బ్రెగ్జిట్: యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించిన బ్రిటన్... స్వతంత్ర దేశంగా ఈయూకు తిరిగి వస్తామన్న స్కాట్లాండ్

ఫొటో సోర్స్, Reuters
యూరోపియన్ యూనియన్‌లో 47 ఏళ్లుగా కొనసాగుతున్న బ్రిటన్ నిన్న అంటే 2020 జనవరి 31 రాత్రి 11 గంటలకు (జీఎంటీ) అధికారికంగా బయటకు వచ్చింది. ఈ చరిత్రాత్మక పరిణామంపై బ్రిటన్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
బ్రిటన్లో 2016 జూన్‌లో జరిగిన రెఫరెండంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు.
ఈయూ నుంచి యూకే నిష్క్రమణ సందర్భంగా బ్రిటన్లో బ్రెగ్జిట్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. లండన్ పార్లమెంట్ స్క్వేర్, ఇతర ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. వేర్వేరు చోట్ల నిష్క్రమణ వ్యతిరేకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.


రెఫరెండంలో ఈయూలో కొనసాగాలని మెజారిటీ ప్రజలు కోరుకొన్న స్కాట్లాండ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది.
బ్రెగ్జిట్ మద్దతుదారులు, వ్యతిరేకులు అందరినీ ఏకతాటిపైకి తెచ్చి, దేశాన్ని ముందుకు నడిపిస్తానని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినబూనారు.

బ్రిటన్ నిష్క్రమణకు గంట ముందు జాన్సన్ సోషల్ మీడియాలో తన సందేశాన్ని విడుదల చేశారు.
గత 50 ఏళ్లలో ఈయూ మార్పు చెందుతూ వచ్చిందని, నేటి ఈయూ బ్రిటన్‌కు తగిన విధంగా లేదని ఆయన చెప్పారు.
ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ముగింపు కాదని, సరికొత్త ఆరంభమని జాన్సన్ వ్యాఖ్యానించారు. ఇది నిజమైన జాతీయ పునరుద్ధరణ, మార్పు సాకారమయ్యే సందర్భమని చెప్పారు.
ఈయూ నుంచి నిష్క్రమణ సందర్భంగా 50 పెన్స్ నాణేన్ని బ్రిటన్ చలామణిలోకి తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
వేడుకలు-నిరసనలు
ఈయూ నుంచి నిష్క్రమణకు గంటల ముందు లండన్ సహా దేశవ్యాప్తంగా పబ్‌లు, సోషల్ క్లబుల్లో బ్రెగ్జిట్ వేడుకలు జరిగాయి.
పార్లమెంట్ స్క్వేర్ వద్ద వంద మంది సంబరాలు చేసుకున్నారు. దేశభక్తి గీతాలు ఆలపించారు. ఇక్కడ బ్రెగ్జిట్ పార్టీ నాయకుడు నిగెల్ ఫారాజ్ ప్రసంగిస్తూ- "ముందెన్నడూ లేనంతగా ఈ రాత్రి మనం వేడుక చేసుకోవాలి. మన దేశ ఆధునిక చరిత్రలో ఇదే అత్యంత గొప్ప సందర్భం" అని చెప్పారు.
పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఈ వేడుకలకు ముందు లండన్లోని వైట్‌హాల్ రోడ్‌లో ఈయూలో బ్రిటన్ కొనసాగాలనేవారు ఓ ప్రదర్శన నిర్వహించారు.
స్కాట్లాండ్‌లో బ్రెగ్జిట్ వ్యతిరేక ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి.

ఫొటో సోర్స్, PA Media
ఒక స్వతంత్ర దేశంగా తిరిగి ఈయూ హృదయంలోకి: స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్
ఉత్తర ఐర్లాండ్‌లో 'బార్డర్ కమ్యూనిటీస్ అగెనెస్ట్ బ్రెగ్జిట్' గ్రూప్ ఐర్లాండ్ సరిహద్దుల్లోని ఆర్మ్‌గడ్ పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్, స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎస్‌ఎన్‌పీ) నాయకురాలు నికోలా స్టర్జన్ శుక్రవారం రాత్రి 11 గంటలకు- "స్వాట్లాండ్ ఒక స్వతంత్ర దేశంగా తిరిగి ఐరోపా హృదయాన్ని చేరుతుంది" అని ట్విటర్లో వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యకు ఈయూ పతాకాన్ని జోడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈయూ నుంచి అధికారికంగా వైదొలగినప్పటికీ ఈయూ నిబంధనలను 2020 డిసెంబరు చివరి వరకు బ్రిటన్ పాటించాల్సి ఉంటుందని బీబీసీ పొలిటికల్ ఎడిటర్ లారా కెన్స్‌బర్గ్ చెప్పారు. యూకే-ఈయూ నాలుగు దశాబ్దాలకు పైగా జంటగా కొనసాగాయని, ఇది పొసగని జంట అని, చివరకు విడాకులు తీసుకున్నాయని వ్యాఖ్యానించారు.
ఈయూలో బ్రిటన్ ఎప్పుడూ అత్యంత ఉత్సాహవంతమైన సభ్యదేశంగా వ్యవహరించలేదని, కానీ దాదాపు అర్ధ శతాబ్దం ఇందులో కొనసాగిందని బీబీసీ ఐరోపా ఎడిటర్ కాట్యా అడ్లర్ చెప్పారు.

ఇప్పుడేం జరుగుతుంది?
ఈయూ నుంచి నిష్క్రమించినప్పటికీ ఈయూ చట్టాల్లో అత్యధికం డిసెంబరు 31 వరకు బ్రిటన్‌కు వర్తిస్తాయి. ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు సంబంధించినది వీటిలో ఒకటి.
ఈయూ-కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తరహాలో ఈయూతో శాశ్వత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని బ్రిటన్ ప్రయత్నిస్తోంది.
డిసెంబరు 31లోపు ఒప్పందం చేసుకోవడానికి బ్రిటన్‌కు చాలా కష్టమవుతుందని ఐరోపా నాయకులు ఇప్పటికే హెచ్చరించారు.
ఐరోపా స్పందన?
వాణిజ్య చర్చల్లో బ్రిటన్, ఈయూ తమ తమ ప్రయోజనాల కోసం పోరాడతాయని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లెయెన్ చెప్పారు. ఈయూలో బ్రిటన్ చివరి రోజు ఉద్వేగభరితమైనదని ఆమె వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
శుక్రవారం బ్రెగ్జిట్‌కు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ మాట్లాడుతూ- 70 ఏళ్లలో తొలిసారిగా ఈయూ నుంచి ఒక దేశం వైదలగుతోందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఒక చరిత్రాత్మకమైన హెచ్చరిక అని, ఈయూలోని ప్రతి దేశంలో దీనిని గమనంలోకి తీసుకోవాలని సూచించారు.
అమెరికా ఏమంది?
బ్రిటన్ ప్రజల తీర్పును గౌరవించే బ్రెగ్జిట్ ఒప్పందానికి యూకే, ఈయూ అంగీకరించడం తనకు సంతోషం కలిగిస్తోందని అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపేయో చెప్పారు.
ఇప్పుడు యూకే ఒక కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తోందని, యూకేతో అమెరాకు ఉన్న బలమైన, ఫలప్రదమైన సంబంధాన్ని మరింతగా మెరుగుపరుకుంటామని వ్యాఖ్యానించారు.

ప్రవేశం-నిష్క్రమణ
బ్రిటన్ 1973 జనవరి 1న అప్పట్లో 'యూరోపియన్ ఎకనమిక్ కమ్యూనిటీ' పేరుతో ఉన్న కూటమిలో చేరింది. తన మూడో ప్రయత్నంలో ఇది సాధ్యమైంది. ఆ తర్వాత రెండేళ్లకు బ్రిటన్లో జరిగిన జాతీయస్థాయి రెఫరెండంలో, కూటమిలో బ్రిటన్ కొనసాగాలని భారీ మెజారిటీతో ప్రజలు తీర్పు ఇచ్చారు.
ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణకు సంబంధించి సొంత పార్టీ ఎంపీలు, యూకే ఇండిపెండెన్స్ పార్టీ నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో 2016 జూన్‌లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన అప్పటి ప్రధాని డేవిడ్ కామెరూన్ మరో రెఫరెండం నిర్వహించారు.
ఈయూలో బ్రిటన్ కొనసాగింపునకు అనుకూలంగా కామెరూన్ ప్రచారం నిర్వహించారు. ప్రస్తుత ప్రధాని, కన్జర్వేటివ్ పార్టీ నేత బోరిస్ జాన్సన్ ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించాలని ప్రచారం సాగించారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 52 శాతం మంది ఓటేయగా, ఈయూలో కొనసాగాలంటూ 48 శాతం మంది ఓటు వేశారు.
కామెరూన్ తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన థెరిసా మే ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఒప్పందానికి పార్లమెంటులో ఆమోదం పొందలేకపోయారు. ఆమె స్థానంలో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యారు. ఆయన ప్రయత్నాలు కూడా తొలుత ఫలించలేదు. బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తిచేస్తాననే హామీతో 2019లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కన్జర్వేటివ్ పార్టీ భారీ మెజారిటీని సాధించింది.
ఆయన ప్రతిపాదించిన నిష్క్రమణ ఒప్పందానికి క్రిస్మస్‌కు ముందు ఎంపీలు ఆమోదం తెలిపారు. సంబంధిత బిల్లు ఇటీవల చట్టరూపం దాల్చింది.

ఇవి కూడా చదవండి:
- LIVE బడ్జెట్ 2020: జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి 30, 757 కోట్లు
- కరోనా వైరస్: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
- క్రికెట్ పోటీల్లోకి మరో కొత్త దేశం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నైజీరియా జట్టు
- ఎక్కడివాళ్లు అక్కడే... వైరస్ భయంతో చైనా నగరంలో రైళ్లు, విమానాలు బంద్
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- బంగారం, ప్లాటినం కంటే ఈ లోహం ఖరీదైంది.. దీనికి ఎందుకింత డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








