హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1757, ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన పదేళ్లలోనే భారత రాజుల సైనిక సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్నాయని, ప్లాసీ లాంటి విజయాన్ని పునరావృత్తం చేయడం కష్టమని ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లు గ్రహించారు.
భారత సంస్థానాలు కేవలం పదేళ్లలో యూరోపియన్ సైనిక టెక్నాలజీకి అనుగుణంగా మారాయి.
1760వ దశకం మధ్య నాటికి భారతీయ రాచరిక సంస్థానాలు, బ్రిటిష్ వారి సైనిక సామర్ధ్యాల మధ్య అంతరం తగ్గిందని స్పష్టమవుతోంది.
దక్షిణ భారత దేశంలో బ్రిటిషర్లు మొదట హైదర్ అలీ నుంచి అలాంటి సవాలును ఎదుర్కొన్నారు.
"18వ శతాబ్దంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మైసూర్ కేంద్రంగా ఉండేది. చరిత్రలో అత్యంత సాహసోపేతమైన, ఉత్తేజకరమైన కార్యకలాపాలకు మైసూరును జన్మస్థానంగా పరిగణించేవారు. బ్రిటిషర్లు ఇక్కడ ప్రమాదకరమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ప్రాంత నాయకుడి పేరు హైదర్ అలీ" అని 'హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్' పుస్తక రచయిత లెవిన్ బి. బోరింగ్ నాటి పరిస్థితుల గురించి రాశారు.
హైదర్ అలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ 38 ఏళ్లు మాత్రమే పాలించినా, ఆ స్వల్ప కాలంలోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసే సంఘటనలు జరిగాయి.


ఫొటో సోర్స్, Getty Images
పుట్టుకతోనే యోధుడు
హైదర్ అలీ పంజాబీ మూలాలున్న వ్యక్తి అని, మైసూర్ సైన్యంలో ఉన్నత పదవిలో ఉండేవారని చెబుతారు.
1776లో ఆయన మైసూరు రాజు వడయార్‌ను కూలదోసి అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు.
ఆ తర్వాత సైన్యాన్ని విస్తరించి పొరుగు రాష్ట్రాలను జయించడం ప్రారంభించారు.
"హైదర్ తన సైనికులకు ఫ్రెంచ్ కమాండర్లతో శిక్షణ ఇప్పించారు. శ్రీరంగపట్నం రక్షణను బలోపేతం చేయడానికి ఫ్రెంచ్ ఇంజినీర్లతో నిర్మాణాలు చేపట్టారు. సొంత నేవీ నిర్మాణానికి కృషి చేశారు. 1760లోనే ఆయన దగ్గర రెండు పెద్ద నౌకలు, 7 చిన్న యుద్ధ నౌకలు, 40 చిన్న పడవలు ఉన్నాయి. వీటన్నింటికీ స్టెన్నెట్ అనే యూరోపియన్ నాయకత్వం వహించారు" అని ఇర్ఫాన్ హబీబ్ తన 'రెసిస్టెన్స్ అండ్ మోడర్నైజేషన్ అండర్ హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్' అనే పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Pharos Book
హైదర్ పుట్టుకతోనే యోధుడని చెబుతారు. గుర్రపు స్వారీ, కత్తిసాముతో పాటు తుపాకీతో గురిచూసి కాల్చడంలో నిపుణుడు.
"హైదర్‌కు అలసటను తట్టుకునే అద్భుతమైన సామర్ధ్యం ఉంది. సైన్యాలను నడిపించేటప్పుడు ఆయన ప్రాణాల గురించి ఆలోచించేవాడు కాదు. దీంతో ఆయన సైనికులు కూడా అలాగే ఉండేవారు. యుద్ధ సమయంలో ప్రశాంతంగా ఉండటం, వేగంగా, ఆకస్మికంగా దాడి చేయడం హైదర్ ప్రత్యేకత. ఇలాంటి వ్యూహంతోనే ఆయన అనేక విజయాలు సాధించారు" అని లెవిన్ బోరింగ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
అసాధారణ జ్ఞాపకశక్తి
హైదర్ దాదాపు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉండేవారని "ది హిస్టరీ ఆఫ్ హైదర్ అండ్ హిజ్ సన్ టిప్పు సుల్తాన్" పుస్తకంలో మెస్తెర్ లా టో రాశారు.
ఆయన శరీరం గోధుమ రంగులో, ముఖం గరుకుగా ఉండేది. కాలి నడకన లేదా గుర్రం ఎక్కి మైళ్ల దూరం ప్రయాణించేవారు.
తెల్లటి మస్లిన్ దుస్తులు, తలపాగా ధరించడాన్ని ఇష్టపడేవారు.
"ఆయనకు ఆభరణాలంటే ఇష్టం లేదు. హైదర్ ఆకర్షణీయంగా కనిపించకున్నా, ఆయన ఉనికి, ఆత్మ విశ్వాసం, శక్తిసామర్థ్యాలు చరిత్రలో ప్రత్యేక ముద్ర వేశాయి. ఆయన ప్రతీ రోజూ అర్ధరాత్రి నిద్రపోయేవారు. ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేవారు" అని మెస్తెర్ రాశారు.
"మైసూరు రాజైన తరువాత ఆయన ముఖం మీద వెంట్రుకలన్నీ తొలగించారు. ఆయనకు గడ్డం, మీసం, కనుబొమ్మలు ఉండేవి కావు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య రాజభవనం నుంచి ఆస్థానానికి వచ్చేవారు. ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్లి ఏనుగులు, గుర్రాలకు సెల్యూట్ చేసేవారు. హైదర్ అసలు చదువుకోలేదు. చాలా కష్టంతో తన పేరులోని మొదటి అక్షరం 'హై' రాయడం నేర్చుకున్నారు" అని మెస్తెర్ తన పుస్తకంలో వివరించారు.
ఆయన కన్నడం, తెలుగు, మరాఠీ, తమిళ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. అయితే పర్షియన్, అరబిక్ భాషలపై అవగాహన లేదు. ఆయనకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది. దశాబ్దాల క్రితం తాను కలసిన వ్యక్తులను గుర్తించే అసాధారణ సామర్థ్యం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పరమత సహనం
హైదర్ పాలనలో మతానికి, మతపరమైన అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మైసూరులో 1610 నుంచి ఘనంగా జరుపుకునే దసరా ఉత్సవాలను ఆయన కొనసాగించారు. స్వయంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున ఆయన ఏనుగుపై స్వారీ చేస్తూ ఊరేగింపు ముందు కదిలివచ్చారు.
"ముస్లిం రాజులలో హైదర్ అత్యంత మత సహనం ఉన్న వ్యక్తి. తన మతం ప్రకారం ప్రార్థన చేయడం లేదా ఉపవాసం ఉండటం ఆయనకు తెలియదు. ఆయన నేర్చుకోలేదు. అన్ని మతాలు దేవుని దృష్టిలో సమానం అని బహిరంగంగా ప్రకటించారు" అని మార్క్ విల్కేస్ తన 'హిస్టారికల్ స్కెచెస్ ఆఫ్ ది సౌత్ ఆఫ్ ఇండియా ఇన్ యాన్ అటెంప్ట్ టు ట్రేస్ ది హిస్టరీ ఆఫ్ మైసూర్' పుస్తకంలో రాశారు.
1769 ఏప్రిల్ 27న హైదర్ శృంగేరి మఠానికి చెందిన జగద్గురు శంకరాచార్యకు ఒక లేఖ రాశారు.
"ఆ లేఖలో హైదర్ ఒక ఏనుగు, ఐదు గుర్రాలు, పల్లకీ, ఐదు ఒంటెలు, శారదా దేవికి చీర, రెండు శాలువాలు, 10 వేల రూపాయలున్న సంచిని పంపినట్లు ఉంది. ఆయన జగద్గురును పవిత్ర ఆత్మ అని లేఖలో సంబోధించారు" అని ఏకే శాస్త్రి తన "ది రికార్డ్స్ ఆఫ్ శృంగేరి ధర్మస్థాన' పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Gyan Publishing House
తొలిసారి రాకెట్లతో దాడి
1767 ఆగస్టులో హైదర్ ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధం ప్రకటించారు.
ఆ సమయంలో, హైదర్ సైన్యంలో 50 వేల మంది సైనికులున్నారు.
అప్పట్లో ఆయన వద్ద ఉన్న ఆధునిక సైనిక శక్తి గురించి ఈస్డిండియా కంపెనీకి తెలియదు.
హైదర్ సైనికుల రైఫిళ్లు, ఫిరంగులు అత్యాధునిక ఫ్రెంచ్ సాంకేతికపై ఆధారపడి ఉండేవి. బ్రిటిషర్ల వద్ద ఉన్న ఫిరంగులతో పోలిస్తే హైదర్ సైన్యం వద్ద ఉన్న ఫిరంగులు ఎక్కువ దూరం కాల్చడానికి వీలుగా ఉండేవి.
"బ్రిటిష్ సైన్యం కంటే హైదర్ సైన్యం చాలా విషయాల్లో మెరుగ్గా, వ్యూహాత్మకంగా ముందుండేది. ప్రత్యర్థి సైన్యాల్ని చెదరగొట్టడానికి హైదర్ సైనికులు ఒంటెల నుంచి రాకెట్లను ప్రయోగించడంలో నైపుణ్యం సాధించారు. హైదర్ తన సైన్యాన్ని, సైనిక సామగ్రిని తరలించడానికి ఎద్దుల బండ్లు ఉపయోగించేవారు. తర్వాతి కాలంలో బ్రిటిషర్లు కూడా దీన్ని అనుసరించారు. అప్పట్లో ఇదొక వింత" అని ఫ్రెంచ్ చరిత్రకారుడు జీన్-మేరీ లాఫాన్ తన పుస్తకం 'ఇండికా: ఎస్సేస్ ఇన్ ఇండో-ఫ్రెంచ్ రిలేషన్స్'లో రాశారు.
చివరకు, బ్రిటిషర్లు హైదర్ అలీతో ఒప్పందం చేసుకుని యుద్ధం నుంచి బయటపడ్డారు. దీంతో దేశంలోని సంస్థానాధీశులంతా బ్రిటిష్ వారిని కూడా ఓడించవచ్చని భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ వారిపై దాడి
వాడ్గావ్ ఒప్పందం జరిగిన ఏడాది తర్వాత, 1780 ఫిబ్రవరి 7న మరాఠా నాయకుడు నానా ఫడణవీస్ తన పాత శత్రువు హైదర్ అలీకి లేఖ రాశారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తమ సైన్యాలను ఏకం చేయాలని సూచించారు.
నెల రోజుల్లనే హైదరాబాద్ నిజాం కూడా హైదర్ అలీతో చేరాలని నిర్ణయించుకున్నారు. 1780 వేసవికల్లా బ్రిటిషర్లను దేశం నుంచి వెళ్లగొట్టాలని ఈ ముగ్గురు ఒక ప్రణాళిక సిద్ధం చేయసాగారు.
ఈ ప్రణాళిక సిద్ధమవుతున్న సమయంలోనే ఫ్రాన్స్ నుంచి పెద్దయెత్తున మైసూరుకు ఆయుధాలు చేరినట్లు మద్రాసులోని బ్రిటిష్ స్థావరానికి సమాచారం అందింది.
1780 జులై 17న హైదర్ అలీ మళ్లీ బ్రిటిషర్లపై దాడి చేశారు. ఈసారి ఆయన వద్ద గతంలో కంటే రెట్టింపు సైన్యం ఉంది.
హైదర్ సైన్యంలో 60 వేల మంది అశ్విక బలం, 35 వేల మంది పదాతి దళం, 100 ఫిరంగులు ఉన్నాయి. మద్రాసును రక్షించుకునేందుకు ఈస్టిండియా కంపెనీ 30 వేల మంది సైనికుల్ని మోహరించినట్లు పైకి చెప్పినా, ఆ నెలలో వారి వద్ద ఉన్న సైనికులు 8 వేల మంది మాత్రమే.
"హైదర్ ముందుకు సాగిన వేగం బ్రిటిష్ సైనికుల సంఖ్యను మరింత తగ్గించింది. ఈ సైనికుల్లో ఎక్కువ మంది కుటుంబాలు ఆర్కాట్‌లో ఉండేవి. వారి భార్యలు, పిల్లలను దృష్టిలో ఉంచుకుని హైదర్ సేనలు వారిని విడిచిపెట్టాయి. వారిలో కొంతమంది లొంగిపోయారు. మరికొందరు ప్రాణభిక్ష పెట్టినందుకు బ్రిటిష్ వారి స్థావరాల తలుపులు తెరిచారు. మద్రాస్, వెల్లూర్, ఆర్కాట్ చుట్టూ ఉన్న గ్రామాలకు నిప్పుపెట్టిన హైదర్ సేనలు బ్రిటిష్ వారి సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేశాయి" అని మార్క్ విల్క్స్ తన 'హిస్టారికల్ స్కెచెస్ ఆఫ్ ది సౌత్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
మున్రో, బేలీ సైన్యాలను ఏకం చేసే ప్రయత్నం విఫలం
1780 ఆగస్టు 25న హైదర్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బ్రిటిష్ సైన్యం మద్రాసు నుంచి కాంచీపురం వైపు బయల్దేరింది. ఈ సైన్యానికి జనరల్ హెక్టర్ మున్రో నాయకత్వం వహించారు. అప్పటికి 15 ఏళ్ల ముందు జరిగిన బక్సర్ యుద్ధంలో మున్రో సేనలు షుజా-ఉద్-దౌలాను ఓడించాయి.
హైదర్ అలీ మీద దాడికి బయల్దేరినప్పుడు ఆయన సైన్యంలో 5 వేల మంది మాత్రమే ఉన్నారు. వారికి నెలల తరబడి జీతాలు లేవు. మద్రాసుకు ఉత్తరాన 30 మైళ్ల దూరంలో తన సైన్యంతో వచ్చి మున్రో సైన్యంతో చేరాలని కల్నల్ విలియం బేలీకి ఆదేశాలు అందాయి.
"హైదర్ సైన్యం చాలా పెద్దగా ఉంది. వాళ్లు భూమి మీద ఎగసిపడుతున్న సముద్రపు అలల మాదిరిగా ఉన్నారు. ఆయన వెనుక ఉన్న ఫిరంగ దళాన్ని ముందు నుంచి చూస్తే, దాని ముగింపు ఎక్కడా కనిపించడం లేదు. ఇంతలో భారీ వర్షాలు మొదలయ్యాయి. బేలీ తన సైన్యాన్ని కోర్టలైర్ నది దాటి తీసుకురావడానికి పదకొండు రోజులు పట్టింది. ఈ 11 రోజుల వ్యవధిలోనే హైదర్ కుమారుడు టిప్పు సుల్తాన్ తన 11 వేల మంది సైనికులను మున్రో, బేలీ సైన్యాల మధ్యన నిలిపారు" అని గులాం హుస్సేన్ ఖాన్ తన 'సైర్ ముతాఖరీన్' పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బేలీ సైన్యాన్ని చుట్టుముట్టిన హైదర్ సైన్యం
సెప్టెంబర్ 6న రెండు సైన్యాలు మొదటిసారి తలపడ్డాయి. దాని గురించి కెప్టెన్ మువాత్ తన 'అకౌంట్ ఆఫ్ ది డిఫీట్ ఆఫ్ పొల్లిలూర్' అనే పత్రంలో రాశారు.
"ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో, వరి మాగాణుల్లో, మోకాలి లోతు నీటిలో పోరాడటం వల్ల బేలీ సైన్యపు బలహీనతలు పూర్తిగా బయటపడ్డాయి. ఆయన సైన్యం భారీగా నష్టపోయింది. రెండు సైన్యాలు ముఖాముఖి కాకుండా దూరం నుంచి పోరాడాయి."
కాసేపటి తర్వాత వారికి డోలు, నగారా శబ్ధాలు వినిపించాయి. మున్రో సైన్యం తమకు తోడుగా వస్తోందని బేలీ భావించారు. అయితే, దగ్గరగా వచ్చిన తర్వాత హైదర్ తన 25 వేల మంది సైనికులతో అక్కడకు చేరుకున్నట్లు వారికి అర్థమైంది.
"మమ్మల్ని హైదర్ అశ్విక దళం చుట్టుముట్టింది. వారి వెనుక ఫిరంగి దళం ఉంది. దాదాపు 50 ఫిరంగులు మా చుట్టు అర్థ వృత్తాకారంలో మోహరించాయి. యుద్ధాన్ని కాసేపు ఆపాలని హైదర్ ఆదేశించారు. వెనుక ఉన్న భారీ ఫిరంగులను ముందుకు తెచ్చిపెట్టారు. ఆ సైన్యంతో తలపడేందుకు మాకు ఎలాంటి అవకాశం లేదు" అని బేలీ తమ్ముడు తన 'అకౌంట్ ఆఫ్ పొల్లిలూర్'లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిషర్ల ఓటమి
మందుగుండు సామగ్రి అంతా అయిపోవడంతో బేలీ తన కత్తికి తెల్ల రుమాలు కట్టి లొంగిపోయేందుకు చిహ్నంగా దాన్ని పైకి లేపారు.
సైనికులు ఆయుధాలు వదిలేయాలని ఆయన సూచించారు.
అయితే, కొంతమంది ఆయన సూచనను పట్టించుకోలేదు. కాల్పులు కొనసాగించారు.
దీంతో హైదర్ కూడా యుద్ధాన్ని కొనసాగించారు.
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి. ఇంకొందరి బట్టలు చిరిగిపోయి, మండుతున్న ఎండల్లో నీరు కూడా దొరక్క అడవి జంతువులకు ఆహారమైపోయారు. బ్రిటిష్ సైన్యంలోని 86 మంది అధికారులలో 36 మంది మరణించారు. 34 మంది గాయపడ్డారు. 16 మందిని బందీలుగా పట్టుకున్నారు" 73 హైలాండ్ రెజిమెంట్‌కు చెందిన ఒక లెఫ్టినెంట్ ఈ విషయాలు తనతో చెప్పినట్లు "వెన్ ది టైగర్ ఫైట్ ది థిస్టిల్" అనే తన పుస్తకంలో అలాన్ ట్రిట్టన్ రాశారు.
బేలీ తల, వీపుకు గాయాలయ్యాయి. ఆయన కాలు తెగిపోయింది. ఆయనను ఫిరంగి బండికి కట్టి హైదర్ ముందుకు తీసుకువచ్చారు. ఇతర బందీలతో కలిపి కూర్చోబెట్టారు. ఈస్డిండియా కంపెనీ సైనికులు, అధికారులకు మొదటిసారి పట్టుబడటం అంటే ఏంటో తెలిసొచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్ బందీల పట్ల అనుచిత ప్రవర్తన
వేల మంది బ్రిటిష్ సైనికులు బందీలుగా దొరికారు.
"హైదర్ బందిఖానాలో పదేళ్లు గడిపిన తర్వాత, కుర్చీ మీద కూర్చోవడం, కత్తి, ఫోర్క్ ఉపయోగించి ఆహారం తినడం ఎలాగో పూర్తిగా మర్చిపోయాను. ఇంగ్లిష్ కూడా మాట్లాడలేకపోయాను. చర్మం నల్లగా మారింది. యూరోపియన్ దుస్తులు ధరించడం మీద ఆసక్తి పోయింది" అని బందీల్లో ఒకరైన జేమ్స్ స్కరీ తన "ది క్యాప్టివిటీ, సఫరింగ్ అండ్ ఎస్కేప్ ఆఫ్ జేమ్స్ స్కరీ" అనే పుస్తకంలో రాశారు.
"బేలీ ఓటమి తర్వాత హైదర్ పోరాటాన్ని కొనసాగించి ఉంటే ఆయన ఫోర్ట్ సెయింట్ జార్జ్‌ను తేలిగ్గా స్వాధీనం చేసుకుని ఉండేవారు. అయితే, ఆయన తన సైన్యాన్ని కాపాడుకోవాలనుకున్నారు. అది బ్రిటిష్ వారి అదృష్టం. తర్వాతి కాలంలో ఈస్టిండియా కంపెనీతో ప్రత్యక్ష ఘర్షణ విధానాన్ని వదిలి పెట్టి వారికి దూరంగా వ్యవహరించే విధానాన్ని ఆచరించారు" అని మాయా జాసనోఫ్ 'ఏజ్ ఆఫ్ ది ఎంపైర్: కాంక్వెస్ట్ అండ్ కలెక్టింగ్ ఇన్ ది ఈస్ట్ 1750-1850'అనే పుస్తకంలో రాశారు.
తర్వాతి కొన్ని నెలల్లో హైదర్‌తో మరాఠీలకున్న అనుబంధాన్ని విచ్ఛిన్నం చేయడంలో గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ విజయం సాధించారు.
మరాఠా కమాండర్ మహాద్జీ సింధియాతో హేస్టింగ్స్ చేసుకున్న ఒప్పందం వల్ల మరాఠాలు బ్రిటిషర్లకు మిత్రులుగా మారారు.
ఫలితంగా, హైదర్ బ్రిటిష్ వారితో జరిగిన తర్వాతి యుద్ధంలో ఓడిపోయారు.
"హైదర్ ఆయన సహచరులు1780లో ఈస్టిండియా కంపెనీపై ఒత్తిడిని కొనసాగించి ఉంటే బ్రిటిష్ వారు భారత్‌ను శాశ్వతంగా వదిలేసి ఉండేవాళ్లు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినందుకు మైసూరు, పుణె సంస్థానాలు తర్వాతి కాలంలో చింతించాయి" అని విలియం డరింపిల్ తన 'ది అనార్కీ' అనే పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Bloomsbury
వెన్నెముక క్యాన్సర్‌తో హైదర్ మృతి
1782లో హైదర్ వీపు మీద లేచిన కురుపు పెద్దది కావడంతో ఆయనకు వెన్నెముక క్యాన్సర్ ఉందని గుర్తించారు.
రెండో ఆంగ్లో- మైసూరు యుద్ధం నాటికి హైదర్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆయన బలం, వేగం తగ్గింది. 1782 డిసెంబర్ 7న 60 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.
"హైదర్ చనిపోయిన సమయం భారత చరిత్రలో ఒక సంఘటన మాత్రమే కాదు. ఆయన మరణం భారత్‌లో బ్రిటిషర్లు శక్తి పుంజుకునేందుకు పునాది వేసింది" అని శామరావు తన 'మోడరన్ మైసూర్ ఫ్రమ్ బిగినింగ్ టు 1868' పుస్తకంలో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











