యుక్రెయిన్, రష్యా ఉద్రిక్తతలు: యూరప్‌కు అదనపు బలగాలను పంపనున్న అమెరికా

సైనికుడు

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందనే భయాలు కొనసాగుతోన్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈవారం 2000 సైనిక బృందాలను యూరప్‌కు పంపనున్నారని వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు.

నార్త్ కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ నుంచి ఈ సైనిక దళాలను పోలాండ్, జర్మనీలకు తరలిస్తారు. ఇప్పటికే జర్మనీలో ఉన్న 1000 బృందాలు రొమేనియాకు వెళ్లనున్నాయి.

యుక్రెయిన్‌పై దాడికి రష్యా ప్రణాళికలు రచిస్తోందని వస్తోన్న వార్తలను మాస్కో ఖండించింది. కానీ యుక్రెయిన్ సరిహద్దులో లక్ష మంది బలగాలను రష్యా ఇప్పటికే మోహరించింది.

అమెరికా నేతృత్వంలోని 'నాటో' సైనిక కూటమిలో యుక్రెయిన్ చేరడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

యుక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఆక్రమించిన 8 ఏళ్ల తర్వాత తాజా సంక్షోభం తలెత్తింది. తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో తిరుగుబాటుదారులకు రష్యా మద్దతుగా నిలిచింది.

వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, Reuters

రష్యాను యుద్ధంలోకి లాగాలని అమెరికా ప్రయత్నిస్తోంది - పుతిన్

యుక్రెయిన్ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు.

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి ఈ యుద్ధాన్ని ఒకసాకుగా వాడుకోవాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుందని ఈ సంక్షోభంపై చాలా వారాల తర్వాత మాట్లాడిన పుతిన్ అన్నారు.

యూరప్‌లో నాటో విస్తరణ గురించి రష్యా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కూడా అమెరికా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

రష్యా దళాలు యుక్రెయిన్ సరిహద్దుల్లోకి చేరుకోవడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి.

రష్యా గత కొన్ని వారాలుగా దాదాపు లక్ష మంది సైనికులను యుక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది. వీరి దగ్గర ట్యాంకుల నుంచి, మందుగుండు, క్షిపణుల వరకూ అన్నీ ఉన్నాయి.

యుక్రెయిన్ దక్షిణ క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించి, తూర్పు డాంబాస్‌లో తిరుగుబాటుదారులకు మద్దతిచ్చిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు రష్యా యుద్ధానికి ప్రణాళికలు వేస్తున్నట్లు పశ్చిమ దేశాలు చేస్తున్న ఆరోపణలను మాస్కో ఖండించింది.

బదులుగా, తూర్పున శాంతి పునరుద్ధరణ కోసం చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాన్ని అమలు చేయడంలో యుక్రెయిన్ ప్రభుత్వం విఫలమైందని రష్యా ఆరోపిస్తోంది.

రష్యా మద్దతున్న తిరుగుబాటుదారుల అధీనంలోని ఈ ప్రాంతంలో కనీసం 14 వేల మంది హత్యకు గురయ్యారు.

నాటో విస్తరణ పై రష్యా అభ్యంతరాలు చెబుతోంది
ఫొటో క్యాప్షన్, నాటో విస్తరణ పై రష్యా అభ్యంతరాలు చెబుతోంది

రష్యా దురాక్రమణ వల్ల జరిగేది యుక్రెయిన్-రష్యా యుద్ధం కాదని, ఇది యూరప్‌లో పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కి మంగళవారం హెచ్చరించారు.

"అమెరికాకు యుక్రెయిన్ భద్రత గురించి పెద్దగా ఆందోళన ఉన్నట్లు అనిపించడం లేదు. కానీ, దాని ప్రధాన లక్ష్యం రష్యా అభివృద్ధిని అడ్డుకోవడమే. అంటే, తన లక్ష్యాన్ని చేరుకోడానికి యుక్రెయిన్ దానికి ఒక టూల్‌.. అంతే" అని హంగేరియా ప్రధాని విక్టర్ ఆర్బన్‌తో మాస్కోలో చర్చల తర్వాత వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు కలిగిన రష్యా-అమెరికా మధ్య ఈ పోటీ కోల్డ్ వార్(1947-89) సమయం నుంచీ ఉంది. ఆ సమయంలో యుక్రెయిన్ సోవియట్ యూనియన్‌లో కీలకమైన భాగంగా, రష్యా తర్వాత స్థానంలో ఉండేది.

నాటోను తూర్పుగా మరింత విస్తరించకుండా అడ్డుకోవడంతోపాటూ, భద్రతా హామీల పట్ల తాము వ్యక్తం చేసిన ఆందోళనలను కూడా అమెరికా విస్మరించిందని పుతిన్ ఆరోపించారు.

నాటోలో చేరాలన్న యుక్రెయిన్ కోరిక నెరవేరితే, ఆ దేశం మిగతా సభ్యులను కూడా రష్యాతో యుద్ధంలోకి లాగుతుందని ఆయన సూచించారు.

"ఊహించండి.. యుక్రెయిన్ నాటో సభ్యదేశంగా మారితే, మిలిటరీ ఆపరేషన్(క్రిమియాను తిరిగి పొందడానికి) ప్రారంభిస్తుంది. అంటే.. ఏంటి మేం నాటోతో యుద్ధం చేయబోతున్నామా. ఎవరైనా దీని గురించి ఆలోచించారా, వారు ఆలోచించనట్టే అనిపిస్తోంది" అని పుతిన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యా ఏం చేస్తోంది?

పుతిన్ యుక్రెయిన్‌కు తుపాకీ గురిపెట్టారని యుక్రెయిన్‌ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోపించారు. సైనిక విపత్తు నుంచి రష్యా వెనక్కు తగ్గాలని పిలుపునిచ్చారు.

రష్యా దాడి చేస్తే యుక్రెయిన్ సైన్యం దానిని తిప్పికొడుతుందని రాజధాని కియెవ్‌లో జెలెన్స్కీతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన జాన్సన్ అన్నారు.

యుక్రెయిన్‌లో 2 లక్షల మంది మహిళలు, పురుషులు ఆయుధాల నీడలో ఉన్నారు. వారంతా తీవ్ర రక్తపాతం జరిగేలా ప్రతిఘటిస్తారు. రష్యాలోని తల్లిదండ్రులు, తల్లులు ఈ వాస్తవాన్ని గుర్తిస్తారని నేను భావిస్తున్నాను" అన్నారు.

చర్చలు జరపడానికి వీలుగా అధ్యక్షుడు పుతిన్ యుద్ధపథం నుంచి వెనక్కు తగ్గుతారని మేం ఆశిస్తున్నాం అని జాన్సన్ ఆకాంక్షించారు.

రష్యా సైన్యం యుక్రెయిన్ భూభాగంలోకి అడుగుపెట్టిన మరుక్షణమే బ్రిటన్ స్పందిస్తుందని, ఆంక్షల ప్యాకేజీ, ఇతర చర్యలను అమలుచేస్తామని జాన్సన్ హెచ్చరించారు.

రష్యా నుంచి ఇంధన స్వేచ్ఛ పొందడానికి, స్థిరమైన పాలనను ప్రోత్సహించడానికి యుక్రెయిన్‌కు 119 మిలియన్ డాలర్లు(రూ.888 కోట్ల) ఇస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.

కానీ, పరిస్థితి తీవ్రం కాకముందే రష్యాపై ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు. దానిపై బ్రిటన్ తీసుకునే ఏ చర్యనైనా తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్ మధ్య వివాదమేంటి.. అమెరికా ఎందుకు యుక్రెయిన్ పక్షం వహిస్తోంది

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)