రష్యాకు యుక్రెయిన్ ఎందుకంత కీలకం.. మీరు తెలుసుకోవలసిన మూడు ప్రధాన కారణాలు..

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ఏంజెల్ బెర్ముడెజ్
- హోదా, బీబీసీ ముండో
రష్యా, యుక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభం విషయంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కొందరు భావిస్తుంటే, ఇది కొత్త ప్రచ్ఛన్న యుద్ధం వైపు వెళ్లే ప్రయత్నం అని మరికొందరు అంటున్నారు.
ప్రపంచ దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల్లో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం వచ్చే అవకాశల గురించి బహిరంగంగా చర్చిస్తున్నారు.
యుక్రెయిన్ సరిహద్దుల్లో లక్ష కన్నా ఎక్కువమంది సైనికులను మోహరించింది రష్యా. కానీ, ఆ దేశంపై దాడి చేసే ఉద్దేశం లేదని ఇప్పటికీ చెబుతోంది.
మరోవైపు, తమ దేశ భద్రతకు సంబంధించిన డిమాండ్ల జాబితాను నాటోకు పంపించింది.
యుక్రెయిన్, నాటో కూటమిలో ఎప్పటికీ చేరదనే హమీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది. తద్వారా, సోవియట్ యూనియన్ పతనం తరువాత ఈ కూటమిలో చేరిన ఇతర సభ్య దేశాలకు పంపే ఆయుధాలు, సైన్యంపై పరిమితులు నిర్ణయించవచ్చన్నది రష్యా ఆలోచన.
దీంతో పాటు, తూర్పు యూరోప్ దేశాల్లో 1997 తరువాత ఏర్పాటు చేసిన మిలటరీ మౌలిక సదుపాయాలను తొలగించాలని డిమాండ్ చేసింది.
"ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తూర్పు యూరోప్ సరిహద్దులు ఎలా ఉన్నాయో, ఆ పరిస్థితులకు మళ్లీ వెనక్కి వెళ్లాలని వారు కోరుకుంటున్నారు" అని అంతర్జాతీయ వ్యవహారాల దూరదృష్టి, విశ్లేషణ సంస్థ 'జియోపొలిటికల్ ఫ్యూచర్స్ వ్యవస్థాపకుడు జార్జ్ ఫ్రీడ్‌మ్యాన్ అన్నారు.
రష్యా వల్ల యుక్రెయిన్‌కు ముప్పు పొంచి ఉందని నిరంతరం చెబుతున్న అమెరికా తూర్పు యూరోప్‌కు పంపడానికి 8,500 మంది సైనికులను అప్రమత్తం చేసింది. నల్ల సముద్రానికి తమ యుద్ధ నౌకలను పంపింది. అలాగే, యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బంది బంధువులను అక్కడి నుంచి తరలివెళ్లమని ఆదేశించింది.
మరోవైపు, పరిస్థితి అదుపులో ఉందని, యుద్ధం గురించి భయపడాల్సిన అవసరం లేదని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు.
రష్యా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకోవడం, రష్యా మద్దతుతో తిరుగుబాటుదారులు తూర్పు యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో ఈ సంక్షోభం ప్రారంభమైందని, ఈ వివాదంలో సుమారు 14,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు.
దీని తరువాత, పశ్చిమ దేశాలు, రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా, ఆ దేశాలకు మరింత దూరం జరిగింది.
ఈ నేపథ్యంలో రష్యాకు యుక్రెయిన్ ఎందుకంత కీలకమో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మూడు ముఖ్య కారణాలున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
1. సెక్యూరిటీ జోన్
"తమ సరిహద్దులకు సమీపంలో ఉన్న దేశం ప్రమాదకరమైన సైనిక కూటమికి వేదికగా మారుతోందని రష్యా భావిస్తోంది. అందుకే రష్యా ఈ వ్యూహాలను అవలంబిస్తోంది. యుక్రెయిన్ నాటో కూటమిలో చేరకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తోంది. నాటో మిత్ర దేశాల నుంచి యుక్రెయిన్‌కు సైనిక దళం, ఆయుధాలు అందకుండా ఉండేందుకు వ్యూహాలు పన్నుతోంది" అని వర్జీనియాలోని టెక్ యూనివర్సిటీలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ గెరాల్డ్ టోల్ బీబీసీతో చెప్పారు.
1812లో నెపోలియన్ దండయాత్ర జరిగినప్పటి నుంచి యుక్రెయిన్ భూభాగం రష్యాకు బఫర్ జోన్‌గా పనిచేస్తోందని జియోపొలిటికల్ ఫ్యూచర్స్‌కు చెందిన జార్జ్ ఫ్రీడ్‌మాన్ పేర్కొన్నారు.
"యుక్రెయిన్, రష్యా పశ్చిమ సరిహద్దులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాపై పశ్చిమం నుంచి దాడి జరిగినప్పుడు యుక్రెయిన్‌ను అడ్డుగా పెట్టుకుని కాపాడుకుంది. అక్కడ నుంచి రష్యా రాజధాని మాస్కో 1,000 మైళ్లు అంటే 1,600 కి.మీ. దూరంలో ఉంది. ఒకవేళ యుక్రెయిన్ నాటో కూటమిలో చేరితే అప్పుడు మాస్కోకు దూరం తగ్గిపోతుంది. అది కేవలం 400 మైళ్లు అంటే 640 కి.మీ దూరంలో ఉంటుంది. కాబట్టి, యుక్రెయిన్, రష్యాకు ఒక సెక్యూరిటీ జోన్ లాంటిది. నెపోలియన్ దాడి నుంచి రష్యాను రక్షించినప్పటి నుంచి యుక్రెయిన్ రష్యాకు ఒక అడ్డుగోడలా ఉంది" అని ఫ్రీడ్‌మాన్ వివరించారు.
తమను శత్రు కూటమి చుట్టుముట్టిందని రష్యా భావిస్తోంది. ఇది రష్యాకు ఆందోళన కలిగించే విషయం అని టోల్ అన్నారు.
తాజా ఉద్రిక్తతలు ప్రారభమైనప్పుడు, రష్యా ఉప విదేశాంగ మంత్రి 1962 క్షిపణి సంక్షోభాన్ని ప్రస్తావించారు. తరువాత, క్యూబా, వెనెజ్వేలాలలో సైనిక బలగాలను మోహరించవచ్చని రష్యా కూడా వ్యాఖ్యానించింది.
"అమెరికాకు తన స్వంత మన్రో డాక్టరిన్ (వలస రాజ్యాలను, తోలుబొమ్మల్లాంటి రాజులను అమెరికా సహించదని యూరోపియన్ దేశాలకు చేసిన హెచ్చరిక) ఉందని, తన చుట్టూ శత్రు దళాల ఉనికి గురించి ఆందోళనలు ఉన్నాయని నొక్కి చెప్పడానికి వారు ఇలా చేసారు. అలా చూస్తే, రష్యా వ్యాఖ్యలు సమర్థనీయమే" అని టోల్ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
2. చారిత్రక, మత, సాంస్కృతిక సంబంధాలు
పొరుగుదేశం (యుక్రెయిన్) ఒక ప్రమాదకరమైన ఆటలోకి ప్రవేశిస్తోందని, ఆ దేశాన్ని యూరోప్, రష్యాల మధ్య అవరోధంగా, మాస్కోకు వ్యతిరేకంగా ఒక స్ప్రింగ్‌బోర్డ్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. యుక్రెయిన్‌తో సంబంధాలపై 2021 జూలై 12న పుతిన్ రాసిన ఒక వివరణాత్మక వ్యాసంలో ప్రస్తావించారు.
ఆ ప్రాంతం యొక్క భద్రత, రాజకీయాల గురించి మాత్రమే కాకుండా, రష్యా, యుక్రెయిన్ మధ్య ఉన్న చారిత్రక, మత, సాంస్కృతిక సంబంధాల గురించి కూడా పుతిన్ ప్రస్తావించారు. దీనిపై ఆయన విస్తృతంగా రాశారు.
బెలారస్, రష్యా, ఉక్రెయిన్‌లకు పూర్వీకులు ఒకరేనని, రష్యా, యుక్రెయిన్ ప్రజల మధ్య తేడాలు లేవని చెప్పడానికి పలు చారిత్రక అంశాలను ప్రస్తావించారు.
రష్యా, యుక్రెయిన్‌ను మరొక దేశంగా భావించదని టోల్ అన్నారు.
"రష్యా, యుక్రెయిన్‌ను సిస్టర్ స్లావిక్ దేశంగా పరిగణిస్తుంది. రష్యాకు యుక్రెయిన్ గుండె లాంటిది. యుక్రెయిన్‌పై రష్యా అభిప్రాయాలు చాలా బలంగా, లోతులకు పాతుకుపోయాయి. కానీ, యుక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా రష్యా పక్కన నిలబడాలనుకుంటోంది. ఇది రష్యాకు రుచించట్లేదు. సొంత సోదరుడికి ద్రోహం చేసినట్టు పరిగణిస్తోంది. అందుకే ఈ రెండు దేశాల విషయంలో భావోద్వేగాలు అధికంగా ఉన్నాయి" అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక, చారిత్రక సారూప్యత సిద్ధాంతాలను జార్జ్ ఫ్రీడ్‌మాన్ తిరస్కరించారు. రష్యా భయమంతా దాని భౌగోళిక రాజకీయ స్థితి గురించేనని ఆయన అభిప్రాయపడ్డారు.
"అవును, వారు చరిత్రను పంచుకుంటారు. చారిత్రకంగా రష్యా, యుక్రెయిన్లను అణచివేసింది. సోవియట్ కాలంలో యుక్రెయిన్లు తీవ్ర కరువును ఎదుర్కొన్నారు. లక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే, అక్కడ పండించిన ధాన్యం మొత్తాన్ని రష్యా ఎగుమతి చేయాలనుకుంది. ఇలాంటి చరిత్ర ఉన్నప్పుడు, ఈ రెండు దేశాల మధ్య ఐక్యత గురించి మాట్లాడడం అర్థరహితం" అని ఫ్రీడ్‌మాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. పుతిన్ లెగసీ
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు యుక్రెయిన్ విషయంలో వ్యక్తిగత భావోద్వేగాలు ఉన్నాయని యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ అఫైర్స్ స్పెషలైజింగ్ ఇన్ రష్యాలో ప్రధాన విశ్లేషకుడు కద్రీ లీక్ గత ఏడాది బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
యుక్రెయిన్ విషయంలో రష్యా విధానం కొన్నిసార్లు హేతుబద్ధంగా కనిపించకపోవడానికి బహుశా ఇదే కారణమని లీక్ అన్నారు.
యుక్రెయిన్‌లో రష్యాకు మద్దతిచ్చే నేతలను అధికారంలోకి తీసుకురావడానికి పుతిన్ చాలాసార్లు ప్రయత్నించారని, అయితే అవి విఫలమయ్యాయని గెరార్డ్ టోల్ వివరించారు.
"పుతిన్ కోరిక అసంపూర్తిగా ఉండిపోయింది. అందుకే పుతిన్‌లో చాలా అసంతృప్తి ఉంది. అది తన ఘనతకు లోటు అని ఆయన భావిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌ను రష్యా వ్యతిరేక శక్తిగా మార్చాయని పుతిన్ భావిస్తున్నారు."
ఈ నేపథ్యంలో, యుక్రెయిన్ సంక్షోభాన్ని భావోద్వేగ కోణాల నుంచి విశ్లేషించడం ప్రమాదకరమని టోల్ భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- గుంటూరు జిన్నా టవర్: ఆకుపచ్చగా ఉన్న ఈ టవర్‌కి భారత్ జెండా రంగులు ఎవరు., ఎందుకు వేశారు?
- రాష్ట్రపతికి బహుమానంగా జింబాబ్వే ఇచ్చిన ఏనుగును తిరిగి పంపించేయమంటూ కోర్టులో పిటిషన్
- అదానీ, అంబానీకి కేంద్ర బడ్జెట్‌తో భారీ లబ్ధి చేకూరనుందా
- ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాల జమ. అసలు సమస్య అక్కడే ఉందా?
- 768 కిలోమీటర్ల పొడవైన మెరుపు.. సరికొత్త ప్రపంచ రికార్డు
- అవకాడో: ఇవి పండ్లు కాదు.. పచ్చ బంగారం..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












