ఆంధ్రప్రదేశ్: పంట చేతికొచ్చినా కొనేవారు లేరు, బస్తా ధాన్యానికి మూడేళ్ల నాటి రేటు కూడా లేదు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు వరి పండించాలంటేనే భయపడిపోతున్నారు. పంట సాగులో అన్నింటికీ ధరలు పెరిగి పోగా, అందుకు భిన్నంగా ధాన్యం ధర తగ్గుతోంది. దీనికి తోడు కొన్న ధాన్యానికి చెల్లింపులు చేయడంలో ఆలస్యం రైతును మరింత ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకుంటున్నామని చెబుతోంది.
''2019లో నేను పండించిన ధాన్యం బస్తా రూ.1400. నిరుడు మొదట రూ.1250 నుంచి చివర్లో అమ్మిన వాళ్లకు రూ.1400 వచ్చింది. అప్పట్లో డీఏపీ రూ. 800 ఉండేది. దమ్ము చేయడానికి ట్రాక్టర్ ఎకరానికి 4 బస్తాలు తీసుకునేవారు. ఇప్పుడు డీఏపీ రూ. 1200 అయ్యింది. ట్రాక్టర్ అద్దె 6 బస్తాలకు పెరిగింది. కానీ ధాన్యం ధర మాత్రం మూడేళ్ల నాటితో పోలిస్తే తగ్గిపోయింది.'' అని తూర్పుగోదావరి జిల్లా కరప మండలానికి చెందిన రైతు వీరబాబు అన్నారు.
ఇప్పటికిప్పుడు క్యాష్ అయితే రూ.1150, తర్వాత ఇచ్చేలా అయితే రూ.1200, ఎప్పుడైనా ఇవ్వొచ్చు అనే ఒప్పందం మీద అయితే రూ.1250 వరకు ధర పలుకుతోందని రైతు వీరబాబు చెప్పారు.
ఏపీలో అనేక మంది రైతులు ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.
రెండు నెలల క్రితమే కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడంతో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆందోళన బాట పట్టారు.

ఫొటో సోర్స్, Reuters
దిగుబడులు పెరిగాయి
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఈసారి వరి సాగు స్వల్పంగా తగ్గింది. మొత్తంగా వివిధ పంటలు పండించే విస్తీర్ణం పెరిగినప్పటికీ వరి పంట మాత్రం కొంత మేరకు తగ్గింది. అయినప్పటికీ దిగుబడులు పెరగడంతో ధాన్యం నిల్వలకు ఢోకా ఉండడం లేదు.
ఏపీలో ఈ సంవత్సరం రబీలో వరి పంట 21.75 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సుమారుగా 65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులను ప్రభుత్వం అంచనా వేసింది. అయితే కరోనా కారణంగా ప్రైవేటు కొనుగోలుదారులకు ఆటంకం ఏర్పడింది.
45 లక్షల మెట్రిక్ టన్నులు తామే సేకరిస్తామని చెప్పిన ప్రభుత్వం అందులో 37లక్షల మెట్రిక్ టన్నుల వరకూ రైతుల నుంచి రావచ్చని లెక్కలు వేసింది. కానీ ఇప్పటి వరకూ ఈ సీజన్ లో 22 లక్షల మెట్రిక్ టన్నుల లోపు మాత్రమే సేకరించగలిగినట్టు అధికారులు చెబుతున్నారు.
ఓ వైపు దిగుబడులు పెరిగాయి. రెండోవైపు కరోనాతో మార్కెట్ ఒడిదుడుకులున్నాయి. అన్నింటి నుంచి గట్టెక్కిస్తామని గట్టిగా చెప్పిన ప్రభుత్వం మాత్రం లక్ష్యాలకు సగం దూరంలోనే సేకరణ చేసింది. ఇవన్నీ కలిసి సామాన్య రైతులకు ఇబ్బందిగా మారాయి.
నేటికీ ధాన్యం అమ్ముకోలేక కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్ముకున్న వారు బకాయిలు రాక దిక్కులు చూస్తున్నారు.

కల్లంలోనే ధాన్యం రాశులు
వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిన మాట ఎవరూ కాదనలేని వాస్తవం. ఎరువులు, పురుగు మందుల ధరలతో పాటు పెట్రోలు ధరలు పెరగడంతో రైతులకు అదనపు భారం తప్పడం లేదు. అయినా సాగు చేస్తున్న వారికి దిగుబడికి తగిన ధర లేకపోవడం దిగాలు పాలుజేస్తోంది.
ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరలు కూడా అందడం లేదు. మిల్లర్లదే ఇష్టారాజ్యంగా ఉందని రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు వెళితే మిల్లర్ల దగ్గరకి వెళ్లాలని చెబుతారు. అక్కడికి వెళితే తమ అవసరాలను అదునుగా తీసుకుని ధర విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
''75 కిలోల బస్తాకి ప్రభుత్వ మద్ధతు ధర రూ. 1416. కానీ నేను అమ్ముకుందామంటే రూ.1200 కూడా రావడం లేదు. నెలన్నర క్రితం పంట కోశాను. అప్పటి నుంచి ధాన్యం కల్లంలోనే ఉంది. రోజూ కాపలా కాసుకోవాలి. ఇంట్లో దాచుకోవడానికి చోటు లేదు. పొలం నుంచి ధాన్యం కొనే వారే లేరు. కొనుగోలు కేంద్రం దగ్గరకి వెళ్లాం. అదిగో ఇదిగో అనడమే తప్ప ఎవరూ రాలేదు. మిల్లర్ల దగ్గరకి కూడా వెళ్లాను. రూ. 1100 ఇస్తామంటున్నారు. ప్రభుత్వం చెప్పిన రేటు కన్నా రూ. 300 తక్కువ'' అని కృష్ణా జిల్లాకు చెందిన రైతు పి. కోటేశ్వరరావు బీబీసీతో అన్నారు.
మరో సీజన్ దగ్గరికొచ్చిందని, పనులు మొదలు పెట్టాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో ధాన్యం ఎంతకో ఒకంతకు అమ్ముకుంటే అప్పులు తప్ప మరేమీ మిగలదని కోటేశ్వరరావు అన్నారు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
చెల్లింపులు లేవు
ధాన్యం అమ్ముడుపోక అనేక మంది రైతులు కలవరపడుతుంటే, వచ్చిందే రేటు అనుకుని అమ్మేసిన రైతులకు కూడా చెల్లింపులు లేక సతమతం అవుతున్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకున్న ధాన్యానికి 15 రోజుల లోపు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయాలి. కానీ 50 రోజులు దాటినా ఉలుకూ పలుకూ లేదని ఏపీ రైతు సంఘం నేతలు చెబుతున్నారు.
'' ప్రభుత్వం మాటల్లోనే రైతులకు మేలు చేస్తున్నట్టు ఉంది తప్ప చేతల్లో మాత్రం మిల్లర్ల మేలు కోసమే పని చేస్తోంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే రూ. 1200 కోట్ల ధాన్యం బకాయిలున్నాయి. వ్యవసాయం పెట్టుబడికి తీసుకొచ్చిన అప్పులు తీర్చాలనే ఒత్తిడి రైతును వేధిస్తోంది.'' అని ఏపీ రైతు సంఘం నాయకుడు కె.శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
రైతుల శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రైతును మిల్లర్ల దయకు వదిలేయకుండా కొనుగోళ్లు చేయాలని, బకాయిలు తక్షణం చెల్లించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

సన్నాలు ఓకే- దొడ్డు, బోండాలతోనే సమస్య
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో సమస్య ఉందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే సన్న రకాల వరి సాగును ప్రోత్సహిస్తున్నా, గోదావరి జిల్లాల్లో కొందరు రైతులు దొడ్డు రకం ధాన్యం బోండాలు పండిస్తున్నారని వ్యవసాయ శాఖ అంటోంది.
వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు రావడం లేదని, అదే సమస్యగా మారుతోందని అధికారులు చెబుతున్నారు.
వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ ధాన్యం రైతుల సమస్యలన్నీ తీరుస్తున్నామని అన్నారు.
"ధాన్యం సన్నం రకాల కొనుగోళ్లు సజావుగా సాగాయి. బోండాలు మార్కెట్ అంతంతమాత్రంగా ఉంది. దాని ప్రభావమే కొన్ని చోట్ల రైతుల దగ్గర నుంచి కొనుగోళ్లు పూర్తికాకపోవడం. ధాన్యం అమ్మకాలు చేసిన వారి బకాయిలు కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాం" అని అరుణ్ కుమార్ వివరించారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని చాలా వరకు సేకరించామని, సన్నాలకు మంచి ధర కూడా వస్తోందని పౌర సరఫరాల శాఖ తూర్పు గోదావరి జిల్లా డీఎం పి. రామ్మెహన్ బీబీసీకి తెలిపారు.
''బోండాలు సాగుదారులకు కొనుగోలు సమస్య ఉందని గుర్తించాం. వాటిని కూడా కొనేందుకు ఏర్పాట్లు చేశాం. రైతులకు సమస్య రాకుండా చూస్తాం.'' అన్నారు రామ్మోహన్.
ధాన్యం రైతుల సమస్యలన్నీ తీరుస్తున్నామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ బీబీసీతో అన్నారు. ధాన్యం సన్నం రకాల కొనుగోళ్లు సజావుగా సాగాయి. బోండాలు మార్కెట్ అంతంతమాత్రంగా ఉంది. దాని ప్రభావమే కొన్ని చోట్ల రైతుల దగ్గర నుంచి కొనుగోళ్లు పూర్తికాకపోవడం. ధాన్యం అమ్మకాలు చేసిన వారి బకాయిలు కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. అంటూ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- "నేను కరోనా వ్యాక్సీన్ రెండు డోసులూ వేసుకున్నాను. అయినా, కోవిడ్ వచ్చింది" - ఒక డాక్టర్ అనుభవం
- హైదరాబాద్-విజయవాడ: విమాన ఛార్జీలకు సమానంగా ప్రైవేటు బస్సు టిక్కెట్లు...రవాణా శాఖ ఏం చేస్తోంది
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








