యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తప్పించడానికి 5 మార్గాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, జేమ్స్ లాండెల్
    • హోదా, దౌత్య ప్రతినిధి

యుక్రెయిన్ మీద రష్యా దాడిచేస్తే కొన్ని వేలమంది చనిపోతారు. అంతకంటే ఎక్కువమందికి పారిపోయి తమ ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

ఈ యుద్ధం వల్ల కలిగే వినాశనాన్నితప్పించడానికి ఐదు మార్గాలు ఉన్నాయని బీబీసీ దౌత్య ప్రతినిధి జేమ్స్ లాండెల్ చెబుతున్నారు.

ఒక యుద్ధం జరిగితే దానివల్ల భయానక పరిణామాలు ఉంటాయి. ఆర్థికంగా భారీ నష్టం జరుగుతుంది. యుద్ధంతో ప్రజలపై పడే ప్రభావం దారుణంగా ఉంటుంది. అయినా రష్యా తన సైన్యంతో యుక్రెయిన్‌ను చుట్టుముడుతోంది.

మరోవైపు, యుక్రెయిన్ సరిహద్దులవైపు ఇక ఒక్క అడుగు వేసినా, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పశ్చిమ దేశాలు రష్యాను హెచ్చరిస్తున్నాయి.

పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఈ సంక్షోభాన్ని తప్పించడానికి దౌత్య ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఘర్షణలకు తెరదించడానికి, ఈ ప్రాంతంలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పడానికి మార్గాలు వెతికే ప్రయత్నాలు తీవ్రమవుతున్నాయి.

పుతిన్ ఉద్దేశం ఏంటి?

చాలామంది దౌత్యవేత్తలు 'ఆఫ్ ర్యాంప్' గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది యుద్ధంగా మారకుండా చేయడానికి అన్ని పక్షాలూ ఒక పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ అదంత సులభం కాదనిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో యుక్రెయిన్ సంక్షోభం యుద్ధంగా మారితే, రష్యాకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని పశ్చిమ దేశాలు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నచ్చజెప్పడం వల్ల యుద్ధం ఆపవచ్చు.

యుద్ధం జరిగితే దానివల్ల ఆర్థికంగా కలిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల దౌత్యపరంగా ఎదురుదాడి కూడా తీవ్రంగా ఉంటుంది.

వీటన్నింటినీ భరించడం అంటే రష్యాకు అంత సులభమేం కాదు. కానీ, ఇలాంటి పరిణామాలే తలెత్తితే, యుద్ధరంగంలో రష్యా విజయం సాధించినా, దానికి అర్థం లేకుండా పోతుందని పుతిన్ ఆలోచించేలా చేయాల్సుంటుంది.

పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌లో సైనిక తిరుగుబాటుకు మద్దతు ఇవ్వవచ్చని పుతిన్‌లో భయం కూడా ఏర్పడవచ్చు.

అలాంటి పరిస్థితుల్లో ఆయన కొన్నాళ్లపాటు ఈ యుద్ధానికి అయ్యే ఖర్చును భరించడం కష్టం కావచ్చు. అలా జరిగితే తన దేశంలోనే పుతిన్‌కు మద్దతు తగ్గిపోతుంది. తర్వాత ఆయన నాయకత్వానికే సవాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

అయితే ఈ యుద్ధ వినాశనాన్ని తప్పించే దారులు కూడా ఉన్నాయి.

రష్యా-యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

1. దౌత్య విజయం ఘనత రష్యాకే దక్కేలా చూడాలి

ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా దౌత్య విజయం ఘనత రష్యాకే దక్కేలా చేయాలని పశ్చిమ దేశాలు భావిస్తాయి. నాటో దళాలు రెచ్చగొట్టినా యుద్ధం కోరుకోని.. పుతిన్ తనను శాంతి కాముకుడుగా చెప్పుకోడానికి కూడా ఈ దేశాలకు ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు.

పశ్చిమ దేశాలు చివరికి తన మాట విన్నాయని, రష్యా వ్యక్తం చేసిన సహేతుకమైన భద్రతా ఆందోళనలను అర్థం చేసుకోడానికి అవి సిద్ధంగా ఉన్నాయని పుతిన్ చెప్పుకోవచ్చు. బెలారుస్‌లో ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటున్న తాము ఒక అతిపెద్ద సైనిక శక్తిగా మారామనే విషయాన్ని రష్యా నాటోకు తెలిసేలా చేస్తుంది.

అదే జరిగితే పుతిన్ విఫలమవుతున్నారనే చెప్పవచ్చు. ఆయన నిర్ణయాలు నాటో నేతృత్వంలోని పశ్చిమ దేశాలను ఏకం చేశాయి. నాటో రష్యా సరిహద్దులకు దగ్గరగా చేరుకుంది. స్వీడన్, ఫిన్‌లాండ్‌ను తమలో చేరేలా ప్రేరేపిస్తోంది. ఇది చెప్పడానికి చాలా సులభంగానే ఉంటుంది.

కానీ, ఈ విధానంలో ఒక పెద్ద సమస్య ఉంది. యుక్రెయిన్‌పై పట్టు సాధించి, నాటో బలం తగ్గించడమే పుతిన్ లక్ష్యం అయితే ఆయన బలహీనపడ్డారని, వెనక్కు తగ్గుతున్నారని అనుకోవడం పొరపాటే అవుతుంది. తన లక్ష్యాలను అందుకోవాలనుకునే ఆయన వెనకడుగు ఎందుకు వేస్తారు.

వీడియో క్యాప్షన్, రష్యాకు యుక్రెయిన్ ఎందుకంత కీలకమో చెప్పే మూడు కారణాలు

2. మధ్యేమార్గం గుర్తించవచ్చు

నాటో మూల సిద్ధాంతాల విషయంలో ఏమాత్రం రాజీ పడేదే ఉండదని పశ్చిమ శక్తులు స్పష్టంగా చెప్పేశాయి.

అంటే, యుక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సౌర్వభౌమాధికారం విషయంలో అవి ఏమాత్రం రాజీ పడడం ఉండదు. నాటోలో చేరాలనుకునే దేశాలన్నింటికీ సభ్యత్వం అందించడానికి తమ తలుపులు తెరిచే ఉన్నామని అది చెబుతోంది.

అయితే, అమెరికా, నాటో దీనికి ఒక మధ్యేమార్గం కూడా ఆలోచించాయి. ఐరోపా భద్రతకు సంబంధించిన అంశాల గురించి దీనిని అన్వేషించవచ్చు. అలా చేయడం వల్ల మధ్యలో వదిలిపెట్టిన ఆయుధ నియంత్రణకు సంబంధించిన ఒప్పందాలను పునరుద్ధరించవచ్చు.

ఈ ఒప్పందాల కింద రష్యా, నాటో దళాల మధ్య పరస్పర విశ్వాసం ఏర్పడేలా ఇరు వైపులా క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవచ్చు. సైనిక విన్యాసాలపై పారదర్శకతను పెంచడంతోపాటూ, యాంటీ శాటిలైట్ ఆయుధాల పరీక్షల్లో సహకారం కూడా పెంపొందించుకోవచ్చు.

తమ భద్రతా ఆందోళనలను పరిష్కరించడానికి ఇవి సరిపోవని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది. రష్యా భద్రతా ఆందోళనలను పణంగా పెట్టి యుక్రెయిన్‌ నాటోలో చేరడం దానికి ఇష్టం లేదు. తర్వాత నాటో క్షిపణుల మోహరింపు ఒక స్థాయి వరకూ తగ్గించడం జరిగితే, అది రష్యా భద్రతాపరమైన ఆందోళనలను కాస్త తగ్గించవచ్చు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యా ఏం చేస్తోంది?

3. మింస్క్ ఒప్పందం పునరుద్ధరించే వ్యూహం

ఒక విధంగా ఇక్కడ రష్యా ఆధిపత్యం కనిపిస్తోంది. యూరప్ ఇప్పుడు రష్యా నిబంధనలపైనే భద్రతా చర్చలు జరుపుతోంది. యుక్రెయిన్, నాటో వర్సస్ రష్యా ఉద్రిక్తతలు బెలారుస్ రాజధాని మింస్క్‌లో 2014, 2015లో జరిగిన ఒప్పందాలను పునరుద్ధరించేలా చేయవవచ్చు. యుక్రెయిన్ సైన్యం, రష్యా మద్దతున్న తిరుగుబాటుదారుల మధ్య పోరాటానికి తెర దించడానికి ఈ ఒప్పందాలు జరిగాయి.

ఆ ప్రాంతంలో శాంతి కొనసాగేలా ఆ ఒప్పందాలను పునరుద్ధరించాలని పశ్చిమ దేశాల నేతలు కోరుకుంటున్నారు. కానీ, ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ ఒప్పందాలు జటిలమైనవి, వివాదాస్పదమైనది.

తమ మద్దతున్న స్థానిక నేతలు బలోపేతం అయ్యేలా యుక్రెయిన్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రష్యా కోరుకుంటోంది. కానీ, రష్యా తిరుగుబాటు ఫైటర్లను పంపించేయాలని, వారికి ఆయుధాలు అందించడం ఆపేయాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తోంది.

డాన్‌బాస్‌లో వేరయిన ఎన్‌క్లేవ్‌కు యుక్రెయిన్ ఎంత వరకూ స్వయం ప్రతిపత్తి ఇస్తుంది అనేది ఇప్పుడు అతిపెద్ద వివాదంగా మారింది.

యుక్రెయిన్ దానికి చాలా తక్కువ స్వయం ప్రతిపత్తి ఇస్తామనే సంకేతాలు ఇచ్చింది. దానికి రష్యా ఒప్పుకోవడం లేదు. దోంతస్క్, లుహాంస్క్‌లను యుక్రెయిన్ విదేశాంగ విధానంలో మరింత అధికారం అందించాలని అది కోరుతోంది. నాటో సభ్యత్వం విషయంలో వాటికి వీటో కూడా ఉండాలని డిమాండ్ చేస్తోంది.

యుక్రెయిన్ అతి పెద్ద భయం ఇదే. ఈ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తే, నాటో నేతలు యుక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించినా, దానికి నాటోలో ప్రవేశం లభించదు. అందుకే యుక్రెయిన్‌లో ఈ ఒప్పందాల పునరుద్ధరణకు మద్దతు లభించడం చాలా కష్టం.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌‌‌ను రష్యా ఏం చేయబోతోంది

4. యుక్రెయిన్ కూడా ఫిన్‌లాండ్‌లా తటస్థంగా ఉండగలదా

తటస్థ వైఖరి అవలంబించేలా యుక్రెయిన్ మీద ఒత్తిడి తీసుకురావచ్చా

ఫిన్‌లాండ్ మోడల్‌ అనుసరించాలని ఫ్రాన్స్ అధికారులు యుక్రెయిన్‌ను చెప్పినట్లు(తర్వాత వీటిని ఖండించారు) వార్తలు వచ్చాయి.

ఫిన్‌లాండ్ ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అధికారికంగా తటస్థ వైఖరిని అవలంబించింది. ఒక స్వతంత్ర, సౌర్వభౌమాధికార, ప్రజాస్వామ్య దేశంగా మిగిలిపోయింది. ఫిన్‌లాండ్ ఎప్పుడూ నాటోకు బయటే ఉంటూ వస్తోంది. యుక్రెయిన్‌కు కూడా అలా ఉండడం సాధ్యమేనా.

యుక్రెయిన్ ఎలాంటి సైనిక ఘర్షణలకైనా దూరంగా ఉండాలని అనుకుంటుంది. అది నాటోలో చేరకుండా ఉండడం అంటే, ఒక విధంగా రష్యా మనసులోని కోరిక నెరవేరినట్లే అవుతుంది.

కానీ, యుక్రెయిన్ అలా ఉండిపోవాలని కోరుకుంటుందా. బహుశా అది జరగదు. ఎందుకంటే తటస్థంగా ఉండడం వల్ల యుక్రెయిన్ మీద రష్యా ప్రభావం మరింత పెరుగుతుంది.

అందుకే అది తటస్థ వైఖరి అవలంబించడం కష్టం. యుక్రెయిన్ అలా చేసిన తర్వాత కూడా రష్యా తన నిబంధనలను కట్టుబడి ఉంటుందా?

యుక్రెయిన్ తటస్థంగా ఉంటే, అలా చేయడం వల్ల అది యూరోపియన్ యూనియన్ సభ్యత్వానికి మరింత దూరం అవుతుంది.

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ మధ్య వివాదమేంటి.. అమెరికా ఎందుకు యుక్రెయిన్ పక్షం వహిస్తోంది

5. అన్ని పక్షాలూ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది

ఈ ఉద్రిక్తతలు సుదీర్ఘ కాలంపాటు కొనసాగుతాయా. ముందు ముందు ఈ వేడి చల్లారిపోతుందా

రష్యా తన సైన్యాన్ని మెల్లమెల్లగా బ్యారక్స్‌కు పంపించి, తమ ఆపరేషన్ ముగిస్తున్నట్లు ప్రకటించవచ్చు. కానీ, రష్యా సైన్యానికి సంబంధించిన చాలా పరికరాలు వెనకే మిగిలిపోతాయి.

రష్యా డాన్‌బాస్‌లో తిరుగుబాటుదారులకు తన మద్దతు కొనసాగించవచ్చు. ఫలితంగా యుక్రెయిన్ రాజకీయాలు, ఆర్థికవ్యవస్థలో అస్థిరత కొనసాగుతుంది.

పశ్చిమ దేశాలు తూర్పు యూరప్‌లో నాటో బలం పెంచడాన్ని కొనసాగించాలని భావిస్తాయి. నాటో నేతలు, దౌత్యవేత్తలు, రష్యా నేతలతో, దౌత్యవేత్తలతో చర్చలు జరుపుతూనే ఉంటారు.

అయితే, ఇప్పటివరకూ జరిగిన నాటో-రష్యా చర్చల వల్ల పెద్దగా ప్రభావం కనిపించ లేదు.

యుక్రెయిన్ ఇకముందు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవచ్చు. కానీ, అది పూర్తి స్థాయి యుద్ధంగా మారడం అనేది జరగదు.

మెల్లమెల్లగా ఈ ఘర్షణ పతాక శీర్షికల నుంచి మాయమైపోతుంది. రష్యా-యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారిపోతాయి. తర్వాత ఇది కూడా జనాల జ్ఞాపకాల నుంచి మాయమైపోయిన ఘర్షణల జాబితాలో ఒకటిగా చేరిపోతుంది.

కానీ, ఇదంతా సులభం కాదు అనేది కూడా వాస్తవమే. అలాంటి పరిస్థితి ఏర్పడాలంటే అన్ని పక్షాలూ కలిసి ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

చర్చలతో ఆశలు సజీవం

ఈ ఒప్పందాలు జరిగితే అన్నిటికంటే తమ దేశమే ఎక్కువగా రాజీ పడాల్సి ఉంటుందేమోనని యుక్రెయిన్ ప్రజలు భయపడుతున్నారు.

యుద్ధం వచ్చే ముప్పు నిజంగా ముంచుకొస్తుందా, అదే నిజమైతే తప్పించుకోడానికి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతం అందరిలో ఒకే ఒక ఆశ మిగిలుంది. అన్ని పక్షాలూ చర్చల కోసం రాజీ అయినట్లు కనిపించడమే ఆ ఆశ. ఇప్పుడు ఆ ఆశ మిణుకు మిణుకు మంటున్నప్పటికీ, ప్రారంభ చర్చల్లో ఏ పరిష్కారమూ లభించకపోయినా, అన్ని పక్షాలూ ఎంత ఎక్కువగా చర్చలు జరిపితే, ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనే అవకాశాలు కూడా అంతే బలంగా ఉంటాయి.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)