భారత రఫేల్ యుద్ధ విమానాలకు 'హామర్' క్షిపణులు జోడిస్తే ఏమవుతుంది...

రఫేల్ యుద్ధ విమానాలు

ఫొటో సోర్స్, European Photopress Agency

జులై 29న అంబాలా (హరియాణా)కు చేరుకోనున్న రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ నుంచి హామర్ క్షిపణులు కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి.

భారత సైన్యం ఈ క్షిపణులను ‘ఎమర్జెన్సీ పవర్స్’ అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేలా ఈ ఒప్పందం ఉంటుంది.

చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకునే, భారత్ 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ హామర్ క్షిపణిని కొనుగోలు చేస్తుండవచ్చని భావిస్తున్నారు.

“స్వల్ప వ్యవధిలో ఆర్డర్ పెట్టినప్పటికీ భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలకు ఆ క్షిపణులను సరఫరా చేసేందుకు ఫ్రాన్స్ సిద్ధమైంది” అని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు ఏఎన్ఐ చెప్పింది.

నాలుగు రోజుల తర్వాత తొలి విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు హరియాణా, అంబాలాలోని భారత వైమానిక దళ స్థావరంలో ల్యాండ్ కానున్నాయి.

హామర్ క్షిపణులను దూరం నుంచి సులభంగా ఉపయోగించవచ్చని, గాలిలో నుంచి భూమిపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణితో లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించవచ్చని ఆ క్షిపణిని తయారుచేసే సంస్థ సఫ్రాన్ ఎలెక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ సంస్థ చెబుతోంది.

“ఈ సిస్టమ్ చాలా సులభంగా సమన్వయం చేసుకుంటుంది. గైడెన్స్ సాయంతో లక్ష్యాలను ఛేదించే ఇది ఎప్పుడూ జామ్ కాదు. క్షిపణి ముందు ఉన్న గైడెన్స్ కిట్‌లో జీపీఎస్, ఇన్‌ఫ్రారెడ్, లేజర్ లాంటివి ఫిట్ చేశాం” అని ఈ సంస్థ చెబుతోంది.

హామర్ అసలు పేరు ‘ఆర్మ్ మెంట్ ఎయిర్‌సోల్ మాడ్యులెయిర్’. ఫ్రాన్స్ మార్కెట్లో విక్రయానికి ఉంచినపుడు దీనిని ‘హామర్’ అని పిలవడం ప్రారంభించారు. తర్వాత ఆ పేరే స్థిరపడిపోయింది.

హామర్ అంటే ‘హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యూనిషన్ ఎక్స్ టెండెడ్ రేంజ్’ అని అర్థం.

safran

ఫొటో సోర్స్, safran

పర్వతాల్లో బంకర్లనూ ధ్వంసం చేయగలదు

ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలతో గాల్లో నుంచి గాలిలో సుదూర లక్ష్యాలను ఛేదించే ‘మెటియర్’ క్షిపణులు ఇప్పటికే ఉన్నాయి. ఇవి పొరుగు దేశాలతో పోలిస్తే భారత వైమానిక దళ సామర్థ్యాన్ని మరిన్ని రెట్లు పెంచుతాయి.

1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని భారత్ వైపు తిప్పడంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా కీలక పాత్ర పోషించింది. గత 50 ఏళ్లుగా భారత వైమానిక దళం తన బలం పెంచుకుంటూ వస్తోంది.

250 కిలోల బరువు నుంచి మొదలయ్యే హామర్ క్షిపణిని రఫేల్‌తోపాటూ మిరాజ్ యుద్ధ విమానాలకు కూడా బిగించవచ్చు.

అయితే, ఫ్రాన్స్ కాకుండా ఆసియాలోని ఈజిఫ్ట్, కతార్ లాంటి దేశాలు ఈ హామర్ క్షిపణులను ఎక్కువగా ఉఫయోగిస్తున్నాయి.

హామర్ క్షిపణులు పర్వత ప్రాంతాల్లో నిర్మించిన బంకర్ల వరకూ దేన్నైనా ఛేదించగలవని ఏఎన్ఐ చెప్పింది.

అలాంటి కఠినమైన ప్రాంతాల్లో ముఖ్యంగా భారత ఉత్తర సరిహద్దులో ఉన్న లద్దాఖ్‌ను ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారత్-చైనా మధ్య వివాదం కొనసాగుతోంది.

యుద్ధం లేదా దాడులు జరగవచ్చని రెండు దేశాల వైపు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలూ రాలేదు.

కానీ, భారత్-చైనా గతంలో రెండు సార్లు తలపడ్డాయి. భారత్‌కు స్వతంత్రం వచ్చిన కొన్నేళ్ల తర్వాత 1962లో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది.

కార్గిల్ కూడా లద్దాఖ్‌లోనే ఉంది. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది.

Solenzara Mars

ఫొటో సోర్స్, Solenzara Mars

క్షిపణుల ఒప్పందంపై ప్రశ్నలు

60 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకుంది. అయితే విమానాల అసలు ధర ఎంతనే దానిపై చాలా వివాదాలు వచ్చాయి.

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కానీ అక్కడ కూడా భద్రతా కారణాలతో ఆ ఒప్పందం గురించి అన్ని విషయాలనూ బయటపెట్టలేదు.

“హామర్ క్షిపణుల ఒప్పందం రఫేల్ డీల్ జరిగేటప్పుడే ఎందుకు చేసుకోలేదు” అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

“ఈ క్షిపణులకు బదులు ఇంకా చౌకగా లభించే స్పైస్, పేవ్‌వే మిసైళ్ల గురించి ఎందుకు ఆలోచించలేదు. ఇవి ఇప్పటికే భారత వైమానిక దళం దగ్గర ఉన్నాయి. హామర్ ధర వీటికంటే ఎక్కువా?” అని ఆయన ట్వీట్ చేశారు.

ఇప్పుడు భారత్ చెబుతున్న ఈ హామర్ క్షిపణిని ఫ్రాన్స్ సైన్యం 2007లో అఫ్గానిస్తాన్, లిబియాలో ఉపయోగించింది.

మొదట ప్రయోగించినపుడే ఈ క్షిపణులు చాలా విజయవంతం అయ్యాయని వాటిని తయారు చేసే సఫ్రాన్ చెబుతోంది.

Joe Giddens/PA Wire

ఫొటో సోర్స్, Joe Giddens/PA Wire

కానీ ఫ్రాన్స్ నుంచి ఇప్పుడు భారత్ ఎన్ని హామర్ క్షిపణులను, ఏ ధరకు కొంటోంది అనేదానిపై ఎలాంటి స్పష్టతా రాలేదు.

భారత్ దాదాపు వంద క్షిపణులను ఒప్పందం చేసుకున్నట్లు ‘ది ఇండియా టుడే’ పత్రిక రాసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

“భారత్‌ తన సరిహద్దులను ఎలా కాపాడుకుంటోందనే వారికోసమే ఈ సమాచారం. భారత్ రఫేల్ జెట్ విమానలను హామర్ క్షిపణులతో బలోపేతం చేస్తోంది. శత్రువులు బంకర్లలో కూడా దాక్కోలేరు” అని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు.

రఫేల్ ధర గురించి వస్తున్న ప్రశ్నలను కూడా ‘జాతీయ భద్రతా అంశం’గా మార్చడంలో బీజేపీ ప్రభుత్వం విజయవంతం అయ్యింది.

అయితే, 1980వ దశకంలో బోఫోర్స్ ఫిరంగులు కొనుగోళ్లు జరిగినపుడు, ఆ ఒప్పందంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అందులో బీజేపీ అందరికంటే ముందు నిలిచింది.

‘స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ వివరాల ప్రకారం అమెరికా, చైనా తర్వాత రక్షణపై అత్యధిక వ్యయం చేసే మూడో దేశం భారత్. దక్షిణాసియాలో భారత్ అగ్ర స్థానంలో ఉంది.

గత ఏడాదితో పోలిస్తే భారత్ రక్షణ బడ్జెట్ 6.8 శాతం పెరిగింది. 2019లో అది 71.1 బిలియన్ డాలర్లు ఉంది.

కానీ జవహర్‌లాల్ నెహ్రూ సమయంలో జరిగిన జీప్ ఒప్పందం, తర్వాత బోపోర్స్, ఇప్పటి రఫేల్ వరకూ భారత్ చేసుకున్న ఏ రక్షణ ఒప్పందమైనా వివాదాలకు దూరంగా ఉండలేకపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)