తెలంగాణ: వరి కొనుగోలులో ఎందుకు ఆలస్యం జరుగుతోంది, రైతుల సమస్యలకు మూలాలేంటి

తడిచిన ధాన్యాన్ని ఆరబోస్తున్న మహిళ
ఫొటో క్యాప్షన్, తడిచిన ధాన్యాన్ని ఆరబోస్తున్న మహిళ
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఖరీఫ్‌ పూర్తయి, తెలంగాణ రైతులు యాసంగికి సిద్ధమయ్యే సమయం ఇది. కానీ, వరి కోతలు మొదలై నెల రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోళ్లు మాత్రం మొదలు కాలేదు.

ప్రభుత్వం కొంటుందన్న నమ్మకంతో కొందరు, దాచుకునే చోటులేక మరికొందరు మార్కెట్‌ యార్డులకు ధాన్యాన్ని తరలించగా, అకాల వర్షాలు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతోంది.

అసలే కొనుగోళ్లు ఆలస్యం కావడం, కొనే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాదోపవాదాలు, ఆపై అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఈ నేపథ్యంలో వరి కొనుగోలు విషయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఏం చెబుతోంది? రైతులు, నిపుణులు ఈ విషయంలో ఏమంటున్నారు? అని తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.

రైతులకు పంట పండించడం ఒక ఎత్తయితే, దాన్ని అమ్ముకోవడం మరొక ఎత్తుగా మారింది.
ఫొటో క్యాప్షన్, రైతులకు పంట పండించడం ఒక ఎత్తయితే, దాన్ని అమ్ముకోవడం మరొక ఎత్తుగా మారింది.

''రైతు వెన్నెముకే, కానీ....''

యాదాద్రి జిల్లా తుర్కపల్లి గొల్లగూడెంకు చెందిన 67 ఏళ్ల రాజయ్య 35ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు.

''మా ఖరీఫ్‌ కోతలు ఎప్పటిలాగే అక్టోబర్‌లో పూర్తయ్యాయి. ధాన్యం కుప్పలు వేసుకున్నాం. ఈసారి మా ఊరు నుంచి దాదాపు 40 లారీల పంటను కొంటారని అనుకున్నాము. కానీ, అధికారులు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, బస్తాలు పెట్టారు తప్ప కొనడానికి మాత్రం రాలేదు'' అని ఆయన వివరించారు.

వర్షాల కారణంగా ధాన్యం తడిచి నష్టపోతున్నామని రాజయ్య అన్నారు.

''రోజుకి ఒక టార్పాలిన్ కవర్‌కు రూ.25 అద్దె కట్టాలి. అయినా, భరించి ధాన్యాన్ని జాగ్రత్త చేస్తున్నా తడిచి మొలకలు వస్తున్నాయి. ప్రతి ఏడాది అక్టోబర్ నుంచే కొనుగోళ్లు మొదలు అవుతాయి. నవంబర్‌కు పూర్తవుతాయి. కానీ ఈసారి డిసెంబర్ వస్తున్నా ధాన్యాన్ని కొనడం లేదు. రైతు వెన్నెముక అంటారు, కానీ మరి మా పరిస్థితి ఇలా మార్చేస్తే ఎలా?'' అని రాజయ్య బీబీసీతో అన్నారు.

వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యం
ఫొటో క్యాప్షన్, వర్షాలకు తడిసి మొలకెత్తిన వడ్లు

రైతులు దాదాపు నెల రోజుల నుంచి ధాన్యాన్ని భద్రపరుచుకుంటూ వస్తున్నారు. మంచుకారణంగా రాత్రి పూట ధాన్యాన్ని టార్పాలిన్ పట్టాలతో కప్పి, పగలు ఎండకు ఆరబెడుతున్నారు.

అయితే, అకాల వర్షాల కారణంగా ధాన్యంలో తేమ శాతం పెరుగుతోంది. 17%కన్నా ఎక్కువ తేమ ఉంటే ఆ ధాన్యాన్ని కొనలేమని అధికారులు చెబుతున్నారు.

ప్రతియేటా అక్టోబర్ ముగిసే నాటికి ధాన్యం కొనుగోలుకు కావాల్సిన ఏర్పాట్లు అంటే, హమాలీలను కుదుర్చుకోవడం, గోనె సంచులు, ట్రక్కుల కోసం టెండర్లు పిలవడంలాంటివన్నీ పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలను తెరుస్తారు.

గత ఏడాది ఉన్న 6000 సెంటర్లను 6300కు పెంచామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, ప్రస్తుతానికి 4500 సెంటర్లు మాత్రమే తెరిచారని రైతు స్వరాజ్య వేదికకు చెందిన రవి కన్నెగంటి అన్నారు. ఈసారి కనీస మద్ధతు ధర (ఎమ్మెస్పీ) గ్రేడ్-ఏ రూ.1960 ఉంటే గ్రేడ్-బీ రూ.1940గా ప్రభుత్వం నిర్ణయించింది.

కొనుగోలు కేంద్రాలలో ఆరుబయట ధాన్యం కుప్పలు
ఫొటో క్యాప్షన్, కొనుగోలు కేంద్రాలలో ఆరుబయట ధాన్యం కుప్పలు

కేంద్రం బాధ్యత ఎంత?

దేశంలో ఆహార భద్రతా చట్టం కింద, కేంద్రం వివిధ రాష్ట్రాల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఏడాదికి రెండుసార్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తుంది.

ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా అలాంటి గణాంకాలను విడుదల చేసింది. అయితే, ఈ సంవత్సరం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అంటే 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంతో 40 లక్షల మెట్రిక్ టన్నులను 58 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది.

వరి కొనుగోలులో కేంద్రం తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Telangana CMO/twitter

ఫొటో క్యాప్షన్, వరి కొనుగోలులో కేంద్రం తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు.

రాజకీయ రగడ

నవంబర్‌లో జరిగిన హుజురాబాద్ ఎన్నిక తరువాత, వరి కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య రాజకీయం దుమారం మొదలైంది. ఈ వ్యవహారం, ఒకప్పుడు ధర్నాచౌక్‌ను తొలగిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి, అదే ధర్నాచౌక్‌లో నిరసనకు దిగేలా చేసింది.

సోమవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై మండిపడ్డారు. మరోవైపు ఖరీఫ్ పంటను ఎంతైనా కొంటామని చెప్పిన సీఎం, యాసంగికి మాత్రం కొనుగోలు కేంద్రాలను తెరవబోమని తేల్చి చెప్పారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల ప్రకటనల్లో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ కూడా నిరసనలు తెలిపేందుకు ధర్నాచౌక్‌కు చేరుకుంది.

కేసీఆర్, నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Telangana CMO/twitter

ఫొటో క్యాప్షన్, కేసీఆర్, నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

కేంద్రం ఎందుకు వద్దంటోంది?

2015-16లో 15.79 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, 2016 -17లో 35.96 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేంద్రం కొన్నది.

అయితే, 2020 -21లో ఏకంగా 94 .54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. పంజాబ్ తరువాత తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యం కొనుగోలు జరిగింది. అయితే నిల్వలు పెరిగిపోవడంతో ఈ ఏడాది అంత కొనుగోలు చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ ఏడాది తెలంగాణలో సుమారు కోటి లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పండగా, అందులో 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

మిగతాది రాష్ట్రo కొనుగోలు చేసి రైస్ మిల్లర్స్‌కు అవసరమైన 20-30 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వగా, మిగిలిన సుమారు 20-30 లక్షల మెట్రిక్ టన్నులు భారం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 20-30 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు అదనపు భారం పడుతుంది.

2020-2021లో తెలంగాణలో కోటి 4 లక్షల 23 వేల ఎకరాలలో (వానాకాలం, యాసంగి కలిపి) వరి పంట వేశారని, ఇది గత ఏడేళ్లలో అత్యధికమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2020-21 లో కోటి 41 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాటి మీడియా సమావేశంలో చెప్పారు.

తెలంగాణలో వరి సాగు అత్యధికంగా స్థాయిలో జరుగుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తెలంగాణలో వరి సాగు అత్యధికంగా స్థాయిలో జరుగుతోంది

రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ?

తెలంగాణలో వరి పంట అవసరమైన దానికన్నా ఎక్కువ పండటమే అసలు సమస్య అని నిపుణులు అంటున్నారు.

''తెలంగాణలో జనాభాకు 17 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సరిపోతుంది. ఒకవేళ పంట నష్టాన్ని కలుపుకున్నా 25లక్షల మెట్రిక్ టన్నులు సరిపోతుంది. ఎఫ్‌సీఐకి ఇవ్వడానికి మరో 20 నుంచి 25 లక్షల మెట్రిక్ టన్నులు కావాలనుకున్నా, మొత్తంగా 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సరిపోతుంది. కానీ ఈసారి తెలంగాణలో దాదాపు ఒక కోటీ మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పండింది. అంటే 50-60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా ఉత్పత్తి అయ్యింది'' అని రైతు స్వరాజ్య వేదికకు చెందిన రవి కన్నెగంటి అన్నారు.

''రాష్టంలో పండిస్తున్న ఆర్.ఆర్. వరిధాన్యం తొందరగా మొలకలెత్తుతుంది'' అని ఆయన వెల్లడించారు.

వడ్లను ఆరబెడుతున్న రైతు
ఫొటో క్యాప్షన్, వడ్లను ఆరబెడుతున్న రైతు

రైతు వేదన తీరేదెలా?

ప్రతిధాన్యం గింజను కొంటామని గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రైతులకు హామీ ఇవ్వడమే కాకుండా, వరి పంటను ప్రోత్సహించారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత రైతులకు దాన్ని అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారింది.

''మిల్లర్లకు అమ్ముదామంటే వారు క్వింటాల్‌కు రూ.1300-1400 కంటే ఎక్కువ ఇవ్వరు. ప్రభుత్వానికి అమ్ముదామంటే మేం తీసుకోబోమని అంటోంది. మార్కెట్‌కు తెచ్చి 18 రోజులు అవుతోంది. మా ధాన్యాన్ని ఇంత వరకు తూకం వేయలేదు'' అని మరో రైతు రమేశ్ అన్నారు.

మార్పు సాధ్యమేనా?

ధాన్యం కొనుగోలు అయోమయం ఒకపక్క కొనసాగుతుండగానే, రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. యాసంగి పంట కొనబోమని తాజాగా తేల్చి చెప్పింది.

మరి ఇప్పటి వరకు వరి పంట పండించిన పొలాల్లో హఠాత్తుగా వేరే పంట వేయాలంటే సాధ్యమవుతుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఉన్నపళంగా రైతులు భూమిని ఇతర పంటలు వేయడానికి అనువుగా మార్చుకోవాలి. వేరే పంటలు వేసినా గిట్టుబాటు అవుతుందో తెలియదు. గిట్టుబాటు కాకపోతే ఆదుకుంటామన్న హామీ ప్రభుత్వం వైపు నుంచి ఇంత వరకు లేదు.

ధైర్యం చేసి వేరే పంటలు వేద్దామన్నా కొందరు రైతులను అడవి జంతువుల బెడద వేధిస్తోంది. అడవి పందులు, జింకలు, కోతులు ఈ పంటలను బతకనిస్తాయా అన్నది ఆ రైతుల ఆందోళన.

భవిష్యత్తు సంగతి ఎలా ఉన్నా, ముందు చేతిలో ఉన్న పంటను తాము నష్టపోకుండా అమ్ముకుంటే చాలనే భావన కొందరు రైతులలో కనిపిస్తోంది.

గత కొన్నిరోజులుగా రైతులకు ధాన్యం ఎక్కడా నిల్వ ఉంచే స్థలం లేక కొనుగోలు కేంద్రాలు, రోడ్ల పైనా కుప్పలు పోస్తున్నారు. వర్షాలకు ధాన్యం తడవడంతో మొలకలు వస్తున్నాయి. రాబోయే 15 రోజులలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపొతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)