వుహాన్ డైరీ: 'ప్రపంచం మౌనంగా ఉంది... నిశ్శబ్దం భయంకరంగా ఉంది'

గువో జింగ్ ప్రపంచాన్ని కలవరపరుస్తున్న కొత్త వైరస్‌కు కేంద్రం అయిన వుహాన్‌లో నివసిస్తున్నారు.
వుహాన్ నగరం జనవరి 23 నుంచి లాక్‌డౌన్ కింద ఉంది. వైరస్ వ్యాపించకుండా అడ్డుకునేందుకు రవాణా, దుకాణాలు, వ్యాపారాలు కూడా మూసివేశారు. ఇళ్లలోపలే ఉండాలని ప్రజలకు సూచించారు.
29 ఏళ్ల సామాజిక కార్యకర్త జింగ్ గత వారం రోజులుగా తన ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆమె డైరీ రాస్తున్నారు. అందులో విషయాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు.


జనవరి 23 - లాక్‌డౌన్ రోజు
ఉదయం నిద్రలేవగానే, లాక్‌డౌన్ గురించి తెలిసింది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. లాక్‌డౌన్ అంటే ఏంటో, అది ఏంతకాలం ఉంటుందో, ఆ సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలో నాకు తెలీదు.
కోపం తెప్పించేలా చాలా కామెంట్స్ (సోషల్ మీడియాలో) వస్తున్నాయి. చాలామంది రోగులకు వైరస్ ఉన్నట్టు తెలిసినా, ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు (తగిన పడకలు లేవు). వారికి వచ్చిన జ్వరం తగ్గడం లేదు.

చాలామంది మాస్కులు వేసుకుంటున్నారు. సరుకులు నిల్వ చేసుకోవాలని నా ఫ్రెండ్స్ చెప్పారు. బయట బియ్యం, నూడుల్స్ దాదాపు పూర్తిగా అమ్ముడైపోయాయి.
ఒకాయన చాలా సాల్ట్ కొంటున్నాడు. కొందరు 'అంత ఎందుకు' అని ఆయన్ని అడిగారు. ఆయన 'ఏడాదంతా లాక్‌డౌన్ ఉంటే ఏం చేయాలి' అన్నారు.
నేను ఒక ఫార్మసీకి వెళ్లాను, లోపల చాలా కొద్దిమందే ఉన్నారు. అక్కడ మాస్కులు, ఆల్కహాల్ శానిటైజర్లు అప్పటికే అమ్ముడైపోయాయి.
సరుకులు నిల్వ చేసుకున్నాను. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నా. రోడ్డుపై కార్లు, పాదచారుల సంఖ్య తగ్గిపోతోంది. నగరంలో అన్నీ హఠాత్తుగా ఆగిపోయినట్టు అనిపించింది.
నగరంలో మళ్లీ జీవం ఎప్పుడొస్తుంది?

జనవరి 24 - కొత్త సంవత్సరం వేడుక 'నిశ్శబ్దం'గా
ప్రపంచం మౌనంగా ఉంది. నిశ్శబ్దం భయంకరంగా ఉంది. నేను ఒంటరిగా ఉన్నాను. బయట కారిడార్లో వస్తున్న చప్పుళ్లను బట్టి నా చుట్టుపక్కల, ఇంకొంతమంది మనుషులున్నారని నాకు తెలుస్తోంది.
దీన్నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించడానికి నా దగ్గర చాలా టైమ్ ఉంది. ఇక్కడ నేను సంప్రదించడానికి, నాకు తెలిసిన వారు ఎవరూ లేరు.
అనారోగ్యానికి గురికాకుండా ఉండడం అనేది నా లక్ష్యాల్లో ఒకటి. అంటే, నేను వ్యాయామం చేస్తుండాలి. బతకడానికి ఆహారం కూడా అవసరమే. అందుకే, లోపల తగినన్ని సరుకులుండేలా నేను చూడాలి.
లాక్‌డౌన్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో, మేం మళ్లీ ఎప్పుడు బయటికి రావచ్చో ప్రభుత్వం చెప్పడం లేదు. మే నెల వరకూ ఇలాగే ఉండచ్చని చాలా మంది చెబుతున్నారు.
కింద ఫార్మసీ, దుకాణాలు ఈరోజు మూసేశారు. కానీ ఫుడ్ డెలివరీ మాత్రం ఇంకా కొనసాగడం చూసి బాగా అనిపించింది.
సూపర్ మార్కెట్లలో నూడుల్స్ అన్నీ అయిపోయాయి. కొన్ని బియ్యం మాత్రమే ఉన్నాయి. నేను ఈరోజు మార్కెట్‌కు కూడా వెళ్లాను. ఆకుకూరలు, గుడ్లు కొనుక్కొచ్చాను.
ఇంట్లోకి వెళ్లాక నా బట్టలన్నీ ఉతికి, స్నానం చేశాను. వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. నేను రోజుకు 20, 30 సార్లు చేతులు కడుక్కుంటున్నాను.

ఫొటో సోర్స్, Getty Images
బయటికెళ్తుంటే, ఇంకా ప్రపంచంతో నాకు సంబంధాలు ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఒంటరిగా ఉన్న వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు ఎలా తట్టుకుంటున్నారా అనేది ఊహించడమే కష్టంగా ఉంది.
నేను మామూలుగా చేసే దానికంటే తక్కువ వంట చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే పిగ్ నామ సంవత్సరంలో ఇది చివరి రాత్రి. అందుకే, ఇది కొత్త ఏడాదిలో పండుగ భోజనంలా ఉండాలి.
భోజనం చేశాక, నా ఫ్రెండ్స్‌కు వీడియో కాల్ చేశాను. మేం వైరస్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేకపోయాం. కొంతమంది వుహాన్ సమీపంలోని పట్టణాల్లో ఉన్నారు. కొందరు వైరస్ వల్ల ఇంటికెళ్లకూడదని అనుకుంటుంటే, కొందరు మాత్రం అందరం కలుద్దామని పట్టుబడుతున్నారు.
కాల్ మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గింది. కొందరు ఆమెతో సరదాగా 'ఫోన్ పెట్టేయ్' అన్నారు.
మేం మూడు గంటలపాటు మాట్లాడుకున్నాం. తర్వాత నాకు సంతోషకరమైన ఆలోచనలతో నిద్రపడుతుందని అనుకున్నా. కానీ, కళ్లు మూసుకోగానే, గత కొన్నిరోజులుగా జరిగినవన్నీ మళ్లీ గుర్తుకొచ్చాయి.
ఏడుపొస్తోంది, నిస్సహాయంగా అనిపిస్తోంది. కోపంగా, బాధగా ఉంది. చచ్చిపోదామా అనిపించింది.
నాకు పెద్దగా చింతలేవీ లేవు. ఎందుకంటే నా ఉద్యోగం బాగానే ఉంటుంది. కానీ, నా జీవితం ఇలా ముగిసిపోవాలని నేను అనుకోవడం లేదు.

జనవరి 25- కొత్త ఏడాదిలో 'ఒంటరి'గా
ఈరోజు చైనా కొత్త సంవత్సరం. పండుగలు జరుపుకోవడానికి నేను పెద్దగా ఆసక్తి చూపించను. కానీ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఇంకా ఘోరంగా ఉంది.
ఉదయం, తుమ్మినప్పుడు కాస్త రక్తం పడింది. భయమేసింది. నాకేమైనా అయ్యిందా అని ఏవేవో ఆలోచనలు. ఇప్పుడు, నేను బయటికెళ్లాలా, వద్దా అని ఆలోచించాను. కానీ, నాకు జ్వరం లేదు, బాగా ఆకలిగా కూడా ఉంది. దాంతో బయటికెళ్లాను.
మాస్క్ వేసుకోవడంలో అర్థం లేదు, అనవసరం అని కొందరు అనుకుంటున్నా.. నేను మాత్రం రెండు మాస్కులు వేసుకున్నా. నా భయం అంతా నకిలీ (నాణ్యత లేని) మాస్కుల గురించే. అందుకే, రెండు మాస్కులు వేసుకోగానే సురక్షితంగా అనిపించింది.
బయట ఇంకా నిశ్శబ్దం ఉంది.
ఒక పూలు అమ్మే షాప్ తెరిచుంది. దాని యజమాని గుమ్మం దగ్గర కొన్ని చామంతిపూలు (చైనాలో అంత్యక్రియలకు ఉపయోగిస్తుంటారు) పెట్టుండడం కనిపించింది. దానికేదైనా అర్థం ఉందేమో, నాకు తెలీలేదు.

ఫొటో సోర్స్, AFP
సూపర్ మార్కెట్లో కూరగాయల అరలు ఖాళీగా ఉన్నాయి. నూడుల్స్, డంప్లింగ్స్ అన్నీ దాదాపు అమ్ముడైపోయాయి. అక్కడ వరుసలో కొంతమందే ఉన్నారు.
షాపుకు వెళ్లినప్పుడల్లా నాకు ఎక్కువగా కొనేద్దాం అనిపిస్తోంది. ఇంట్లో 7 కిలోల బియ్యం ఉన్నా, మరో 2.5 కిలోలు కొన్నాను. కొన్ని చిలగడదుంపలు, డంప్లింగ్స్, కూరగాయలు, సాల్టెడ్ గుడ్లు, వేరే సరుకులు తీసుకొచ్చాను.
నాకు సాల్టెడ్ గుడ్లు నచ్చవు. కానీ, లాక్‌డౌన్ ఎత్తేశాక నా ఫ్రెండ్స్ వస్తారేమో అని వాళ్లకోసం తీసుకొచ్చాను.
ఇంట్లో నెలకు సరిపడా సరుకులు ఉన్నాయి. మళ్లీ, ఇలా బలవంతంగా కొనడం వెర్రిగా అనిపిస్తోంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను వాటిని కొనుగోలుచేయక తప్పదు.
నేను నది పక్కనే నడకకు వెళ్లాను. రెండు స్నాక్ షాపులు తెరిచున్నాయి. కొందరు తమ కుక్కలను తీసుకుని నడుస్తున్నారు. ఇంకొందరు షికారుకు వచ్చారు. చూస్తుంటే, వాళ్లకు కూడా ఇళ్లలో బందీల్లా ఉండడం ఇష్టం లేదేమో అనిపించింది.
నేను ముందెప్పుడూ, ఇలా రోడ్డు పక్కన నడవలేదు. నాకు ప్రపంచం కాస్త పెద్దదైనట్టు అనిపించింది.

జనవరి 26 - మన గొంతు వినిపించేలా చేయడం
లాక్‌డౌన్ జరిగిన మొదటి రోజు, సోషల్ మీడియాలో నేను (దాని గురించి) ఏం రాయలేకపోయాను (సెన్సార్‌షిప్ వల్ల). నేను వీచాట్‌లో కూడా రాయలేకపోయా. చైనాలో చాలా కాలం నుంచి ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ ఉంది. కానీ ఇప్పుడు అది ఇంకా దారుణంగా ఉందని అనిపిస్తోంది.
అంతా తలకిందులైనప్పుడు, మన రోజువారీ జీవితాన్ని మళ్లీ చక్కదిద్దుకోవడం సవాలుగా మారుతుంది. నేను ఒక యాప్ ద్వారా ఉదయం వ్యాయామం చేస్తూనే ఉన్నా. కానీ ఏవేవో ఆలోచనలు వస్తుండడంతో దానిపై ఫోకస్ చేయలేకపోయా.
నేనీరోజు మళ్లీ బయటికెళ్లి, అక్కడ ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టాలని ప్రయత్నించా. నాకు మా ఇంటికి దాదాపు అర కిలోమీటరు దూరంలో 8 మంది కనిపించారు.
నాకు ఇంటికి వెళ్లాలని లేదు. మరింత తెలుసుకోవాలని ఉంది. నేను వుహాన్ వచ్చి రెండు నెలలే అయ్యింది. నాకు ఇక్కడ ఎక్కువమంది ఫ్రెండ్స్ లేరు. ఈ సిటీ గురించి కూడా తెలీదు.
ఈరోజు నేను వంద మందిని చూశానని అనిపిస్తోంది. నేను నా గొంతును వినిపించాలి, సంకెళ్లను తెంచేయాలి. అందరూ ఆ ఆశతోనే ఉంటారనిపిస్తోంది. భవిష్యత్తులో మేం మళ్లీ కలిసి, మాట్లాడుకుంటామనే అనుకుంటున్నాను.
రాత్రి 8 గంటలకు 'గో వుహాన్' అంటూ కిటికీలోంచి జనం అరుపులు వినిపించాయి. స్వీయ-సాధికారత రూపంలో అదొక సామూహిక ప్రార్థన లాంటిది.

ఫొటో సోర్స్, Getty Images
జనవరి 28- చివరికి 'ఎండ' కనిపించింది
భయం ప్రజల మధ్య చీలికలను తీసుకొచ్చింది.
చాలా నగరాల్లో జనం బయట మాస్క్ వేసుకోవాల్సి వస్తోంది. న్యుమోనియాను నియంత్రించడానికి అలా చేస్తున్నారు. కానీ నిజానికి అది అధికార దుర్వినియోగానికి దారితీస్తోంది.
కొంతమంది మాస్క్ లేకుండానే ప్రయాణిస్తున్నారు. వాళ్లు మాస్క్ ఎందుకు వేసుకోలేదో నాకు తెలీలేదు. బహుశా వాళ్లు కొనుక్కోలేకపోయారేమో, లేదంటే వాళ్లకు నోటీస్ గురించి తెలిసుండదు. ఏదేమైనా, బయటికెళ్లే వాళ్ల హక్కును ఎవరూ కాదనలేరు.
ఆన్‌లైన్లో కొన్ని వీడియోలు సర్కులేట్ అవుతున్నాయి. కొంతమంది తలుపులు బిగించుకుని తమను తాము లోపల బందీలుగా ఉంచుకున్నారు. హుబే ప్రావిన్స్ వారిని ఇళ్ల నుంచి బయటకు పంపించేశారు. వారు ఎటూ వెళ్లలేకపోతున్నారు.
కానీ, అదే సమయంలో కొంతమంది హుబే ప్రజల కోసం ఆశ్రయం ఇస్తున్నారు.
ఇళ్లలోనే ఉండేలా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో పద్ధతులు పాటించవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గరా తగినన్ని మాస్కులు ఉండేలా చూసుకోవచ్చు. లేదంటే ఇళ్ల లోపలే ఉంటున్నవారికి నగదు బహుమతులు ఇవ్వవచ్చు.

ఫొటో సోర్స్, EPA
ఈరోజు. నా మూడ్‌లాగే, మొత్తానికి ఎండ వచ్చింది. మా కాంప్లెక్స్‌లో మరింత మంది కనిపించారు. వాళ్లలో కొందరు ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. వాళ్లు స్థానికేతరులను చెక్ చేయడానికి వచ్చారు.
లాక్‌డౌన్ పరిస్థితిలో విశ్వాసం, బంధం ఏర్పరుచుకోవడం అంత సులభం కాదు. నగరం భారంగా ఉంది.
వీటన్నిటి మధ్యా, నేను మరింత జాగ్రత్తగా ఉండడం తప్ప, వేరే ఏం చేయలేను.
దీన్నుంచి బయటపడడం గురించి నాలో ఆందోళన మెల్లగా చెదిరిపోతోంది. ఇక్కడ ఉన్నవారితో మనం ఎలాంటి సంబంధాలూ ఏర్పరుచుకోలేనప్పుడు, నగరంలో ఇంకాస్త ముందుకు వెళ్లడంలో అర్థమేముంది.
సామాజిక భాగస్వామ్యం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరూ సమాజంలో తమ పాత్రను గుర్తించాలి. ఒకరి జీవితాన్ని అర్థవంతంగా చేయాలి.
ఈ ఒంటరి నగరంలో, నేను నా పాత్రను గుర్తించాలి.
(గువో జింగ్ తన డైరీలో రాసిన విషయాలను వీచాట్‌లో పోస్ట్ చేశారు. బీబీసీ ప్రతినిధి గ్రేస్ టిసాయ్‌తో మాట్లాడారు.)
ఇలస్ట్రేషన్స్ - డేవియస్ సూర్య

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. మోదీ, ట్రంప్, జిన్‌పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- విశాఖపట్నంలో రాజధాని: సెక్రటేరియట్, సీఎం నివాసం ఉండేది ఎక్కడంటే..
- ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు ఇదీ
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- అమరావతి ఆందోళనల్లో మహిళలు: ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే వస్తున్నాం’
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








