రష్యా, యుక్రెయిన్: ‘పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది.. ఏదో జరగొచ్చని అనిపిస్తోంది’

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
యుక్రెయిన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఏ క్షణానైనా సుమారు 8,500 యుద్ధ దళాలను అక్కడకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తెలిపింది.
అయితే, యుక్రెయిన్‌పై మిలటరీ దాడి చేసే ఉద్దేశం లేదని రష్యా అంటోంది. కాగా, సరిహద్దుల్లో 1,00,000 సైనిక దళాలను మోహరించింది.
రష్యా దూకుడును అడ్డుకోవడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పశ్చిమ దేశాలు యోచిస్తున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం యూరోపియన్ మిత్రదేశాలతో ఒక వీడియో సమావేశం నిర్వహించారు.
కాగా, సైనికులను మోహరించే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పెంటగాన్ తెలిపింది.
నాటో మిలిటరీ కూటమి వేగంగా ప్రతిస్పందించాలని నిర్ణయించినా, "లేదా రష్యా సైనిక బలగాల మోహరింపులో మార్పులు చోటుచేసుకున్నా" పై అంశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ వెల్లడించారు.
లేదంటే యుక్రెయిన్‌కు సైనిక దళాలను పంపే ఆలోచన లేదని ఆయన అన్నారు.
డెన్మార్క్, స్పెయిన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ సహా కొన్ని నాటో సభ్య దేశాలు ఇప్పటికే తూర్పు యూరప్‌కు యుద్ధ విమానాలు, యుద్ధనౌకలను పంపే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రక్షణను బలోపేతం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'రష్యా విషయంలో అంతర్జాతీయ ఐక్యత ముఖ్యం'
"ముందుండి పోరాడే సైనికుల" కోసం అమెరికా పంపించిన పేలుడు సామగ్రి సహా 90 టన్నుల "ప్రాణాలను హరించే పదార్థాలు" కిందటి వారాంతంలో యుక్రెయిన్ చేరుకున్నాయి.
సోమవారం నాటి వీడియో సమావేశంలో జో బైడెన్‌తో పాటు, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాగి, పోలిష్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పాల్గొన్నారు.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నాయకులు ఉర్సులా వాన్ డెర్ లేయన్, చార్లెస్ మిషెల్ కూడా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.
"సమావేశం ఎంతో బాగా జరిగింది. యూరోపియన్ నాయకులందరితోనూ పూర్తి ఏకీభావం కుదిరింది" అని బైడెన్ తెలిపారు.
"రష్యాతో విరోధం పెరుగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ ఐక్యత చాలా ముఖ్యమని" నాయకులందరూ అంగీకరించారని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
యుక్రెయిన్‌లోకి రష్యా చొరబాటు పెరిగితే, "మిత్రదేశాలు అసాధారణ ఆంక్షలు విధించడంతో పాటు త్వరితంగా ప్రతిచర్యలు తీసుకోవాలని" నాయకులంతా అంగీకరించారు.

ఫొటో సోర్స్, REUTERS
'కీవ్‌పై మెరుపు దాడికి రష్యా ప్రణాళిక'
యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై మెరుపు దాడికి రష్యా ప్రణాళిక సిద్ధం చేస్తోందని ఇంటెలిజెన్స్ సూచించినట్లు బోరిస్ జాన్సన్ సోమవారం నాడు హెచ్చరించారు.
"యుక్రెయిన్ సరిహద్దుల్లో 60 రష్యన్ సైనిక దళాలు మోహరించి ఉన్నాయని ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. కీవ్‌పై మెరుపు దాడికి రష్యా సన్నద్ధమవుతోందనే అందరూ అంచనా వేస్తున్నారు" అని జాన్సన్ అన్నారు.
"అలా చేస్తే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని క్రెమ్లిన్‌కు, రష్యాకు మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది" అని ఆయన సూచించారు.
నాటో కూటమిని తమ జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. యుక్రెయిన్‌లోనూ, తూర్పు వైపుకు నాటో కూటమి విస్తరించబోదని చట్టపరమైన హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది.
అయితే, ఇక్కడ సమస్య రష్యా దూకుడు చర్యలేగానీ నాటో విస్తరణ కాదని అమెరికా స్పష్టం చేసింది.
యుక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయ సిబ్బంది బంధువులను అక్కడి నుంచి తరలివెళ్లమని ఆదివారం బైడెన్ ప్రభుత్వం చెప్పింది.
బ్రిటన్ కూడా తమ దౌత్య కార్యాలయం నుంచి సిబ్బందిని వెనక్కి పిలిపించడం ప్రారంభించింది.
మిత్రదేశాలు తమ సిబ్బందిని దేశం నుంచి ఉపసంహరించుకోవడం నిరుపయోగమని యుక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ ఒలెక్సీ డానిలోవ్ బీబీసీతో అన్నారు.
"మాకు ఇక్కడ సహాయం కావాలి. ప్రజలు భయాందోళనలకు గురైతే, అది యుక్రెయిన్‌ను ప్రమాదకరమైన స్థితిలోకి నెడుతుంది. అప్పుడు మమ్మల్ని మభ్యపెట్టడం రష్యాకు సులభం అవుతుంది" అని ఆయన అన్నారు.
యుక్రెయిన్ ప్రభుత్వాన్ని నడిపేందుకు మాస్కోకు అనుకూలమైన వ్యక్తిని అక్కడ ప్రవేశపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యోచిస్తున్నారని గతంలో బ్రిటన్ విదేశాంగ కార్యాలయం ఆరోపించింది.
విదేశాంగ కార్యాలయం పేర్కొన్న ఆ వ్యక్తి యుక్రేనియన్ మాజీ ఎంపీ యెవెన్ మురాయేవ్. బ్రిటన్ వాదనలు "అసంబద్ధమని" ఆయన అన్నారు.
బ్రిటన్ విదేశాంగ శాఖ "తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని" రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది.
గత వారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ దౌత్యపరమైన చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను స్విట్జర్లాండ్‌లో కలిశారు.
ఆ సందర్భంగా, ఈ మొత్తం విషయంలో భావోద్వేగాలు తగ్గుముఖం పడతాయని ఆశిస్తున్నట్లు లావ్‌రోవ్ తెలిపారు.
అయితే, ఈ చర్చలు ఉద్రిక్తతలను తగ్గించడంలో విఫలమయ్యాయి. అంతే కాకుండా రష్యా కరెన్సీ రూబుల్ విలువ దారుణంగా పడిపోయింది.
యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా సైన్యం కదిలితే కొత్త ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా, దాని మిత్రదేశాలు హెచ్చరించాయి.

యుక్రేనియన్లు రక్షణ దళాలను సిద్ధం చేస్తున్నారు
గత కొన్ని నెలలుగా యుక్రేనియన్లు వలంటీర్లతో ప్రాదేశిక రక్షణ దళాన్ని సిద్ధం చేస్తున్నారు. కీవ్‌పై దాడి జరిగితే అడ్డుకునేందుకు వారికి శిక్షణ ఇస్తున్నారు.
వారిలో ఒక మహిళా సభ్యురాలు మార్టా యుజ్కివ్ బీబీసీతో మాట్లాడారు.
"నిజంగానే నేను ఆందోళన చెందుతున్నాను. నేను శాంతిని ఆకాంక్షిస్తున్నాను. యుద్ధం జరగాలని కోరుకోవట్లేదు. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే, నా దేశాన్ని రక్షించుకోవడానికి నేను సిద్ధంగా ఉండాలి" అని ఆమె అన్నారు. 50 ఏళ్ల యుజ్కివ్ వృత్తిరీత్యా వైద్యురాలు.
కీవ్‌లోని ఐటీ కన్సల్టెంట్ ఆండ్రీ వోల్కోవ్ పరిస్థితి "ప్రమాదకరంగా" ఉందని అన్నారు.
"పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఏదో జరగవచ్చని అనిపిస్తోంది. ఇక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి తరలివెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాను" అని వోల్కోవ్ తెలిపారు.
రష్యా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పుడు యుక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఆ తరువాత, ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరండం) ద్వారా క్రిమియా రష్యాలో చేరేందుకు ఓటు వేసింది.
అయితే, ఇది చట్టవిరుద్ధమని పశ్చిమ దేశాలు, యుక్రెయిన్ భావించాయి.
రష్యా మద్దతుగల తిరుగుబాటుదారులు రష్యా సరిహద్దులకు సమీపంలోని తూర్పు యుక్రెయిన్ ప్రాంతాలపై కూడా పట్టు సాధించారు.
ఈ వివాదంలో 14,000 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. 2015లో శాంతి ఒప్పందం జరిగినా అది కార్యరూపం దాల్చేందుకు చాలా దూరంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













