పాకిస్థాన్‌ జేఎఫ్-17 థండర్ బ్లాక్-త్రీ యుద్ధ విమానం రఫేల్‌తో పోటీ పడగలదా?

జేఎఫ్-17బీ

ఫొటో సోర్స్, Aamir qureshi

    • రచయిత, సనా ఆసిఫ్ దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అత్యాధునిక యుద్ధ విమానం జేఎఫ్-17 బ్లాక్-త్రీ తయారీకి పాకిస్తాన్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చైనా సహకారంతో తయారైన పద్నాలుగు జేఎఫ్-17బీ విమానాలను పాకిస్తాన్ వైమానిక దళానికి అప్పగించారు.

ఈ విమానాలను పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ (పీఏసీ) తయారు చేసింది.

డబుల్ సీటర్ జేఎఫ్-17బీ విమానాలను పాకిస్తాన్ వాయుసేనకు అప్పగించేందుకు, జేఎఫ్-17 బ్లాక్-త్రీ ఉత్పత్తి ప్రారంభించేందుకు బుధవారం నాడు కామ్రా ఎయిర్‌బేస్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

జేఎఫ్-17బీ, ఇప్పటికే ఉన్న జేఎఫ్-17కన్నా భిన్నమైందా?

కొత్త జేఎఫ్-17బీ మోడల్ విమానంలో రెండు సీట్లు ఉంటాయని, దీన్ని ఎక్కువగా శిక్షణకోసం ఉపయోగిస్తారని, దీని సామర్థ్యం జేఎఫ్-17 విమానంలాగే ఉంటుందని పాకిస్తాన్ వైమానిక దళ ప్రతినిధి అహ్మర్ రజా బీబీసీకి తెలిపారు.

"కొత్త విమానంలో క్షిపణులు, రాడార్లు పాత విమానం తరహాలోనే ఉంటాయి. కొత్త మోడల్‌లో ఒక సీటు అదనంగా ఉంటుంది. అందువల్ల మరో పైలట్ కూడా కూర్చుని శిక్షణ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది" అని ఆయన వివరించారు.

ఈ విమానాల వలన సైనిక శక్తి పెరుగుతుందని పాకిస్తాన్ వైమానిక దళం చెబుతోంది. ఇవి శిక్షణ ఇవ్వడానికి మాత్రమే కాకుండా యుద్ధ కార్యకలాపాల్లో కూడా పాల్గొనగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయని అంటున్నారు.

జేఎఫ్-17బీ విమానాలు అత్యాధినుకమైనవని పాకిస్తాన్ వైమానిక దళం చెబుతోంది
ఫొటో క్యాప్షన్, జేఎఫ్-17బీ విమానాలు అత్యాధినుకమైనవని పాకిస్తాన్ వైమానిక దళం చెబుతోంది

బ్లాక్-త్రీ ఏమిటి?

జేఎఫ్ బ్లాక్-త్రీ ఫోర్త్ జనరేషన్ ఫైటర్ జెట్ అవుతుంది. ఇది అత్యంత అధునాతనమైన మోడల్ అనీ, ఆ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా..ప్రత్యర్థులకు దీటుగా ప్రతిఘటించడానికి సహాయపడుతుందని పాకిస్తాన్ వాయుసేన తెలిపింది.

"ఇది జేఎఫ్-17కు తరువాతి వెర్షన్. దీన్లో కొత్త రాడార్లు అమర్చబడతాయి. ఇందులో ఆధునిక ఆయుధాలు, క్షిపణులు ఉంటాయి. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ విమానం ఒక ఏడాది లేదా ఏడాదిన్నర లోపల తయారైపోతుంది" అని పాకిస్తాన్ వైమానిక దళ ప్రతినిధి తెలిపారు.

ఇందులో యాక్టివ్ ఎలక్ట్రానిక్ సెకండరీ రాడార్ ఉంటుందని, మెరుగైన మిసైల్స్ ఉంటాయని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మక్సూద్ అఖ్తర్ తెలిపారు.

"దీనిలో గాల్లోంచి గాల్లోకి, గాల్లోంచి భూమి మీదకు కూడా ప్రయోగించగలిగే ఆయుధాలు ఉంటాయి. ఇది ఫోర్త్ జనరేషన్ విమానం" అని ఆయన అన్నారు.

విదేశాలకు విక్రయించే జేఎఫ్-17 విమానాలను కూడా బుధవారం ప్రదర్శనకు ఉంచారు
ఫొటో క్యాప్షన్, విదేశాలకు విక్రయించే జేఎఫ్-17 విమానాలను కూడా బుధవారం ప్రదర్శనకు ఉంచారు

జేఎఫ్ 17 థండర్ యుద్ధ విమానాలను రఫేల్‌తో పోల్చవచ్చా?

ఇది భారత రఫేల్ విమానాలకన్నా మెరుగైనది అనే మాట వినిపిస్తోంది.

"ఇది నిజమే. చాలా విషయాల్లో ఇది రఫేల్‌కన్నా మెరుగ్గా ఉంటుంది. రఫేల్‌తో పోటీ పడగల సామర్థ్యం ఉంటుంది" అని మెరుగైనది వైమానిక దళ ప్రతినిధి తెలిపారు.

"ఇది 100 శాతం నిజం అని చెప్పలేం. అన్ని విషయాల్లోనూ భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోలికలు వస్తూ ఉంటాయి. రఫేల్‌కన్నా జేఎఫ్-17 బ్లాక్-త్రీలో మెరుగైన రాడార్, మిసైల్స్ ఉంటాయి. రఫేల్‌కన్నా ఇది మెరుగైన సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్పొచ్చు. కానీ విమానాలను పోల్చినప్పుడు రాడార్, క్షిపణులను మాత్రమే కాకుండా ఇంకా చాలా అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది అని స్ట్రాటజిక్ స్టడీస్ ఆఫ్ ఎయిర్ యూనివర్సిటీ అధిపతి ఆదిల్ సుల్తాన్ అభిప్రాయపడ్డారు.

అత్యాధునిక యుద్ధ విమానం జేఎఫ్-17 బ్లాక్-త్రీ తయారీకి పాకిస్తాన్ రంగం సిద్ధం చేస్తోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అత్యాధునిక యుద్ధ విమానం జేఎఫ్-17 బ్లాక్-త్రీ తయారీకి పాకిస్తాన్ రంగం సిద్ధం చేస్తోంది

జేఎఫ్ థండర్ బ్లాక్-3 ఎలాంటి నైపుణ్యాన్ని కలిగి ఉంటుంది?

జేఎఫ్-17బీ విమానాలు ముఖ్యంగా ఎగుమతి చెయ్యడానికి ఉపయోగపడతాయి. మేము కస్టమర్లతో మాట్లాడినప్పుడల్లా, వారు డబుల్ సీటర్ విమానాలు కావాలని అడిగేవారు. అందుకే వీటిని ప్రత్యేకంగా తయారుచేయించాం" అని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మక్సూద్ అఖ్తర్ తెలిపారు.

విదేశాలకు విక్రయించే జేఎఫ్-17 విమానాలను కూడా బుధవారం ప్రదర్శనకు ఉంచారు.

జేఎఫ్-17 థండర్ బ్లాక్-త్రీ విమానం పాకిస్తాన్ స్వయంగా తయారు చేయబోతోంది. కాబట్టి ఇది ఆ దేశానికి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుంది.

చైనా సహాయంతో ఈ విమానాలను తయారుచేసే నైపుణ్యాన్ని పాకిస్తాన్ పెంపొందించుకుంది. ఇది తేలికగా ఉంటూ బహుళ ప్రయోజనాలు కలిగిన ఫోర్త్ జనరేషన్ విమానం అని నిపుణులు అంటున్నారు.

విమానాన్ని అప్‌గ్రేడ్ చెయ్యాలనుకుంటే పాకిస్తాన్‌ స్వయంగా చేసుకోగలదు. దీనికి కావలసిన అన్ని సౌకర్యాలు ఆ దేశంలో ఉన్నాయి. వీటికోసం ఇతర దేశాలపై ఆధారపడవలసిన అవసరం లేదు.

జేఎఫ్ -16 థండర్ ఫాల్కన్‌లాగే ఇది కూడా తేలికగా ఉంటూ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ, భూమి మీద, ఆకాశంలోనూ ప్రయోగించగల ఫైటర్ జెట్ అనీ, దీని మిసైల్స్ సుదూర లక్ష్యాలకు గురిపెట్టగలవని రక్షణ నిపుణులు అంటున్నారు.

ఈ సామర్థ్యం కారణంగానే బాలాకోట్ సంఘటన తరువాత బీవీఆర్ (బియాండ్ విజువల్ రేంజ్) మిసైల్‌తో భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌ను పడగొట్టగలిగింది. ఈ విషయంలో జేఎఫ్-17 థండర్ అనేక ప్రశంసలను అందుకొంది.

రఫేల్‌లో ఉన్న అధునాతన రాడార్‌లాంటిదే జేఎఫ్-17 థండర్‌లో కూడా ఉంది. దీనిలో ఉండే మిసైల్ రేంజ్ 150 కిలోమీటర్లు ఉంటుంది అని చెప్తున్నారు.

జేఎఫ్-17బీ

ఫొటో సోర్స్, Aamir qureshi

పాకిస్తాన్ జేఎఫ్-17 విమానాలను తయారు చెయ్యడం ఎప్పుడు ప్రారంభించింది?

1995లో జేఎఫ్‌కు సంబంధించిన ఒప్పందంపై పాకిస్తాన్, చైనాలు సంతకం చేసాయి.

ఈ విమానం మొదటి టెస్ట్ మోడల్ 2003లో తయారైంది. 2010లో మొదటిసారిగా జేఎఫ్-17 థండర్ విమానాలు పాకిస్తాన్ వాయుసేనలో చేరాయి.

మిగ్ విమానాలను తయారుచేసే రష్యన్ కంపెనీ మికోయాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకుంది.

మిరాజ్, ఎఫ్-7, ఏ-5 విమానాల స్థానంలో జేఎఫ్-17 విమానాలను ప్రవేశపెట్టే విధంగా వీటిని రూపొందించారు.

సోషల్ మీడియాలో స్పందన ఎలా ఉంది?

సోషల్ మీడియాలో పాకిస్తాన్ జేఎఫ్-17 బీ విమానాల పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

మియా అయ్యూబ్ అనే వ్యక్తి జేఎఫ్-17బీ ఫొటో పోస్ట్ చేస్తూ.."మీరింక హాయిగా నిద్రపోండి. మన ప్రాణాలకు రక్షగా పాకిస్తాన్ వాయుసేన ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది" అని రాసారు.

“పాకిస్తాన్ వైమానిక దళం శక్తిని తక్కువ అంచనా వేయొద్దని” జరూన్ అనే వ్యక్తి రాసారు.

“దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి ఇది ఒక ముఖ్య విజయమని" షేన్ అవన్ రాసారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)