సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా

ఫొటో సోర్స్, ANI
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 12న విచారించింది.
ఈ విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ 'దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన కార్యక్రమాల్లో ఖలిస్థానీలు రంగప్రవేశం చేశారని' అన్నారు.
అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ధర్మాసనం ముందు వేణుగోపాల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈమేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారంతో కూడిన అఫిడవిట్‌ను కూడా దాఖలు చేస్తానని చెప్పారు.
రైతుల ఉద్యమంలో నిషేధిత సంస్థ 'సిఖ్స్ ఫర్ జస్టిస్' ప్రమేయం ఉందని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.
గతేడాది ఫిబ్రవరి 1న, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... కశ్మీర్‌లో తీవ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్న వారే, షహీన్ బాగ్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం ఏడాదికి పైగా కొనసాగుతోంది. సీఏఏకు వ్యతిరేకంగా కూడా నెలల తరబడి నిరసన కార్యక్రమాలు జరిగాయి.
రైతు ఉద్యమంలో సిక్కు రైతుల భాగస్వామ్యం కీలకమైంది. సీఏఏ, ఎన్ఆర్‌సీని పెద్ద సంఖ్యలో ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల తమ పంటల్ని అతి తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తుందని సిక్కు రైతులు భయపడ్డారు. సీఏఏ-ఎన్‌ఆర్‌సీ అమలుతో దేశంలో తమ పౌరసత్వం ప్రమాదంలో పడుతుందని ముస్లింలు ఆందోళన చెందారు.
రైతు ఉద్యమంలో ఖలిస్థానీల ప్రమేయం ఉందని సుప్రీం కోర్టులో వాదించిన ప్రభుత్వం, అదే రైతు ఉద్యమం కారణంగా శుక్రవారం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ జయంతిని పురస్కరించుకొని మోదీ ఈ ప్రకటన చేశారు.
''మేం ఎంతో ప్రయత్నించినప్పటికీ, కొంతమంది రైతులను ఒప్పించలేకపోయాం. వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు ఈ చట్టాల ప్రాధాన్యత గురించి వారికి నచ్చజెప్పడానికి శాయశక్తులా ప్రయత్నించారు'' అని మోదీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ సర్కారు ఎందుకు తలొగ్గింది?
వ్యవసాయ చట్టాలపై మోదీ సర్కారు వైఖరి పూర్తిగా కొత్తది. అంతకుముందు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ 'వ్యవసాయ చట్టాలను కొద్దిమంది రైతులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, కానీ వారికి పెద్ద సంఖ్యలో రైతులు మద్దతు ఇస్తున్నారని' అన్నారు.
ప్రధాన మంత్రి తాజా ప్రకటన ప్రకారం, కేవలం కొంతమంది రైతులు వ్యతిరేకిస్తున్నందువల్లే ఈ మూడు చట్టాలని ఉపహరించినట్లుగా కనిపించడం లేదు.
మరోవైపు సీఏఏ, ఎన్ఆర్‌సీ వ్యతిరేక ఉద్యమాల పట్ల మోదీ ప్రభుత్వం కఠినంగా ఉంది.
''మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చినా, సీఏఏ విషయంలో ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదని'' గతేడాది జనవరి 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు.
వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ ప్రధాని మోదీ ప్రకటన చేశాక, ఇక తర్వాత దేనివంతు అంటూ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
''వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ మరుగునపడ్డాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఇంకా ఎలాంటి సూచనలు లేవు. ఇప్పుడు ఏం చేయనున్నారు?'' అని టైమ్స్ నౌ ఎడిటర్ నావికా కుమార్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, @BJP
నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి ''హిందుత్వ'' అంశం అనుకున్నవిధంగా ఉపకరించట్లేదని గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గౌరాంగ్ జానీ అన్నారు.
''ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక్క పని కూడా జరగడం లేదు. మెజార్టీ ప్రాతిపదికన వారు తప్పుడు విధానాలను రూపొందించారు. ఇప్పుడు వారికి మరో దారి కనిపించడం లేదు''
''సిక్కులతో చెలగాటమాడారు. సిక్కుల చరిత్ర గురించి తెలిసి ఉంటే, వారి జోలికి వెళ్లి ఉండేవారు కాదు. సీఏఏ వ్యతిరేక ఉద్యమంలాగే దీన్ని కూడా సిక్కులు వదిలేస్తారని అనుకున్నారు. కానీ ఈ ఉద్యమం, మోదీ సర్కారును కిందకు దిగొచ్చేలా చేసింది'' అని ఆయన అన్నారు.
''బీజేపీ ప్రభుత్వం ఎంత అసౌకర్యంగా ఉందో అర్థం అవుతోంది. వారి ముఖ్యమంత్రులు వేగంగా మారిపోతున్నారు. క్యాబినెట్‌లో దళితులు, వెనుకబడిన వర్గాల వారికి స్థానం ఇస్తున్నారు.
కానీ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయనేది మాత్రం వారికి అర్థం కావట్లేదు. ఉద్యోగ ప్రకటనలు, ఆకలి, నిరుద్యోగం పెరిగిపోతున్నాయి. ఆకలి సూచికలో పాకిస్తాన్ కంటే కూడా వెనుకబడి ఉన్నాం.
రాబోయే కాలంలో సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా వీరు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో 30 శాతం ముస్లింలు ఉన్నారు. అక్కడ సీఏఏ వల్ల ప్రభుత్వానికి ఒరిగేదేం ఉండదు. నోట్ల రద్దు, జీఎస్‌టీ, చైనా దూకుడును నియంత్రించలేకపోవడం వంటి అంశాల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది'' అని ప్రొఫెసర్ గౌరాంగ్ జానీ చెప్పుకొచ్చారు.
''సీఏఏ, ఎన్ఆర్సీ విషయంలో కూడా మోదీ సర్కారు ఇదే వైఖరిని ప్రదర్శించనుందా?'' అని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాసుకొచ్చారు.
''రాబోయే ఎన్నికలు, ఇప్పటివరకు జరిగిన నిరసన కార్యక్రమాలు ప్రధాని మోదీని అలోచనలో పడేశాయి. సామూహిక ప్రజా ఉద్యమాలను ఆయన అణచివేయలేకపోయారు. కానీ ఆందోళనకారులను వేధించారు. సీఏఏ వ్యతిరేక ఉద్యమాల వల్ల ఎన్‌ఆర్‌సీని పక్కన పెట్టారు. ఇక సీఏఏ అంశాన్ని కూడా ముగించాలి. రైతుల మొండిపట్టుదల, అంకితభావం వల్లే వారి ఉద్యమం విజయవంతమైంది'' అని అసదుద్దీన్ పేర్కొన్నారు.
''ప్రజాస్వామ్య పద్ధతిలో సాధించలేని పని, రాబోయే ఎన్నికల భయంతో సాధ్యమైంది. మనసు మార్చుకొని చేయలేని పనులను, ఎన్నికల భయం వల్ల చేయాల్సి వచ్చింది'' అని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు.
''ఒకవేళ రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం ఉంటే... నోట్ల రద్దు అనేది పెద్ద పొరపాటు అని కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒప్పుకుంటారు. అంతేకాకుండా జీఎస్టీని బలవంతంగా ప్రజలపై రుద్దామని కూడా అంగీకరిస్తారు'' అని అన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మాజీ మంత్రి సోమపాల్ శాస్త్రి బీబీసీతో అన్నారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ప్రభుత్వంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
''చట్టాలను వెనక్కి తీసుకోవడానికి మోదీ సర్కారు చాలా సమయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఇది వారికి ఏవిధంగానూ సహాయపడదు. గురునానక్ జయంతిని పురస్కరించుకొని వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. వారు మత రాజకీయాలు చేయడం ఎప్పటికీ ఆపలేరు.
ఉద్వేగపూరిత అంశాల సహాయంతో రాజకీయం చేయడం ద్వారా అధికారంలోకి రావొచ్చు. కానీ దాని ప్రభావం ఆ ఉద్వేగం ఉన్నంత కాలమే ఉంటుందనే విషయం ఇప్పుడు వారికి చక్కగా బోధ పడింది'' అని శాస్త్రి పేర్కొన్నారు.
ఆధునిక భారతదేశంలో దేవునిపై భారం వేసి వ్యవసాయం చేస్తున్నారు. ఏడాదికేడాదికి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతోంది. రైతులు కూడా వ్యవసాయం నుంచి తప్పుకుంటున్నారు. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం రేటు 25 శాతం కాగా, పట్టణ ప్రాంతాల్లో 14 శాతం ఉన్నట్లు తెలిసింది.
చాలా మంది రైతులు సంప్రదాయ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నారు. వారంతా చిన్న కమతాలను సాగు చేస్తున్నారు. కొన్నిసార్లు పెట్టుబడి పెట్టినదాని కన్నా తక్కువ రేటుకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం వారి నుంచి ఆహారధాన్యాలను కొనుగోలు చేస్తున్నప్పటికీ, అది అంత ప్రభావవంతగా జరగట్లేదు. అందుకే రైతులు తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధర కంటే తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది.
రైతులకు కోపం తెప్పిస్తే మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలవలేదు. అయితే 2024 వరకు మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండనుంది. ఇప్పటికిప్పుడు వారి అధికారానికి వచ్చిన ముప్పేమీ లేదు. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్. కొన్నిరోజుల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మోదీ, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ ఏడాదిలో గడిచిన కొన్ని నెలల్లోనే బీజేపీ నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మొత్తం మంత్రివర్గమే మారిపోయింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాలను బట్టి, వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోంది.
తమ ప్రభుత్వం విప్లవాత్మకంగా పేర్కొన్న మూడు వ్యవసాయ చట్టాలను తాజాగా ప్రధాని మోదీ ఉపసంహరించారు.
కొంతమంది రైతులను ఒప్పించలేకపోవడం వల్లే తాము వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు మోదీ చెప్పారు. కానీ లఖీంపూర్ ఖేరీ ఘటనలో రైతుల మరణానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారునిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి:
- హరియాణా గగనతలంలో రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి, 25 ఏళ్ల నాటి ఆ విధ్వంసం ఎలా జరిగింది?
- పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?
- అరబ్ దేశాల్లో కలకలం రేపుతున్న కొత్త మతం.. ఇది ఏంటి, ఎందుకు?
- ‘భారీ వర్షాలతో టీటీడీకి 4 కోట్లకు పైగా నష్టం.. 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదు’
- సినిమా చూశాక అదే స్టైల్లో దోపిడీ చేశాడు, 52 ఏళ్లు పోలీసులకు దొరకలేదు
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- ‘పోలీస్ కావాలనుకున్న నా కొడుకును దొంగను చేశారు’
- జర్నలిస్ట్ హత్య: ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల అక్రమాలను బయటపెట్టినందుకు చంపేశారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















