రైతుల నిరసనలు: ‘కనీస మద్దతు ధర’ డిమాండును మోదీ ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదు?

కనీస మద్దతు ధర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ధర్నాలు సోమవారానికి ఐదో రోజుకు చేరుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై తమ వ్యతిరేకతను తెలియజేసేందుకు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి రైతులు దిల్లీ సరిహద్దుల వరకూ తరలి వచ్చారు.

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కన్నా తక్కువకు పంటలను కొనుగోలు చేయడాన్ని నేరంగా పరిగణించాలని, ఎంఎస్‌పీకి పంటల కొనుగోలును ప్రభుత్వం కొనసాగించాలని అఖిల భారతీయ కిసాన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కోరుతోంది. తమ ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటని చెబుతోంది.

ఎంఎస్‌పీ విషయమై ప్రధాని మోదీ ఇదివరకే ట్విటర్‌లో స్పందించారు.

‘‘నేను ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. ఎంఎస్‌పీ వ్యవస్థ, ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయడం కొనసాగుతుంది. మేం రైతులకు సేవ చేసేందుకే ఉన్నాం. అన్నదాతలను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. వారి కుటుంబాల్లో భావి తరాల జీవితాలు కూడా మెరుగ్గా ఉండేందుకు కృషి చేస్తాం’’ అని మోదీ సెప్టెంబర్ 20న వ్యాఖ్యానించారు.

కానీ, ఎంఎస్‌పీని, పంటల కొనుగోలును కొనసాగిస్తామని చట్టంలో పొందుపరిచేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదివరకు కూడా చట్టాల్లో రాతపూర్వకంగా ఈ విషయం ఎక్కడా లేదని, అందుకే కొత్త చట్టాల్లోనూ పేర్కొనలేదని ప్రభుత్వం అంటోంది.

రైతు సంఘాలు అడుగుతున్నట్లుగా ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు పంటను కొనుగోలు చేయడాన్ని నేరంగా ప్రకటించడం ప్రభుత్వానికి ఎందుకు అంత కష్టం?

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే కన్నా ముందు మనం అసలు ఎంఎస్‌పీ అంటే ఏంటి, దాన్ని ఎలా నిర్ణయిస్తారనే విషయాలు తెలుసుకోవాలి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఎంఎస్‌పీ అంటే...

మార్కెట్‌లో పంటల ధరలు పడిపోయినా, రైతులకు నష్టం కలగకుండా వాటికి ఓ కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ ధరకు పంటలను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

ఏ పంటకైనా దేశవ్యాప్తంగా ఒకే ఎంఎస్‌పీ ఉంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖలోని కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రొడ్యూసేస్ సిఫార్సులకు అనుగుణంగా ఎంఎస్‌పీ నిర్ణయిస్తారు. ప్రస్తుతం 23 పంటలకు ఎంఎస్‌పీని నిర్ణయిస్తున్నారు.

వరి, గోధుమలు, జొన్న, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పెసర్లు, వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, పత్తి వంటి పంటలు వీటిలో ఉన్నాయి.

దేశంలో ఆరు శాతం రైతులకు మాత్రమే ఎంఎస్‌పీ అందుతోందని, వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హరియాణా రాష్ట్రాల వారేనని అంచనాలు ఉన్నాయి. అందుకే, కొత్త వ్యవసాయ చట్టాలపై ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

రైతుల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

కొత్త చట్టాల వల్ల ఏం మారింది?

ఎంఎస్‌పీకి పంటలను కొనుగోలు చేస్తామని ఇప్పటివరకూ ప్రభుత్వం రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వలేదని, మౌఖికంగానే చెబుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ అన్నారు. అందుకే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిన తర్వాత రైతుల్లో ఆందోళనలు పెరిగాయని చెప్పారు.

ఎంఎస్‌పీకి పంటల కొనుగోళ్లు కొనసాగిస్తామని కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది.

మరోవైపు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధిని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకపోవడం కూడా రైతులకు ఆందోళన కలిగిస్తోంది.

ఇదివరకు ఈ నిధి నుంచి ఏటా మూడు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇచ్చేది. కానీ, ఈ ఏడాది అందుకు నిరాకరించింది.

కనీస మద్దతు ధర

ఫొటో సోర్స్, Getty Images

ధరలు నిర్ణయించేది ఎవరు?

ఎంఎస్‌పీకి కొనుగోళ్లను కొనసాగిస్తామని ప్రభుత్వం చట్టంలో పెట్టినా, దాని అమలు సాధ్యపడుతుందో, లేదోనని సిరాజ్ హుస్సేన్ సందేహం వ్యక్తం చేశారు.

‘‘ఒక ‘న్యాయమైన సగటు నాణ్యత’ ఆధారంగా ఎంఎస్‌పీ నిర్ణయిస్తారు. పంట నిర్ణీత నాణ్యత ప్రమాణాలను చేరుకుంటేనే ఎంఎస్‌పీ లభిస్తుంది. ప్రమాణాలను చేరుకోలేని పంటల మాటేమిటి?’’ అని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ కొనుగోళ్లు తగ్గే అవకాశం

వరి ధాన్యం, గోధుమలను కొనుగోలు చేయడాన్ని ప్రభుత్వం తగ్గించాలని చాలా కమిటీలు సిఫార్సు చేశాయని సిరాజ్ హుస్సేన్ తెలిపారు.

శాంతా కుమార్ కమిటీ నుంచి నీతి ఆయోగ్‌ వరకు ప్రభుత్వానికి ఇలాంటి నివేదికలు ఇచ్చాయి.

ప్రభుత్వం కూడా ఈ సూచనలకు అనుగుణంగా పనిచేస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం పంటల కొనుగోళ్లను తగ్గించవచ్చని రైతులు భయపడుతున్నారు.

ధాన్యం బస్తాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రైవేటు సంస్థలు ఎంఎస్‌పీకి కొంటాయా?

భవిష్యతులో ప్రభుత్వం కొనుగోళ్లు తగ్గిస్తే, రైతులు ప్రైవేటు సంస్థలకు పంటలు అమ్ముకోవాల్సి వస్తుందని చండీగఢ్‌లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ప్రొఫెసర్ ఆర్‌ఎస్ ఘుమన్ అన్నారు.

‘‘ఎంఎస్‌పీ కన్నా తక్కువకు పంటలను ప్రైవేటు సంస్థలు కొనుగోలు చేయాలనుకుంటాయి. లేకపోతే అవి కూడా ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వస్తుంది. అందుకే, ఎంఎస్‌పీకే పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు షరతులు పెట్టాలనుకోవడం లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

కార్పొరేట్ల నుంచి ఎంఎస్‌పీ షరతు పెట్టకూడదన్న ఒత్తిడి కూడా ప్రభుత్వంపై ఉందని సిరాజ్ హుస్సేన్ అంటున్నారు.

వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

రైతుల ఇబ్బందులు పెరగవచ్చు

ఏదైనా ఉత్పత్తిని అమ్మే వ్యక్తి ఒకరే ఉంటే, దాన్ని ‘మోనోపలీ’ అంటారు. ఆ అమ్మే వ్యక్తి ఆ ఉత్పత్తిని తనకు ఇష్టమైన ధరకు అమ్మవచ్చు.

అదే సమయంలో ఒక ఉత్పత్తిని కొనే వ్యక్తి ఒక్కరే ఉంటే, దాన్ని ‘మోనోప్లాస్నీ’ అంటారు. కొనే వ్యక్తి కూడా తనకు ఇష్టమైన ధరకు ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయొచ్చు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల వల్ల రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో ‘మోనోప్లాస్నీ’ వస్తుందని ఆర్ఎస్ ఘుమన్ అంటున్నారు.

ప్రైవేటు సంస్థలు కలిసి ఒక జట్టుగా ఏర్పడి పంటల ధరలను శాసించే పరిస్థితి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎంఎస్‌పీని చట్టంలో చేర్చితే, ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యాన్ని నివారించవచ్చు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థలు పంటల కొనుగోళ్లు ఎక్కువగా చేయకపోవచ్చు.

ఓవైపు స్వయంగా పంట కొనుగోళ్లను ప్రభుత్వమే తగ్గిస్తూ, మరోవైపు ఎంఎస్‌పీకే పూర్తిగా పంటలన్నీ కొనుగోళ్లు చేయాలని ప్రైవేటు సంస్థలకు చెప్పే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు పెరగవచ్చు.

రైతులు

ఫొటో సోర్స్, RAWPIXE

‘ప్రభుత్వం తప్పుకోవాలనుకుంటోంది’

పంటల ధరలు మరీ పడకుండా ఎంఎస్‌పీ ఓరకమైన రక్షణ కల్పిస్తుంది.

ప్రైవేటు సంస్థలు డిమాండ్, సరఫరా ప్రకారం ధరలు నిర్ణయిస్తాయి.

ఈ వ్యవహారం మొత్తం రెండు పక్షాల (రైతులు, ప్రైవేటు సంస్థలు) మధ్యే ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, తృతీయ పక్షంగా తాము ఉండాలని అనుకోవడం లేదని ఘుమన్ అభిప్రాయపడ్డారు.

పరిష్కారం ఏంటి?

భారత్‌లో 85 శాతం చిన్న, సన్నకారు రైతులేనని అంచనాలు ఉన్నాయి. వీరి వద్ద ఉన్నవి ఐదు ఎకరాల కన్నా తక్కువ కమతాలే.

కొత్త చట్టాల్లో ఎంఎస్‌పీని చేర్చినా ఫలితం ఉండదని, ఆ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవడమే పరిష్కారం అని ఆర్‌ఎస్ ఘుమన్ అన్నారు.

ప్రభుత్వం మాత్రం ఇందుకు సిద్ధంగా లేదు.

అయితే, ‘కిసాన్ సమ్మాన్ నిధి’ లాంటి ఏర్పాటుతో రైతులకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక చేయూతను అందించవచ్చని సిరాజ్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)