వ్లాదిమిర్ పుతిన్ జీవితంలో ఆ ఒక్క సంఘటన నాటోకు విరోధిగా ఎలా మార్చేసిందంటే..

పుతిన్

ఫొటో సోర్స్, KREMLIN

ఫొటో క్యాప్షన్, నాటో సెక్రటరీ జనరల్ జార్జ్ రాబర్ట్‌సన్‌తో వ్లాదిమిర్ పుతిన్ (పాత చిత్రం)

''రష్యా ఏం కోరుకుంటోంది? నిజంగానే యుక్రెయిన్‌లోని కొంత భాగాన్ని రష్యా తనలో కలుపుకోవాలని అనుకుంటుందా? ఆ పని చేయగలనని పుతిన్‌కు తెలుసు, అందుకే ఆయన ఒత్తిడి చేస్తున్నారని నేను నమ్ముతున్నా. యూరోపియన్ యూనియన్‌(ఈయూ)లో తాను చీలిక సృష్టించగలనని పుతిన్‌కు తెలుసు.''

''నిజానికి ఆయన గౌరవాన్ని కోరుకుంటున్నారు. ఒకరిని గౌరవించడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. నిజం చెప్పాలంటే అసలు ఎలాంటి ఖర్చు ఉండదు. చైనాకు వ్యతిరేకంగా మాకు రష్యా అవసరం ఉంది. మేం రష్యాను చైనాకు దూరంగా ఉంచాలి. యుక్రెయిన్‌లో ఏం జరుగుతుందో కూడా మేం తెలుసుకోవాలి. క్రిమియా ద్వీపకల్పం రష్యా పరమైంది. దాన్ని ఇప్పుడు రష్యా తిరిగి ఇవ్వదు. ఇది సత్యం.''

జనవరి 20న భారత్‌లో చేసిన ఈ ప్రకటన కారణంగా జర్మన్ నేవీ చీఫ్, తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. జర్మనీ నేవీ చీఫ్ రాజీనామా, ఆయన ప్రకటనపై రష్యా కూడా స్పందించింది.

''యూరోపియన్ యూనియన్‌లోని అందరూ గాడి తప్పలేదని, సరైన పనులు చేసే కొందరు ఇంకా మిగిలి ఉన్నట్లు జర్మన్ నేవీ చీఫ్ ప్రకటన ద్వారా స్పష్టం అవుతోంది'' అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందిన మీడియా కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ అన్నట్లు రష్యా వార్తా సంస్థ తాశ్ పేర్కొంది.

''ఆ ప్రకటన గురించి మాకు తెలుసు. అయితే నాటో, ఈయూ అంశంలో మా వైఖరికి ఈ ప్రకటనకు ఎలాంటి సంబంధం లేదు. యూరప్‌లోని ప్రతీ ఒక్కరూ గాడి తప్పలేదని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది. నిజాన్ని మాట్లాడగల వ్యక్తులు కూడా ఇంకా ఉన్నారు. వారు నిజాన్ని చూడాలనుకుంటున్నారు'' అని దిమిత్రీ అన్నారు.

జర్మన్ నేవీ చీఫ్ చేసిన ఈ ప్రకటన... అమెరికా, యూరోపియన్ యూనియన్ల అధికారిక వైఖరికి పూర్తి విరుద్ధంగా ఉంది. 'యుక్రెయిన్ నుంచి 2014లో అక్రమంగా క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుందని, ఇది ఆమోదించదగినది కాదని' ఈయూతో పాటు అమెరికా అంటున్నాయి. క్రిమియాను తిరిగి యుక్రెయిన్‌కు అప్పగించాలని ఈయూ, యూఎస్ డిమాండ్ చేస్తున్నాయి.

కానీ చాలా మంది నిపుణులు మాత్రం జర్మన్ నేవీ చీఫ్ మాటలు ఆమోదమోగ్యమైనవే అని, పుతిన్ గౌరవాన్ని కోరుకుంటున్నారనే వ్యాఖ్యలు తార్కికంగా ఉన్నాయని భావిస్తున్నారు.

పుతిన్

ఫొటో సోర్స్, EPA

నాటో ఏర్పాటు

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం, 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)‌ను ఏర్పాటు చేశారు. అమెరికా, కెనడా, ఇతర పాశ్చాత్య దేశాలు కలిసి ఈ కూటమిని ఏర్పాటు చేశారు. సోవియట్ యూనియన్ నుంచి రక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రపంచంలో రెండే శక్తిమంతమైన రాజ్యాలు ఉండేవి. అందులో ఒకటి అమెరికా కాగా, రెండోది సోవియట్ యూనియన్.

మొదట నాటోలో 12 సభ్య దేశాలు ఉండేవి. నాటోను ఏర్పాటు చేసిన తర్వాత... ఉత్తర అమెరికా లేదా యూరప్‌లోని ఏ దేశంపై దాడి జరిగినా, అది తమపైనే జరిగినట్లుగా భావిస్తామని కూటమిలోని మిగతా సభ్య దేశాలన్నీ ప్రకటించాయి. నాటోలోని సభ్యదేశాలన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటాయి.

కానీ 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత చాలా విషయాలు మారిపోయాయి. నాటో కూటమిని ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన కారణం సోవియట్ యూనియన్‌ను విచ్ఛిన్నం చేయడం. సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత ప్రపంచం ఒకే ధ్రువంగా మారిపోయింది. అమెరికా, ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదిగింది. అప్పుడే కొత్తగా రష్యా ఏర్పడింది. రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది.

ఒక అగ్రరాజ్యంగా వెలుగొంది విచ్ఛిన్నం కావడం పట్ల ఏర్పడిన బాధ, కోపాన్ని నిగ్రహించుకుంటూ రష్యా, తన వ్యవహారాలను చక్కబెట్టుకుంటోంది. అమెరికా తలుచుకుంటే, రష్యాను కూడా తన కూటమిలో చేర్చుకోవచ్చు. కానీ రష్యాను కూడా యూఎస్ఎస్‌ఆర్‌లాగే భావించిన అమెరికా... రష్యా పట్ల తన ప్రచ్ఛన్న యుద్ధ వైఖరిని అలాగే కొనసాగించింది.

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

పుతిన్ ఒంటరిగా మిగిలిపోయారా?

''తొలుత రష్యాను కూడా నాటో కూటమిలో చేర్చాలని పుతిన్ అనుకున్నారు. కానీ కూటమిలో చేరేందుకు అనుసరించాల్సిన ప్రక్రియ పట్ల పుతిన్ విముఖత వ్యక్తం చేశారు'' అని గతేడాది నవంబర్‌లో యూకే రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, నాటో (1999-2003) మాజీ సెక్రటరీ జనరల్ జార్జ్ రాబర్ట్‌సన్ అన్నారు.

''సంపన్నమైన, స్థిరమైన, అభివృద్ధి చెందుతోన్న పశ్చిమ దేశాల్లో పుతిన్ కూడా భాగం కావాలని అనుకున్నారు'' అని జార్జ్ వెల్లడించారు.

పుతిన్, 2000లో రష్యా అధ్యక్ష పదవిని అధిష్టించారు. పుతిన్‌తో తొలి సమావేశాన్ని జార్జ్ రాబర్ట్‌సన్ గుర్తు చేసుకున్నారు. ''నాటోలో చేరాల్సిందిగా మీరు మాకెప్పుడు ఆహ్వానాన్ని పంపుతారు'' అని పుతిన్ నన్ను అడిగారు. దానికి సమాధానంగా ''నాటో కూటమిలో చేరాలంటూ మేం ఎవరికీ ఆహ్వానాలు పంపించం. ఈ కూటమిలో భాగం కావాలి అనుకునేవారు స్వయంగా అందుకోసం దరఖాస్తు చేసుకుంటారు'' అని చెప్పినట్లు జార్జ్ తెలిపారు. దానికి వెంటనే, ''అలా దరఖాస్తు చేసుకునే దేశాల జాబితాలో నేను లేను'' అని పుతిన్ వ్యాఖ్యానించినట్లు జార్జ్ చెప్పుకొచ్చారు.

సీఎన్ఎన్ మాజీ జర్నలిస్ట్ మైఖేల్ కోసిన్‌స్కీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన పాడ్ కాస్ట్ కార్యక్రమం 'వన్ డెసిషన్'లో రాబర్ట్‌సన్ దీని గురించి చెప్పుకొచ్చారు.

రాబర్ట్‌సన్ చెప్పిన మాటల్ని నమ్మాల్సిందే. ఎందుకంటే 2000 మార్చి 5న, బీబీసీకి చెందిన జర్నలిస్ట్ డేవిడ్ ప్రోస్ట్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా కూడా పుతిన్ దాదాపు ఇదే విధంగా ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

'నాటో గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు నాటోను భాగస్వామిగా లేదా ప్రత్యర్థిగా లేదా శత్రువుగా చూడాలనుకుంటున్నారా?' అని పుతిన్‌ను డేవిడ్ అడిగారు.

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

''యూరప్ సంస్కృతిలో రష్యా కూడా ఒక భాగం. యూరప్‌తో సంబంధం లేని ఒంటరి దేశంగా నా దేశాన్ని నేను ఊహించలేను. ఇది నాగరిక ప్రపంచం. ఇలాంటి పరిస్థితుల్లో నేను, నాటోను శత్రువుగా చూడాలంటే చాలా కష్టం. ఇలాంటి ప్రశ్న ఉత్పన్నమవ్వడం కూడా ప్రపంచానికి, రష్యాకు మంచిది కాదు. ప్రపంచానికి హాని కలిగించడానికి ఇలాంటి ఒక ప్రశ్న సరిపోతుంది'' అని దానికి సమాధానంగా పుతిన్ చెప్పారు.

''రష్యా తన మిత్రదేశాలతో సమానమైన, న్యాయపరమైన సంబంధాలను కోరుకుంటోంది. ఇప్పటికే అంగీకరించిన సాధారణ ప్రయోజనాల నుంచి మమ్మల్ని వేరుచేయడమే మా ప్రధాన సమస్య. ముఖ్యంగా అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం చాలా కీలకం. సమాన భాగస్వామ్యం, సమాన సహకారం పొందడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. నాటో సహకారం గురించి కూడా మేం చర్చిస్తాం. కానీ రష్యాను సమాన భాగస్వామిగా పరిగణిస్తేనే దీని గురించి చర్చించడం సాధ్యమవుతుంది. తూర్పు వైపు నాటో విస్తరణను మేం వ్యతిరేకిస్తున్నామని మీకు తెలుసు'' అని ఆయన వివరించారు.

రష్యా, నాటో కూటమిలో చేరే అవకాశం ఉందా? అని పుతిన్‌ను డేవిడ్ మరో ప్రశ్న అడిగారు.

''ఇది జరగకపోవడానికి కూడా వేరే కారణాలు లేవు. అలాంటి అవకాశం వస్తే నేను దాన్ని తోసిపారేయను. కానీ, సమాన భాగస్వామిగా రష్యాను పరిగణించాలి అనే డిమాండ్‌ను మాత్రం నొక్కి చెబుతాను. నేను ఈ అంశాన్ని పదే పదే చెబుతున్నాను. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అప్పటి పరిస్థితుల ప్రకారం ఐక్యరాజ్య సమితి సిద్ధాంతాలను రూపొందించారు. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారతాయనేది నిజం. ఇప్పుడు అంతర్జాతీయ భద్రతకు సంబంధించి ఒక కొత్త వ్యవస్థను రూపొందించారని అనుకుందాం. కానీ 'ఈ ప్రక్రియతో రష్యాకు ఎలాంటి సంబంధం లేదు, దీన్నుంచి రష్యాను దూరంగా పెట్టడం' అనే ఊహను కూడా నేను తట్టుకోలేను'' అని పుతిన్ వివరించారు.

జిన్‌పింగ్‌తో పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

''మేం నాటో విస్తరణను వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా, ప్రపంచంలోని ఏ ప్రాంతంపై మాకు ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు మేం ఎప్పుడూ చెప్పలేదు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి చర్చించడమే మా ప్రాధాన్యత. ఈ అంశం నుంచి మమ్మల్ని పక్కన పెట్టేందుకు ప్రయత్నించడమే మా నిరసనలకు కారణం. కానీ వీటర్థం మేం ప్రపంచం నుంచి దూరంగా వెళ్తున్నట్లు కాదు. ఒంటరిగా ఉండటం మా విధానం కాదు'' అని పుతిన్ వివరించారు.

గత 21 ఏళ్లుగా అధికారంలో ఉన్న పుతిన్ వ్యక్తిత్వం, ఆలోచనలు మారిపోయాయని చెబుతున్నారు. యుక్రెయిన్‌లో 2004లో ఆరెంజ్ రివల్యూషన్ వీధి నిరసనల తర్వాత, పుతిన్, పశ్చిమ దేశాలపై అనుమానం పెంచుకున్నారు.

ఈ నిరసనల వెనుక ప్రజాస్వామ్య అనుకూల ఎన్జీవో హస్తం ఉందని పుతిన్ చెప్పారు. కానీ నాటో విస్తరణపై పుతిన్ అసంతృప్తి పెరుగుతూనే ఉంది. మధ్య, తూర్పు యూరప్‌లో రొమేనియా, బల్గేరియా, స్లోవేకియా, స్లోవేనియా, లాత్వియా, ఈస్టోనియా, లిథువేనియాలు కూడా 2004లో నాటో కూటమిలో చేరాయి. క్రొయేషియా, అల్బేనియా దేశాలు 2009లో ఈ కూటమిలో కలిశాయి. 2008లోనే జార్జియా, యుక్రెయిన్ దేశాలకు ఇందులో చేరే అవకాశం వచ్చింది. కానీ ఇప్పటికీ ఈ రెండు దేశాలు కూటమిలో చేరలేదు.

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

నాటోలో ఆర్టికల్ 5 అంటే ఏంటి?

నాటోలో ఆర్టికల్ 5ను రాబర్ట్‌సన్ అమల్లోకి తెచ్చారు. 9/11 తర్వాత ఇది అమలులోకి వచ్చింది. ఆర్టికల్ 5ను అమల్లోకి తీసుకురావడాన్ని అతిపెద్ద పందెంగా పరిగణిస్తారు. ఈ ఆర్టికల్ అమల్లోకి వచ్చిన తర్వాత కూటమి ఏర్పాటు ఉద్దేశమే మారిపోయింది. తన భద్రత కోసమే కాకుండా తన సొంత ప్రయోజనాల దృష్ట్యా ఈ కూటమి ఇతరులపై దాడికి తెగబడుతుందని అందరూ భావిస్తున్నారు.

2003లో ఇరాక్‌పై దాడిని అమెరికా ఈ ఆర్టికల్ సహాయంతో సమర్థించుకుంది. దీనికి సంబంధించి నాటోలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

పుతిన్ మరోసారి యుక్రెయిన్ సరిహద్దుల్లో తమ సైన్యాన్ని మోహరించారు. ఈ నేపథ్యంలో యుక్రెయిన్‌కు నాటో మద్దతుగా నిలబడింది. ఏ సమయంలో అయినా పుతిన్, యుక్రెయిన్‌పై దాడికి ఆదేశించవచ్చని చెబుతున్నారు.

ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా, యూరప్‌లకు పుతిన్ ఒక షరతు విధించారు. యుక్రెయిన్‌ను ఎప్పటికీ నాటో కూటమిలో చేర్చకూడదనేదే ఈ షరతు. ఒకప్పుడు పుతిన్, స్వయంగా నాటోలో చేరాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనే, ఇతర దేశాలు కూడా నాటోలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికోసం ఏకంగా సరిహద్దుల్లో సైన్యాన్ని కూడా మోహరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)