ఆంధ్రప్రదేశ్: రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే చట్టంగా మారిన మూడు రాజధానుల వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జగన్ సర్కారు అంటోంది.
అయితే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ విపక్షాల నుంచి వినిపిస్తోంది. ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ మినహా దాదాపు అన్నిపార్టీలు అమరావతినే కొనసాగించాలని కోరుతున్నారు.
కొందరు న్యాయపోరాటం చేస్తుండగా, ప్రభుత్వం తెచ్చిన వికేంద్రీకరణ చట్టాలపై కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. ఇటు రాజధాని ప్రాంతంలోని కొందరు రైతులు అమరావతినే కొనసాగించాలంటూ ఏడాది కాలంగా ఆందోళన సాగిస్తున్నారు.
ఎన్నికలకు ముందు ఏం చెప్పారు?
రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ఎన్నికలకు ముందు వైసీపీ ప్రకటించింది. రాజధాని తరలింపు ఆలోచన లేదని ఆ పార్టీ నేతలన్నారు. తాను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నానని ప్రతిపక్ష నేతగా జగన్ అన్నారు.
అదే సమయంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, భూకుంభకోణం సాగిందనే విమర్శలు చేస్తూనే వచ్చారు. వాటిపై తాము అధికారంలోకి రాగానే విచారణ చేసి, దోషులను శిక్షిస్తామని కూడా అన్నారు జగన్.
అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీతో పాటుగా వివిధ రూపాల్లో అమరావతి అక్రమాల ఆరోపణలపై విచారణ సాగించింది.
కొందరు నేతలు రాజధాని ప్రకటనకు ముందే ఇక్కడ భూములు కొనుక్కుని అవి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా, మంచి ధర లభించేలా ప్రణాళికలు వేశారని క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికలో పేర్కొంది.
ఇవే ఆరోపణలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఏసీబీ కేసులలో కొందరు అధికారులు, అప్పటి అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి బంధువుల పేర్లు ఉన్నాయి.
రాజధాని అంశంపై పరిశీలనకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ కంపెనీ పేరుతో మరో కమిటీని ఏర్పాటు చేయగా, ఈ రెండూ దాదాపు ఒకే రీతిలో నివేదికలు ఇచ్చాయి. మూడు రాజధానులు, జోన్లు, ఇతర చర్యలను సూచించాయి.
ఈ కమిటీలో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం తీసుకుని తుది నివేదికలు ఇచ్చాయని ప్రభుత్వం చెప్పినా, ప్రజాక్షేత్రంలో పరిశీలన లేకుండా ఈ నివేదికలు రూపొందించారనే ఆరోపణలు వినిపించాయి.

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM
డిసెంబర్ 17 ప్రకటన
ఏపీ రాజధాని వ్యవహారంపై 2019 డిసెంబర్ 17 న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి సంచలన ప్రకటన చేశారు.
“డీసెంట్రలైజేషన్ చాలా అవసరం. మనం కూడా మారాలి.. మనకు కూడా దక్షిణాఫ్రికా మాదిరిగా మూడు రాజధానుల అవసరం రావచ్చు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండొచ్చు. యంత్రాంగం అక్కడి నుంచే పని చేయవచ్చు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా కొనసాగించవచ్చు. కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ రావచ్చు. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు రాజధానులు వస్తాయోమో. రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది’’ అన్నారు జగన్.
‘‘అమరావతిని రాజధాని చేయడం కోసం ఎకరాకి రూ. 2 కోట్లు చొప్పున లెక్కిస్తే రూ. 1.06 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. అదే విశాఖలో అయితే అలాంటి అవసరమే ఉండదు" అంటూ అని ఆయన తన శాసన సభ ప్రసంగంలో అన్నారు

సీఎం ప్రకటనతో కలకలం - నిరసనలు
సీఎంగా జగన్ చేసిన ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ భవితవ్యానికి సంబంధించి పెను మార్పులకు మూలం అయ్యింది. అప్పటికే అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా 34 వేల ఎకరాల భూమిని ఇచ్చిన సుమారు 29 వేల మంది రైతులకు ఈ నిర్ణయం ఆగ్రహం కలిగించింది. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో వారు నిరసనలకు దిగారు.
అలా మొదలైన ఆందోళనలు ఏడాది కాలంగా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. పలుమార్లు ఉద్రిక్తతలు, అరెస్టులు, కేసుల నమోదులు కూడా జరిగాయి.
సుమారుగా 1500 మందిని అరెస్ట్ చేశారని అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వెలగపూడికి చెందిన జొన్నలగడ్డ నాగేశ్వరరావు బీబీసీతో అన్నారు.
"మేము ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చాం. ఇప్పడు వెనక్కి ఇచ్చినా ఏమీ చేసుకోలేం. ఏమి చేయాలన్నా కనీసం మాతో చర్చించాలి. కానీ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరించింది. అందుకే మేము రోడ్డెక్కాం’’ అన్నారు నాగేశ్వర రావు.
“నేను విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నా, జై ఆంధ్రా ఉద్యమంలోనూ ఉన్నా. ఇప్పుడు అమరావతి కోసం పోరాడుతున్నా. ఎంత వేధించినా మా డిమాండ్ ఒక్కటే. అమరావతి ఏకైక రాజధానిగా కావాలి. దాన్ని సాధిస్తాం’’ అన్నారాయన.

మండలి అభ్యంతరాలకు నో
పాలనా వికేంద్రీకణ, సీఆర్డీయే రద్దు చట్టాల రూపకల్పన ఏడాది కాలంగా ఏపీ రాజకీయాల్లో పలు మలుపులకు కారణమయ్యింది. డిసెంబర్ ప్రకటన తర్వాత జనవరిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లును ఆమోదించారు. కానీ శాసనమండలిలో దానికి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అక్కడ విపక్ష టీడీపీకి మెజారిటీ ఉండడంతో చైర్మన్ షరీఫ్ ఆ రెండు బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.
మండలి నిర్ణయంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిగా మండలిని రద్దు చేస్తూ ఆ మరుసటి రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ప్రస్తుతం అది కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే మండలి రద్దుకు పార్లమెంటు తీర్మానం చేయాల్సి ఉండగా, అది ఇంకా ప్రస్తావనకు రాలేదు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మరోసారి ఏపీ అసెంబ్లీ అవే రాజధాని సంబంధిత చట్టాలను ఆమోదించింది. రెండోసారి మండలి ముందుకు వచ్చినప్పటికీ అక్కడ బిల్లుకి ఆమోదం లభించలేదు. సెలక్ట్ కమిటీ ముందు ఉన్న బిల్లులంటూ విపక్షం అభ్యంతరం పెట్టింది.
చివరకు రెండుసార్లు మండలిలో ఈ బిల్లుల ఆమోదానికి అవకాశం దక్కకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 197 ప్రకారం మూడు నెలలు వేచి చూసి, గవర్నర్ ఆమోదానికి పంపింది. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించిన బిల్లులు మండలిలో ఆమోదం పొందకపోతే 3 నెలల తర్వాత అవి ఆమోదం పొందినట్టేనన్న నిబంధన ఉండడం వల్ల చివరకు ఈ ఏడాది సెప్టెంబర్ చివరిలో గవర్నర్ వాటికి రాజముద్ర వేయడంతో అవి చట్ట రూపం దాల్చాయి.
కోర్టుల్లో కొనసాగుతున్న వివాదాలు
శాసన మండలిలో వ్యవహారాలు, సెలక్ట్ కమిటీ నిర్ణయాలు, చట్టంగా మారిన తీరు, మూడు రాజధానుల అంశం చట్టబద్ధత, వాటితోపాటుగా అమరావతి రైతుల ఆందోళనలను ప్రస్తావిస్తూ పలువురు ఈ రెండు చట్టాలను ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
కొన్ని నెలలుగా వాటి విచారణ కొనసాగుతుండగా, వివిధ సందర్భాల్లో కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయితే తుది తీర్పు వెలువడేందుకు ఇంకా సమయం పట్టవచ్చు. అయితే కోర్టు నిర్ణయం తమకే అనుకూలంగా ఉంటుందని అటు ప్రభుత్వం, ఇటు పిటిషనర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలను నడిపిస్తున్న మహిళలు
అమరావతి పరిరక్షణ సమితి పేరుతో రాజధాని ప్రాంతంలో కొన్నిగ్రామాల్లో నిరసనలు నిత్యం కొనసాగుతున్నాయి. వారికి మద్ధతుగా విజయవాడ, గుంటూరు నగరాల్లో కూడా వివిధ కార్యక్రమాలు జరిగాయి. అయితే దాదాపుగా అన్ని ఆందోళనల్లోనూ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
"ఇంట్లో పిల్లలు, ముసలి వాళ్ల బాగోగులు చూసుకోవాలి. వారి అవసరాలన్నీ తీర్చిన తర్వాత బయటకు వస్తున్నాం. ఎప్పుడూ ఇలా రోడ్డున పడలేదు. మొదటిసారి మా పిల్లల భవష్యత్ కోసం ఈ ఉద్యమం చేస్తున్నాం ” అని మందడం గ్రామానికి చెందిన మణి బీబీసీతో అన్నారు.
“ఏడాది కాలంగా ప్రభుత్వం వేధిస్తోంది. కనకదుర్గ ఆలయానికి వెళదామంటే అడ్డంకులు, కోటప్ప కొండకు మొక్కుకుందామని వెళుతుంటే ఆంక్షలు... ఇలా ఏదీ చేయనివ్వలేదు. కేసులు కూడా పెట్టారు. మహిళలను వేధించారు” అని మణి ఆరోపించారు.
కరోనా సమయంలో కూడా ఈ ఆందోళనలు కొనసాగాయి. ఇప్పటికీ సామాజిక దూరం పాటిస్తూ నిరసన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, @JANASENAPARTY
అన్ని పార్టీల వాదన అమరావతి కోసమే
అమరావతి పరిరక్షణ సమితిలో టీడీపీ నేతలు క్రియాశీలకంగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా ఈ ఉద్యమాన్ని విస్తరించాలని ప్రయత్నించారు. వివిధ ప్రాంతాల్లో బిక్షాటన, ప్రచార కార్యక్రమాలను ఆయన చేపట్టారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు.
కాంగ్రెస్, సీపీఐ నేతలు కూడా అమరావతి ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారు. రైతుల ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి రీత్యా ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలని సీపీఎం కోరింది.
బీజేపీ నేతలు మాత్రం భిన్నస్వరాలు వినిపించారు. తొలుత సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణవంటి నాయకులు అమరావతి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జీవీఎల్ నరసింహరావువంటి నేతలు మాత్రం రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, తాము జోక్యం చేసుకోబోమని ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది.
తాజాగా సోము వీర్రాజు మాత్రం అమరావతిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తుళ్లూరులో అమరావతి ప్రాంత రైతులకు మద్ధతుగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.
"మా పార్టీ వైఖరి స్పష్టం. కేంద్రం రాజ్యాంగబద్ధంగా తన వైఖరిని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం అమరావతి రైతులకు మద్ధతునిస్తోంది. రాజధాని విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారు. మేము అధికారంలోకి వస్తే ఐదు వేల ఎకరాల పరిధిలో రాజధాని నిర్మిస్తామని చెప్పాం. కర్నూలులో హైకోర్ట్ విషయంలో మా వైఖరి మారదు" అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమరాతి కాదు భ్రమరావతి అంటున్న అధికార పక్షం
అమరావతి కోసం సాగుతున్న ఆందోళనకు పోటీగా బహుజన సంఘాల పేరుతో రెండు నెలలుగా మరో ఉద్యమం సాగుతోంది. ఈ రెండు శిబిరాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. పోటాపోటీగా ఫిర్యాదులు కూడా చేసుకున్నారు.
బహుజన సంఘాల ఆందోళనను చిత్రీకరించేందుకు వెళ్లిన బీబీసీకి శిబిరం నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు తమ ఉద్యమాన్ని తక్కువ చేసేలా కథనాలు ఇస్తున్నాయని, అందువల్ల ఎవరికీ ఉద్యమాన్ని చిత్రీకరించేందుకు అవకాశం ఇవ్వడం లేదని, తమకు ప్రచారం అవసరం లేదని వారు చెప్పారు.
రాజధాని ప్రాంత రైతులకు చంద్రబాబు న్యాయం కన్నా అన్యాయమే ఎక్కువ చేశారని బాపట్ల ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ ఆరోపించారు.
"చంద్రబాబు వల్లే అమరావతి భ్రమరావతి అయ్యింది. ఎస్సీ, బీసీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. 34 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం ఏ విధంగా న్యాయం? అసైన్డ్ రైతులకు అన్యాయం చేశారు. మేము అమరావతిని శాసన రాజధానిగా ఉంచి, అభివృద్ధి చేస్తాం, పాలనా వికేంద్రీకరణకు ప్రజలంతా మద్ధతునిస్తున్నారు" అని ఎంపీ సురేశ్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/VZMGOAP
చట్టాలు అమలు చేస్తాం: ప్రభుత్వం
పాలనా వికేంద్రీకరణ విషయంలో చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. అమరావతి పరిణామాలపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
“రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మా ప్రభుత్వం చట్టాలు చేసింది. దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సాధ్యం కాదు. నిజమైన రైతులకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదు. శాసన రాజధానిగా అమరావతి ప్రాంతమంతా అభివృద్ధి అవుతుంది” అని ఆయన చెప్పారు.
“విశాఖ కేంద్రంగా పాలనా రాజధాని ఏర్పాటుకు అనుగుణంగా చర్యలు ఉంటాయి’’ అని బొత్స సత్యన్నారాయణ స్పష్టం చేశారు.
2015లో శంకుస్థాపన తర్వాత కొన్ని నిర్మాణాలకు ప్రయత్నం జరిగింది. కానీ ఏడాది కాలంగా అక్కడ పరిస్థితి సందిగ్ధంగా మారినట్టు చెప్పవచ్చు. టీటీడీ ఆధ్వర్యంలో సాగుతున్న ఆలయ నిర్మాణ పనులు మినహా ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదు.
రాజధాని విషయంలో ఎప్పుడు స్పష్టత వస్తుందన్నది ఎవరకీ అంతుపట్టడం లేదు. అయితే న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు చెబుతుండగా, తాజాగా కేంద్ర హోంమంత్రితో భేటీలో పాలనా వికేంద్రకరణ అంశాన్ని ప్రస్తావించి, తమ నిర్ణయంలో మార్పులేదన్న సంకేతాలను ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









