ఒమిక్రాన్: మా దేశంపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేయండి - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా

కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో తమ దేశంతో సహా పొరుగున ఉన్న దేశాలపై ప్రయాణ ఆంక్షలను విధించడాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఖండించారు.

ఈ చర్యలు "తీవ్ర నిరాశకు గురిచేశాయని", ఇది అన్యాయమని, తక్షణమే ఆంక్షలను ఎత్తివేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో సహా పలు దేశాలు ఈ ఆంక్షలను విధించాయి.

ఒమిక్రాన్‌ను "వేరియంట్ ఆఫ్ కన్సర్న్" జాబితాలో చేర్చారు. ప్రాథమిక ఆధారాల బట్టి ఇది త్వరగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, కరోనా నాలుగో వేవ్.. దేశానికే అవమానకర రీతిలో వ్యాక్సీన్లు వేయించుకోని ప్రజలు

భారీ స్థాయిలో పరివర్తనం చెందిన ఈ వేరియంట్‌ను ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో గుర్తించారు.

గత రెండు వారాల్లో ఆ దేశంలోని గౌటెంగ్ ప్రాంతంలో 70కు పైగా ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్లు బయటపడ్దాయి.

"దక్షిణాఫ్రికాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు" ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.

తాజాగా సోమవారం జపాన్ సరిహద్దు ఆంక్షలను ప్రకటించింది. నవంబర్ 30 నుంచి తమ దేశంలోకి విదేశీయులను అనుమతించమని స్పష్టం చేసింది.

ప్రపంచ దేశాలన్నీ హడావిడిగా ఆంక్షలను విధించడంపై డబ్ల్యూహెచ్ఓ స్పందిస్తూ, "రిస్క్ బట్టి, శాస్త్రీయత ఆధారంగా" చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

అయినప్పటికీ, గత కొద్దిరోజుల్లో పలు దేశాలు ప్రయాణ ఆంక్షలను విధించాయి.

కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారీగా మ్యూటేషన్ చెందిందని నిపుణులు చెబుతున్నారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారీగా మ్యూటేషన్ చెందిందని నిపుణులు చెబుతున్నారు

'దక్షిణాఫ్రికా అన్యాయంగా వివక్షకు గురవుతోంది'

"ఇప్పుడు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. కానీ, ఆఫ్రికాను లక్ష్యంగా చేసుకుని ప్రయాణ ఆంక్షలను విధించడం అంతర్జాతీయ స్థాయిలో సంఘీభావాన్ని దెబ్బతీస్తుంది" అని డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా డైరెక్టర్ మత్‌షిడిసో మొతి అన్నారు.

ఆదివారం రామఫోసా ప్రసంగిస్తూ.. ప్రయాణ ఆంక్షలకు శాస్త్రీయమైన ఆధారాలు లేవని, దక్షిణాఫ్రికా అన్యాయంగా వివక్షకు గురవుతోందని అన్నారు.

ఈ ఆంక్షలు కొత్త వేరియంట్ వ్యాప్తిని అరికట్టలేవనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ప్రభావిత దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రయాణ ఆంక్షలు మరింత దెబ్బతీస్తాయి. అదే విధంగా, ఆ దేశాలు మహమ్మారి వ్యాప్తి నుంచి కోలుకునే సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపిస్తాయి."

"మా దేశాల ఆర్థికవ్యవస్థలకు మరింత నష్టం జరగకముందే.. ప్రపంచ దేశాలు అత్యవసరంగా తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి" అంటూ రామఫోసా పిలుపునిచ్చారు.

దక్షిణాఫ్రికా కొత్తగా ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు విధించదని ఆయన స్పష్టం చేశారు.

అయితే, "నిర్దిష్ట ప్రాంతాల్లో, నిర్దిష్టమైన విధుల్లో ఉన్నవారికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంపై విస్తృతంగా చర్చిస్తుందని" వెల్లడించారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. భవనాల లోపల జరిగే సమావేశాలు, వేడుకలకు అత్యధికంగా 750 మంది, బహిరంగ సమావేశాలకు 2,000 మంది హాజరు కావొచ్చని నియమాలు ఉన్నాయి.

దేశంలో వ్యాక్సీన్ల కొరత లేదని, కరోనాతో పోరాటానికి టీకాలు ఒక్కటే మార్గమని చెప్తూ ప్రజలందరూ వెంటనే వ్యాక్సీన్లు వేయించుకోవాలని రామఫోసా కోరారు.

ఒమిక్రాన్‌ను గుర్తించినందుకు ప్రశంసలు అందుకోకపోగా, తమ దేశం శిక్షకు గురవుతోందంటూ శనివారం దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రయాణ ఆంక్షలను తీవ్రంగా విమర్శించింది.

ప్రస్తుతం బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌తో సహా పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులను గుర్తించారు.

వీడియో క్యాప్షన్, కోవిడ్-19 కొత్త వేరియంట్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)