తెలంగాణ: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు - సీఎం కేసీఆర్ ప్రకటన

"యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం కొనడం లేదు. తెలంగాణ రైతులను ముంచాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది" అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రివర్గ సమావేశం తరువాత ఆయన ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
ప్రెస్ మీట్‌లో కేసీఆర్ ఏమన్నారంటే..
"బీజేపీ రైతుల వ్యతిరేక పార్టీ. కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయదు. కొన్నా నిర్వహించే శక్తి రాష్ట్రానికి లేదు. కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఇక రైతులు వాళ్ల రిస్క్‌పై ఆధారపడి పండించుకోవచ్చు" అని కేసీఆర్ అన్నారు.
కల్తీ విత్తనాలపై కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించిన కేసీఆర్, దేశంలో కల్తీ విత్తనాలపై పీడీ యాక్ట్ పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
"గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మన దేశం స్థానం 101 ఉంటే పాకిస్తాన్ 92 ఉంది. దేశ పరిస్థితి మొహం మీద ఉమ్మేసే విధంగా ఉంది. కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్‌లు సిగ్గు, శరం ఉంటే దీనిమీద మాట్లాడండి" అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మోదీ ప్రభుత్వం రైతులు చట్టాలు వెనక్కి తీసుకుందని అన్నారు.
కేంద్రం సామాజిక బాధ్యతను విస్మరిస్తోందని, రైతు వ్యతిరేక విధానాలను చేపడుతోందని ఆరోపించారు.
‘తెలంగాణలో ఎకరం అమ్మి ఆంధ్రాలో ఐదెకరాలు కొంటున్నారు’
"140 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రం చిల్లరకొట్టు షావుకారులాగా వ్యవహరిస్తోంది. ఆహార భద్రత కేంద్రం బాధ్యత. ఆహార నిల్వలు పెరిగితే ఏం చేయాలన్నది కూడా కేంద్రమే ఆలోచించాలి. ఈ ప్రక్రియలో కొంత నష్టం వస్తే భరించాలి. అది చేయకుండా నెపాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాల మీదకు నెట్టేస్తున్నారు. ఇప్పటివరకు చరిత్రలో ఇంతటి నీచమైన, దరిద్రమైన కేంద్ర ప్రభుత్వన్ని చూడలేదు" అని కేసీఆర్ ఆరోపణలు చేశారు.
ఏడేళ్ల కిందట తెలంగాణ రైతు పరిస్థితి ఏంది? ఈరోజు తెలంగాణ రైతు పరిస్థితి ఏంది? ఏడేళ్ల కిందట తెలంగాణ పల్లెల్లో ఎంత డబ్బు ఉంది? ఇప్పుడు ఎంత డబ్బు ఉంది? తెలంగాణ భూముల ధరలు ఎక్కడికి పోయినై? చాలామంది తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి అన్నారు. పడిపోయినయా పెరిగినయా? రూ. 20 లక్షల లోపల (ఎకరం) భూమి దొరుకుతుందా ఇయ్యాల తెలంగాణలో ఎక్కైడనా? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ వాల్యూ.. తెలంగాణ రైతు వాల్యూ? ఐదెకరాలు ఉన్న తెలంగాణ రైతు ఇయ్యాల కోటీశ్వరుడు. అదే ఏడేండ్ల కిందట.. బిచ్చగాడు. వలస బోయిండు. పోలే.. మనం జూళ్లే.
ఐదేళ్ల కిందట ఐదెకరాలున్న రైతు హైదరాబాద్ కూలి పనికి వచ్చిండు. ఇయ్యాల ఐదెకరాలున్న రైతు తెలంగాణలో ఏ మారుమూలకు బోయినా.. నువ్వు కాగజ్ నగర్ పోయినా, మక్తల్ పోయినా, గద్వాల బోయినా, భద్రాచలం బోయినా, జుక్కల్ బోయినా ఇరవై లక్షల్లోపు ఎకరం జాగా లేదు. రోడ్డు సైడ్ ఉంటే 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. రాజీవ్ రహదారి వంటి నేషనల్ హైవే పక్కన ఉంటే మూడు కోట్లు, నాలుగు కోట్లు ధర. తెలంగాణ రైతుల వాల్యూ పెరగలే ఇయ్యాల.
ఆనాడు ఆంధ్రాలో ఎకరం అమ్మి ఇక్కడ మూడెకరాలు కొన్నారు. ఇయ్యాల మా నల్గొండ రైతులు.. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి, మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి ఎకరం అమ్మి ప్రకాశం జిల్లాలో ఐదెకరాలు, నాలుగెకరాలు కొంటున్నారు. తెలంగాణ రైతులు ఇయ్యాల కాలర్ ఎగరేసి ప్రకాశం జిల్లాలో కొంటున్నరు. కర్ణాటకలో కొంటున్నరు భూములు.. ఒక ఎకరం అమ్మి రెండెకరాలు, మూడెకరాలు కొంటున్నరు. ఇది నిజం కాదా? తెలంగాణలో భూముల ధరలు పెరిగినయ్.. రైతులు కోటీశ్వరులు అయినరు. ఒక పల్లెలో కోటాను కోట్లు ఉంటున్నయ్ ఇయ్యాల. ఒక మేనేజర్ ఫ్రెండ్ వచ్చి చెప్పాడు.. సర్ ఇయ్యాల మా ఊరి బ్యాంకులో ఆరు కోట్ల రూపాయలు ఉన్నయ్ అని. ఏడేళ్ల కిందట ఏముండె? లక్షలకు కూడా దిక్కు లేకుండె. దీనికంత ఎవలు.. ఎవలు కారణం?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో వరి పండగ దండగ ఎలా అయింది? - ఎడిటర్స్ కామెంట్
- ఆంధ్రప్రదేశ్‌లో చెరకు ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు?
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- టమాటా రేటు తగ్గుతోంది.. ఎందుకు?
- ఆలివ్ ఆయిల్: నాణ్యమైనదా? కల్తీ అయ్యిందా? తెలుసుకోవడానికి 5 పద్ధతులు
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









