరి 30న ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడ్డాక, 21 ఏళ్లలోపున్న తమ సిబ్బంది కుటుంబ సభ్యులందరూ చైనా నుంచి వచ్చేయాలని అమెరికా ఆదేశించింది.
హుబేయ్ రాష్ట్రం నుంచి తిరిగి వచ్చిన తమ పౌరులను అమెరికా 14 రోజులపాటు ప్రత్యేక వైద్య పరిశీలనలో ఉంచుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి?
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ దేశాలు ప్రయాణ ఆంక్షలను అమలు చేస్తున్నాయి.
అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్: ఇటీవల చైనాను సందర్శించిన విదేశీయులెవరినీ దేశంలోకి అనుమతించడం లేదు.
న్యూజిలాండ్, ఇజ్రాయెల్: చైనా ప్రధాన భూభాగం నుంచి వచ్చిన విదేశీయులను అనుమతించడం లేదు.
జపాన్, దక్షిణ కొరియా: హుబేయ్ రాష్ట్రాన్ని సందర్శించిన విదేశీయులను అనుమతించడం లేదు.
మంగోలియా, రష్యా(పాక్షికంగా): చైనాతో సరిహద్దుల మూసివేత.
ఈజిప్ట్, ఫిన్‌లాండ్, ఇండోనేషియా, బ్రిటన్, ఇటలీ, ఇతర దేశాల జాతీయ విమానయాన సంస్థలు చైనా ప్రధాన భూభాగానికి విమానాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

ఫొటో సోర్స్, EVN
ప్రయాణ నిషేధాలతో ఫలితముంటుందా?
ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణ నిషేధాలు వద్దని అంతర్జాతీయ ఆరోగ్య అధికారులు సలహా ఇస్తున్నారు.
"ప్రయాణ ఆంక్షలతో మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ఆస్కారముంది. ఇవి సమాచార మార్పిడికి, వైద్య సరఫరా వ్యవస్థకు అడ్డంకులు సృష్టిస్తాయి. ఆర్థిక వ్యవస్థలకు నష్టం కలిగిస్తాయి" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ జెబ్రీయెసస్ శుక్రవారం చెప్పారు.
ఆంక్షలు విధించే బదులు సరిహద్దుల వద్ద ప్రయాణికులకు వైద్యపరీక్షలు నిర్వహించాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.

వైరస్ వ్యాప్తి తీవ్రత ఎలా ఉంది?
వైరస్ వ్యాప్తికి కేంద్రమైన వుహాన్‌లో 75 వేల మందికి పైగా ఇన్‌ఫెక్షన్ బారిన పడి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వాస్తవ బాధితుల సంఖ్య అధికారిక గణాంకాల కన్నా చాలా ఎక్కువగా ఉండొచ్చని హాంకాంగ్ విశ్వవిద్యాలయం అంచనాలు చెబుతున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తి తొలి దశలపై ప్రముఖ వైద్యపత్రిక 'ద లాన్సెట్' నివేదిక ప్రకారం- మృతుల్లో అత్యధికులకు ఇది సోకడానికి ముందే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
వుహాన్లోని జిన్యింటాన్ ఆస్పత్రిలో చికిత్స పొందిన మొదటి 99 మందిలో 40 మందికి గుండె బలహీనంగా ఉందని, లేదా రక్తనాళాలు దెబ్బతిని ఉన్నాయని నివేదిక తెలిపింది. మరో 12 మందికి మధుమేహం ఉందని చెప్పింది.
కరోనావైరస్ తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. ఇది సోకితే మొదట్లో జ్వరం, జలుబు, ఆ తర్వాత పొడి దగ్గు రావొచ్చు.
వైరస్ బాధితుల్లో అత్యధికులు సాధారణ జ్వరం మాదిరే ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకొనే అవకాశముంది. తక్కువస్థాయి ఇన్‌ఫెక్షన్ నుంచి వారంలో బయటపడొచ్చని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ నిపుణుడు ఒకరు చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- సొమాలియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం.. మిడతల దండయాత్రే కారణం
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- బడ్జెట్ 2020: కొత్త ఆదాయపన్ను శ్లాబులు.. నిజంగానే పన్ను ఆదా చేస్తాయా
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- BBC Indian Sportswoman of the Year-2019: అవార్డ్ నామినీలు వీరే; 'భారత మహిళలు చరిత్ర లిఖిస్తున్నారు' -రూపా ఝా, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








