ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

పిల్లల

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఐదవ విడత నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019- 20ని శనివారం విడుదల చేసింది. ఈ సర్వే ఫలితాల ద్వారా రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాలలో జిల్లాల వారీగా జనాభా, ఆరోగ్యం, పౌష్టికత, మహిళా సాధికారత, గృహ హింస, పునరుత్పత్తి సామర్ధ్యం, శిశు మరణాలు, తల్లీ పిల్లల ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకోవచ్చు.

1992 నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు ఈ సర్వేని నిర్వహించారు. 4వ విడత ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వే 2015-16లో జరిగింది.

వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ విషయంలో తలెత్తుతున్న అంశాలను తెలుసుకోవడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యాలు.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ సర్వేకి నోడల్ కేంద్రంగా ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్‌ను నియమించింది.

ఈ సర్వేలో ప్రధానంగా నాలుగు రకాల షెడ్యూల్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు.

పిల్లలకు ఇచ్చే జ్యూస్

ఫొటో సోర్స్, Getty Images

1 గృహాషెడ్యూల్: దీని ద్వారా ఒక గృహంలో నివసించే కుటుంబ సభ్యులతో పాటు ఆ ఇంటిలో సర్వే ముందు రోజు రాత్రి కుటుంబ సభ్యులతో పాటు నివసించిన వారి వివరాలు, వారి సాంఘిక , ఆర్ధిక పరిస్థితులు, నీటి వసతి, పరిశుభ్రత, వైద్యం, ఇన్సూరెన్సు , అంగ వైకల్యం, భూమి యాజమాన్యం, సర్వేకు 3 సంవత్సరాల ముందు ఇంట్లో సంభవించిన మరణాలు, దోమ తెరల వాడకం కూడా పరిశీలిస్తారు.

2. మహిళల షెడ్యూల్: మహిళల షెడ్యూల్లో వివాహం, పునరుత్పత్తి, గర్భ నిరోధ సాధనాలు, పిల్లలకు టీకా మందులు, వైద్యం, పోషకాహార లభ్యత, లైంగిక అలవాట్లు, హెచ్ఐవి/ ఎయిడ్స్, మహిళా సాధికారత, గృహ హింసను చేర్చారు.

3) పురుషుల షెడ్యూల్: పురుషుల షెడ్యూల్లో పురుషుల లక్షణాలు, వివాహం, పిల్లలు, గర్భ నిరోధ సాధనాల వాడకం, పునరుత్పత్తి ప్రాధాన్యతలు, పోషకాహారం, లైంగిక అలవాట్లు, ఆరోగ్యం, ఇతర లింగాల పట్ల ఉన్న అభిప్రాయాలు, హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి సమాచారం సేకరించారు.

4) బయో మార్కర్ షెడ్యూల్: దీని ద్వారా పొడవు, బరువు, నడుము, తొడ వెడల్పు, పిల్లలలో, 15 - 49 సంవత్సరాల మహిళల్లో , 15 - 54 వయసు ఉన్న పురుషుల్లో హెమోగ్లోబిన్ స్థాయిలు, 15 ఏళ్ళు పై బడిన స్త్రీ పురుషుల బీపీ, మధుమేహం శాతాలు పరిశీలించారు. దీంతో పాటు, హెచ్ బిఏ1సి, మలేరియా, విటమిన్ డి3 వంటి వాటి పరీక్షకు కూడా రక్తాన్నిసేకరించారు.

జ్యోతి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నమోదైన వివరాలను పరిశీలిస్తే మహిళా సాధికారతకు సంబంధించిన అంశాల్లో మెరుగుదల కనిపించింది.

పిల్లల్లో పోషకాహార లోపం, రక్త హీనత విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి స్వల్పంగా నమోదు కాగా, తెలంగాణలో పరిస్థితి కొంత దిగజారింది.

అయితే, నెలసరి సమయంలో మహిళలు పాటించే శుభ్రత విధానాలలో మాత్రం గతంలో కంటే మెరుగుదల కనిపించింది. తెలంగాణాలో గృహ హింసకు గురైన వారి సంఖ్య పెరగగా, అది ఆంధ్ర ప్రదేశ్‌లో కొత తగ్గింది.

ఆంధ్రప్రదేశ్‌లో జులై 2 2019 నుంచి నవంబరు 14, 2019 వరకు సిగ్మా రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ ప్రవేట్ లిమిటెడ్ అనే సంస్థ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫీల్డ్ వర్క్ నిర్వహించింది. దీని కోసం 11,346 గృహాలను సర్వే చేసి, 10,975 మంది మహిళలు, 1,558 పురుషుల నుంచి సమాచారాన్ని సేకరించారు.

పోలియో

ఫొటో సోర్స్, Getty Images

పెరిగిన టీకా మందుల సరఫరా

సర్వే చేసిన మహిళల్లో 18 ఏళ్ల లోపు వివాహం చేసుకుంటున్న వారి సంఖ్య ఎన్ఎఫ్ హెచ్ఎస్ - 4లో 33 శాతం ఉంటే అది 2019 - 20లో 29.3 శాతం ఉంది. 15 - 19 సంవత్సరాల మధ్య వయసులో గర్భం దాల్చిన వారి సంఖ్య 2015-16లో 11.8 ఉండగా అది ఈ ఏడాది 12.6గా నమోదైంది.

ప్రతీ 1000 జననాలకు శిశు మరణాల శాతం 19. 9గా నమోదైంది. గతంలో ఇది 23.6 ఉండేది. అలాగే, పిల్లల టీకా మందుల సరఫరా గతంలో కంటే ఇప్పుడు పెరిగినట్లు ఈ సర్వే పేర్కొంది. 12 - 23 సంవత్సరాల పిల్లల్లో టీకాలు వేసిన వారి శాతం 73 శాతానికి పెరిగింది. ఇది గతంలో 65 శాతం మాత్రమే ఉండేది.

ఆస్పత్రి ప్రసవాలు గతంలో 91.5 ఉండగా అవిప్పుడు 96.5 శాతానికి పెరిగాయి.

పిల్లల్లో రక్త హీనత, పోషకాహార లోపం

5 ఏళ్ల లోపు పిల్లలలో ఎదుగుదల తగ్గిన వారి శాతం 31.2 ఉంది. ఇది గతంలో 31. 4 శాతం ఉండేది.

సంఖ్యాపరంగా ఇది కేవలం 0. 2 శాతం తగ్గుదలగా కనిపిస్తున్నప్పటికీ దీనిని మెరుగైన అభివృద్ధే అని చెప్పవచ్చని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి డైరెక్టర్ కృతిక శుక్ల బీబీసీ న్యూస్ తెలుగుతో చెప్పారు.

ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న మహిళలు గత సర్వేలో 33.5 ఉండగా అదిప్పుడు 33.1 శాతానికి తగ్గింది.

6 - 59 నెలలున్న శిశువుల్లో రక్త హీనత ఉన్నవారి శాతం 58. 6 ఉండగా అదిప్పుడు 63. 2 ఉంది.

15 - 49 సంవత్సరాలు ఉన్న మహిళల్లో రక్త హీనత 58. 8 శాతం ఉంది. ఇది గతంలో కంటే తగ్గింది. ఈ పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని కృతిక చెప్పారు.

ఊబకాయం

ఫొటో సోర్స్, SPL

ఈ ఏడాది సెప్టెంబరులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గర్భిణులకు, పాలిచ్చే తల్లుల కోసం, పిల్లలకు పోషకాహారాన్ని అందించేందుకు వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ, వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాలను ప్రారంభించారు. ఈ పథకాల ద్వారా సుమారు 30 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ప్రకటించారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 1863 కోట్ల రూపాయిలను కూడా కేటాయించింది.

అంగన్వాడీల ద్వారా గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మందులను ఇస్తున్నట్లు కృతిక తెలిపారు. ఈ పథకాల కింద ప్రతీ రోజు ఒక గుడ్డు, పాలు భోజనంతో పాటు ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాల వారిగా ఈ సమాచారాన్ని పరిశీలించి పోషకాహార లోపాన్ని నిర్మూలించే దిశగా ప్రయత్నాలు చేపడతామని ఆమె చెప్పారు.

నెలసరిలో సురక్షిత విధానాలను అవలంబిస్తున్న మహిళలు గతంలో 67.5 శాతం ఉండగా అదిప్పుడు 85. 1 శాతానికి పెరిగింది.

సర్వేలో పాల్గొన్న 18 - 49 సంవత్సరాల వయసులో ఉన్న 30 శాతం మహిళలు భాగస్వామి వలన శారీరక హింసకు గురైనట్లు తెలిసింది. నగరాలలో ఇది ఎక్కువగా ఉంది.

18 - 29 సంవత్సరాల వయసులో ఉన్న మహిళల్లో లైంగిక హింసకు గురైన వారిలో 3.7 మంది ఉన్నారు. గతంలో ఇది 6. 8 శాతం ఉండేది. గర్భం దాల్చిన మహిళల్లో 3. 8 శాతం మంది భాగస్వామి వలన హింసకు గురైనట్లు తెలిసింది.

మహిళల పై జరుగుతున్న హింసను అరికట్టడానికి ఆ కేసులను సత్వరమే పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ పోలీసు స్టేషన్లను, యాప్ కూడా ప్రవేశ పెట్టింది.

భాగస్వామి వలన హింసకు గురవుతున్న మహిళల సంఖ్య కూడా తగ్గిందని కృతిక చెప్పారు.

పెరిగిన మహిళా సాధికారత

ఇంట్లో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో మహిళలకు కూడా పాత్ర ఉందని 87. 2 శాతం మహిళలు తెలిపారు. గతంలో ఇది 81 శాతం మాత్రమే ఉండేది.

సర్వే చేసిన మహిళల్లో 84. 4 శాతం మందికి సొంతంగా నిర్వహించుకునే బ్యాంకు అకౌంటు ఉంది 66. 6 శాతం మహిళల పేరు మీద ఆస్తి ఉంది. ఇది గతంలో 47. 4 శాతం ఉండేది.

బాలింత

ఫొటో సోర్స్, Prathima/bbc

తెలంగాణలో చిన్న వయసు పెళ్లిళ్లు తగ్గాయి

తెలంగాణలో జూన్ 30 2019 నుంచి నవంబరు 14 వరకు కార్వీ డేటా మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ సర్వేని నిర్వహించింది. దీని కోసం 27,351 గృహాల నుంచి, 27,518 మహిళలు, 3863 మంది పురుషుల నుంచి సమాచారాన్ని సేకరించారు.

18 ఏళ్ల లోపు వివాహం చేసుకుంటున్న వారి సంఖ్య 2015 -16లో 26. 2 శాతం ఉంటే అది 2019 - 20లో 23.5 శాతం ఉంది. 15 - 19 సంవత్సరాల మధ్య వయసులో గర్భం దాల్చిన వారి సంఖ్య 2015లో 10.6 ఉండగా అది ఈ సారి 5.8గా నమోదైంది.

వ్యవస్థాగత ప్రసవాలు గతంలో 91. 5 ఉండగా అవిప్పుడు 97 శాతానికి పెరిగాయి.

ప్రతీ 1000 జననాలకు శిశు మరణాల శాతం గతంలో 20.0 ఉండగా , అదిప్పుడు 16.8 గా నమోదైంది.

5 ఏళ్ల లోపు పిల్లలలో ఎదుగుదల కుంటుపడిన వారి శాతం గత సర్వేలో 28.0 ఉండగా ఈ ఏడాది సర్వేలో 33.1 ఉంది.

శిశువులు, అయిదేళ్ల లోపు పిల్లల్లో రక్త హీనత 60. 7 ఉండగా అదిప్పుడు 70.0 ఉంది. 15 - 49 సంవత్సరాలు ఉన్న మహిళల్లో రక్త హీనత 58. 8 శాతం ఉంది. ఇది గతంలో కంటే తగ్గింది.

తెలంగాణాలో లాక్ డౌన్ సమయంలో పోషకాహారాన్ని లబ్ధిదారుల ఇంటికే అందించే ఏర్పాట్లు చేయాలని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలు కూడా జారీ చేశారు.

మధ్యాహ్న భోజనం, విద్యార్థి

ఫొటో సోర్స్, Getty Images

రక్త హీనత ఇంటర్ జెనెరేషనల్ లోపం. దీనిని నివారించడానికి ప్రవేశపెట్టిన ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని గనక సరిగ్గా అమలు చేయగలిగితే పుట్టబోయే పిల్లల్లో రక్త హీనతను నివారించగలమని పోషకాహార నిపుణులు అంటున్నారు.

"రక్త హీనత రాత్రికి రాత్రి పరిష్కరించే సమస్య కాదు. గర్భిణుల స్థాయి నుంచే సమస్య పరిష్కరించుకుంటూ రాగలిగితే రక్త హీనతను నివారించవచ్చు" అని మాగ్నా కార్టా ఫౌండేషన్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ విజయ భవాని అన్నారు.

"ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా మహిళ గర్భం దాల్చిన సమయంలో 1,000 రోజుల పాటు పోషకాహారాన్ని అందించగలిగితే పిల్లల్లో రక్త హీనతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది" అని ఆమె అన్నారు.

"క్షేత్ర స్థాయిలో పని చేసేవారికి కూడా పౌష్టికాహారం ఇవ్వడంలో ఉండే ప్రాముఖ్యతను గురించి శిక్షణ ఇవ్వాలి . అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగినప్పుడే సరైన ఫలితాలు వస్తాయి" అని ఆమె అభిప్రాయపడ్డారు.

15 - 49 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలలో సాధారణ స్థాయి కంటే తక్కువ బిఎంఐ ఉన్న వారు గతంలో 22.9 ఉండగా అదిప్పుడు 18. 8 గా ఉంది. ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న మహిళల శాతం గతంలో 33 .5 ఉండగా అదిప్పుడు 33.1 ఉంది.

నెలసరిలో సురక్షిత విధానాలను అవలంబిస్తున్న మహిళల శాతం గతంలో 76. 6 ఉండగా అది 92.1 శాతానికి పెరిగింది.

18 - 49 సంవత్సరాల వయసులో ఉన్న 36.9 శాతం మహిళలు భాగస్వామి వలన శారీరక హింసకు గురైనట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాలలో ఇది ఎక్కువగా ఉంది. 18 - 29 సంవత్సరాల వయసు లోపు ఉన్న మహిళలు లైంగిక హింసకు గురైన వారిలో 5. 0 మంది ఉన్నారు. ఇది గతంలో కంటే తగ్గింది.

గ్రామీణ ప్రాంత మహిళల్లో 5.1 శాతం గర్భం దాల్చిన సమయంలో శారీరక హింసకు గురైనట్లు తెలిసింది. ఇది గ్రామీణ ప్రాంతాలలో 5.1 శాతం ఉండగా నగరాల్లో 2. 1 శాతం ఉంది.

తెలంగాణలో ఎక్కడి నుంచైనా షీ టీం కి కాల్ చేసి తమ సమస్యను ఫిర్యాదు చేసే అవకాశం తెలంగాణ పోలీసు శాఖ కల్పిస్తోంది. వీరికి వాట్స్ యాప్ ద్వారా కూడా సమాచారాన్ని అందించవచ్చు. గృహ హింసకు గురైన వారు కూడా పోలీసు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది.

ఆసుపత్రుల్లో ప్రసవాలు, మాతా శిశు మరణాల నివారణ విషయంలో తెలంగాణ మెరుగైన ఫలితాలను కనబరిచిందని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు భోజనంతో పాటు గుడ్లు, పాలు ఇస్తున్నట్లు చెప్పారు. అయితే రక్త హీనత తగ్గించడానికి ఇంకా చాలా పని జరగాల్సి ఉందని అన్నారు. ఇందు కోసం అమ్మాయిలు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచే పోషకాహారం తీసుకునే విధంగా పథకాలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)