కరోనావైరస్: మన పళ్లెంలో అన్నంలేని పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలి?

ఆహారం

ఫొటో సోర్స్, Rubina A. Khan

    • రచయిత, జేమ్స్ వాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచ దేశాల అధినేతల నుంచి సామాన్యుల వరకూ అందరి ముఖాలకు మాస్క్‌లు, పెద్ద పెద్ద స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న మ్యాచ్‌లు, ఖాళీ రోడ్లు... ఇలా కరోనావైరస్ మహమ్మారి మనం ఎప్పటికీ మరిచిపోలేని కొన్ని దృశ్యాలను మిగిల్చింది.

సూపర్ మార్కెట్ల ముందు భారీ క్యూలనూ చూశాం. దగ్గరున్నవారితోనూ ఫోన్లలో మాటలకే పరిమితయ్యాం.

లాక్‌డౌన్‌లు రావడంతోనే కొన్ని చోట్ల దుకాణాల్లోని సరుకులన్నీ ఖాళీ అయిపోయాయి. బ్రిటన్‌లో సూపర్ మార్కెట్లలో అరలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

ఆహారం

ఫొటో సోర్స్, Chris Putnam/Barcroft Media via Getty Images

ఆఫ్రికా లాంటి దేశాల్లో పరిస్థితి తీవ్రంగా కనిపించింది. అక్కడి రైతులకు విత్తనాలు దొరకడం కూడా కష్టమైపోయింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణ సూడాన్‌లలో పరిస్థితి దారుణంగా మారింది.

అమెరికాలో పోషించే పరిస్థితి లేక చాలా జంతువులను చంపేశారు. పాలు వినియోగదారులకు చేరే అవకాశం లేక, మురికి కాలువల పాలయ్యాయి

మన ఆహార సరఫరా గొలుసు ఎంత సున్నితంగా ఉందన్న విషయాన్ని కరోనా మహమ్మారి బయటపెట్టింది.

మరి, ఈ అనుభవం నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా? భవిష్యతులో మరోసారి ఇలాంటి పరిస్థితులు వస్తే ఇంతకన్న మెరుగ్గా ఎదుర్కోగలమా?

కూలీలు

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP via Getty Images

అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార సరఫరా గొలుసులో తలెత్తన సమస్యలు ఆరంభంలోనే పరిష్కారమయ్యాయని విశ్లేషకులు అంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అవి ఎక్కువకాలం కొనసాగాయని, కూలీలపై ఆధారపడటం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.

పంటలు వేయడం, కోత పనులు, మార్కెట్ వరకూ తీసుకురావడం... ఇలా అన్ని పనుల్లో కూలీలు కీలకంగా ఉన్నారు. దీంతో కరోనా సమయంలో కూలీలు దొరక్క, ఉత్పత్తిపై ప్రభావం పడింది.

లాక్‌డౌన్ సమయంలో పంజాబ్ నుంచి వలస కూలీలు రాలేకపోవడంతో తనకు చాలా నష్టం జరిగిందని బిహార్‌కు చెందిన రైతు మనువంత్ చౌధరీ చెప్పారు.

20 ఎకరాల్లో వేసిన తమ పంటను కోయడానికి మనుషులు దొరకలేదని అన్నారు.

కోతలకే కాదు, కోసిన తర్వాత ధాన్యాన్ని నిల్వ ఉంచడంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. రవాణా వసతులు సరిగ్గా లేకపోవడం, మిల్లులు మూతపడటంతో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి.

''లాక్‌డౌన్ మొదలైన నాలుగు రోజుల తర్వాత నుంచి మార్చి చివరి వరకూ స్థానిక కూలీల సాయంతో మార్కెట్‌కు రోజూ 50 కిలోల వంకాయలు పంపించగలిగా. ఆ తర్వాత కరోనా భయం బాగా పెరిగింది. కూలీలు రావడం మానేశారు'' అని చౌధరీ అన్నారు.

వ్యవసాయం

ఫొటో సోర్స్, Saqib Majeed/SOPA Images/LightRocket via Getty Im

కూలీల స్థానంలో రోబోలు

జర్మనీ లాంటి దేశాలు కూడా వలస కార్మికుల కొరత సమస్యను ఎదుర్కున్నాయని ఫుడ్ నేవిగేటర్ మ్యాగజీన్ ఎడిటర్ కేటీ ఎస్క్యూ అన్నారు.

అయితే, వలస కార్మికుల తరలింపుకు తోడ్పడేందుకు యురోపియన్ కమిషన్ చర్యలు తీసుకుంది.

నిజానికి, ఈ దేశాలు సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించాయి. భవిష్యతులో అవి కార్మికులకు బదులుగా యంత్రాలను వినియోగించవచ్చు.

న్యూజీలాండ్‌లో కోతల కోసం ఆటోమోటిక్‌గా పనిచేసే రోబోను తయారుచేశారు. కివీ పళ్లను మనిషి సాయం లేకుండానే అది తెంపుతుంది.

ఈ రోబో 24 గంటలూ పనిచేస్తుందని, దీంతో కార్మికుల కన్నా చాలా రెట్లు ఎక్కువ పని చేయించుకోవచ్చని అని దాన్ని తయారు చేసిన సంస్థ వ్యవస్థాపకుడు స్టీవెన్ సాండర్స్ చెప్పారు.

ఇంకా రకరకాల రోబోలను వారి సంస్థ తయారు చేస్తోంది.

కోతల పద్ధతి ఒక్కో పంటకు ఒక్కోలా ఉండటం తమకు సవాలు అని సాండర్స్ అన్నారు.

రోబోలు

ఫొటో సోర్స్, Delmarty/Alpaca/Andia/Universal Images Group via

ఇతర దేశాల్లోనూ ఇలాంటి యంత్రాలను తయారుచేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ, బాగా డబ్బున్న రైతులే ఇలాంటి వాటిని వినియోగించుకోగలరు.

''కొత్త సాంకేతికతపై రైతులు పెట్టుబడులు పెట్టాలనుకుంటారా? ఇప్పటికే వారి లాభాల వాటా చాలా తక్కువగా ఉంటోంది'' అని కేటీ ఎస్క్యూ అన్నారు.

ఇటు మాంసోత్పత్తి రంగంలోనూ భౌతిక దూరం పాటించడం పెద్ద సవాలే. ఇలాంటి ప్రాసెసింగ్ ప్లాంట్లలో కోవిడ్ కేసులు కూడా చాలా వచ్చాయి.

రోబోలు

ఫొటో సోర్స్, Zhang Yun/China News Service via Getty Images

వివిధ దేశాల్లో, ఖండాల్లో ఉత్పత్తైన ఆహార పదార్థాల్లో దాదాపు 90 శాతం వాటి సరిహద్దులు దాటి వెళ్లవు. అంటే, స్థానికంగానే వినియోగమవుతాయి.

ఆహార సరఫరా గొలుసు చాలా వరకూ 'సరైన సమయంలో' సరుకు చేరవేయడంపైనే ఆధారపడి ఉంటుంది.

గోదాముల అవసరం తక్కువ. వీలైనంత త్వరగా ఉత్పత్తులకు దుకాణాలకు చేరవేసే నెట్‌వర్క్ ఇది. ఇది మెరుగ్గా పనిచేసినప్పుడే తాజా ఆహార పదార్థాలు వినియోగదారులకు అందుతాయి.

లాక్‌డౌన్ సమయంలో ఆహార సరఫరా గొలుసు ఎంత బలహీనంగా ఉందన్నదానికి మనం ఉదాహరణలు చూశాం. అయితే, పట్టణాల్లో ఉండే రైతులు, ఉత్పత్తిదారులు తమ సామర్థాలను ఈ సమయంలో నిరూపించుకున్నారు.

వీలైనంతవరకూ 'స్థానికంగా లభించే ఆహార ఉత్పత్తులు' తీసుకోవడంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమయ్యాయి.

స్థానికంగా ఉత్పత్తయ్యే ఆహార ఉత్పత్తులను కూడా పెద్ద స్థాయిలో వినియోగంలోకి తేవొచ్చని కొందరు ఆవిష్కర్తలు నిరూపిస్తున్నారు.

ఇక పెద్ద పెద్ద నగరాల్లో 'అండర్ గ్రౌండ్' వ్యవసాయం ద్వారా అవసరమైన పంటలు పండించవచ్చు. అయితే, ఈ వ్యవసాయం చేయడానికి సరైన స్థలం వెతుక్కోవాలి. ఉన్న చోట్లను మెరుగ్గా వాడుకోవాలి.

శాటిలైట్ సాంకేతికత ద్వారా భూమి పోషక తత్వాలను కనిపెట్టి, వ్యవసాయానికి అనుగుణమైన ప్రాంతాలను గుర్తించవచ్చు.

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ సంక్షోభ సమయంలో కొన్ని ఆశాకిరణాలు కూడా కనిపించాయని నిపుణులు అంటున్నారు.

ఆహార సరఫరా గొలుసును మరింత విస్తారంగా, ఆరోగ్యకరంగా, సుస్థిరంగా మార్చేందుకు ఇదో అవకాశమని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

ఆహారం, మార్కెట్

ఫొటో సోర్స్, AM PANTHAKY/AFP via Getty Images

మనం రోజూ చెత్తబుట్టలో పారవేసే ఆహార పదార్థాల్లో దాదాపు 70 శాతం నిజానికి తినగలిగిన పదార్థాలే. మొత్తంగా ఇలా అన్ని రకాల ఆహార ఉత్పత్తుల్లో దాదాపు 40 శాతం చెత్తగా మారుతున్నాయి.

పండించిన పదార్థాలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకున్నప్పుడే ఆహార సరఫరా గొలుసులో సుస్థిరత వస్తుంది. ప్రపంచంలోని ప్రతి తొమ్మిది మందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని అంచనాలు చెబుతున్నాయి.

పండ్లు, కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు తోడ్పడే ఒక రకమైన పూతను అమెరికాకు చెందిన ఎపీల్ అనే సంస్థ తయారు చేసింది. ఈ పూతకు రంగు గానీ, రుచి గానీ ఉండదు. సహజమైన పదార్థాలను ఉపయోగించే దీన్ని తయారుచేశారు.

కోవిడ్-19 లాంటి సంక్షోభాలు ఇబ్బందులతో పాటు కొన్ని అవకాశాలను కూడా మన ముందుకు తెస్తుంటాయి.

రాబోయే రోజుల్లో ఆహార సరఫరా గొలుసులో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు మనం చూస్తామేమో!

అదనపు రిపోర్టింగ్: సౌతిక్ బిశ్వాస్, విలియమ్ పార్క్, రిచర్డ్ గ్రే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)