ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన యతి నరసింహానందను ఇంకా జైల్లో ఎందుకు పెట్టలేదు?

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA/BBC
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి, డాస్నా, ఘాజియాబాద్
"ఇస్లాంను ఈ నేలపైన లేకుండా నలిపి పారెయ్యాలి... ముస్లింలందరినీ ఖతం చేయాలి"
"ఈరోజు మనం ముస్లింలుగా పిలుస్తున్న వాళ్లను గతంలో రాక్షసులని పిలిచేవారు."
"Islam is an organised gang of criminals. మహిళల వ్యాపారమే ఆ గ్యాంగ్‌కు పునాది. మహిళలను నాశనం చేయటమే పునాది. కాఫిర్లకు చెందిన మహిళలను వశపర్చుకోవడం దానికి అతి పెద్ద పునాది."
పై విద్వేష ప్రకటనలు చేసిన వ్యక్తి పేరు యతి నరసింహానంద సరస్వతి. ఘాజియాబాద్ జిల్లా, డాస్నా పట్టణంలోని దేవి మందిరానికి 'పీఠాధీశుడైన' యతి నరసింహానంద సరస్వతి.. ఇప్పుడు జూనా అఖాడాకు మహామండలేశ్వరుడిగా కూడా ఉన్నారు.
దేవి మందిరం గేటు బయట పెద్ద పెద్ద అక్షరాల్లో 'ఇందులో ముస్లింలు అడుగుపెట్టడం నిషిద్ధం' అని రాసి ఉంటుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఒక ట్వీట్ చేసినా, రిపోర్టింగ్ చేసినా, లేదా ఆఖరుకు సీఏఏకు వ్యతిరేకంగా ఒక పోస్టర్ వేసినా సరే అరెస్టులు జరిగిపోతాయి. మరి అలాంటప్పుడు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని ఎడతెగకుండా ఎగదోస్తున్న యతి నరసింహానంద సరస్వతిని ఇప్పటి వరకూ ఎందుకు జైళ్లో పెట్టలేదు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
రోజురోజుకూ పెరిగిపోతున్న హిందుత్వవాద నేతల్లో యతి నరసింహానంద సరస్వతి అందరికన్నా ఎక్కువగా చర్చల్లో ఉన్న పోస్టర్ బాయ్ అని చెప్పొచ్చు.
ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన కొన్నేళ్లుగా చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు జనాలకు చేరుతూనే ఉన్నాయి.
జూనా అఖాడాలో మహామండలేశ్వర్ అయిన నరసింహానందపైన డాస్నాలోని దేవి ఆలయాన్ని, దానికి చెందిన భూమిని తన సొంతాస్తిలా వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అయితే, ముస్లింలు ఎక్కువగా ఉండే డాస్నాలో యతి నరసింహానంద ప్రసంగాలను ఎవరూ పెద్దగా పట్టించుకోరని స్థానికులు అంటారు. కానీ, ఆయన ప్రసంగాలతో హిందూ, ముస్లింల మధ్య ధ్రువీకరణ పెరిగిపోయిందని ఘాజియాబాద్ పోలీసు శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి అన్నారు.
కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతుండగా, అనేక ప్రాంతాల్లో మతాలవారీగా ధ్రువీకరణ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఘాజియాబాద్ జిల్లాలోని ఈ పట్టణంలో జరుగుతున్న పరిణామాల ప్రభావం జిల్లా సరిహద్దుల వరకే పరిమితమై లేదు. ఉత్తర్‌ప్రదేశ్ అంతటా ఇది స్పష్టంగా కనిపిస్తోంది.
ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనలో నాతో మాట్లాడిన చాలా మంది ముస్లింలు నరసింహానంద సరస్వతి 'విషపూరిత భాష' పట్ల ఆందోళన వెలిబుచ్చారు. కానీ యోగి రాజ్యంలో ఆయన్ను అడ్డుకునే వారే లేకుండా పోయారు. మరి ఎందుకిలా?
ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో నరసింహానంద ఇలా అన్నారు.
"...ముస్లింలను చంపడానికి ఖడ్గాలు అవసరం లేదు. ఎందుకంటే ఖడ్గాలతో వాళ్లను మీరు చంపలేరు. టెక్నిక్‌లో మీరు వారిని దాటేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది."
ఈ ధర్మ సంసద్‌లో ముస్లింలను నరమేధం చేయాలని ఆయన బాహాటంగానే పిలుపునిచ్చారనే ఆరోపణలున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై బాగా దుమారం లేవడంతో ఉత్తరాఖండ్ పోలీసులు ధర్మ్ సంసద్‌లో చేసిన విద్వేష ప్రసంగాల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.
అయితే, ఎఫ్ఐఆర్‌లో యతి నరసింహానంద పేరును ఆ తర్వాత చేర్చారు. ఆయన పేరును ముందే ఎఫ్ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదు అన్న విషయంపై పోలీసులు ఏమీ వివరణ ఇవ్వలేదు.

యతి నరసింహానందపై ఏయే కేసులున్నాయి?
యతి నరసింహానందపై ముందు నుంచే ఎన్నో ఎఫ్ఐఆర్‌లు, కేసులు నమోదై ఉన్నాయి.
ఆయన తరఫు న్యాయవాది, డాస్నాలోని దేవి మందిరానికి చెందిన మహంత్ మా చేతనానంద సరస్వతి తెలిపిన వివరాల ప్రకారం, యతిపై దాదాపు రెండు డజన్ల కేసులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. కొన్నింట్లో చార్జిషీట్ నమోదైంది. కొన్ని కేసుల్లో హైకోర్టు స్టే విధించింది. మరికొన్ని కేసుల్లో విచారణ జరుగుతోంది.
ఉత్తరాఖండ్‌లో యతి నరసింహానందపై 153-ఏ, 295-ఏ సెక్షన్ల కింద కేసు విచారణ జరగాల్సి ఉంది. 153-ఏ అంటే సముదాయాల మధ్య మతం, భాష ఆధారంగా విద్వేషాన్ని వ్యాపింపజేయటం, సెక్షన్ 295-ఏ అంటే, మత భావనలను దెబ్బతీయడం లేదా దెబ్బతీసేందుకు ప్రయత్నించడం.
ఘాజియాబాద్ పోలీసులు 10 కేసులకు సంబంధించిన వివరాలు అందించారు. ఆ వివరాల ప్రకారం నరసింహానందపైన ఐటీ యాక్ట్‌తో పాటు ఐపీసీ సెక్షన్లు 306, 307, 395 వంటి వాటిల్లో కేసులు నమోదై ఉన్నాయి.
సెక్షన్ 306 అంటే ఎవరినైనా ఆత్మహత్యకు పురికొల్పడం. సెక్షన్ 307 అంటే హత్యాయత్నం, 395 అంటే దోపిడీ.
ఘాజియాబాద్ పోలీసుల నుంచి లభించిన సమాచారాన్ని మేం సీనియర్ న్యాయవాది రాజేశ్ త్యాగికి చూపించాం. యతి నరసింహానంద సరస్వతి చేసిన ప్రసంగాలపైనా, అలాగే ఇతర కేసుల్లోనూ పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల గురించి తన అభిప్రాయం ఏంటో చెప్పమని కోరాం.
హరిద్వార్ హేట్ స్పీచ్ కేసులో సుప్రీంకోర్టుకు లేఖ రాసిన 76 మంది న్యాయవాదుల్లో మీరఠ్‌కు చెందిన రాజేశ్ త్యాగి కూడా ఒకరు.

తాను ఆయన వీడియోలన్నీ చూస్తున్నానని రాజేశ్ త్యాగి అన్నారు. నరసింహానంద ఉపయోగిస్తున్న భాషను చూస్తే 'పోలీసులు ఒక రకంగా ఆయనను ఇష్టారాజ్యంగా నడచుకోనిచ్చారు' అనిపిస్తోందంటారు రాజేశ్ త్యాగి.
త్యాగి ఇలా అన్నారు, 'ఆయనపై దోపిడీ, హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో కొన్ని నేరాలు పునరావృతం కూడా అయ్యాయి. అలాంటప్పుడు ఈ కేసులన్నింట్లో ఆయనకు బెయిల్ ఎలా లభించిందో నాకర్థం కావడం లేదు. నిజానికి, ఆయన బెయిల్‌ను ఎప్పుడో రద్దు చెయ్యాల్సింది.'
'ఈయనకు ప్రభుత్వం నుంచే నేరుగా మద్దతు లభిస్తోంది. ఈయనను పోలీసులు ఏమీ అనటం లేదు. అధికారులు ఏమీ అనటం లేదు. కేసులు పెట్టారు, వదిలేశారు.. అంతే. కాబట్టి ఆయన నిర్భయంగా ఉన్నారు.'
సమాజంలో ఈ విధంగా విష బీజాల్ని నాటుతూ పోతే, చాలా పెద్ద ఎత్తున నరమేధాలు జరిగే ప్రమాదం ఉంటుందని రాజేశ్ త్యాగి అంటారు.
'ఈ కేసులో నేరుగా యూఏపీఏ చట్టాన్ని వర్తింపజేయాలి. కానీ పోలీసులు ఈయనపై యూఏపీఏ పెట్టడం లేదు. హరిద్వార్ కేసులోనూ యూఏపీఏ పెట్టలేదు. ఇది నేరుగా యూఏపీఏ కిందకు రావాల్సిన కేసే తప్ప మరొకటి కాదు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్, వీడియో సాక్ష్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి.'

అయితే, యతి నరసింహానంద సరస్వతిపై జరుగుతున్న విచారణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లూ లేవని ఘాజియాబాద్ ఎస్ఎస్‌పీ పవన్ కుమార్ బీబీసీతో అన్నారు.
ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ రేంజ్ డీఐజీ కరణ్ సింగ్ నాగన్యాల్ కూడా బీబీసీతో ఈ మాటే అన్నారు. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లూ లేవన్న కరణ్ సింగ్... యతి నరసింహానంద పట్ల తాము 'సాప్ట్'గా ఏమీ లేమని అన్నారు.
ఈ కేసులో ఏర్పాటైన ఎస్ఐటీ నివేదిక ఎప్పటి రావొచ్చనే విషయంలో స్పష్టమైన జవాబు చెప్పని కరణ్ సింగ్, 'వీలైనంత త్వరగా సాక్ష్యాలు సేకరించి ఫైనల్ చార్జిషీట్ ఫైల్ చేస్తాం' అన్నారు.
యతి నరసింహానంద సరస్వతికి దగ్గరి అనుచరుడైన అనిల్ యాదవ్ దేవి మందిర ప్రాంగణంలో ఉన్న ఒక హాల్‌లో బీబీసీతో మాట్లాడారు. ఈయనను 'చిన్న నరసింహానంద' అని కూడా పిలుస్తుంటారు. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు, 'కేసులకు లెక్కే లేదు. వరుసగా నమోదవుతూనే ఉంటాయి. ఇబ్బందేం లేదు. నిజానికి అవి మాకు ఆభరణాల్లాంటివి.'
విచారణ జరగకపోవడానికి ఒకే కారణమని ఆయనంటారు. 'గురూజీ ఎలాంటి నేరం చేయలేదు, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదు.'
ఘాజియాబాద్ పోలీసులు చెబుతున్న ప్రకారం, యతి నరసింహానందపై నమోదైన 13 కేసుల్లో సగానికి పైగా చార్జిషీట్స్ ఫైల్ చేశారు.
యతిపైన గూండా యాక్ట్ పెట్టడానికి సంబంధించిన కేసు జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ రాకేశ్ కుమార్ సింగ్‌తో ఫోన్ ద్వారా మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా ఆయన కాంటాక్ట్‌లోకి రాలేదు. ఆయనకు సందేశాలు పంపించినప్పటికీ ఎలాంటి జవాబూ రాలేదు.
అంటే, ఆయనపై చాలా కేసులు నడుస్తున్నాయి. అలాగే, దిల్లీ ప్రెస్ క్లబ్‌లో, దిల్లీ అల్లర్ల సందర్భంగా ఆయన చేసిన విద్వేషం నిండిన రెచ్చగొట్టే ప్రసంగాలతో మతసామరస్యం దెబ్బతినే ప్రమాదాలున్నప్పటికీ ఆయన చేస్తున్న ముస్లిం వ్యతిరేక ప్రకటనలన్నీ ప్రజలకు చేరుతూనే ఉన్నాయి.

రాజకీయ ప్రాపకం?
యతి నరసింహానందకు వ్యతిరేకంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడానికి ఆయనకు యోగి ప్రభుత్వం నుంచి లభిస్తున్న రాజకీయ ప్రాపకమే కారణమని ఘాజియాబాద్‌కు చెందిన ఒక పోలీసు అధికారి అన్నారు.
తన పేరును వెల్లడి చేయకూడదనే షరతుపై బీబీసీతో మాట్లాడిన ఆ అధికారి, 'ఆయనకు వ్యతిరేకంగా ఏదీ చెయ్యొద్దని పై నుంచి మాకు స్పష్టమైన సంకేతాలున్నాయి' అన్నారు. యతిపై నమోదై ఉన్న కేసులు ముందుకు వెళ్లే అవకాశాలు ఏ మాత్రం లేవన్న అధికారి, ఇది తనకే ఎంతో దారుణంగా అనిపిస్తోందన్నారు.
కోర్టుల్లో ఉన్న కేసులకు సంబంధించి, ఏడాదిలో ఒకటి లేదా రెండుకన్నా ఎక్కువ పేషీలు లేకుండా యతి నరసింహానంద తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తారని ఆ అధికారి చెప్పారు. పేషీలు చాలా ఎక్కువ గడువుతో ఉండేలా వారు చూస్తారని, దాంతో న్యాయప్రక్రియ ముందుకు సాగదని ఆయనన్నారు.
యతి నరసింహానందపైన గూండా యాక్ట్‌ను అమలు చేయడంలో మెతకగా వ్యవహరిస్తున్నారన్న విషయంలో ఘాజియాబాద్‌కు చెందిన మరొక పోలీసు అధికారి తన అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్నారు. తాను సిస్టమ్‌లో చాలా చిన్న భాగాన్నని చెప్పిన ఆయన, సిస్టమ్ ఎవరినైనా కాపాడాలనుకుంటే దానికి తగిన మార్గాలు కూడా కావాల్సినన్ని ఉంటాయన్నారు.
రాజకీయ ప్రాపకం లేదా కోర్టు కేసులు సుదీర్ఘకాలంగా వాయిదా పడుతున్నాయన్న ఆరోపణలపై యతి నరసింహానంద సరస్వతి తరఫు న్యాయవాది, డాస్నా దేవి మందిరానికి చెందిన మహంత్ మా చేతనానంద సరస్వతి ఇలా ఎదురు ప్రశ్న వేస్తారు, 'కోర్టుల్లో రాజకీయ ప్రాపకం ఎలా పని చేస్తుందో మీరే చెప్పండి.'
హేట్ స్పీచ్‌కు సంబంధించిన కేసులు రాజకీయ దురుద్దేశాలతో పెట్టినవే అని ఆమె అంటారు. 'ఆరోగ్యం బాగా లేదని మేం ఎన్నిసార్లు అప్లికేషన్ మూవ్ చేయగలుగుతాం? (పదే పదే అలా చేస్తే) కోర్టు నాన్-బెయిలబుల్ వారంట్ ఇష్యూ చేస్తుంది కదా.'
యతి నరసింహానంద సరస్వతికి భావజాలపరమైన వారసుడినని చెప్పుకునే అనిల్ యాదవ్ మాత్రం 'గూరూజీ, యోగీజీల మధ్య మంచి సంబంధాలున్నాయి' అని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించలేదు.
'గురూజీ'ని పూజ్యులుగా భావించే బీజేపీ నేతలు చాలా మందే ఉన్నారని ఆయనంటారు. అయితే, చాలా సార్లు రాజకీయ లాభనష్టాల గుంజాటనలో పడి వారు ముందుకు రారని ఆయన అభిప్రాయం.

బీజేపీ నేత కపిల్ మిశ్రా పేరును ప్రస్తావిస్తూ, ఆయన తరచూ ఇక్కడికి వస్తూ ఉండేవారని అనిల్ యాదవ్ చెప్పారు. కానీ ఒక ట్వీట్ తర్వాత ఆయన దూరమయ్యారన్నారు. 'బహుశా అది పార్టీపరంగా తలెత్తిన అనివార్యత కావచ్చు' అన్నారు.
బీజేపీ నేత కపిల్ మిశ్రాకు యతి నరసింహానంద వ్యాఖ్యలతో ఎప్పుడూ ఇబ్బంది కలుగలేదు. 2021 ఏప్రిల్‌లో యతి కోసం ఆయన చందాలు కూడా వసూలు చేశారు.
బీబీసీతో మాట్లాడిన కపిల్ మిశ్రా, దీనికి జవాబుగా ఇలా అన్నారు, "యతిపైన కొందరు దాడి చేస్తామని అన్నప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా ఫత్వాలు జారీ అయినప్పుడు.... ఒక వ్యక్తిని చంపేస్తామంటూ ఇలా బాహాటంగా బెదిరింపులకు పాల్పడ్డప్పుడు, ఆయనకు కూడా కమలేశ్ తివారీ లాంటి పరిస్థితి ఎదురు కావొద్దనే, నేను ఆయనకు భద్రత కల్పించాలని కోరాను.
అందుకోసం మేం ఫండ్ వసూలు చేశాం. ఆయన భద్రత కోసం మేం 50 లక్షలు సేకరించి ఇచ్చాం. ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొన్ని నాకు బాగా అనిపించలేదు. ముఖ్యంగా మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు. అప్పుడు నేను 'మందిరంలో కూర్చునే వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయడం తగద'ని అన్నాను. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్లడం, కలవడం ఆపేశాను."
కపిల్ మిశ్రా ఇంకా ఏమంటారంటే, 'ఇక పార్టీ విషయానికొస్తే, పార్టీలో ఇలాంటి విషయాలపై ఎలాంటి చర్చా జరగదు. పార్టీలో చాలా ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి. ఇలాంటి విషయాలపై పార్టీలో ఏ స్థాయిలోనైనా సరే చర్చ జరుగుతుందని నేననుకోను.'
యతి నరసింహానందకు సంబంధించిన ఏ కేసులోనూ ప్రభుత్వ జోక్యం లేదని ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠీ అన్నారు. 'ఉత్తరప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక, పోలీసులకు పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా సరే, ఆ వ్యక్తి పచ్చ బట్టలు తొడుక్కున్న వాడైనా లేదా కాషాయ బట్టలు తొడుక్కున్న వాడైనా, ఎవరైనా సరే, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా సరే.. ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాల్సిందే' అన్నారు రాకేశ్ త్రిపాఠీ.
మత సామరస్యానికి భంగం వాటిల్లజేసే ఎలాంటి విచ్ఛిన్నకర వ్యాఖ్యనైనా సరే ప్రభుత్వం ఖండిస్తుందని రాకేశ్ త్రిపాఠీ చెప్పుకొచ్చారు.
అయితే, ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా చాలాసార్లు ముస్లింలను టార్గెట్ చేస్తూ విచ్ఛిన్నకరమైన భాషను ఉపయోగించారు. ఉదాహరణకు, 'అబ్బాజాన్', 'అలీ ఔర్ బజరంగ్‌బలీ' లాంటి వ్యాఖ్యలు.

అంతేకాదు, హిందువులు, ముస్లింలు వేర్వేరు సంస్కృతులకు చెందిన వారని, వారు కలిసి జీవించలేరనే వ్యాఖ్యలు కూడా యోగి గతంలో ఓ ప్రసంగంలో భాగంగా చేశారు.
మరోవైపు, తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పుకునే 'చిన్న యతి' అనిల్ యాదవ్.. యతి మద్దతుదారులందరూ యోగి ఆదిత్యనాథ్ తరఫున తప్పక ప్రచారం చేస్తారని చెప్పారు.
'బీజేపీలో ఒకే నేత ఉన్నారు. ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్' అన్నారు అనిల్ యాదవ్.
నరేంద్ర మోదీపై వ్యాఖ్యానిస్తూ ఆయనిలా అన్నారు, 'మాననీయులైన మోదీ గారు ముస్లింల కోసం ఎన్నో ద్వారాలు తెరిచారు. తన పదేళ్ల కాలంలో వారిని చాలా శక్తిమంతులుగా కూడా మార్చారు.'
యతి నరసింహానంద, ఆయనతో పాటు కలిసి పని చేస్తున్న టీమ్ అందరూ ఉగ్ర హిందుత్వవాద అజెండాను చేపట్టారు. వారు 'హిందూ జాతిని, హిందూ వారసత్వాన్ని(హిందూ నసల్ ఔర్ ఫసల్)' కాపాడుకోవాలని పిలుపునిస్తున్నారు.
డాస్నా మందిరంలో నాలుగు వైపులా పోస్టర్లు వేసి ఉన్నాయి. వాటిలో ఒక పోస్టర్‌పైన హిందువులు కనీసం ఐదుగురు పిల్లలను కనాలని, అప్పుడే హిందూ మతం నిలిచి ఉంటుందని రాసి ఉంది.
మతతత్వ వ్యాప్తి, ప్రభుత్వ ఖర్చుతో ఆలయ భద్రత
డాస్నాలో 80 శాతానికి పైగా జనాభా ముస్లింలదే. వీరిలో అత్యధికులు చిన్న, చిన్న పనులు చేసుకునే వారే. వ్యవసాయం లేదా ఇతర కూలీ పనులు చేసే వాళ్లే ఎక్కువ.
స్థానికులతో మాట్లాడినప్పుడు హిందూ, ముస్లింల మధ్య అపనమ్మకాలు, అనుమానాలు, దూరాలు ఎలా పెరుగుతున్నాయో అర్థమవుతుంది. అయితే ఈ భావనలు ఎప్పటి నుంచి రూపు దిద్దుకుంటున్నాయి, ఇప్పుడు ఎంతగా వేళ్లూనుకున్నాయి అనేది తెలుసుకోవడం అంత సులువైందేమీ కాదు.

కాంగ్రెస్ నేత సతీశ్ శర్మ నివాసం మందిరానికి ఎదురుగా ఉంటుంది. ఆయన పుట్టింది డాస్నాలోనే. ఇతరుల లాగానే ఆయన బాల్యం కూడా మందిరంలో ఆడుతూ, పాడుతూ గడిచింది. దాన్ని శుభ్రం చేసేందుకు, వ్యాయామం చేసేందుకు ఆయన ఆలయంలోకి వెళ్తుండేవారు.
ఇంటి ముందు అప్పుడే పర్చుకుంటున్న ఉదయపు నీరెండలో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొన్న సతీశ్ శర్మ ఏమంటారంటే, 'నేను పార్టీలో తర్వాత చేరాను. నేను ముందుగా కట్టర్ హిందువునే, కానీ హిందుత్వవాదిని మాత్రం కాదు.'
ఈ విధానసభ ఎన్నికల్లో తనకు పార్టీ టికెట్ లభిస్తుందనే ఆశతో ఉన్నారు సతీశ్ శర్మ.
డాస్నాను గంగా-జమునా తెహజీబ్ (గంగా-యమునా సంస్కృతి)కి ప్రతీక అని చెబుతారు సతీశ్ శర్మ. 'ఇక్కడ హిందువులు, ముస్లింలు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు తోడుగా నిలబడతారు. కలిసి మందిరాలకు వెళ్తుంటారు. 1947లో గానీ, 1992లో గానీ ఎప్పుడూ ఇక్కడ మతం ఆధారంగా అల్లర్లు జరగలేదు.'
మొదట్లో రాజస్థాన్ నుంచి, మరి కొన్ని చోట్ల నుంచి ముస్లింలు డాస్నా ఆలయంలో నైవేద్యం సమర్పించడానికి వస్తుండేవారని ఆయన చెప్పారు.
సతీశ్ శర్మకు సన్నిహితుడు, డాస్నా నివాసి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సాజిద్ హుసేన్.. మందిరంలో జరిగే దసరా పూజ కోసం తాము డబ్బు ఇచ్చేవారిమని, ఛఠ్ పూజలో పాల్గొనేవారిమని అన్నారు.
కానీ ఇవాళ మందిరంలోకి ముస్లింలు ప్రవేశించడం నిషిద్ధం. మందిరంలో అడుగుపెట్టడానికి ముందు ఐడెంటిటీ కార్డు చూపించాల్సి ఉంటుంది. వెళ్లేవారి వివరాలన్నీ గేటు దగ్గరుండే పోలీసులు రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
యతి నరసింహానంద ప్రాణాలకు ముప్పుందని పోలీసులంటారు. అందుకోసమే ఆలయంలో 22-28 మంది పోలీసు సిబ్బంది అనుక్షణం కాపలాగా ఉంటారు. దీని కోసం ప్రభుత్వం నెలకు 25-30 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది.

సతీశ్ శర్మ ఇలా అంటారు, 'ఇక్కడ తయారవుతున్న విద్వేషపూరిత వాతావరణం పరస్పర ప్రేమ, సౌహార్దతలను దెబ్బతీస్తోంది. ఇప్పుడు ముస్లింలు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. ఇటువైపు రాకుండానే ఉండిపోతున్నారు.'
డాస్నా దాటి ముందుకు వెళ్తే ఇక్లా, రఘునాథ్‌పూర్ గ్రామాలు వస్తాయి. ఆ గ్రామాల్లో కొందరు హిందువులతో మాట్లాడినపుడు, మందిరంలోకి యతి నరసింహానంద రాక ముందు మందిరం లోపల, బయటా ముస్లిం యువకులు హిందూ యువతులను వేధించేవారని, మందిరంలో చోరీలకు పాల్పడేవారని, కానీ ఇప్పుడు అంతా బాగుపడిందని అన్నారు.
ఈ సమాచారం వారికి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో స్పష్టత లేదు. రఘునాథ్‌పూర్ గ్రామానికి చెందిన మతన్‌వతి అనే మహిళ, 'ఇలాంటి పనులు హిందూ యువకులు చేయరు. ఇలాంటి పనులు చేసేది ముస్లింలే. ఈ ప్రాంతమంతా ముస్లింలదే' అన్నారు.
వాళ్లు అక్కడా, ఇక్కడా విన్న మాటల్ని చెబుతున్నారా, లేదా వేధింపులు ఎదుర్కొన్న మహిళ ఎవరితోనైనా మాట్లాడిస్తారా అని అడిగినపుడు దానికి ఎలాంటి జవాబూ రాలేదు. లేదా తమ ఆడబిడ్డలపై జరిగిన వాటి గురించి ఏ కుటుంబం అయినా ఎలా ముందుకొచ్చి మాట్లాడుతుంది అనే జవాబిచ్చారు.

గతంలో మందిరం లోపల ముస్లిం యువకులు వేధింపులకు పాల్పడ్డప్పుడు లేదా కొట్లాటలు జరిగినప్పుడు తాను స్వయంగా అందులో ఉన్నానని ఒక హిందూ వ్యక్తి చెప్పాడు.
ఇక్లా గ్రామానికి చెందిన వికాస్ గూజర్ ఏమంటారంటే, 'మేం వాళ్ల మసీదుల్లోకి వెళ్లం. వాళ్లు మమ్మల్ని అందులోకి రానివ్వరు కూడా. అందులో కూర్చొని మీరు హనుమాన్ చాలీసా చదవగలరా చెప్పండి? గురుగ్రామ్‌లో గురుద్వారాల్లోకి లేదా మందిరాల్లోకి పిలిపించి నమాజ్ చేయిస్తున్నారు లేదా దుర్గా పండాల్‌లలో నమాజ్ చేయిస్తున్నారు. మరి వాళ్లు మమ్మల్ని హనుమాన్ చాలీసా చదవనిస్తారా?'
రోడ్డు పక్కన దుకాణం నడుపుకునే నరేంద్ర శర్మ దృష్టిలో యతి నరసింహానంద మందిరంలోకి రావడం ద్వారా 'హిందువులు జాగృతులయ్యారు, ఐక్యమయ్యారు'.
మరి కొంచెం ముందుకు వెళ్లగా, కొందరు హిందూ మహిళలు దీనికి పూర్తిగా భిన్నమైన విషయం చెప్పారు. మందిరం లోపల వేధింపులు ఘటనలు ఇప్పుడే జరుగుతున్నాయని, గతంలో జరిగేవి కావని వారన్నారు.
పక్కనే ఉన్న బాజీగ్రాన్ వీధిలో ఒక ముస్లిం వ్యక్తిని యతి నరసింహానంద వీడియో గురించి అడిగినపుడు, యతి 'పిచ్చివాడని' ఆయన జవాబిచ్చారు.
'ఇలాంటి ఉల్టా, సీధా మాటలు మాట్లాడే వాళ్లను పిచ్చివాళ్లనే అంటారు. ఆయన ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఇక్కడ అందరూ కలిసిమెలిసే ఉంటారు' అన్నారాయన.

ఈ వీధిలో ఇంట్లో అద్దెకు ఉండే ఒక ముస్లిం పిల్లవాడు గత ఏడాది మార్చిలో నీళ్లు తాగటం కోసం దేవి మందిరం లోపలికి వెళ్లగా, అతన్ని దారుణంగా కొట్టారు.
ఇప్పుడు ఆ పిల్లవాడి కుటుంబం ఇల్లు ఖాళీ చేసే వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.
ప్రాచీన దేవి మందిరం చుట్టుపక్కల ముస్లిం జనాభానే ఎక్కువగా ఉంటుంది. ఆ పరిసరాల్లో ఉండే చాలా మంది హిందువులు తమ మాటల్లో తమ జనాభా తక్కువ అనే విషయాన్ని ప్రస్తావించారు.
వారి సంభాషణలతో, హావభావాలతో అర్థమైందేంటంటే, జనాభా తక్కువగా ఉన్నందున వారు అభద్రత భావానికి లోనవుతున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం ఘాజియాబాద్ జిల్లా జనాభాలో 82.5 శాతం హిందువులు కాగా, 14.18 శాతం ముస్లింలు.
మందిరం చరిత్ర, యతి నరసింహానంద ప్రవేశం
ప్రభుత్వ దస్తావేజుల్లో ఆలయ భూమి మందిరం పేరుతోనే ఉంది. అయితే, మందిరానికి సంబంధించి ఎన్నో కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ మందిరానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పూర్వకాలంలో గంగానదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లే వారు దారిలో ఈ మందిరంలో రాత్రి బస చేసేవారని విన్నట్టుగా కాంగ్రెస్ నేత సతీశ్ శర్మ అంటారు.
మందిరం పక్కన ఉన్న చెరువులో స్నానం చేస్తే చర్మరోగాలు పోతాయన్నది మరో నమ్మకం.

చెరువు పక్కనున్న శివాలయంలో శివలింగాన్ని స్వయంగా పరుశురాముడే స్థాపించాడని ఈ మందిరానికి చెందిన అనిల్ యాదవ్ అంటారు.
ఇంకా ఈ మందిరానికి సంబంధించి, లంకాధీశుడైన రావణుడి తండ్రి అనేక ఏళ్ల పాటు ఇక్కడే తపస్సు చేశాడని, స్వయంగా రావణుడు కూడా ఇక్కడ పూజలు నిర్వహించాడని కూడా చెప్పేవాళ్లున్నారు.
అంతేకాదు, మహాభారత యుద్ధానికి ముందు కుంతి, పంచ పాండవులు లక్క ఇంటిలోంచి క్షేమంగా తప్పించుకున్న తర్వాత ఇక్కడే కొంత కాలం రహస్య జీవితం గడిపారని కూడా చెబుతుంటారు. ఈ ప్రాచీన ఆలయానికి సంబంధించి డాస్నాలో ఇలా చాలా నమ్మకాలున్నాయి.
యతి నరసింహానంద సరస్వతి ఈ మందిరంలోకి రావడానికి ముందు చాలా ఏళ్ల పాటు మౌనీ బాబా అనే పూజారి మందిర కార్యకలాపాలు చూస్తుండేవారు.
2005లో ఆలయంలోకి జొరబడ్డ దొంగలు మౌనీ బాబాను కొట్టారని స్థానికులు చెబుతుంటారు. దాంతో కొంత కాలం తర్వాత ఆయన మందిరాన్ని వదలి వెళ్లిపోయారు.
ఆ తర్వాత మౌనీ బాబా శిష్యుడినని చెప్పుకున్న గణేశ్ శర్మ ఎలియాస్ గణేశ్ గిరి ఈ మందిర కార్యకలాపాలు చేపట్టారు. కానీ ఆ తర్వాత ఆయన కూడా దేవి మందిరాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయారు.
దేవి మందిరానికి పూజారి ఎవరూ లేని స్థితిలో, 2007లో యతి నరసింహానంద సరస్వతి ఇక్కడికి మహంత్‌గా వచ్చారని అనిల్ యాదవ్ చెప్పారు.

సన్యాసం పుచ్చుకోవడానికి ముందు యతి నరసింహానంద పేరు దీపక్ త్యాగి.
దీపక్ త్యాగి మాస్కోలో చదివారని, ఆయన చివరగా లండన్‌లో ఉద్యోగం చేశారని అనిల్ యాదవ్ అంటారు.
ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1998లో సమాజ్‌వాదీ పార్టీ మహానగర అధ్యక్షుడయ్యారు. కానీ ఆయన 'లవ్ జిహాద్'కు గురైనట్టుగా చెప్పుకున్న ఒక యువతికి సాయం చేయలేకపోవడంతో చాలా బాధపడ్డారని అంటారు అనిల్ యాదవ్.
మతం మార్చుకుంటున్నాని చెప్పి ఆయన కొంత కాలం మసీదుల వెంట, మదర్సాల వెంట తిరిగారని అనిల్ యాదవ్ అంటారు. 'దాంతో ఆయన మనసు పూర్తిగా మారిపోయింది.'
1999-2000 సంవత్సరంలో దీపక్ త్యాగి సన్యాసం తీసుకున్నారు.
బీజేపీ పార్లమెంటు సభ్యుడు బీఎల్ శర్మ ప్రేమ్‌ను కలిశాక ఆయన 'సంపూర్ణ హిందూవాది'గా అయ్యారు. మందిరంలో బీఎల్ శర్మ విగ్రహం ఉంటుంది. యతి నరసింహానంద ఆయనను తన గురువుగా భావిస్తారు.

ఆలయ భూమి, ట్రస్ట్
ఈ కథ ఇక్కడితోనే పూర్తవదు.
దేవి ఆలయం నిర్మాణమైన భూమి వాస్తవానికి తమ కుటుంబానికి చెందిందని ఘాజియాబాద్‌లో నివసించే జిందల్ కుటుంబం చెప్తోంది. దాదాపు 500-1000 ఏళ్ల కింద తమ పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఈ కుటుంబం అంటోంది. దేవి మందిర ట్రస్ట్ ఈ ఆలయ నిర్వహణను చూసుకుంటూ ఉండేది.
మొదట్లో ఈ భూమిలో సేద్యం జరుగుతుండేదని, పక్కనున్న చెరువు నుంచి పొలాలకు నీరందేదని గౌరవ్ జిందల్ చెప్పారు. వృత్తిరీత్యా గౌరవ్ న్యాయవాది.
ఒక రోజు చెరువులోంచి ఓ రాతి విగ్రహం బయటపడిందని, అది మాత విగ్రహం అని, దాని కోసమే ఆలయాన్ని నిర్మించారని గౌరవ్ చెబుతారు.
ఆలయ చరిత్రలో పాండవులను, రావణున్ని జోడించడం కేవలం పుకార్లేనని గౌరవ్ అంటారు.

యతి నరసింహానంద సరస్వతి మొదట్లో హిందూ మహాసభతో సంబంధాలు కలిగి ఉండేవారని, డాస్నాకు చెందిన ఒక వ్యక్తి ఆయనను దేవి మందిరానికి తీసుకొచ్చారని గౌరవ్ అంటారు.
సన్యాసం తీసుకున్న తర్వాతే ఆయన మందిరానికి వచ్చారని గౌరవ్ చెప్పారు. యతి కట్టర్ హిందూ కావటం వల్ల చనిపోయిన తన తండ్రి కృష్ణ మురారీ జిందల్ అతడి పట్ల ఆకర్షితులయ్యారన్నారు గౌరవ్ జిందల్. అలా మందిరంలో నివాసం మొదలుపెట్టిన యతి... ఇక ఎటూ వెళ్లకుండా అక్కడే ఉండిపోయారని గౌరవ్ చెప్పారు.
గతంలో ఆలయంలో ఒక రాజకీయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, అప్పుడు తన తండ్రి దాన్ని వ్యతిరేకించారని, వివాదం ముదిరిపోయి ఒకరినొకరు నానా మాటలు అనుకున్నారని కూడా గౌరవ్ చెప్పారు.
ఆ తర్వాత ఆలయం 'తమ కుటుంబం చేతుల్లోంచి వెళ్లిపోయింద'నేది గౌరవ్ కథనం. అయితే, ఇప్పటికీ తమ కుటుంబం 'భయ వాతావరణం'లోనే దర్శనం కోసం మందిరానికి వెళ్తుందని ఆయన చెప్పారు.
ఆలయ నిర్వహణ అధికారం తమ కుటుంబానికి దక్కాలని ఆయన కోరుకుంటున్నారు.

ఇక మందిరంలో మూడో పక్షం ఆనంద్ గుప్తాది. ఆలయ భూమిలో ఒక భాగం తమ పూర్వీకులు దానంగా ఇచ్చిందని ఆయనంటారు. ఆ భూమిపై యతి చట్టవిరుద్ధంగా ఉంటున్నారని ఆనంద్ గుప్తా కథనం.
ఆనంద్ గుప్తా నివాసం సరిగ్గా ఆలయానికి ఎదురుగా ఉంది. ఇంట్లోని మొదటి అంతస్తులో పడకపైన పరచి ఉన్న అనేక పాత కాగితాలను ఆనంద్ గుప్తా చూపించారు. అవన్నీ ఆలయ భూమికి సంబంధించినవే.
2010లో తాను కోర్టులో దీనిపై కేసు కూడా వేశానని ఆనంద్ చెప్పారు. కింది కోర్టులో ఆ కేసు విచారణ జరుగుతోందన్నారు.
కానీ మందిరానికి చెందిన అనిల్ యాదవ్ మాత్రం అలాంటి కేసు ఏదీ లేదన్నారు. భూమి యాజమాన్యం విషయంలో ఎలాంటి వివాదం లేదన్నారు. ఎందుకంటే, 'ఇప్పుడు ఇదంతా ఆలయానికి చెందిన భూమే' అన్నారు అనిల్ యాదవ్.
'నా తాతలు లేదా ముత్తాతలు ఏదైనా ట్రస్టుకో, మందిరానికో, ధర్మశాలకో భూమిని ఇచ్చారు. ఇప్పుడు నాకది వాపస్ కావాలి అని ఎవరైనా అడిగితే అది అర్థం లేనిదే అవుతుంది కదా' అన్నారు అనిల్ యాదవ్.

ఇక ట్రస్టుల విషయానికొస్తే, దేవి మందిరాన్ని వేర్వేరు ట్రస్టుల కింద విభజించారు. ట్రస్టులన్నింటికీ యతి నరసింహానంద సరస్వతే అధిపతిగా ఉన్నారు.
2021లో మూడు ట్రస్టులు ఏర్పాటయ్యాయని అనిల్ యాదవ్ అంటారు - 'యతి నరసింహానంద సరస్వతి ఫౌండేషన్', 'శ్రీకృష్ణ యోగ్‌ధామ్', 'హరహర మహాదేవ్ భక్త మండలి'. ప్రస్తుతం నాలుగో ట్రస్టును కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొత్త పనులు ప్రారంభించడం 'యతి నరసింహానంద సరస్వతి ఫౌండేషన్' ట్రస్ట్ చేసే పనుల్లో ఒకటి. బాలలకు ఆటపాటల్ని పరిచయం చేయడం, వారిని సైన్యంలో చేరేలా తయారు చేయటం వంటి పనులు రెండో ట్రస్టు చూసుకుంటుంది. ఇక, మూడో ట్రస్టు పని మందిరంలో దేవిమాత సేవల్ని చూడటం. నాలుగో ట్రస్టు బాధ్యతల్లో విద్యాలయాలు, గోశాలల నిర్వహణ ఉంటాయని చెబుతున్నారు.
ఆలయంలో 25-30 మంది సిబ్బంది ఉన్నారని, ఆలయ నిర్వహణకు నెలకు దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షలు ఖర్చవుతుందని అనిల్ యాదవ్ చెప్పారు.
ఆలయానికి వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి సిబ్బందికి జీతాలు చెల్లించే బాధ్యతను బయటి వ్యక్తులు తీసుకున్నారని అనిల్ యాదవ్ చెప్పారు.

యతి సోషల్ మీడియా యాక్సెస్
యోగి రాజ్యంలో యతి నరసింహానందకు అభయ హస్తం లభిస్తోందా?
ఈ ప్రశ్న అడిగిన వెంటనే అనిల్ యాదవ్ ఇలా అన్నారు, 'హరిద్వార్‌లో యోగీజీ లేరు. దిల్లీలో యోగీజీ లేరు. ఐదేళ్ల ముందు, 2017కు ముందు యోగీజీ లేరు. బహుశా ఆనాడు సమస్యలు ఇంతకన్నా కూడా పెద్దవే. యాక్సెస్ తక్కువే. ఇప్పటికన్నా పెద్ద పెద్ద ప్రకటనలు బహుశా 2017కు ముందే చేశారు. ఆనాడు మాకున్న యాక్సెస్ కూడా తక్కువే.'
యతి దగ్గరి అనుచరుడైన అనిల్ యాదవ్ సోషల్ మీడియాలో ఆరితేరిన ప్రొఫెషనల్ లాగా నాతో మాట్లాడారు.
సోషల్ మీడియాలో మందిరం లేదా యతి నరసింహానంద పేరుతో ఏదైనా హ్యాండిల్ మొదలైందంటే చాలు, దానిపై సదరు ప్లాట్‌ఫాం కమ్యూనిటీ షరతుల ఉల్లంఘనగా రిపోర్ట్ చేయడంతో దాన్ని మూసెయ్యాల్సి వస్తోందని అనిల్ యాదవ్ చెప్పారు.
దీన్ని తప్పించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లున్న యూట్యూబర్స్ మద్దతు తీసుకుంటున్నారు. మెసేజ్ వేర్వేరు హ్యాండిల్స్ ద్వారా పంపిణీ కావడం వల్ల వాటిపై రిపోర్ట్ చేసే రిస్క్ చాలా వరకు తగ్గిపోతుంది.
'ఏదైనా నెరేటివ్‌ను ఒకే ప్లాట్‌ఫాంపైన పదే పదే ప్రసారం చేస్తే, దానిపై రిపోర్టింగ్ జరుగుతుంది. అదే మనం మార్చి మార్చి ప్రసారం చేస్తే, దానిపై రిపోర్టింగ్ జరగదు' అన్నారు అనిల్ యాదవ్.

ఏదైనా క్లిప్‌ను వైరల్ చేయాలంటే, ముందుగా దాన్ని ఒక వాట్సాప్ గ్రూపులో వేయాలి. దాన్ని యతి మద్దతుదారులందరూ తమ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ముందుకు తీసుకెళ్తారు.
'వాట్సాప్‌ను ఎవ్వరూ బ్లాక్ చేయలేరు' అంటారు అనిల్ యాదవ్.
సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలతో పాటు సూర్య బులెటిన్ అనే హిందీ పత్రికను, న్యూస్ పోర్టల్‌ను కూడా అనిల్ యాదవ్ నిర్వహిస్తున్నారు.
ఇక్కడ పని చేసే సిబ్బందికి వేతనం లభిస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్లాట్‌ఫాంపైన 'గ్రీన్ కంటెంట్' అంటే వివాదరహితమైన కంటెంట్ వస్తుందన్నారు. కానీ ఈ కంటెంట్‌లో కూడా తమ సైద్ధాంతిక సందేశాన్ని ప్రసారం చేస్తామని చెప్పారు అనిల్ యాదవ్. అంటే 'హిందూజాతికి, వారసత్వానికి ముస్లింలతో ముప్పు' ఉందనే సందేశం అన్నమాట.
50 రూపాయల ధరకు అమ్ముతున్న సూర్య బులెటిన్ 2021 అక్టోబర్ సంచికను నేను తిరగేశాను. అందులో 'కశ్మీర్', 'ఆర్యన్ ఖాన్', 'జిహాదీలు' వంటి పదాలతో కూడిన పెద్ద పెద్ద శీర్షికల కింద రాసిన వ్యాసాలు కనిపించాయి.

సోషల్ మీడియా వీరికి అత్యంత శక్తిమంతమైన మాధ్యమం. దీని ద్వారా తమ గొంతును వీలైనంత ఎక్కువ మందికి వినిపించటం, వీరి మాటల్లోనే చెప్పాలంటే హిందువులను ఐక్యం చేయడం లాంటి పనులు జరుగుతున్నాయి.
ధర్మ్ సంసద్ కూడా ఈ వ్యూహంలో భాగమే. మొదట్లో ఏడాదికి ఒక ధర్మ్ సంసద్ జరిగేది. కానీ ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అనేక ధర్మ్ సంసద్‌లు ఏర్పాటు చేయాలనే ప్రణాళిక సిద్ధమైంది.
హరిద్వార్ ధర్మ్ సంసద్ తర్వాత నూతన సంవత్సరంలో మొదటి ధర్మ్ సంసద్ కార్యక్రమం జనవరి 1, 2 తేదీల్లో డాస్నాలో జరగాల్సి ఉండింది. కానీ హరిద్వార్, రాయపూర్‌లలో జరిగిన ధర్మ్ సంసద్‌ల చుట్టూ వివాదాలు ముసురుకోవడంతో డాస్నా ధర్మ్ సంసద్ కార్యక్రమాన్ని ముందుకు జరిపారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముస్లింల ఒత్తిళ్లకు లోనయ్యిందని, ధర్మ్ సంసద్ ఎట్టి పరిస్థితిలోనైనా జరిగి తీరుతుందని యతి నరసింహానంద సరస్వతి హరిద్వార్‌లో అన్నారు.

ఘాజియాబాద్ ఎస్ఎస్‌పీ పవన్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, ధర్మ్ సంసద్‌లో ఏయే అంశాలపై చర్చ జరుగుతుందనే దానిపై పోలీసులు ఓ కన్నేసి ఉంచుతారని చెప్పారు.
'ఒకవేళ వివాదాస్పద టాపిక్ అయితే, దాని వల్ల వైషమ్యాలు పెరుగుతాయనుకుంటే, లేదా అది తీవ్ర నేరాలకు పాల్పడేలా పురికొల్పే టాపిక్ అయినట్టయితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం' అన్నారు పవన్ కుమార్.
కానీ ధర్మ్ సంసద్ లోపల ఏం మాట్లాడొచ్చనే విషయాన్ని ముందే ఎలా నిర్ధరించుకుంటారు?
హరిద్వార్, రాయపూర్ ఉదాహరణలు మన ముందున్నాయి. ముస్లింలపై నరమేధం జరపాలని ఈ కార్యక్రమాల్లో బాహాటంగా పిలుపునిచ్చారు.
'కేవలం మొదటి ఉదాహరణ ఆధారంగా, ఆ తర్వాత కూడా తప్పుగానే మాట్లాడతారని అనుకోలేం కదా' అంటారు పవన్ కుమార్.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎగజిమ్ముతున్న విద్వేష విషాన్ని అడ్డుకునేదెవరు? యూపీలో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్న వారిపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్న.. ప్రశ్నగానే మిగిలి ఉంది.
ఇవి కూడా చదవండి:
- కజకిస్తాన్‌లో అల్లర్లు ఎందుకు చెలరేగాయి, రష్యా ఎందుకు రంగంలోకి దిగింది?
- ప్రధానమంత్రి భద్రత ఎలా మారుతూ వచ్చింది?
- ‘పంజాబ్ యువరాణి.. విక్టోరియా మహారాణికి దేవుడిచ్చిన కుమార్తె’
- ఇటలీ నుంచి ఇండియా వచ్చిన విమానంలోని ప్రయాణికులలో మళ్లీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు
- బుల్లీబాయి, సుల్లీ డీల్స్: సోషల్ మీడియాలో ముస్లిం మహిళల వేలం గురించి మనం అర్ధం చేసుకోవాల్సిందేంటి?
- వనమా రాఘవ: ఏపీ వైపు పారిపోతుండగా అర్ధరాత్రి అరెస్ట్ - ప్రెస్ రివ్యూ
- చైనా అప్పుల ఉచ్చులో పేద దేశాలు చిక్కుకుపోతున్నాయా
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’ ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకోవాలి? - 8 ప్రశ్నలకు సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












