ధర్మ సంసద్: రెండు సభలు, ఒకే రకమైన తీవ్రమైన ఆరోపణలు, రెండు రాష్ట్రాల చర్యల్లో తేడా ఎందుకు?

- రచయిత, అలిషాన్ జాఫ్రీ
- హోదా, బీబీసీ కోసం
2021 డిసెంబర్లో జరిగిన రెండు ధర్మ సంసద్‌లలో ప్రముఖ హిందూ సాధువులు, సన్యాసులు కొందరు 'ముస్లింలను ఊచకోత కోయాలని' పిలుపునిచ్చారు.
వీటిలో ఒకటి బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో, ఇంకొకటి వారం తర్వాత కాంగ్రెస్ పాలిత చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో జరిగింది.
హరిద్వార్ ధర్మ సంసద్‌లో సాధువుల వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
మరోవైపు, ఛత్తీస్‌గడ్ ధర్మ సంసద్‌లో మహాత్మా గాంధీని నిందించిన సాధువును అరెస్ట్ చేయడం మినహా రెచ్చగొట్టేలా మాట్లాడిన మిగతా వక్తలపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. అంతేకాదు.. హరిద్వార్ ధర్మ సంసద్‌పై జరిగినంత చర్చ కూడా జరగలేదు.
అయితే, హరిద్వార్ ధర్మ సంసద్‌లలో మాదిరిగానే రాయపూర్ ధర్మ సంసద్‌లో కూడా 'ముస్లిం సమాజాలపై దాడులు చేయాలని' సాధువులు, సన్యాసులు పిలుపునిచ్చారు.
ఛత్తీస్‌గఢ్ ధర్మ సంసద్‌లో గాంధీ గురించి స్వామి కాళీచరణ్ అవమానకర వ్యాఖ్యలు చేశారు. పదే పదే మైనార్టీలపై విద్వేషాలను రెచ్చగొట్టారు.
డిసెంబర్ 26న ఆయన వీడియో వైరల్ అయిన తర్వాత, చత్తీస్‌గఢ్ పోలీసులు కాళీచరణ్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై దేశద్రోహంతోపాటూ, వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.
ఇదే కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వీడియోలను బీబీసీ సంపాదించింది. మిగతా వక్తలు కూడా హింసకు పిలుపునివ్వడం ఆ వీడియోల్లో కనిపించింది.
ఈ వ్యాఖ్యలపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని విపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపించాయి.

ఫొటో సోర్స్, Ani
'హింసాత్మక చర్యలకు పిలుపు'
రాయ్‌పూర్ ధర్మ సంసద్‌లో పాల్గొన్న కొందరు ప్రధాన వక్తలు, ప్రముఖ సాధువులకు హరిద్వార్‌లో నిర్వహించిన ధర్మసంసద్ నిర్వాహకులతో కూడా సంబంధాలు ఉన్నాయి.
ఉదాహరణకు ఈ సభలో ప్రసంగించిన వక్తల్లో ఒకరైన ప్రబోధానందగిరి జునా అఖాడాకు చెందిన కీలక నేత. ప్రముఖ సాధువు. హరిద్వార్ విద్వేషపూరిత ప్రసంగం కేసులో అరెస్టైన యతి నర్సింగానంద్‌కు ఈయన ప్రధాన సహచరుడు.
హరిద్వార్ ధర్మ సంసద్‌లో ప్రసంగించిన స్వామి నారాయణ్ గిరి 'మియన్మార్‌లోలాగే భారత్‌లో కూడా ముస్లిం జాతిని ప్రక్షాళన చేయాలని' పిలుపునిచ్చారు.
నర్సింగానంద, ప్రబోధానంద్‌కు గురువు అయిన స్వామి నారాయణ్ గిరి జునా అఖాడాకు ప్రతినిధిగా ఉన్నారు. నర్సింగానంద్‌తో కలిసి ఆయన ఒక వీడియోలో కూడా కనిపిస్తున్నారు.
ఆ వీడియోలో నర్సింగానంద్‌కు, ఆయన హరిద్వార్ కార్యక్రమానికి జునా అఖాడా మద్దతుగా నిలుస్తుందని కూడా చెబుతున్నారు.
జునా అఖాడా మహామండలేశ్వర్‌గా నర్సింగానంద్ నియామకం వెనుక నారాయణ్ గిరి కీలక పాత్ర పోషించినట్లు కూడా చెబుతున్నారు.
ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా వీరిలో చాలా మంది సాధువులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వస్తుంటే, ఒక మహిళా సన్యాసిని 'హిందూ మహిళల రక్షణకు ముస్లిం మహిళలపై లైంగిక హింసకు పాల్పడాలని' హిందూ పురుషులను రెచ్చగొట్టారు.
'ముస్లిం మహిళలను బందీలుగా చేసుకుని, వారిని లైంగిక వేధింపులకు గురిచేయాలని' సాధ్వి విభా హిందూ పురుషులకు పిలుపునిచ్చారు.
2021 అక్టోబర్లో సుర్గుజా జిల్లాలో నిర్వహించిన 'ధర్మాంతరణ్ రోకో మంచ్' (మతమార్పిడులు అడ్డుకునే వేదిక) నిర్వహించిన మరో ర్యాలీలో రాంవిచార్ నేతమ్, నందకుమార్ సాయి లాంటి బీజేపీ నేతలు, రాయ్‌పూర్ ధర్మసంసద్‌లో ప్రసంగించిన కీలక వక్తల్లో ఒకరైన స్వామి పరమాత్మానంద లాంటివారు 'బలవంతపు మతమార్పిడులకు పాల్పడినట్లు ఆరోపణలున్న మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని చంపాలని' పిలుపునిచ్చారు.
వందలాది హిందూ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన పరమాత్మానంద 'మైనారిటీలను శిరచ్ఛేదం చేయాలని' రెచ్చగొట్టారు.
తర్వాత వారు విల్లు, బాణాలు, ఈటెలతో ఫొటోలకు ఫోజులిచ్చారు. గతంలో గోరక్షణ పేరుతో జరిగిన మూక దాడులను కూడా ఆయన వెనకేసుకొచ్చారు.
స్వాతంత్ర్య పోరాటంలాగే, భారత్‌ను హిందూ దేశంగా మార్చే పోరాటాన్ని విజయవంతం చేయాలని ఆయన రాయ్‌పూర్‌లో జరిగిన సభలో తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

'పట్టించుకోని పోలీసులు'
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వక్తలపై పోలీసులు చర్యలు తీసుకున్నారా అనేది తెలుసుకోడానికి సుర్గుజా జిల్లా ఎస్పీ అమిత్ కాంబ్లీని బీబీసీ సంప్రదించింది.
"పోలీసులు ఈ అంశంలో దర్యాప్తు చేస్తున్నారని, ఎవరూ దీనిపై ఫిర్యాదు చేయకపోవడంతో, ఈ కేసును సూమోటోగా తీసుకోవడం వివాదాస్పదం కావచ్చు" అని ఆయన చెప్పారు.
ఒక విషయం ప్రజల దృష్టిని ఆకర్షించినపుడు మాత్రమే పోలీసులు చర్యలు తీసుకుంటారా అని బీబీసీ ఆయన్ను ప్రశ్నించింది.
"మీడియాలో వచ్చిన వాటి ఆధారంగా మేం చర్యలు తీసుకోము. మాకు వాటి గురించి ఎలాంటి ఫిర్యాదులు కూడా రాలేదు" అని ఆయన సమాధానం ఇచ్చారు.
ఈ వీడియోల గురించి అసలు పోలీసులకు తెలుసా అని కూడా పోలీసు అధికారులను బీబీసీ ప్రశ్నించింది.
ఆ వీడియోలు తమకు మీడియా ద్వారా అందాయని, అందుకే ఆ వీడియోల ప్రామాణికతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని కాంబ్లీ చెప్పారు.
ఈ వీడియోలు వైరల్ అయి మూడు నెలలు అయ్యిందని, వాటిని ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారని, ఇప్పుడు వాటిని తారుమారు చేయడానికి ఆస్కారం ఉండకపోవచ్చని బీబీసీ ఆయనకు గుర్తు చేసింది.
దీంతో తమకు లభించిన ఆధారాలను బట్టి పోలీసులు వాటిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తారని ఆయన చెప్పారు.
బీబీసీతో మాట్లాడిన రాయ్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ కూడా సుర్గుజా ఎస్పీ చెప్పిందే పునరుద్ఘాటించారు.
"మిగతా వక్తల ప్రసంగాల గురించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. విద్వేష ప్రసంగాలను పోలీసులు సూమోటో కేసుగా పరిగణించరు" అన్నారు.
వరుస విద్వేషపూరిత ప్రసంగాలపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై సుప్రీంకోర్టు లాయర్ సంజయ్ హెడ్గే సందేహాలు వ్యక్తం చేశారు.
"ఏదైనా దర్యాప్తు ప్రారంభించాలంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అది లేకుండా ఒక దర్యాప్తు జరుగుతోందంటే పోలీసులు నిజాలతో రాజీ పడుతున్నారనే అనుకోవాలి. ఇక రెండోది, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా రెచ్చగొట్టేలా ఉన్న విద్వేషపూరిత ప్రసంగాలపై సూమోటోగా చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంది. అది విచారణ చేయదగిన నేరమే" అన్నారు.

ఫొటో సోర్స్, Ani
'మహాత్మాగాంధీకి జరిగిన అవమానంగా పరిమితం చేశారు'
ముస్లిం వ్యతిరేక హింసకు పిలుపునిచ్చినా పట్టించుకోలేదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వరుస ట్వీట్లలో ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అతివాదులకు ఆశ్రయం ఇస్తోందని అన్నారు.
"ఒకవైపు, తాము అధికారంలోకి వస్తే హరిద్వార్‌లో మారణహోమానికి పిలుపునిచ్చిన వారిని శిక్షిస్తామని ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు, ముస్లింలపై లైంగిక హింస, సామూహిక హత్యలను ప్రేరేపించిన వారిని అరెస్టు చేయడంలో ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.
ఛత్తీస్‌గఢ్‌లో హింసను ప్రేరేపించిన వారి గురించి అనేక ప్రకటనలు ఇచ్చాను. కానీ, పోలీసులు కేవలం ఒకరిని మాత్రమే అరెస్టు చేశారు. గాంధీని అవమానించారనే అంశానికి మొత్తం విషయాన్ని కుదించేశారు. గాంధీ కూడా తనకు జరిగే అవమానాల కన్నా అమాయక మైనారిటీల జీవితాలకే ప్రాముఖ్యనిస్తారు" అని ఒవైసీ బీబీసీతో అన్నారు.
ఈ కేసుపై 'పక్షపాతంగా దర్యాప్తు' జరిపారంటూ బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేసింది.
"కాళీచరణ్ వ్యాఖ్యలపై మాత్రమే పక్షపాత ధోరణిలో కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ పార్టీతో సంబంధాలుండి, కాళీచరణ్‌కు సమానంగా లేదా అంతకన్నా ఎక్కువ సమస్యాత్మకంగా మాట్లాడిన వారిని ప్రజల దృష్టి నుంచి తప్పించారు.
న్యాయపరమైన విచారణ జరిపితే ఒక్క కాళీచరణ్ మీద మాత్రమే కాదు, ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపైనైనా చర్యలు తీసుకోవచ్చు. ధర్మ సంసద్ ప్రసంగాలతో కాంగ్రెస్ నాయకులు విభేదిస్తే, వారెందుకు దానికి హాజరయ్యారు?" అని బీజేపీ నేత సచ్చిదానంద ఉపాసనే ప్రశ్నించారు.
ధర్మ సంసద్ ప్రధాన పోషకుడు మహంత్ రాంసుందర్ దాస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కాళీచరణ్ ప్రసంగం తరువాత అక్కడి నుంచి నిష్క్రమించారు.
కాంగ్రెస్ నాయకుల సమక్షంలోనే ఆ కార్యక్రమంలో ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయని, తన ముందే అత్యంత ద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పటికీ రాంసుందర్ దాస్ జోక్యం చేసుకోలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి బీబీసీకి చెప్పారు.
ఈ మొత్తం కార్యక్రమం ద్వేషపూరిత ప్రసంగాల కోసమే నిర్వహించారన్నది బహిరంగ రహస్యమేనని ఆయన అన్నారు. 'భారతదేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చడమే ఈ చర్చ అజెండా' అని రాసి ఉన్న కరపత్రాలను ఆయన బీబీసీకి చూపించారు.
కార్యక్రమంలో ఇతర వక్తల మాటలను ఎందుకు ఖండించలేదని రాంసుందర్ దాస్‌ను బీబీసీ అడిగినప్పుడు, ఆయన ఆ ఈవెంట్‌తో తనకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు.
గాంధీకి వ్యతిరేకంగా కాళీచరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించినట్లే, ముస్లింలకు వ్యతిరేకంగా ఇతరులు చేసిన ప్రసంగాలను ఖండిస్తారా అని రాంసుందర్ దాస్‌ను బీబీసీ అడిగింది.
"హరిద్వార్, రాయ్‌పూర్‌లలో ప్రసంగాలు చేసినవారిని మీరు ఈ ప్రశ్నలు అడగాలి. నేను, నా గురించి మాత్రమే చెప్పగలను" అని ఆయన జవాబిచ్చారు.

ఫొటో సోర్స్, Alishan Jafri
బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన కాంగ్రెస్
కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టారు. బీజేపీ మత విద్వేషాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
"బీజేపీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, నేరస్థులపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఊరుకోదు" అని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ లీడర్ ఆర్‌పీ సింగ్ చెప్పారు.
ఎన్నికలకు ముందు బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఆరోపించారు.
ఏది ఏమైనప్పటికీ, మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసినవారిపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
"విద్వేషాలను రెచ్చగొట్టేవారికి ప్రోత్సాహం అందిస్తూ ఉద్రిక్తతలను సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నది స్పష్టం. కాళీచరణ్ సానుభూతిపరులు, ద్వేషాన్ని చిమ్మే ఇతరులపై చర్యలు తీసుకోవాలని ఎలా కోరుకుంటారు?" అని లాంబా అన్నారు.
నరసింహానంద మద్దతుదారు వికాస్ సెహ్రావత్ నుంచి తనకు వచ్చిన బెదిరింపులను లాంబా గుర్తుచేసుకున్నారు. ఆమె ఫిర్యాదులతో వికాస్‌ను కొంతకాలం జైల్లో పెట్టారు.
ద్వేషపూరిత నేరాలకు సంబంధించిన వీడియోలు, ముఖ్యంగా కవార్ధాలో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి సంబంధించిన పలు వీడియోలు ఇటీవల బయటికొచ్చాయి.
ముస్లింలను బహిష్కరిస్తామని వందలాది సుర్గుజా గ్రామస్థులు ప్రమాణం చేస్తున్న వీడియో 2021 జనవరిలో బయటికొచ్చింది.
"రాష్ట్రంలో మైనారిటీలపై హిందుత్వవాదుల హింస పెరిగింది. మితవాద హిందుత్వ రాజకీయాలతో సంబంధం ఉన్న 'జాతీయవాద' విద్వేష శక్తులకు ప్రభుత్వం ఉచిత పాస్ ఇచ్చింది. బీజేపీ పట్ల వారి వ్యతిరేకత సైద్ధాంతికంగా ఉండాలి" అని యాక్టివిస్టు అలోక్ శుక్లా అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









