కరోనావైరస్: వుహాన్ వాసులకు భోజనం ఎలా అందుతోంది

ఫొటో సోర్స్, Meituan
కరోనావైరస్ కారణంగా చైనాలోని వుహాన్ నగరాన్ని పూర్తిగా మూసేశారు. బయటివాళ్లు నగరంలోకి రాకుండా, స్థానికులు నగరాన్ని విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
దుకాణాలు, వ్యాపారాలను కూడా మూసేశారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉంటున్న 1.1 కోట్ల ప్రజలకు కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఆహారం సమకూర్చుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చైనాలో అతిపెద్ద సోషల్ మీడియా వేదికైన వీబోలో చాలామంది వుహాన్ వాసులు ఆహారం దొరకట్లేదంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.
అక్కడక్కడా దొరుకుతున్న కూరగాయల ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. పోనీ ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేద్దామన్నా కూడా కొన్ని రిస్కులున్నాయి.
''నేను వారంలో చాలాసార్లు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవాణ్ణి. కానీ, ఇప్పుడు 3-4 సార్లు మాత్రమే చేస్తున్నా. డెలీవరీ ఇచ్చే బయటి వ్యక్తులను కలవడానికి కూడా భయంగా ఉంది'' అని వుహాన్‌లో ఉంటున్న ఓ విద్యార్థి చెప్పారు.
కానీ, ఈ సమస్యలను టెక్నాలజీ సాయంతో పరిష్కరించేందుకు ఓ ఫుడ్ డెలివరీ సంస్థ ప్రయత్నిస్తోంది. ఆ సంస్థ పేరు మీటువాన్. దానికి 44 కోట్లమంది వినియోగదారులున్నారు. ప్రతిరోజూ అది దాదాపు 7లక్షల ఫుడ్ డెలివరీలు చేస్తుంది.


డెలీవరీ బాయ్స్, కస్టమర్లు నేరుగా ఒకరికొకరు కలుసుకునే పని లేకుండా ఆహారాన్ని అందించేలా అది ఇప్పుడు ఏర్పాట్లు చేస్తోంది. దానికి అనుగుణంగా ప్రస్తుతం యాప్‌ను అప్‌డేట్ చేశారు. కస్టమర్లు ఎవరైనా ఆహారాన్ని ఎక్కడ పెట్టాలో చెబితే అక్కడ పెట్టి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు. దీంతో నేరుగా డెలివరీ బాయ్స్, కస్టమర్లను కలుసుకునే అవసరం లేదు. గతంలో ఈ యాప్ కస్టమర్‌ను కలవకుండా డెలివరీని అందించేది కాదు. కానీ, వైరస్ కారణంగా తన పంథాను మార్చుకుంది.
బయటకు వెళ్లి కూరగాయల్లాంటివి కొనుక్కోవడానికి కూడా జనం భయపడుతున్నారు. దాంతో ప్రస్తుతం ఎక్కువమంది ఈ యాప్‌పైనే ఆధారపడుతున్నారు.

ఫొటో సోర్స్, Meituan
మరోపక్క వైరస్ బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం ‘మీటువాన్’ రోజూ వెయ్యి భోజనాలను ఉచితంగా అందిస్తోంది. దీనికోసం ఆస్పత్రుల బయట కాంటాక్ట్‌లెస్ లాకర్లను ఏర్పాటు చేశారు. డెలివరీ బాయ్స్ లాకర్లను ముట్టుకోకుండా ఒక క్యూఆర్ కోడ్ సాయంతో వాటిని తెరిచి ఆహారాన్ని అందులో పెడుతున్నారు. తరువాత వైద్య సిబ్బంది కూడా కోడ్ సాయంతోనే వాటిని తెరిచి ఆహారాన్ని తీసుకుంటున్నారు.
మరోపక్క ఫేస్‌బుక్, వీవర్క్, మోర్గన్ స్టాన్లీ లాంటి చాలా సంస్థలు సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమని కోరుతున్నాయి. ఈ సంస్థలు ఆఫీసులో సాధారణంగా సిబ్బందికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తాయి. కానీ, ఉద్యోగులు ఇంటి దగ్గరే ఉండి పని చేస్తుండడంతో ఆన్‌లైన్ ఫుడ్‌కు డిమాండ్ మరింత పెరిగింది.
వైరస్ బయటపడ్డాకే, మీటువాన్ ఈ 'హ్యూమన్ కాంటాక్ ఫ్రీ' డెలివరీ సదుపాయాన్ని మొదట వుహాన్ నగరంలో తీసుకొచ్చింది. తరువాత దాన్ని 184 నగరాలకు విస్తరించింది. ఈ వారాంతానికల్లా చైనావ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సంస్థ చెబుతోంది.

ఫొటో సోర్స్, Meituan
మరోపక్క ఈ సంస్థ అందిస్తున్న ఉచిత భోజనం వేలాది వైద్య సిబ్బందికి వరంలా మారింది. వైరస్ బారిన పడ్డ వేలాది రోగులకు చికిత్స అందించే క్రమంలో అక్కడి వైద్య సిబ్బంది చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి వంట చేసుకోవడం, బయటకు వెళ్లి ఆహారం తెచ్చుకోవడానికే కాదు, కనీసం భోజనాన్ని ఆర్డర్ చేసి వెళ్లి తెచ్చుకునే సమయం కూడా ఉండట్లేదు.
ఇప్పుడు ఆ సమస్యను మీటువాన్ సంస్థ తీరుస్తోంది. మీటువాన్‌తో పాటు అలీబాబా ఫుడ్ డెలివరీ సంస్థ కూడా కోట్ల రూపాయలను వుహాన్ రోగులకు అవసరమైన వైద్య పరికరాలను కొనేందుకు ఆస్పత్రులకు విరాళంగా ఇచ్చాయి.

ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్ కన్నా వేగంగా వ్యాపిస్తున్న వదంతులు... వాటిలో నిజమెంత?
- ‘నా కూతురి బొమ్మ టార్చిలైట్ నా ప్రాణాలు కాపాడింది’
- అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు చిత్రాల రికార్డులతో పబ్లిసిటీ వార్... కలెక్షన్ల ఫిగర్లకు బేస్ ఏంటి?
- బడ్జెట్ 2020 :ఆదాయ పన్ను కొత్త శ్లాబ్స్‌తో యువత భవిష్యత్తుతో ఎందుకీ చెలగాటం?
- కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- పాకిస్తాన్: తినడానికి రొట్టెలు కూడా దొరకడం లేదు.. గోధుమ పిండి కొరతతో అల్లాడుతున్న ప్రజలు
- కరీమ్ లాలా: ఈ ముంబయి మాఫియా డాన్‌ను ఇందిరా గాంధీ ఎందుకు కలిశారు?
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








