కరోనా వైరస్: భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. ఐదు కీలక ప్రశ్నలు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలో అత్యంత కఠినమైనదిగా పరిగణించే లాక్‌డౌన్‌ను తొలగించిన కొన్ని వారాల తర్వాత.. దేశంలో తొలి కోవిడ్-19 కేసు నమోదైన నాలుగు నెలల తర్వాత ఆ కేసుల సంఖ్య నింగినంటేలా పెరిగిపోతోంది.
ఈ సంక్షోభం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి.
కేసుల పెరుగుదలతో భారత్ ఆందోళన చెందాలా?
నిక్కచ్చిగా చెప్పాలంటే భారతదేశ పరిస్థితి మరీ అంతగా దిగజారి ఉండకపోవచ్చు.
ప్రస్తుతం 3.20 లక్షలకు పైగా కేసేలతో ప్రపంచంలో అత్యధిక నిర్ధారిత కేసుల్లో అమెరికా, బ్రెజిల్, రష్యాల తర్వాత నాలుగో స్థానంలో ఉంది. కానీ తలసరి కేసుల సంఖ్య ప్రకారం చూస్తే అతి తక్కువగా 143వ స్థానంలో ఉందని కార్నెల్ యూనివర్సిటీలో ఎకానమిక్స్ ప్రొఫెసర్ కౌశిక్ బసు చెప్పారు.
ఈ వ్యాధి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని లెక్కించే కొలమానమైన కేసుల పునరుత్పత్తి నంబర్ పడిపోయింది. నమోదవుతున్న కేసుల సంఖ్య రెట్టింపయ్యే సమయం పెరిగింది. కానీ నిశితంగా గమనిస్తే ముంబై, దిల్లీ, అహ్మాదాబాద్ వంటి హాట్‌స్పాట్ నగరాల్లో కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరటం, మరణాల రేటు విపరీతంగా పెరుగుతుండటం చూడొచ్చు. ‘‘ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి పెరగటం కొనసాగితే న్యూయార్క్ తరహాలో పెరిగిపోతాయి’’ అని కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఒక వైద్యుడు నాతో పేర్కొన్నారు.
ఈ నగరాల్లో రోగులను చేర్చుకోవటానికి ఆస్పత్రులు నిరాకరించటంతో పలువురు రోగులు చనిపోయిన భయానక వార్తలు వెలుగుచూసాయి. ఒక విషాదకర ఉదంతంలో ఒకరు టాయిలెట్‌లో చనిపోయి కనిపించారు. లేబరేటరీలు కుప్పలు తెప్పలుగా నిండిపోవటంతో పరీక్షలు ఆలస్యం కావటమో, పెండింగ్‌లో ఉండటమో జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
మహమ్మారి విజృంభించటానికి ముందే భారత ఆర్థికవ్యవస్థ నెమ్మదిస్తోంది. కాబట్టి వ్యాపారాలు మూతబడి మరింత మంది ఉపాధి కోల్పోయేలా మరోసారి లాక్‌డౌన్ చేయజాలదు. కాబట్టి వైరస్ వ్యాప్తిని నియంత్రించటం కోసం భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.
‘‘ఈ నంబర్లే చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయి వాటికవే తగ్గిపోయేవి కావు. పరిస్థితిని అదుపులోకి తేవటానికి జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఆశిష్ ఝా చెప్పారు.
అంటే.. మహమ్మారి వ్యాప్తి ఆగిపోవటానికి సామూహిక రోగనిరోధకశక్తిని సాధించటం కోసం దేశంలో 60 శాతం మంది జనాభాకు కరోనావైరస్ సోకేంతవరకూ భారత్ వేచిచూడజాలదు. ‘‘అది జరగటం అంటే కోట్ల మంది జనం చనిపోవటమే. అది ఆమోదనీయమైన ఫలితం కాదు’’ అంటారు ఝా.
‘‘దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రోజూ వారీగా స్థిరంగా తగ్గటం లేదు. మనం ఆందోళన చెందాలి కానీ.. అది తీవ్ర భయాందోళనగా మారకూడదు’’ అని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో మరణాల రేటు తక్కువగా ఉండటం తప్పుదోవ పట్టిస్తోందా?
దేశంలో నమోదైన కేసుల్లో చనిపోతున్న వారి నిష్పత్తి సుమారు 2.8 శాతంగా ఉంది.
కానీ ఈ సంఖ్య వివాదాస్పదం. అసలు ఈ మహమ్మారికి సంబంధించి ఇంకా చాలా సంఖ్యలు కూడా వివాదాస్పదమే.
మొత్తం కేసుల సంఖ్యతో మొత్తం మరణాల సంఖ్యను భాగించటంలో.. నమోదు కాని కేసుల సంఖ్యను కానీ, అనారోగ్యం నుంచి మరణానికి మధ్య ఉన్న జాప్యాన్ని కానీ లెక్కలోకి తీసుకోవటం లేదని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో మేథమెటీషియన్ ఆడమ్ కుచార్స్కీ పేర్కొన్నారు.
మహమ్మారి విస్తరిస్తున్న ఈ దశలో కేస్ ఫాటాలిటీ రేట్ (సీఎఫ్ఆర్) సగటును చూసినపుడు.. ప్రభుత్వాలకు వాస్తవ పరిస్థితి కనిపించదని, దానివల్ల ఉదాశీనంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
‘‘సీఎఫ్ఆర్ అనేది ఒక కనికట్టు లాంటిది. నమోదైన కేసులు, మరణాల సంఖ్యను నమ్మినా కూడా.. మరణాల సంఖ్యను – ఫలితం తేలిన ముగిసిన కేసుల సంఖ్యతో భాగిస్తే ఇంకా ఎక్కువ సంఖ్య వస్తుంది’’ అని డాక్టర్ ముఖర్జీ చెప్పారు.
తలసరి మరణాల రేటు కూడా వ్యాధి వ్యాప్తిని అర్థంచేసుకోవటాన్ని పరిమితం చేస్తుంది. ఎందుకంటే.. దేశంలో ఇంకా వైరస్ సోకని ప్రాంతాలు చాలా విస్తారంగా ఉన్నాయి.
ఇప్పటివరకూ 9,000కు పైగా నమోదైన మరణాల్లో మూడొంతుల భాగం మూడు రాష్ట్రాలు – మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీల్లోనే ఉన్నాయి.
దేశంలో కరోనా మరణాల్లో యువత సంఖ్య ప్రపంచ సగటు కన్నా ఎక్కువగా ఉన్నట్లు ఆర్థికవేత్త పార్థా ముఖోపాధ్యాయ చేపట్టిన ఓ కొత్త అధ్యయనం చెప్తోంది.
ఏప్రిల్ 30వ తేదీ నాటికి.. మహారాష్ట్రలో 40 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు కరోనా రోగుల్లో మరణాల రేటు 4 శాతంగా ఉంది. ఈ వయసు వారికి ఇటలీలో ఇదే రేటు ఇందులో పదో వంతు మాత్రమే ఉంది.
‘‘ఇక్కడ ఎందుకింత ఎక్కువ మంది యువత చనిపోతున్నారో మనం కనిపెట్టాల్సిన అవసరముంది. డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాదుల వల్లనా లేక మన నగరాల్లోని కాలుష్య వాయువుల వల్ల వచ్చే శ్వాస సమస్యల వల్లనా? ప్రపంచంతో పోలిస్తే మన యువత అనారోగ్యంగా ఉందా?’’ అంటారు ప్రొఫెసర్ ముఖోపాధ్యాయ్.
అయినప్పటికీ.. దేశంలో మరణాల సగటు రేటు చాలా తక్కువగానే ఉంటుందని, మరణాల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉంటారని నిపుణులు చెప్తున్నారు.
‘‘దేశంలో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ జబ్బుపడిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే.. మనం ప్రమాదం నుంచి బయటపడి ఉండొచ్చు’’ అని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం దేని గురించి ఆందోళన చెందాల్సి ఉంటుంది?
దేశంలో వేర్వేరు ప్రాంతాల మీద వేర్వేరుగా ప్రభావం చూపుతూ విస్తరిస్తున్న వైరస్ మహమ్మారిని.. ఆ విధంగానే పరిగణించి కృషి చేయాల్సి ఉంటుందని అట్లాంటిక్ మేగజీన్ సైన్స్ రైటర్ ఎడ్ యంగ్ పేర్కొన్నారు.
సామాజిక దూరం, పరీక్షలు నిర్వహించే సామర్థ్యం, జన సమ్మర్థం, వయసు, సంపద, సామాజిక సమైక్యత, అదృష్టం అనే అంశాలు ఈ మహమ్మారి రూపురేఖలను నిర్దేశిస్తున్నాయని యంగ్ విశ్లేషించారు.
భారతదేశంలో అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించటంతో అర్థంతరంగా ఉపాధి కోల్పోయి, డబ్బు లేక నగరాల నుంచి వలసబాట పట్టిన కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల ద్వారా ఈ వైరస్ వ్యాపించింది. ఉదాహరణకు ఒడిషాలో ఇటీవల నమోదైన కేసుల్లో 80 శాతం మంది ఇలా వచ్చిన వలస కార్మికులే ఉన్నారు.
‘‘అందుకే ఈ వైరస్ వ్యాప్తిని భారతదేశ మహమ్మారిగా చూడకూడదు. దిల్లీ మహమ్మారి, ముంబై మహమ్మారి, అహ్మదాబాద్ మహమ్మారి లాగా దీనిని చూస్తూ చర్యలు చేపట్టాలి’’ అని దిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో సర్జన్ డాక్టర్ అంబరీష్ సాత్విక్ పేర్కొన్నారు.
ఈ నగరాల్లో ప్రతి 100 పరీక్షల్లో నిర్ధారణ అయ్యే కేసుల సంఖ్య జాతీయ సగటు కన్నా నాలుగైదు రెట్లు అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా ఒక చోట కేసుల సంఖ్య తగ్గి మరోచోట కొత్త హాట్‌స్పాట్‌లు పెరుగుతూ ఉన్నపుడు స్థానిక వైద్య వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతాయి.
‘‘వైరస్ దేశంలో విస్తరించే కొద్దీ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వరుసగా అమాంతంగా పెరిగిపోతుంటాయి. దేశంలో వైద్య సంరక్షణ సామర్థ్యాన్ని నిజంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది’’ అని డాక్టర్ ముఖర్జీ చెప్పారు.
అంటే.. కేసుల సంఖ్య తగ్గుతున్న ప్రాంతాల నుంచి వైద్య సదుపాయాలను – డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, పరికరాలు, మందులు, వెంటిలేటర్లను – కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న ప్రాంతాలకు వేగంగా తరలించాల్సిన అవసరం ఉంటుంది.
సైన్యానికి చెందిన వైద్య సర్వీసుల వంటి మొబైల్ వనరులను సంసిద్ధంగా ఉంచటం చాలా ఉపయోగపడుతుందనేది నిపుణులు అభిప్రాయం.

ఫొటో సోర్స్, Getty Images
సుదీర్ఘ లాక్‌డౌన్ వల్ల ప్రయోజనం కలిగిందా?
దేశంలో వైరస్ వ్యాప్తిని నెమ్మదింపజేయటానికి త్వరగా – మార్చి 25న - లాక్‌డౌన్ విధించటం తెలివైన పని అని నిపుణులు అంటున్నారు. ‘‘మరే దేశమూ అంత త్వరగా ఈ పని చేయలేదు. దానివల్ల ప్రభుత్వం చర్యలు చేపట్టటానికి సమయం లభించింది. ఇది చాలా మరణాలను నివారించింది’’ అని డాక్టర్ ఝా పేర్కొన్నారు.
కానీ అది కేవలం నాలుగు గంటల ముందు మాత్రమే ప్రకటించారు. అసంఘటిత రంగ కార్మికులు నగరాల నుంచి వలస పోవటం మొదలుపెట్టటంతో అది ఎంత విఫలమైందో వెల్లడైంది.
ఇక ప్రభుత్వాలు ఈ లాక్‌డౌన్ సమయాన్ని పరీక్షలను పెంచటానికి, ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసుకోవటానికి ఉపయోగించుకున్నాయా లేదా అనేది తేలాల్సి ఉంది. కేరళ, కర్నాటక వంటి రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, దిల్లీ వంటి వాటికన్నా మెరుగుగా పనిచేసినట్లు కనిపించాయి.
భారతదేశం బాగా సంసిద్ధమైనట్లయితే.. ముంబై, అహ్మదాబాద్, దిల్లీల్లో కేసుల సంఖ్యను అదుపుచేయటంలో వైఫల్యం ఉండేది కాదని నిపుణులు అంటున్నారు.
డాక్టర్లు, వైద్య సిబ్బంది, సదుపాయాలతో కూడిన బెడ్ల కొరత.. ప్రభుత్వ ఆస్పత్రుల మీద నమ్మకం లేకపోవటం వల్ల ప్రభుత్వాలు ఇక్కట్లు ఎదుర్కొన్నాయి. ఫలితంగా ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు వెల్లువెత్తారు. అవి ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటానికి ఏమాత్రం సిద్ధంగా లేవు.

ఫొటో సోర్స్, Getty Images
మున్ముందు పరిస్థితి ఏమిటి?
భారతదేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ ఇంకా కుంటుతూనే సాగుతోంది. ప్రస్తుతం రోజుకు 1.50 లక్షల నమూనాలను మాత్రమే పరీక్షిస్తోంది. లాక్‌డౌన్ కన్నా ముందు రోజుకు కేవలం 1,000 గా ఉన్న పరీక్షల సంఖ్య ఇప్పుడు చాలా పెరిగింది. కానీ.. ప్రపంచవ్యాప్తంగా ఈ పరీక్షల తలసరి రేటును పోలిస్తే భారత్‌లో ఇంకా అత్యంత తక్కువగానే ఉంది.
దేశంలో మొదటి కేసు జనవరి 30వ తేదీన నమోదైనందున.. కేసులను మరింత ముందుగానే పెంచి ఉండవచ్చునని చాలా మంది భావిస్తున్నారు.
‘‘మనకు వనరులు ఉన్నాయి. సామర్థ్యం ఉంది. కానీ ముందస్తు ప్రణాళిక లేదు. పైగా లాక్‌డౌన్ వల్ల లభించిన తొలి ప్రయోజనాలకు మురిసిపోతూ కూర్చున్నాం’’ అని ప్రొఫెసర్ ముఖోపాధ్యాయ్ వ్యాఖ్యానించారు.
కేసుల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోయిన దేశ రాజధాని దిల్లీ ఇటువంటి అలసత్వానికి, విఫల ప్రణాళికలకు ఒక ఉదాహరణ.
రాబోయే వారాల్లో కేసుల సునామీ వెల్లువెత్తుతుందనే ఆందోళనతో.. ప్రైవేటు ఆసుపత్రులు మరిన్ని పడకలను కోవిడ్-19 రోగులకు కేటాయించాలని స్థానిక ప్రభుత్వం ఆదేశించింది. పెళ్లి మండపాలు, స్టేడియంలు, హోటళ్లలోనూ పడకలు ఏర్పాటు చేస్తోంది.
కానీ నిపుణులు సందేహం వ్యక్తంచేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
పెళ్లి మండపాలు, స్టేడియంలలో ఇప్పటికిప్పుడు పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయటం ఎలా సాధ్యమవుతుంది? డాక్టర్లు, నర్సులు ఎక్కడి నుంచి వస్తారు? నగరంలో ప్రతి ఐసీయూ నిండిపోయినపుడు.. పెళ్లి మండపంలో బెడ్ మీద ఉన్న రోగికి క్రిటికల్ కేర్ ఎలా అందుతుంది?
‘‘కొత్త మౌలికసదుపాయాలు అవసరం. సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. కేవలం రోగులను ఖాళీ చేయించి.. కోవిడ్ వార్డులు తయారు చేస్తే సరిపోదు’’ అని డాక్టర్ సాత్విక్ పేర్కొన్నారు.
అధికారిక ఉత్తర్వులు, తాత్కాలిక ప్రణాళికలతో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటం వల్ల ప్రయోజనం ఉండదని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు.. వైరస్ సోకే ప్రమాదం అలాగే కొనసాగుతోందని స్పష్టంగా తెలియజేయటంలో ప్రభుత్వం విఫలమైతే.. సామాజిక దూరం, పరిశుభ్రత పాటించటం పట్ల అంతకుముందు ఉమ్మడిగా ఉన్న ఉత్సాహం కూడా ఆవిరైపోతుంది.
‘‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. మనం ఇంకా మహమ్మారి ఆరంభ దశలోనే ఉన్నాం. మలుపు తిరగటానికి ఇంకా ఏడాది, అంతకన్నా ఎక్కువ సమయం ఉంది. ప్రశ్న ఏమిటంటే.. రాబోయే 12 – 16 నెలల కాలాన్ని ఎదుర్కొని ముందుకు సాగటానికి ఉన్న ప్రణాళిక ఏమిటి?’’ అంటారు డాక్టర్ ఝా.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్‌డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








