అహ్మద్‌నగర్ ఐసీయూలో అగ్నిప్రమాదం: ‘మా నాన్నను ఐసీయూలో పెట్టారు.. ఉదయం దానికి మంటలంటుకున్నాయి’

ఫొటో సోర్స్, SHAHID SHAIKH
- రచయిత, రాహుల్ గైక్వాడ్
- హోదా, బీబీసీ కోసం
'పొద్దున వార్డును శుభ్రం చేస్తున్నారు. అందుకే ఐసీయూకు దూరంగా వెళ్లి ఒక చెట్టు కింద కూర్చున్నాం. అంతలోనే ఎవరో మంటలు.. మంటలు అని అరవడం వినిపించింది. వెంటనే మేము ఐసీయూ వార్డుకు పరిగెత్తాం' అంటూ ఆ ప్రమాదం గురించి లక్ష్మణ్ సవల్కర్ కుమారుడు బాలాసాహెబ్ సవల్కర్ వివరించారు.
అహ్మద్‌నగర్ జిల్లా ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో శనివారం ఉదయం 10 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో 17 మంది పేషెంట్లు ఉన్నారు. లక్ష్మణ్ సవల్కర్‌కు కూడా ఐసీయూలో ఉన్నారు. కానీ కాసేపటికే ఆయన్ను మరో వార్డుకు తరలించారు. దాంతో ఆయన ప్రాణాలు దక్కాయి. కానీ ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
అంబులెన్స్ కోసం ఎదురు చూస్తున్న లక్ష్మణ్ సవల్కర్ కుమారుడు బాలాసాహెబ్ సవల్కర్ చాలా విచారంగా ఉన్నారు. ఆయన తమ సామాన్లు పట్టుకుని ఆస్పత్రి లాబీలో నిలబడ్డారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు. బీబీసీ మరాఠీకి ఫోన్ చేసి ఈ ప్రమాదం గురించి సమాచారం ఇచ్చింది ఈ బాలాసాహెబే.

ఫొటో సోర్స్, SHAHID SHAIKH
"మేమంతా వ్యవసాయం చేస్తాం. ఆయనకు కోవిడ్ ఎలా సోకిందో కూడా మాకు అర్థం కావడం లేదు. ఆయన్ను 12 రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించాం. ముందు ఆయన్ను జనరల్ వార్డులో పెట్టారు. ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకు తరలించారు.
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నేను ఆస్పత్రిలోనే ఉన్నాను. ఉదయం వార్డును శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మేము వార్డు బయటున్న ఒక చెట్టు కింద కూర్చున్నాం. అప్పుడు అందరూ మంటలు..మంటలు అని అరవడం మొదలుపెట్టారు. దాంతో మేము ఐసీయూ వార్డు వైపు పరిగెత్తాం. అక్కడున్న రోగులను డాక్టర్లు, సిస్టర్లు మరో వార్డుకు తరలించారు" అని బాలాసాహెబ్ చెప్పారు.
రోగులను మరో వార్డుకు తరలించిన తర్వాత అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక నర్సు తన పేరు బయటపెట్టొద్దన్న షరతుతో మాతో మాట్లాడారు.
"నేను వార్డులోకి రాగానే భయాందోళనతో కూడిన వాతావరణం కనిపించింది. ఐసీయూ నుంచి పేషెంట్లను ఈ వార్డుకు తీసుకొచ్చారు. ఆక్సిజన్ స్థాయిలు చెక్ చేయడానికి రోగిని వెంటిలేటర్‌పై పెట్టాము. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి నేను ఈ పని చేస్తున్నాను. కానీ ఇలాంటి భయంకరమైన ఘటనను ఇప్పటి వరకు చూడలేదు" అని ఆ నర్సు చెప్పారు.

అగ్ని ప్రమాదం జరిగిన జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. కరోనావైరస్ సెకండ్ వేవ్ సమయంలో ఇక్కడ ఐసీయూ వార్డు పెట్టారు. ఇక్కడున్న పరికరాలు, సౌకర్యాలన్నీ అత్యాధునికమైనవి.
ప్రారంభించిన ఏడాదిలోపే ఇక్కడ అగ్నిప్రమాదం జరగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదం జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయన్న దానిపై పరిశీలన జరిపామని అహ్మద్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర భోస్లే మీడియాకు చెప్పారు.
ఈ ప్రమాదంలో 11 మంది రోగులు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు, ఈ ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు.

ఆస్పత్రిని సందర్శించిన తర్వాత డాక్టర్ భారతీ పవార్ బీబీసీ మరాఠీతో మాట్లాడారు.
"ప్రమాద సమయంలో ఐసీయూలో 17మంది రోగులున్నారు. వారిలో 11 మంది చనిపోయారు. మిగిలిన ఆరుగురు రోగులకు చికిత్స కొనసాగుతోంది. మేము బాధిత కుటుంబ సభ్యులను కలవబోతున్నాం" అని ఆమె చెప్పారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
డివిజినల్ కమిషనర్ అధ్యక్షతన ఒక కమిటీ దీనిపై విచారణ చేస్తుందని అహ్మద్‌నగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి హసన్ ముష్రిఫ్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఈ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని తెలిపారు.
ఈ ప్రమాదంపై ఒక కేసు కూడా నమోదు చేస్తామని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
స్థానిక పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సూయజ్ కాలువను బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోకుండా అమెరికా ఎలా అడ్డుకుంది?
- ‘నా వయసువారు చూడకూడని వీడియోలు ఉంటాయి అక్కడ’
- సూర్య 'జై భీమ్' తెర వెనుక అసలు కథ ఏంటి? రియల్ హీరో ఎవరు?
- ఉత్తర్ ప్రదేశ్: మూక దాడులు, హత్యలపై విచారణల్లో న్యాయం జరుగుతోందా? బాధితులు ఏమంటున్నారు?
- ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో యుద్ధ విమానం నుంచి భారత పైలట్ పడినప్పుడు ఏమైందంటే...
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...
- కోవిడ్ 19: ఊపిరితిత్తులపై దాడి చేసి, ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జన్యువు
- కార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా?
- జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్
- కోవిడ్ టీకా: రెండో డోసు తీసుకోకపోతే మళ్లీ మొదటి డోసు వేయించుకోవాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












