డీకేఐఎస్‌టీ: ఎప్పుడూ కనిపించనంత స్పష్టంగా సూర్యుడు... ఇక్కడ చూడండి

ఫొటో సోర్స్, NSF/DKIST
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, బీబీసీ సైన్స్ ప్రతినిధి
సూర్యుడి ఉపరితలాన్ని ఇప్పటివరకు ఎన్నడూ చూడనంత స్పష్టంగా చూపించే చిత్రాలను అమెరికాలోని ఒక భారీ టెలిస్కోప్ అందించింది.
సూర్యుడి ఉపరితలంపై కేవలం 30 కి.మీ. పరిధిలో ఉన్న పదార్థాలను కూడా ఈ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
హవాయి రాష్ట్రంలోని డేనియర్ కె.ఇనోయి సోలార్ టెలిస్కోప్ ఈ చిత్రాలను అందించింది. ఈ టెలిస్కోప్‌నే 'డీకేఐఎస్‌టీ' అని వ్యవహరిస్తారు.
సూర్యుడు భూమికి 14.9 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. సూర్యుడి వ్యాసం సుమారు 14 లక్షల కిలోమీటర్లు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, '30 కిలోమీటర్ల' పరిధిలోని ఉపరితల దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించగలగడం పెద్ద విశేషమే.
చిత్రాల్లో కనిపిస్తున్న నిర్మాణాలు కణం ఆకారంలో ఉన్నాయి. ఒక్కో నిర్మాణం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రమంత పెద్దగా ఉంది.
ఈ నిర్మాణాలు 'కన్వెక్షన్' ప్రభావిత ప్లాస్మా ద్రవ్యరాశులు. కాంతివంతంగా కనిపిస్తున్న ప్రదేశాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్లాస్మా ఉపరితలం మీదకు వస్తోంది. ఈ ప్రదేశాల చుట్టూ ముదురు వర్ణంలో కనిపిస్తున్న గీతల్లో ఉష్ణోగ్రత తగ్గిన ప్లాస్మా ఉపరితలం కిందకు వెళ్తోంది.
హవాయిలోని మయీ ద్వీపంలో మూడు వేల మీటర్ల ఎత్తైన హలీకలా అగ్నిపర్వతంపై ఈ టెలిస్కోప్ ఉంది. దీనికి నాలుగు మీటర్ల(4ఎం) ప్రైమరీ మిర్రర్ ఉంది. ప్రపంచంలో ఇంత పెద్ద ప్రైమరీ మిర్రర్ మరే టెలిస్కోప్‌కూ లేదు.
శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోప్‌తో సూర్యుడిలో జరిగే వివిధ ప్రక్రియలు, మార్పులను అధ్యయనం చేస్తున్నారు. అంతరిక్ష వాతావరణాన్ని మెరుగ్గా అంచనా వేయడానికి ఈ పరిజ్ఞానం దోహదం చేస్తుందని వారు ఆశిస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter/NatlSolarObservatory
సూర్యుడి నుంచి భారీగా వెలువడే ఆవేశిత రేణువులు(చార్జ్డ్ పార్టికల్స్), అయస్కాంత క్షేత్ర తీవ్ర ప్రభావాలు శాటిలైట్లు, రేడియో కమ్యూనికేషన్లను దెబ్బతిస్తుంటాయి. ఇవి వ్యోమగాములకు హాని కలిగిస్తాయి. విద్యుత్ గ్రిడ్‌ల పనితీరునూ దెబ్బతీస్తాయి.
భూవాతావరణాన్ని అంచనా వేసినంత కచ్చితత్వంతో అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయలేం.


"ప్రపంచంలో ఎక్కడైనా వర్షం రాకను చాలా వరకు కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. అంతరిక్ష వాతావరణాన్ని అలా ఏ మాత్రం అంచనా వేయలేం" అని డీకేఐఎస్‌టీని నిర్వహించే 'అసోసియేషన్ ఆఫ్ యూనివర్శిటీస్ ఫర్ రీసర్చ్ ఇన్ ఆస్ట్రానమీ' అధ్యక్షుడు మ్యాట్ మౌంటెయిన్ చెప్పారు.
అంతరిక్ష వాతావరణాన్ని అంచనా వేయడంలో మనం కనీసం 50 ఏళ్లు వెనకబడి ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. అంతరిక్ష వాతావరణం వెనక దాగి ఉన్న భౌతికశాస్త్ర పరిజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ పని సూర్యుడితోనే మొదలవుతుందని, రానున్న దశాబ్దాల్లో డీకేఐఎస్‌టీ ఈ అధ్యయనాన్ని సాగిస్తుందని వివరించారు.

ఫొటో సోర్స్, ESA
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరాల్ నుంచి వచ్చే వారం ప్రయోగించనున్న 'సోలార్ ఆర్బిటర్(సోలో)' అంతరిక్ష అబ్జర్వేటరీ పని విషయంలో డీకేఐఎస్‌టీ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి.
సోలో- అమెరికా, ఐరోపా సంయుక్త ప్రాజెక్టు. సూర్యుడి ఉపరితలానికి కేవలం నాలుగు కోట్ల 20 లక్షల కిలోమీటర్ల దూరం నుంచే సోలో ఫొటోలు తీస్తుంది. ఇప్పటివరకు ఇంత దగ్గరగా ఏదీ ఇలా ఫొటోలు తీయలేదు. బుధగ్రహానికి భూమికి మధ్య దూరం కంటే కూడా ఈ దూరం తక్కువ.

ఇవి కూడా చదవండి:
- గగన్‌యాన్: ముగ్గురు భారతీయులు, ఏడు రోజులు, రూ.10 వేల కోట్ల వ్యయం
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
- చంద్రయాన్-2 మిషన్ సూత్రధారులు ఈ ఇద్దరు మహిళలు
- నెలకు రూ.7 వేల వేతనం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న రైతు కూలీలు
- అపోలో మిషన్: చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు స్వర్ణోత్సవం
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- బంగారం, ప్లాటినం కంటే ఈ లోహం ఖరీదైంది.. దీనికి ఎందుకింత డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









