యుక్రెయిన్, రష్యా ఉద్రిక్తతలు: నాటో విస్తరణను ఖండించడంలో రష్యాతో గొంతు కలిపిన చైనా

ఫొటో సోర్స్, GETTY IMAGES
నాటో విస్తరణను ఖండించడంలో రష్యాతో గొంతు కలిపింది చైనా. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో, రెండు దేశాల మధ్య స్నేహం పెరుగుతోంది.
వింటర్ ఒలింపిక్స్ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా, అనేక అంశాలపై ఇరు దేశాల అంగీకారాలను తెలియజేస్తూ మాస్కో, బీజింగ్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
తైవాన్‌పై చైనా వైఖరికి మద్దతిస్తున్నామని, తైవాన్ స్వతంత్రాన్ని వ్యతిరేకిస్తున్నామని రష్యా పేర్కొంది.
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ముందే పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు.
ఇద్దరు దేశాధినేతల మధ్య సమావేశాలు "స్నేహపూర్వకంగా", నిర్మాణాత్మకంగా జరిగాయని క్రెమ్లిన్ తెలిపింది.
నాటో కూటమి ప్రచ్ఛన్న యుద్ధ భావజాలాన్ని సమర్థిస్తోందని రష్యా, చైనా తమ ఉమ్మడి ప్రకటనలో ఆరోపించాయి.
అలాగే, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఆకుస్ భద్రతా ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేశాయి.
బీజింగ్ 'వన్ చైనా పాలసీ' కి మద్దతిస్తున్నట్లు రష్యా తెలిపింది. తైవాన్ చైనాలో విడదీయరాని భాగమని, ఎప్పటికైనా చైనాలో కలవక తప్పదని పేర్కొంది.
అయితే, సొంత రాజ్యాంగం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకులతో తమది స్వతంత్ర దేశమని తైవాన్ భావిస్తోంది.
తమ మధ్య "సహకరించుకోలేని అంశాలు లేవు" అని రష్యా, చైనాలు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ ప్రకటనలో యుక్రెయిన్ ప్రస్తావన లేదు. ఈ అంశంలో పశ్చిమ దేశాలకు, రష్యాకు మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.
నకిలీ యుక్రేనియన్ దాడిని సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని, దాన్ని సాకుగా చూపించి ఆ దేశంపై దండయాత్ర చేసేందుకు ప్రణాళిక రచిస్తోందని బుధవారం అమెరికా ఆరోపించింది.
రష్యా భూభాగంపై లేదా తూర్పు యుక్రెయిన్‌లో రష్యన్ మాట్లాడే ప్రజలపై దాడి జరిగినట్లు చూపించే గ్రాఫిక్ వీడియోను మాస్కో విడుదల చేసే అవకాశం ఉందని అమెరికా ఆరోపించింది.
రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. కాగా, తన వాదనలకు మద్దతుగా అమెరికా ఎలాంటి సాక్ష్యాధారాలనూ చూపించలేదు.
నాటో మిత్ర దేశాలకు మద్దతుగా తూర్పు యూరోప్‌కు మరిన్ని సైనిక దళాలను పంపుతున్నామని అమెరికా ప్రకటించిన మరుసటి రోజే ఈ కుట్ర వార్తలు బయటికొచ్చాయి.
ఈ చర్య "విధ్వంసకరం" అని, నాటో విస్తరణ గురించి తమ అనుమానాలకు, భయాలకు మద్దతిస్తోందని రష్యా పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- షేక్ రషీద్: అండర్-19 వరల్డ్ కప్‌లో టీమిండియాను ఫైనల్ చేర్చిన తెలుగు కుర్రాడి కథ
- ధర్మ సంసద్: రెండు సభలు, ఒకే రకమైన తీవ్రమైన ఆరోపణలు, రెండు రాష్ట్రాల చర్యల్లో తేడా ఎందుకు?
- దుబయ్: ఎడారి కాకుండా ఎలా తట్టుకుంటోంది? సారవంతమైన భూములను ఎలా కాపాడుకుంటోంది?
- గల్వాన్ డీకోడెడ్: 'గల్వాన్ లోయలో జరిగిన భారీ నష్టాన్ని చైనా దాచిపెడుతోంది'.. క్లాక్సన్ నివేదిక వెల్లడి
- సిరియా: ఐసిస్ నాయకుడు ఖురేషీని అంతమొందించామని ప్రకటించిన అమెరికా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








