వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?

వికాస్ దుబే

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, వికాస్ దుబే
    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం

ఉజ్జయిని నుంచి కాన్పూర్ తీసుకెళ్తున్న సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించిన వికాస్ దుబే ఎదురు కాల్పుల్లో చనిపోయాడని పోలీసు అధికారులు చెబుతున్నారు.

కాన్పూర్‌లో 8 మంది పోలీసుల హత్య కేసులో ప్రధాన నిందితుడు వికాస్ దుబేను గురువారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

వికాస్ దుబేపై క్రిమినల్ కేసులే కాదు, ఇతర కేసులు కూడా చాలా ఉన్నాయి. రాజకీయ పార్టీల్లో అతడికి చాలా పలుకుబడి ఉందని చెబుతున్నారు.

కాన్పూర్ చౌబేపూర్ పోలీస్ స్టేషన్లో దుబేపై 60 కేసుల వరకూ ఉన్నాయి. వాటిలో హత్య, హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి.

“ఒక హత్య కేసులో వికాస్ దుబెను అరెస్ట్ చేయడానికి వెళ్లినపుడు పోలీసులపై కాల్పులు జరిగాయి. ఆ కేసులో అతడి పేరుంది” అని కాన్పూర్ ఐజీ మోహిత్ అగ్రవాల్ బీబీసీతో చెప్పారు.

చౌబేపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల ఆధారంగా గత మూడు దశాబ్దాలుగా నేర ప్రపంచంలో వికాస్ దుబే పేరు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిని చాలాసార్లు అరెస్టు కూడా చేశారు. కానీ ఇప్పటివరకూ అతడికి ఏ కేసులోనూ శిక్ష వేయించలేకపోయారు.

“2001లో ఒక పోలీస్ స్టేషన్లోకి చొరబడి సహాయ మంత్రి హోదాలో ఉన్న బీజేపీ నేత సంతోష్ శుక్లాను హత్య చేశాడని వికాస్ దుబేపై ఆరోపణలు ఉన్నాయి. సంతోష్ శుక్లా హత్య ఒక హైప్రొఫైల్ కేసు. అంత పెద్ద నేరం జరిగినా పోలీసులెవరూ వికాస్ దుబేకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వలేదు. కోర్టులో దుబేకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు ప్రవేశపెట్టలేకపోయారు. దాంతో అతడిని వదిలేశారు” అని కాన్పూర్ స్థానిక జర్నలిస్ట్ ప్రవీణ్ మెహతా చెప్పారు.

దానితోపాటూ 2000లో కాన్పూర్ శివాలీ పోలీస్ స్టేషన్లో ఉన్న తారాచంద్ ఇందర్ కాలేజీ అసిస్టెంట్ మేనేజర్ సిద్ధేశ్వర్ పాండే హత్య కేసులో కూడా వికాస్ దుబే పేరు ఉంది.

వికాస్ దుబే

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, వికాస్ దుబే నివాసం

జైలుకు వెళ్లడం, బెయిల్‌పై రావడం

పోలీస్ స్టేషన్లో నమోదైన రిపోర్టుల ప్రకారం వికాస్ దుబేపై 2000లో రాంబాబు యాదవ్ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అతడు జైలు నుంచే ఆ హత్యకు పథకం వేశాడని చెబుతారు.

2004లో ఒక కేబుల్ వ్యాపారి హత్యలో కూడా వికాస్ దుబే పేరు బయటికొచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం చాలా కేసుల్లో వికాస్ దుబే జైలుకెళ్లాడు. కానీ, వెంటనే బెయిలుపై విడుదలయ్యేవాడు. 2013లో కూడా ఒక హత్య కేసులో వికాస్ దుబే పేరు ఉంది. అంతే కాదు 2018లో తన చిన్నాన్న కొడుకు అనురాగ్‌పై హత్యాయత్నం చేశాడని కూడా అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు అనురాగ్ భార్య వికాస్ సహా నలుగురిపై కేసు పెట్టారు.

“వికాస్ దుబే అన్ని రాజకీయ పార్టీలకూ దగ్గరగా మెలిగేవాడు. అందుకే, నిన్నటివరకూ అతడిని పట్టుకోలేకపోయారు. ఒకవేళ పట్టుకున్నా, కొన్ని రోజుల్లోనే జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చేసేవాడు” అని ప్రవీణ్ మెహతా చెప్పారు.

వికాస్ దుబే స్వస్థలం కాన్పూర్ బిటూర్‌ ప్రాంతంలోని బికరూ గ్రామం. ఆ గ్రామంలో అతడు తన ఇంటిని ఒక కోటలా కట్టుకున్నాడు. అతడి అనుమతి లేకుండా ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లలేరని స్థానికులు చెబుతున్నారు.

వికాస్ దుబే

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

కుటుంబ సభ్యులు జిల్లా పంచాయత్ సభ్యులు

“2002లో రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచీ వికాస్ హవా కొనసాగింది. అప్పట్లో నేర సామ్రాజ్యంలో అతడి ఆధిపత్యం కొనసాగడమే కాదు, భారీగా డబ్బు కూడా సంపాదించాడు” అని పేరు బయటపెట్టద్దనే షరతుతో బికరూ గ్రామస్థుడు ఒకరు చెప్పారు.

చౌబేపూర్‌లో నమోదైన కేసుల్లో అక్రమ జరిగిన భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఆ లావాదేవీల వల్లే వికాస్ దూబే అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని గ్రామస్థులు చెబుతున్నారు. బిటూర్‌లో ఆయనవి కొన్ని స్కూళ్లు, కాలేజీలు కూడా ఉన్నాయి.

తన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆయన ఆధిపత్యం కొనసాగేదని బికరూలో ఉన్నవారు చెబుతున్నారు. జిల్లా పరిషత్‌లో, చాలా గ్రామాల్లో, గ్రామ సర్పంచి ఎన్నికల్లో వికాస్ దుబే ఇష్టాయిష్టాలకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు..

“బికరూ గ్రామంలో గత 15 ఏళ్ల నుంచీ ఒకే వ్యక్తి ఏకగ్రీవంగా సర్పంచి అవుతూ వస్తున్నారు. వికాస్ దుబే కుటుంబ సభ్యుల్లోని కొందరు గత 15 ఏళ్లుగా జిల్లా పంచాయత్ సభ్యులుగా గెలుస్తున్నారు” అని ఆ గ్రామంలోని ఒక వృద్ధుడు చెప్పారు.

కాన్పూర్

ఫొటో సోర్స్, SAMIRAMAJ MISHRA

తండ్రి రైతు, కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు

“వికాస్ దుబే తండ్రి ఒక రైతు. వికాస్‌కు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒక సోదరుడు 8 ఏళ్ల క్రితమే హత్యకు గురయ్యాడు. ముగ్గురిలో వికాస్ దుబే చిన్నవాడు. వికాస్ భార్య రిచా దుబే ప్రస్తుతం జిల్లా పంచాయతీ సభ్యులుగా ఉన్నారు” అని గ్రామస్థులు చెబుతున్నారు.

“వికాస్ దుబేపై పోలీస స్టేషన్లో ఎన్నో కేసులు నమోదైనా, గ్రామంలో ఆయన గురించి చెడుగా మాట్లాడేవారు ఎవరూ దొరకరు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం చెప్పరు” అని పేరు రాయవద్దనే షరతుతో బికరూ గ్రామస్థుడు ఒకరు చెప్పారు.

“2000 సంవత్సరంలో శివాలీలో అప్పటి నగర పంచాయతి చైర్మన్ లల్లన్ వాజ్‌పేయితో గొడవల తర్వాత వికాస్ దుబే నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు” అని ఆయన చెప్పారు.

వికాస్ దుబేకు ఇద్దరు కొడుకులు. వారిలో ఒకరు విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతుంటే, ఇంకొకరు కాన్పూర్ సిటీలోనే చదువుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)