అమెరికా 'అన్ సాల్వ్డ్ మిస్టరీస్': సినిమా చూశాక అదే స్టైల్లో దోపిడీ చేశాడు, 52 ఏళ్ల దాకా పోలీసులకు దొరకలేదు

ఫొటో సోర్స్, US MARSHALS SERVICE
అమెరికాలో 52 ఏళ్ల క్రితం ఓ బ్యాంకు దోపిడీ జరిగింది. దేశంలో అత్యంత కలకలం రేపిన బ్యాంకు దోపిడీల్లో ఇది కూడా ఒకటి.
దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది ఇన్నేళ్ల పాటూ అంతు చిక్కలేదు.
ఎట్టకేలకు, ఇప్పుడు ఆ దొంగ దొరికాడని అమెరికా అధికారులు ధృవీకరించారు.
ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో సొసైటీ నేషనల్ బ్యాంక్‌లో టెడ్ కాన్రాడ్ టెల్లర్‌గా పనిచేస్తుండేవారు
1969 జులైలో టెడ్ కాన్రాడ్ తాను పనిచేసే బ్యాంకులోనే దొంగతనానికి పాల్పడ్డారు. 215,000 డాలర్లు (సుమారు రూ. 1.5 కోట్లు) తీసుకుని పారిపోయారు.
ఇప్పటి లెక్కల ప్రకారం... అది 1.7 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.12 కోట్లకు సమానం.
ఆ తర్వాత ఆయన ప్రశాంతంగా సాదాసీదా జీవితాన్ని గడిపారని యూఎస్ మార్షల్స్ సర్వీస్‌కు చెందిన పరిశోధన అధికారులు తెలిపారు.
టెడ్ కాన్రాడ్ ఈ ఏడాది మే నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు.
దోపిడీ..
బ్యాంకు దొంగతనం చేసినప్పుడు కాన్రాడ్ వయసు కేవలం 20 సంవత్సరాలు.
ఆ బ్యాంకుకు పేలవమైన సెక్యూరిటీ ఉండడంతో ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
ఓ శుక్రవారం సాయత్రం బ్యాంకు మూసివేసిన తరువాత డబ్బు మొత్తాన్ని ఒక కాగితపు సంచీలో కుక్కి చక్కగా నడుచుకుంటూ బయటకి వచ్చారు.
రెండు రోజుల తరువాత, బ్యాంకు నుంచి డబ్బు మాయమైందని మిగతా ఉద్యోగులకు తెలిసే సమయానికి కాన్రాడ్ అదృశ్యమైపోయారు.
కాన్రాడ్‌ను పట్టుకోవడానికి పోలీసులు 50 ఏళ్లకు పైగా వేట కొనసాగించారు.
ఆయన కథను 'అమెరికాస్ మోస్ట్ వాంటెడ్', 'అన్ సాల్వ్డ్ మిస్టరీస్' లాంటి టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా ప్రసారం చేశారు.
బ్యాంకు దోపిడీ గురించి కాన్రాడ్ తన స్నేహితులకు చెప్పారని, అది చాలా సులభమంటూ గొప్పలు కూడా చెప్పుకున్నారని మార్షల్స్ సర్వీస్ వెల్లడించింది.
దోపిడీ కథాంశంతో 1968లో స్టీవ్ మెక్‌క్వీన్ హీరోగా వచ్చిన 'ది థామస్ క్రౌన్ అఫైర్ ' సినిమా కాన్రాడ్‌కు చాలా ఇష్టమని, దోపిడీకి సిద్ధమవుతున్న సమయంలో ఆ సినిమాను ఆయన డజను సార్లు అయినా చూసుంటారని సమాచారం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పేరు మార్చుకుని, రాష్ట్రాలు దాటి..
బ్యాంకు దోపిడీ అనంతరం కాన్రాడ్ తన పేరును థామస్ రాండెల్‌గా మార్చుకుని, మొదట వాషింగ్టన్ డీసీకి, అక్కడి నుంచి లాస్ ఏంజెల్స్‌కు పారిపోయారని మార్షల్స్ తెలిపారు.
ఆయన చివరికి, బోస్టన్ శివార్లలో స్థిరపడ్డారు. నేరం చేసిన ప్రదేశానికి ఇది సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ కాన్రాడ్ సాదాసీదా జీవితం గడిపారు.
గత 40 ఏళ్లల్లో కాన్రాడ్ గోల్ఫ్ క్రీడాకారుడుగా, పాత కార్ల డీలరుగానూ పనిచేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
దర్యాప్తు అధికారులకు ఈ కేసు కొరకరాని కొయ్యగా మారింది. వారు కొన్ని దశాబ్దాల పాటు దీన్ని ఛేదించలేకపోయారు.
ఆయన చనిపోయాక రాండెల్ పేరుతో సంస్మరణ గురించి వార్తాపత్రికలో ప్రకటన చూసిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు.
1960లలో ఆయన దాఖలు చేసిన పత్రాలతో, ఇటీవల ఆయన దాఖలు చేసిన పత్రాలను పోల్చి చూశారు.
చిత్రంగా, 2014లో బోస్టన్ కోర్టులో రాండెల్ దివాలా కేసుకు సంబంధించిన పత్రాలు కూడా వీటిల్లో కనిపించాయి.
'మా నాన్న ఆత్మ శాంతిస్తుంది'
కాన్రాడ్ బ్యాంకు దోపిడీ కేసు ప్రధాన పరిశోధకుల్లో మార్షల్ పీటర్ ఎలియట్ ఒకరు.
తన తండ్రి తదనంతరం ఎలియట్ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు.
అంత ధైర్యంగా దోపిడీ చేసిన కాన్రాడ్ ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఎలియట్ తండ్రి శతవిధాలా ప్రయత్నించారు.
"మా నాన్న కాన్రాడ్‌ను వెతకడం ఎప్పుడూ ఆపలేదు. 2020లో ఆయన చనిపోయేవరకు అదే ధ్యాసగా ఉండేవారు. ఎలాగైనా ఆ దొంగను పట్టుకోవాలని అనుకున్నారు"
"ఇప్పటికైనా మా నాన్న ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను. ఆయన పరిశోధన, ఈ దేశ మార్షల్స్ సర్వీస్ ఎట్టకేలకు ఈ కేసును ముగించిందని తెలిసి ఆయన ఆత్మ శాంతిస్తుంది" అని ఎలియట్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మల్ఖాన్ సింగ్: చేతిలో ఏకే-47, వెంట 100 మంది సాయుధ సైన్యం.. అయినా ఈ బందిపోటు ఎందుకు లొంగిపోయాడు
- రాణి కమలాపతి ఎవరు? హబీబ్‌గంజ్ స్టేషన్‌కు ఆమె పేరెందుకు పెట్టారు?
- ఫేస్‌బుక్ లైవ్ ఇస్తుంటే ఫోన్ దొంగతనం చేశాడు.. పోలీసులకు సులభంగా దొరికిపోయాడు
- భారత్-పాకిస్తాన్ యుద్ధం 1971: గొంతులో బుల్లెట్ దిగినా, మిషన్ పూర్తి చేసి ప్రాణం వదిలిన భారత జవాన్ ఆల్బర్ట్ ఎక్కా
- ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ మిస్సింగ్.. ఈ ఐపీఎస్ అధికారి ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానం ఎందుకు దొరకట్లేదు?
- ‘గత 116 ఏళ్లలో ఈ స్థాయిలో మంచు కురవడం చూడలేదు’
- అర్ధరాత్రి మాయమైన చిన్నారిని ఎలా గుర్తించారు, ఆ రహస్యాన్ని పోలీసులు ఎందుకు చెప్పడం లేదు?
- జోకర్ వేషంలో వచ్చి, రైలులో 17 మందిని గాయపర్చిన వ్యక్తి
- పోలండ్-బెలారుస్ సరిహద్దు సంక్షోభం: వేల మంది శరణార్ధులు ఎక్కడి నుంచి వస్తున్నారు?
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













