కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సోఫీ విలియమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనాలోని వుహాన్ నగరంలో కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి పడకల సామర్థ్యం గల ఆస్పత్రిని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా.. ఇప్పటికే ఈ వైరస్ సోకిన వారికి సేవలు అందించేందుకు ఈ ఆస్పత్రి కడుతున్నారు.
చైనాలో ఇప్పటి వరకూ 830 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 41 మంది చనిపోయారు.
వుహాన్ నగరంలోనే ఈ వైరస్ పుట్టుకొచ్చింది. ఈ నగరం జనాభా 1.1 కోట్లు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. మెడికల్ షాపుల్లో మందులు అయిపోతున్నాయి.
ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం కొత్తగా కడుతున్న ఈ ఆస్పత్రి సామర్థ్యం వెయ్యి పడకలు.


చైనా ప్రభుత్వ మీడియా ప్రచురించిన వీడియోలో.. ఈ ప్రాంతానికి పదుల సంఖ్యలో మట్టి తవ్వే యంత్రాలు చేరుకుని, ఆస్పత్రి నిర్మాణ పనులు చేస్తున్నాయి.
మొత్తం 269000 చదరపు అడుగుల స్థలంలో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు.
2003లో కూడా సార్స్ వైరస్ సోకిన వారికి వైద్యం అందించేందుకు బీజింగ్‌లో ఇలాగే ఒక ఆస్పత్రిని నిర్మించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది.
''వాస్తవానికి ఇది వైరస్ సోకిన వారిని వేరుగా ఉంచేందుకు నిర్మిస్తున్న ఆస్పత్రి. వైరస్ సోకిన వారిని ఇక్కడికి పంపిస్తారు. వాళ్లు మిగతా వారితో కలవకుండా, రోగం నయం చేసుకునేందుకు తగిన భద్రత, వైద్య ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి'' అని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ప్రపంచ ఆరోగ్యం, సామాజిక వైద్యం బోధించే అధ్యాపకురాలు జాన్ కౌఫ్‌మన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరు రోజుల్లోనే ఆస్పత్రిని చైనా ఎలా నిర్మించగలుగుతోంది?
''ఇలాంటి ఎన్నో ప్రముఖ ప్రాజెక్టుల్ని వేగంగా చేపట్టిన రికార్డు చైనాకు ఉంది'' అని విదేశీ సంబంధాల మండలిలో ప్రపంచ ఆరోగ్యంపై అధ్యయనం చేస్తున్న సీనియర్ ఫెలో యాంగ్జాంగ్ హువాంగ్ చెప్పారు.
2003లో బీజింగ్‌లో ఏడు రోజుల్లోనే ఆస్పత్రిని నిర్మించారని, అప్పటి వరకూ ఉన్న రికార్డును బద్దలుకొట్టే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు.
బీజింగ్‌లోలాగే ఇప్పుడు వుహాన్‌లో కూడా ప్రీఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ (ముందుగానే నిర్మించి ఉంచిన కాంక్రీటు దిమ్మెల్లాంటి నిర్మాణాలను ఒక చోట చేర్చి కలపటం) తరహాలోనే ఆస్పత్రిని నిర్మిస్తున్నారు.
''చైనా ఒక అధికారాన్ని చెలాయించే దేశం. పైనుంచి వచ్చే ఆదేశాలను ఎవ్వరైనా సరే పాటించాల్సిందే. అధికారుల సర్కారీ రాజ్ తరహా విధానాలను, ఆర్థిక పరమైన సవాళ్లను కూడా వాళ్లు సులభంగా అధిగమిస్తారు. అన్ని రకాల వనరులనూ సమీకరించగలుగుతారు'' అని హువాంగ్ చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
అనుకున్న సమయానికల్లా ఆస్పత్రిని నిర్మించేందుకు దేశం నలుమూలల నుంచి అవసరమైనంత మంది ఇంజనీర్లను తీసుకొస్తారని ఆయన వివరించారు.
''ఇంజనీరింగ్ పనుల్లో చైనాకు మంచి పేరుంది. ఆకాశాన్నంటే భవనాలను కూడా వాళ్లు రికార్డు సమయాల్లో కట్టేశారు. పాశ్చాత్య దేశాలవాళ్లు ఆలోచించడానికి కూడా ఇబ్బందిపడే విషయం ఇది. ఇలా భవనాలను చైనా కట్టి చూపిస్తుంది'' అని హువాంగ్ అన్నారు.
ఇక మందుల విషయానికొస్తే.. వుహాన్ ఆస్పత్రి తన పొరుగు నగరాల ఆస్పత్రుల నుంచి మందులు తీసుకుంటేంది. లేదంటే నేరుగా ఫ్యాక్టరీల నుంచే మందుల్ని ఉత్పత్తి చేయించి, ఈ ఆస్పత్రికి పంపిస్తారు.
శుక్రవారం 150 మంది చైనా సైన్యానికి చెందిన వైద్య సిబ్బంది వుహాన్‌కు చేరుకున్నారని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అయితే, వీరంతా కొత్తగా నిర్మించిన ఆస్పత్రిలో పనిచేస్తారా? లేదా? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సార్స్ వైరస్ విజృంభించినప్పుడు ఏం జరిగింది?
2003లో చైనాలో సార్స్ వైరస్ వ్యాపించింది. అప్పుడు ఈ వైరస్ బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందించేందుకు బీజింగ్ నగరంలో షియాటంగ్‌షన్ ఆస్పత్రిని నిర్మించారు.
ఏడు రోజుల్లో ఈ ఆస్పత్రిని కట్టారు. అప్పటి వరకూ ఒక ఆస్పత్రిని నిర్మించేందుకు అతి తక్కువ సమయంగా ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించినట్లు చెప్పారు.
అప్పట్లో ఈ ఆస్పత్రి నిర్మాణానికి 4 వేల మంది ప్రజలు రాత్రింబవళ్లు పనిచేశారని చైనా.కామ్.సీఎన్ తెలిపింది.
ఈ ఆస్పత్రిలో ఎక్స్‌రే రూమ్, సీటీ రూమ్, ఐసీయూ, లేబొరేటరీ ఉన్నయి. ప్రతి వార్డుకూ ప్రత్యేకంగా మరుగుదొడ్లు కూడా కట్టారు.
ఆస్పత్రి నిర్మించిన రెండు నెలలకే దేశంలో సార్స్ వైరస్ సోకిన వారిలో ఏడొంతుల్లో ఒక వంతు మంది ఇక్కడ చేరారు. ''వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతం'' అని చైనా మీడియా కీర్తించింది.
''ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా ఆస్పత్రులు, వైద్య కేంద్రాల్లోని నర్సులు, డాక్టర్లు, వైద్య సదుపాయాలను తాత్కాలికంగా ఈ ఆస్పత్రికి తరలించారు. సార్క్ వైరస్‌ను ఎలా గుర్తించాలి, మిగతా వారికి ఈ వైరస్ సోకకుండా వీరికి ఎలా వైద్యం చేయాలి అన్న విషయాలపై ఆరోగ్య శాఖ నియమ నిబంధనల ప్రకారం వారు నడుచుకున్నారు'' అని కౌఫ్‌మన్ వివరించారు.
సార్స్ వైరస్ సోకినప్పుడు ఇలా ఆస్పత్రిని నిర్మించడం, నర్సులు, డాక్టర్ల జీతాలు మొదలైన వాటికి మాత్రం పై నుంచి భారీగా నిధులు వచ్చాయి. ఆస్పత్రి నిర్వహణ, మందులు ఇతరత్రా వ్యవహారాలకు అవసరమైన ఖర్చుల్ని మాత్రం స్థానికంగానే భరించారు.
''ఇప్పుడు వుహాన్‌లో నిర్మించే ఆస్పత్రి ఖర్చుల్ని కూడా వుహాన్ ప్రభుత్వం భరిస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యత గల వ్యవహారం'' అని కైఫ్‌మన్ చెప్పారు.
''ఈ అంటువ్యాధి అంతమయ్యాక సైలెంట్‌గా ఈ ఆస్పత్రిని వదిలేస్తారు'' అని హువాంగ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- కరోనా వైరస్: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత
- రజినీకాంత్ చెప్పిన దాంట్లో నిజమెంత... సీతారాముల నగ్నవిగ్రహాలకు పెరియార్ చెప్పుల దండలు వేసి ఊరేగించారా..
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
- ఈ బాలుడు పడుకుంటే.. అతని ప్రాణానికే ముప్పు
- పీరియడ్స్‌లో ఉన్న మహిళలు బ్యాడ్జీలు ధరించే విధానంపై 'పునరాలోచన' చేస్తున్న జపాన్ సూపర్ బజార్
- క్రికెట్ పోటీల్లోకి మరో కొత్త దేశం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నైజీరియా జట్టు
- ఎక్కడివాళ్లు అక్కడే... వైరస్ భయంతో చైనా నగరంలో రైళ్లు, విమానాలు బంద్
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి...
- బంగారం, ప్లాటినం కంటే ఈ లోహం ఖరీదైంది.. దీనికి ఎందుకింత డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









