తాలిబాన్లు తమ భార్యలను ‘అందంగా’ చూడటం కోసం మేకప్ సామాన్లు కొనుగోలు చేసినప్పుడు..

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, ఇక్బాల్ ఖట్టక్
- హోదా, బీబీసీ కోసం
1988 నుంచీ నేను చాలా సార్లు అఫ్గానిస్తాన్ వెళుతూ ఉండేవాడిని. కొన్నిసార్లు వ్యక్తిగతంగా, కొన్నిసార్లు విలేఖరిగా, కొన్నిసార్లు టీచర్‌గా కూడా ఆ దేశానికి వెళ్లాను.
అవామీ నేషనల్ పార్టీ నాయకుడు, ఖుదాయి ఖిద్మత్‌గర్ ఉద్యమ వ్యవస్థాపకుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నేను తొలిసారి అఫ్గానిస్తాన్ వెళ్లాను.
కానీ, 2001మార్చిలో పశ్చిమ దేశాల మీడియా ప్రతినిధులతో కలిసి అఫ్గానిస్తాన్ వెళ్లేందుకు ఆహ్వానం అందినప్పుడు మాత్రం ఆ దేశం వెళ్ళడానికి అంతకు ముందెప్పుడూ చేయనంత ఆలోచన చేశాను. (అప్పుడు అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్‌లు పాలిస్తున్నారు).
నేను 1989నుంచి విలేఖరిగా పని చేస్తున్నాను. కానీ, అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు రాజకీయ అధికారం చేపట్టినప్పటి నుంచీ ఒక్కసారి కూడా వారిని నేరుగా కలిసే అవకాశం రాలేదు.
ఈ ఆహ్వానానికి అంగీకారం తెలపడానికి నాకు సుమారు రెండు వారాలు పట్టింది. నేను 1999 నుంచి 'రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్' కోసం పాకిస్తాన్‌లో మీడియా స్వాతంత్య్రం, విలేఖరుల హక్కులను పర్యవేక్షిస్తున్నాను. 2000లో 'తాలిబాన్ అండ్ ది మీడియా' అనే నివేదిక విడుదల అయిన నేపథ్యంలో తాలిబాన్లు నాకు హాని తలపెడతారేమో అనే భయం కూడా నన్ను వెంటాడింది.
నాకు తాలిబాన్లు తెలియదు, వారికి నేను తెలియదు. తాలిబాన్లకు సన్నిహితంగా ఉండే ఇస్లామాబాద్ విలేఖరులకు అఫ్గానిస్తాన్ వెళ్లేందుకు వీసా సులభంగా లభిస్తుందని ఒక స్నేహితుడు చెప్పారు.
అప్పట్లో విలేఖరులకు, సాధారణ పౌరులకు అఫ్గానిస్తాన్ వీసా ఇస్లామాబాద్‌లోని అఫ్గాన్ ఎంబసీ దగ్గర లభించేది.
ప్రపంచంలో మూడే మూడు దేశాలు... పాకిస్తాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాయి.
తాలిబాన్లు తొలిసారి అధికారం చేపట్టిన నేపథ్యంలో.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్.. రెండు దేశాల్లోనూ పౌరుల కోసం పరస్పరం ఉచితంగా వీసాలు ఇస్తూ ఉండేవారు.
దాంతో, నేను వీసా కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించవలసిన అవసరం రాలేదు.

ఫొటో సోర్స్, IQBAL KHATTAK
"తాలిబాన్లకు అంతా తెలుసు"
ఏప్రిల్ 05, 2001 ఉదయం మేము తోర్ఖామ్ మీదుగా కాబుల్ కు ప్రయాణమయ్యాం. తోర్ఖామ్ సరిహద్దు అవతల ఉన్న ఒక చిన్న గదిలో కూర్చున్న ఒక యువ ఇమ్మిగ్రేషన్ అధికారి నేను కాబుల్ వెళ్ళడానికి గల కారణాన్ని అడిగారు.
నా సమాధానంతో సంతృప్తి చెందిన ఆయన నా పాస్‌పోర్టుతో పాటు ఇతర విలేఖరుల పాస్‌పోర్టుల పై కూడా స్టాంపింగ్ పూర్తి చేశారు.
తోర్ఖామ్ నుంచి కాబుల్ ప్రయాణం చాలా బడలికతో కూడుకుని ఉంటుంది. మనసులో ఏదో తెలియని భయం ఉండటంతో, ఆ ప్రయాణంలో అంతా అందరం నిశ్శబ్దంగానే గడిపాం.
కానీ, ఆ రాత్రి కాబుల్‌లోని కాంటినెంటల్ హోటల్లో చేసిన బసతో ప్రయాణపు అలసట తీరింది.
అఫ్గానిస్తాన్ వెళ్లే విదేశీ జర్నలిస్టులందరూ కచ్చితంగా అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దగ్గర తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
ఆ మరుసటి రోజు ఉదయమే, మేము విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి అక్కడొక పెద్ద గదిలో కూర్చున్నాం. కొన్ని క్షణాల తర్వాత తలపాగా ధరించిన ఒక యువకుడు అక్కడకు వచ్చి టేబుల్ పైనున్న ఫ్రెంచ్ వార్తాపత్రిక లీ మాండ్ చేతిలోకి తీసుకున్నాడు.
నాకు ఫ్రెంచ్ ఒక్క అక్షరం కూడా అర్ధం కాదు, కానీ, ఆ పత్రిక ప్రధాన వార్తా కథనం తాలిబాన్ గురించి అని మాత్రం అర్ధమయింది.
దాంతో, ఆ కథనం గురించిన వివరాలను నాతో పాటు వచ్చిన ఫ్రెంచ్ విలేఖరిని అడిగాను.
"ఆ విషయం అడగకు. ఇది తాలిబాన్లకు వ్యతిరేకంగా రాసిన పరిశోధనాత్మక కథనం" అని చెప్పారు.
ఆ ఫ్రెంచ్ వార్తా పత్రిక చేతిలో పట్టుకున్న యువకుడిని ఫ్రెంచ్ వార్తా పత్రిక ఎందుకు తెచ్చారని అడిగాను. "ఇది మీ కోసం కాదు. తాలిబాన్లకు ఎవరు, ఎక్కడ నుంచి ఏమి రాస్తారో అన్నీ తెలుసు. మాకు అన్ని విషయాలూ తెలుసు" అని సమాధానమిచ్చాడు.
ఇదంతా ఆ యువకుడు పష్తో భాషలో చెప్పాడు. అంతలో మేము టీ తాగుతామేమోనని కనుక్కుని, మా రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగానే పూర్తవుతుందని హామీ ఇచ్చాడు.
అఫ్గాన్ రాయబార కార్యాలయాలు అప్పట్లో కేవలం 3 దేశాలలోనే ఉన్నప్పటికీ తాలిబాన్ల పటిష్టమైన మీడియా పర్యవేక్షణను చూసి మేము ఆశ్చర్యపోయాం.
అయితే, మీడియా పర్యవేక్షణ కోసం వారికెవరు సహాయం చేస్తున్నారు? పశ్చిమ దేశాల విలేఖరులు ఒక విధమైన నవ్వుతో నా వైపు చూశారు. వారు మా దేశం (పాకిస్తాన్)పై అనుమానంతో ఉన్నారని నాకర్ధమయింది.
మా వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖతో నమోదు చేసుకున్న తర్వాత మాకు సహాయం చేసేందుకు ఒక ఇంగ్లీష్ తెలిసిన ట్రాన్స్‌లేటర్‌ను జత చేశారు. అతను ట్రాన్స్ లేటర్ మాత్రమే కాదు, నిఘా కోసం మాపై ఒక కన్నేసి ఉంచే వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. చాలా దేశాలు, ప్రభుత్వాలు విలేఖరులపై నిఘా పెడతాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తాలిబాన్లు-మేకప్ కిట్లు
తాలిబాన్లు మహిళల పట్ల కర్కశంగా ప్రవర్తించే విషయం గురించి రాయాలని మేము ప్రణాళిక చేసుకున్నాం.
అయితే, కాబుల్‌లోని ‘షెహర్ ఏ నౌ’ బజార్‌లో నెలకొన్న కాస్మెటిక్స్ దుకాణం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ షాపు నిండా రకరకాల సౌందర్య ఉత్పత్తులున్నాయి.
మేము ఆశ్చర్యపడటాన్ని కనిపెట్టి, ఆ దుకాణదారుడు నవ్వుతూ.. "అవును, ఇక్కడ షాపింగ్ చేస్తారు" అని చెప్పారు.
ఆయన సమాధానం మా ఉత్సుకతను మరింత పెంచింది. వెంటనే మేము.. ‘ఎలా కొంటారు?’ అని అడిగాం.
ఆయన వెంటనే గుక్క తిప్పుకోకుండా సమాధానమిచ్చారు.
"తాలిబాన్లు వారంతట వారే వచ్చి, వాళ్ళ భార్యల కోసం రకరకాల మేకప్ సామాన్లు కొంటారు. తాలిబాన్లు మహిళలు బజార్‌కి వెళ్లడాన్ని వ్యతిరేకించినప్పటికీ.. వారు మాత్రం వారి భార్యలను అందంగా చూడాలని అనుకుంటారు" అని చెప్పారు.
టీవీ రిపోర్టింగ్ కోసం వీడియో ఫుటేజ్ చాలా ప్రధానం. కానీ, ఇప్పుడు అక్కడ వీడియో తీసుకోవడం మాకొక పెద్ద సవాలు. ఆ దుకాణదారుడు మమ్మల్ని వీడియో తీయడానికి, కెమెరా ముందు మాట్లాడడానికి అస్సలు అంగీకరించ లేదు. తాలిబాన్లు కెమెరా వాడకాన్ని సహించరు.
తాలిబాన్ల గత పాలనలో అఫ్గానిస్తాన్‌లో రేడియో, టీవీలను నిషేధించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
గడ్డం లేనందుకు మినహాయింపు పత్రం
ఆ తర్వాత రోజు ఉదయం, మమ్మల్ని తీసుకుని వెళ్లేందుకు హోటల్ దగ్గరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నియమించిన ట్రాన్స్‌లేటర్, కాబుల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చారు. ఆయన పష్తున్ వ్యక్తి. మేము ఆయనను మిస్టర్ ప్రొఫెసర్ అని పిలిచేవాళ్ళం. ఆయన ముందు పష్తోలో మేమెలా ఉన్నామో ప్రశ్నించి, "అర్ధం చేసుకోవడం కష్టంగా ఉందా?" అని అడుగుతూ ఉండేవారు.
ఆయన ఇలా చాలా సార్లు చేస్తూ ఉండేవారు. వారి ప్రవర్తన నాకు ఆందోళన కలిగించేది. ‘తాలిబాన్ అండ్ మీడియా’ నివేదిక నాకేదైనా సమస్యను సృష్టిస్తుందేమోనని భయపడుతూ ఉండేవాడిని.
ఒక రోజు ఆయన నా భయాలను గ్రహించి, "ఆందోళన చెందకండి. మీరు మా అతిధులు. మీరా నివేదిక రాయడం వల్ల సమస్యలేమీ ఉండవు" అని చెప్పారు.
కొన్ని క్షణాల పాటు నా గుండె ఆగినట్లు అనిపించింది. కానీ, భగవంతుడు మంచే చేస్తాడని నాకు నేనే భరోసా ఇచ్చుకున్నాను.
మేము పెద్దగా ఆలోచించని అంశం వైపు ఆయన మా దృష్టిని మరల్చారు. బజార్లలో నడుస్తున్నప్పుడు మర్చిపోకుండా ప్రార్ధన సమయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా మసీదులో లేకపోతే పోలీసులు వారిని కఠినంగా శిక్షిస్తారని చెప్పారు.
నేను షేర్ ఏ నౌ బజార్ లో ఉన్నప్పుడు ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ అధికారి నా దగ్గరకు వచ్చి, "గడ్డం ఎందుకు పెంచుకోవడం లేదు" అని ప్రశ్నించారు.
"నువ్వు ముస్లింవి కాదా?" అని కోపంగా అడిగారు.
వెంటనే మాతో పాటు ఉన్న ట్రాన్స్‌లేటర్ జోక్యం చేసుకుని.. "ఆయన ముస్లిం, పష్తున్ కూడా. ఆయన కూడా గడ్డం పెంచుకుంటారు" అని చెప్పారు.
అది విని, అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. జరిగిన సంఘటనకు ఆ ట్రాన్స్‌లేటర్ మాకు క్షమాపణలు చెప్పి, డిన్నర్ తర్వాత కలుస్తామని వెళ్లిపోయారు.
ఆ తర్వాత మేము హెరాత్ రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లాం.
తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకోక ముందు, ఆ రెస్టారెంట్ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉండేది. కానీ, వారి వ్యాపారం ఇప్పుడు బాగా దెబ్బ తింది.
మేము ఫుడ్ ఆర్డర్ చేసి మాట్లాడుకోవడం మొదలుపెట్టాం.
మేము మాట్లాడుకోవడం మొదలుపెట్టగానే, రెస్టారెంట్‌లో కల్లోలం మొదలయింది. అక్కడున్న ఉద్యోగులు కిటికీ కర్టెన్లు దించి, కిటికీలు, తలుపులు మూసివేయడం మొదలుపెట్టారు.
"భయపడకండి" అని అక్కడున్న ఒక ఉద్యోగి పర్షియా భాషలో చెప్పారు. "ఈ రోజు శుక్రవారం. శుక్రవారం ప్రార్ధనల కోసం అందరూ మసీదులో ఉండాలి. మీరు మా అతిధులు కాబట్టి మిమ్మల్ని మేము గెంటివేయలేం" అని చెప్పారు.
ఆ మరుసటి రోజు ఉదయం మేము తాలిబాన్ హోమ్ మినిస్టర్ ముల్లా అబ్దుల్ రజాఖ్ అఖుండ్‌ను ఇంటర్వ్యూ చేయాలి.
నేను ఈ గడ్డం సమస్య గురించి ప్రశ్నించాలని అనుకున్నాను.
ఆయన ఆఫీసుకు వెళ్లేసరికి ఆయనకు మరో ముఖ్యమైన సమావేశం ఉండటంతో మా ఇంటర్వ్యూ రద్దయినట్లు తెలిసింది.
అయితే, మేము ఇంటర్వ్యూ కు సిద్ధంగా ఉన్న సమయానికి, డిప్యూటీ హోమ్ మినిస్టర్ అక్కడకు వచ్చి ముందు కెమెరాను ఆపమని ఆదేశాలు ఇచ్చారు. అది విన్న వెంటనే విలేఖరులు, కెమెరా జర్నలిస్టుల కళ్ళల్లో విచారం, విసుగు కనిపించాయి.
ఇంటర్వ్యూ ముగిసిన వెంటనే, నేను ఆయనను ఇక్కడ గడ్డం నియమం గురించి అడిగాను.
"మిమ్మల్ని ఎవరైనా అడిగారా?" అని ఆయన ప్రశ్నించారు.
నాకు జరిగిన విషయాన్ని ఆయనకు వివరంగా చెప్పాను. అది వినగానే, ఆయన పర్షియాలో అధికారికి ఏదో చెప్పి, "మీరు మళ్ళీ అలాంటి సమస్యను ఎదుర్కోరు" అని హామీ ఇచ్చారు.
మంత్రి అక్కడ నుంచి వెళ్లిపోయారు. నేను ఆ అధికారి కోసం వేచి చూసాను. కొంత సేపటి తర్వాత ఆ అధికారి చేతిలో ఒక కాగితంతో నా దగ్గరకు వచ్చారు. దాని మీద అందమైన చేతి రాత ఉంది.
నిజానికి, అది గడ్డం లేనందుకు మినహాయింపు ఇస్తూ ఇచ్చిన సర్టిఫికేట్.
"పోలీసులు మిమ్మల్ని ప్రశ్నిస్తే, ఈ సర్టిఫికేట్ చూపించండి" అని ఆ అధికారి చెప్పారు. దాంతో, నాకు కాస్త ధైర్యం కలిగింది. అయితే, నన్ను తిరిగి ఎవరూ ప్రశ్నించలేదు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
యూఎన్ క్లబ్
తాలిబాన్ల పాలనలో కాబుల్ నిర్జీవంగా ఉందని, అంతకు ముందు కాబుల్ వెళ్లినవారెవరైనా చెబుతారు.
కాబుల్‌లో ఉండే సందడి మాయమయ్యింది. సినిమా, సంగీతం ఆగిపోయాయి. సెలూన్లు మూసేసారు.
చాలా మంది స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక్క పాకిస్తాన్ ఎంబసీ కార్యాలయం తప్ప మరో దేశ దౌత్య కార్యాలయాలేవీ అక్కడ లేవు.
మేము కాబుల్ జూ దగ్గర ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తుండగా, అక్కడున్న పోలీసు మా కెమెరాను లాక్కున్నారు.
కానీ, ఇంకొకసారి ఫోటోలు తీస్తే క్షమించేది లేదని గట్టిగా హెచ్చరించి కొన్ని గంటల తర్వాత మా కెమెరాలు వెనక్కి తిరిగి ఇచ్చారు.
అయితే, రోజంతా ఫీల్డ్‌లో గడిపిన తర్వాత మేము సేద తీరడానికి సాయంత్రం యూఎన్ క్లబ్‌కి వెళ్ళేవాళ్ళం.
ఆ క్లబ్‌లోకి కేవలం విదేశీయులను మాత్రమే అనుమతించేవారు.
ఇక్కడ వాతావరణం నగరానికి కాస్త భిన్నంగా ఉండేది. విదేశీ మహిళలు, పురుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కనిపించేవారు.
తాలిబాన్ల పాలనలో ఫ్రీ మీడియా అంటే, పిచ్చివాడి స్వర్గంలో నివసించడం మాదిరిగా ఉంటుందని చెప్పవచ్చు. అఫ్గానిస్తాన్ గురించి తెలుసుకోవాలంటే, యూఎన్ క్లబ్ ఒక్కటే మార్గం.
ఇక్కడుండే విదేశీయులు.. స్వచ్చంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో స్థానికుల కోసం వివిధ రకాల పనులు చేస్తూ ఉండేవారు.
మాలాగే, వీరు కూడా వినోదం కోసం కొంత సేపు ఈ క్లబ్ లో గడుపుతూ ఉండేవారు. ఇక్కడ మాత్రమే వారికి కావల్సినదేదైనా వారు చేయగలరు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
“ఉప్పెనకు ముందు నిశ్శబ్ధం”
"ఉప్పెనకు ముందు నిశ్శబ్దం" ఆవరిస్తుందనే ఇంగ్లీష్ సామెత ఉంది. నేను కాబుల్‌లో ఉన్న పది రోజులూ నగరమంతా ఒక రకమైన నిశ్శబ్ధం ఆవరించినట్లుగా అనిపించింది. ఏదో భారీ సంఘటన జరిగినట్లు ప్రజలంతా సంతాపంలో ఉన్నట్లుగా కనిపించారు. లేదా ఏదో జరగబోతోంది అన్నట్లుగా అనిపించింది.
2001, ఏప్రిల్ 14న మేము తోర్ఖామ్ మీదుగా తిరిగి పాకిస్తాన్‌కి వచ్చాం. ఈ పర్యటన నాకు చాలా అర్ధవంతంగా అనిపించింది. తాలిబాన్ల గురించి రాసిన నివేదిక వారి స్వరూపాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించినా కూడా వారు మాకు ఎటువంటి ఇబ్బందినీ కలిగించలేదు. ఈ నివేదిక విషయంలో నా దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ సంస్థలు పెట్టిన వేదనలో పదవ వంతు కూడా తాలిబాన్లు పెట్టినట్లు నాకనిపించలేదు.
కానీ, నా పర్యటన ముగిసిన 5 నెలల లోపే, కాబుల్‌లో నెలకొన్న నిశ్శబ్దం విస్ఫోటనం అయి న్యూయార్క్ ట్విన్ టవర్స్ పేలుళ్ల రూపంలో వినిపించింది. మరి కొన్ని రోజుల్లోనే అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలన అంతమయింది.
సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత 2021లో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
అఫ్గాన్ వీసా తెచ్చుకునేందుకు నేను మళ్లీ ఇస్లామాబాద్‌లో ఉన్న అఫ్గాన్ దౌత్య కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నాను.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఎన్నెన్నో గండాలు
- కాబుల్ విమానాశ్రయం బయట ఏడుగురు అఫ్గాన్ పౌరులు మృతి - బ్రిటన్ రక్షణ శాఖ
- #BeingDalit: హైదరాబాద్- 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'
- అమెరికా: బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా?
- బ్రిటన్‌లోని భారతీయులు దైవభాష సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు?
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













