రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా ఎలా మారింది... ప్రత్యక్షంగా చూసినవారు ఏం చెబుతున్నారు?

రైతుల ట్రాక్టర్ ర్యాలీ

గణతంత్రం అంటే గణం (ప్రజలు) పైన ఉండాలి. తంత్రం (రాజకీయం) కింద ఉండాలి. కానీ, గత 75 ఏళ్లుగా తంత్రమే పైన ఉంది. ప్రజల్ని కిందకు తోసేసారు. ఈ ట్రాక్టర్ ర్యాలీ ద్వారా మేము ప్రజల గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాం. రైతుల మాటలు వినిపించాలనుకుంటున్నాం. సాధారణంగా జనాల మనసులో మాటలు వింటుంటాం కదా. ఇవాళ రైతుల మనసులో మాటలు వినిపించాలనుకుంటున్నాం" అని రైతు నాయకుడు యోగేంద్ర యాదవ్ బీబీసీకి తెలిపారు.

అయితే, తరువాత జరిగిన ట్రాక్టర్ ర్యాలీ చూస్తే రైతులు, ప్రభుత్వానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారన్నది స్పష్టమవ్వలేదు.

దిల్లీలోని వివిధ సరిహద్దులనుంచీ వచ్చిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ చిత్రాలు చూస్తే.. హింసాత్మకంగా, గత 60 రోజులనుంచీ జరుగుతున్న శాంతియుత నిరసనలకు భిన్నంగా కనబడుతున్నాయి.

రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా దిల్లీ, హరియణా, మహరాష్ట్ర, రాజస్థాన్, ఉతర ప్రదేశ్ రైతులు.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత ట్రాక్టర్ ర్యాలీ చేపట్టాలనుకున్నారు.

రైతుల ట్రాక్టర్ ర్యాలీ

ఫొటో సోర్స్, Getty Images

ర్యాలీలో ఏమైంది?

ఈ ర్యాలీని నిషేధించాలన్న ప్రతిపాదనను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. అయితే, రైతులు పోలీసులతో చర్చించాలని సూచించింది.

రైతులు, పోలీసులు కలిసి ర్యాలీ నడిచే మార్గాన్ని, సమయాన్ని కూడా నిర్ణయించుకున్నారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలోని కొన్ని సమూహాలు దిల్లీ చేరుకున్నాయి. ఎర్రకోట మీద తమ జెండా ఎగురవేశాయి. దానితోపాటూ, పలు చోట్ల పోలీసులతో ఘర్షణలు, లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ షెల్స్ చోటు చేసుకున్నాయి.

ఈ ఘర్షణల్లో అనేకమంది ప్రజలు, పోలీసులు కూడా గాయపడ్డారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

సింఘు, తిక్రీ, షాజహన్‌పూర్, చిల్లీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతల చిత్రాలు మీడియాలో వచ్చాయి. వీటన్నిటిలోనూ పెద్ద సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో గుమికూడి ఉండడం కనబడుతోంది.

పోలీసులు తమతో హింసాత్మకంగా ప్రవర్తించారని రైతులు ఆరోపించారు. కానీ, అనేకచోట్ల బ్యారికేడ్లను పగలగొడుతున్న రైతులను ఆపే ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు కనిపించారు.

72 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో గణతంత్ర దినోత్సవంనాడు ఇలాంటి హింసను ఎప్పుడూ చూడలేదు.

ఐటీఓ వద్ద తిరగబడిన ట్రాక్టర్
ఫొటో క్యాప్షన్, ఐటీఓ వద్ద తిరగబడిన ట్రాక్టర్

ఐటీఓ దగ్గర కనిపించిన దృశ్యాలు

బీబీసీ ప్రతినిధి వికాస్ త్రివేది, రిపబ్లిక్ డే ఉదయం 11.00 గంటలనుంచీ అక్కడే ఉన్నారు.

"సాధారణంగా ఈ మార్గంలోనే రిప్లబ్లిక్ డే పరేడ్ చేస్తారు. ఈసారి కరోనా కారణంగా పరేడ్‌ను కుదించారు. అయినప్పటికీ ఐటీఓకు వెళ్లే అనేక దారులు మూసివేశారు.

పరేడ్ ముగిసిన తరువాత ప్రగతి మైదాన్‌నుంచీ ఐటీఓ వెళ్లే దారి మొత్తం రైతుల ట్రాక్టర్లతో నిండిపోయింది. ట్రాక్టర్ ర్యాలీ కోసం ముందే నిర్ణయించుకున్న మార్గాల లిస్ట్‌లో ఈ మార్గం లేదు.

నేను నడుచుకుంటూ ఐటీఓ చేరుకున్నాను. అప్పటికే అక్కడ పోలీసులు రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్నారు.

దాదాపు 50 మంది నిరసనకారుల చేతిలో ఇనుప రాడ్లు ఉన్నాయి. వాళ్లు ఆ రాడ్లతో పోలీసుల బ్యారికేడ్లు పగలగొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డ్ చేస్తున్నవారిని కూడా వారు చెదరగొడుతున్నారు. పోలీస్ డ్యూటీలో ఉన్న ఒక బస్సును తగులబెట్టారు.

మధ్యాహ్నం ఒంటిగంట అవుతుండగా ఐటీఓనుంచీ న్యూదిల్లీ వెళుతున్న దారిలోంచి వస్తున్న ఒక వ్యక్తి కనిపించారు. ఆ రోడ్డులో ఒక ట్రాక్టర్ తిరగబడిందని, ఒక వ్యక్తి మరణించారని చెప్పారు.

మేము అటువైపు వెళ్లాం. మరణించిన వ్యక్తి ఉత్తరాఖండ్‌కు చెందిన నవనీత్ అని తెలిసింది. అంతకుముందు ఆ ప్రాంతంలో అనేకమంది పోలీసులు మోహరించి ఉన్నారు. కానీ, ఈ మరణవార్త విన్న తరువాత వారు అక్కడినుంచీ వైదొలిగారు.

ఆందోళనకారులు మరణించిన వ్యక్తి భౌతిక దేహాన్ని ఐటీఓ కూడలిలో ఉంచారు. పోలీసులు, ప్రభుత్వం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో కనిపించారు. సాయంత్రం అక్కడినుంచీ శవాన్ని తరలించారు" అని త్రివేది తెలిపారు.

చిల్లా సరిహద్దు వద్ద రైతులు
ఫొటో క్యాప్షన్, చిల్లా సరిహద్దు వద్ద రైతులు

చిల్లా, ఘాజీపూర్ బోర్డర్

ఉత్తర ప్రదేశ్, దిల్లీలను కలిపే సరిహద్దువద్ద పొద్దున్న తొమ్మిది గంటలనుంచీ బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి ఉన్నారు.

"పొద్దున్న 10.30 వరకూ కూడా చిల్లా సరిహద్దువద్ద ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం కాలేదు. వేలమంది రైతులు ట్రాక్టర్లతో సహా గుమి కూడి ఉన్నారు.

ర్యాలీ ఎప్పుడు మొదలవుతుంది అని పోలీసులను అడిగాను. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన తరువాత మొదలవుతుందని చెప్పారు. ఇలా వెయిట్ చేయిస్తున్నందుకు రైతులు కాస్త అసంతృప్తి చెందినట్లు కనిపించారు.

ఓ గంట తరువాత, ఘాజీపూర్ దగ్గర రైతులు సిమెంట్, ఇనుప బ్యారికేట్లను పగలగొట్టి సెంట్రల్ దిల్లీవైపు తరలి వెళుతున్నట్లు సమాచారం వచ్చింది.

నేను కూడా ఆవైపు వెళ్లాను. అక్కడ పోలీసులు, నిరసనకారులకన్నా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిని ఆపడం పోలీసులకు కష్టమే. ఘాజీపూర్ బోర్డరు దగ్గర కొన్ని నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందుకనే పోలీసుల చేతులు కొంచం కట్టివేసినట్టు అయ్యింది.

ఘాజీపూర్‌నుంచీ అక్షరథామ్ వైపు వెళుతున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, కానీ ఏమీ లాభం లేకపోయింది. మేము ఎర్రకోటవైపు వెళుతున్నాం అని అరుచుకుంటూ నిరసనకారులు ముందుకు కదిలారు.

మీరెందుకు ముందే నిర్ణయించుకున్న మార్గం గుండా వెళ్లట్లేదు అని కొందరు రైతు ప్రదర్శనకారులను అడిగాను. మాకవన్నీ తెలీదు. మేము ఎర్ర కోటకు వెళ్లాలి..అంతే అని వాళ్లన్నారు.

రైతు నాయకుల మాటలు వినడానికి నిరసనకారులు సిద్ధంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, బోర్డర్ దగ్గర పెద్ద నాయకులెవరూ లేరు.

కొద్ది సేపట్లోనే ఆ దారంతా నిరసనకారుల కంట్రోల్‌లోకి వచ్చేసింది. పోలీసులు వెనక్కు తగ్గి నిల్చున్నారు" అని రావి తెలిపారు.

షాజహాన్ పూర్ వద్ద రైతుల పరేడ్

ఫొటో సోర్స్, Twitter/Yogendra Yadav

ఫొటో క్యాప్షన్, షాజహాన్ పూర్ వద్ద రైతుల పరేడ్

షాజహాన్‌పూర్ బోర్డర్

బీబీసీ ప్రతినిధి సోనల్ ఉదయంనుంచీ అక్కడే ఉన్నారు.

"అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళనుంచి వచ్చిన వేలాది మంది రైతులు ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్నారు.

ఉదయం 10.00 గంటలకి అక్కడ కార్యక్రమం ప్రారంభమైంది. మొదట జెండా ఎగురవేసి, జాతీయగీతం ఆలపించారు. తరువాత ర్యాలీ మొదలవ్వగానే పోలీసులు బ్యారికేడ్లు తొలగించారు. అందుకే ఇక్కడ ఎలాంటి ఘర్షణలూ చోటు చేసుకోలేదు.

తిక్రీ బోర్డరు వద్ద ఉన్నంత పెద్ద ట్రాక్టర్ల లైను ఇక్కడ లేదు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఘాజీపూర్ బోర్డర్ దగ్గర రైతులంతా ట్రాక్టర్లలో వెళ్లి, తిక్రీ దగ్గర ర్యాలీతో కలుస్తారు. అక్కడినుంచీ అందరూ హరియాణాలోని మానేసర్ ‌వరకూ ర్యాలీ చేస్తారు. కానీ మధ్యహ్నం మూడు గంటల వరకూ కూడా అది జరగలేదు" అని సోనల్ తెలిపారు.

ఎర్రకోట మీద నిరసనకారులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఎర్రకోట మీద నిరసనకారులు

నంగ్లోయీనుంచీ ఎర్ర కోట వరకూ...

ఇక్కడ రిపోర్టింగ్‌కోసం బీబీసీ నుంచి సమీరాత్మజ్ మిశ్రా వెళ్లారు.

"సుమారు 11 గంటలకు రైతుల ర్యాలీ ప్రారంభమైంది. వేలమంది రైతులు నినాదాలు చేస్తూ నంగ్లోయీ చేరుకున్నారు. అక్కడినుంచీ వారు నేరుగా పిరాగడీ చేసుకోవాలని అనుకున్నారు. కానీ వారిని ముందుగా నిర్ణయించిన మార్గంలోనే వెళ్లమని పోలీసులు చెప్పారు. ఇక్కడ అనేకమంది రైతులు కొన్ని గంటలపాటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.

తరువాత కొంతమంది నిర్ణయించుకున్న మార్గంలోనే బయలుదేరారు. కానీ కొంతమంది పిరాగడి మార్గంలో వెళ్లారు. దారిలో పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను పగలగొట్టుకుంటూ ముందుకు సాగారు. తరువాత పోలీసులు వారిని ఆపలేదు. నంగ్లోయీ కూడలి దగ్గర పోలీసులకు, రైతులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేసారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొంతమంది గాయపడినట్లు సమాచారం.

రైతుల ట్రాక్టర్ ర్యాలీ

ఫొటో సోర్స్, Reuters

ఇంతలో ఘాజీపూర్‌నుంచీ వెళ్లిన రైతులు ఐటీఓ ద్వారా దిల్లీ చేరుకుని ఎర్రకోటలోకి ప్రవేశించారు. నంగ్లోయీనుంచీ వెళ్లిన రైతులు కూడా ఎర్రకోట చేరుకున్నారు. చూస్తుండగానే అనేకమంది రైతులు ఎర్రకోట బురుజుల పైకి చేరుకున్నారు. వారంతా అక్కడ కొన్ని గంటలపాటూ గుమికూడారు. ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసే ప్రదేశంలో వారు కూడా త్రివర్ణ పతాకం ఎగురవేసారు. ట్రాక్టర్ ర్యాలీ కూడా చేశారు.

తరువాత పోలీసులు, రైతులను బురుజులమీంచి కిందకు దింపేశారు. నడుచుకుంటూ వచ్చిన రైతులు మెల్లిమెల్లిగా అక్కడనుంచీ వెనక్కు తరలిపోయారు. కానీ మరికొంత మంది ఎర్రకోటవైపు వెళుతూ కనిపించారు. ఇక్కడ సాయంత్రం ఐదు గంటలవరకూ నినాదాలు పెల్లుబికి వినిపిస్తూనే ఉన్నాయి. తరువాత ట్రాక్టర్లన్నీ వెళిపోయాయి. రైతులు కూడా అక్కడినుంచి తరలి వెళిపోయారు. పరిస్థితి మామూలైపోయింది. ఇక్కడ చిన్న చిన్న పోలీసు లాఠీ చార్గ్‌లు తప్ప పెద్ద ఘర్షణలేమీ జరగలేదు" అని మిశ్రా చెప్పారు.

టిక్రీ సరిహద్దు ప్రాంతం
ఫొటో క్యాప్షన్, టిక్రీ సరిహద్దు ప్రాంతం

టిక్రీ బోర్డర్

ఇక్కడ బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా ఉన్నారు.

"ఉదయం 10.00 గంటల ప్రాంతంలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఇక్కడనుంచీ బయలుదేరింది. శాంతియుతంగా ర్యాలీ నడుస్తూ ఉంది. దారికి ఒక పక్క ట్రాక్టర్లు వెళుతూ ఉన్నాయి. వాటికి పక్కనే రైతులు నడుస్తూ ఉన్నారు. దేశభక్తి గీతాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ర్యాలీ, వెనకాల ముప్పై కిలోమీటర్ల కన్నా పొడవు ఉందని కొందరు రైతులు చెప్పారు.

కొన్నిచోట్ల ప్రజలు పువ్వులు జల్లుతూ రైతులకు స్వాగతం పలికారు. కానీ, మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో నంగ్లోయీ చేరుతూనే రైతులు పోలీసుల బ్యారికేడ్లు విరిచేశారు. తరువాత పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

అక్కడ చాలా గంటలపాటూ భారీగా పోలీసులు మోహరించారు. కానీ సాయంత్రం ఐదు గంటలకి చూస్తే అక్కడ పోలీసులు ఎవరూ కనిపించలేదు. అనేక పోలీసు వాహనాలు విరిగి పడి ఉన్నాయి. రైతులు బ్యారికేడ్లను ట్రాక్టర్లకున్న గొలుసులతో పక్కకు లాగి మార్గం ఏర్పరుచుకున్నారు.

ఈ ప్రాంతంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జ్ కూడా చేశారు. చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయి. వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కొన్ని రైతు సమూహాలు దిల్లీవైపు తరలి వెళ్లాయి. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు" అని పాషా తెలిపారు.

సింఘు సరిహద్దు ప్రాంతం
ఫొటో క్యాప్షన్, సింఘు సరిహద్దు ప్రాంతం

సింఘు బోర్డర్

సింఘు సరిహద్దు వద్ద బీబీసీ ప్రతినిధి అరవింద్ ఛాబ్రా ఉన్నారు.

"రైతులు ట్రాన్స్‌పోర్ట్ నగర్ దగ్గర ఉన్న బ్యారికేడ్లను పగలగొట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మొదట్లో పోలీసులు బలప్రయోగం చేసే ప్రయత్నాలు కూడా చేశారు.

'మేము రింగ్‌రోడ్డుమీంచి వెళ్లాలనుకుంటున్నాం. కానీ పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మమ్మల్ని ఆపవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేసాం. కావాలంటే వారి అధికారులతో మాట్లాడతామని కూడా చెప్పాం' అని సింఘు సరిహద్దుల్లో ఉన్న రైతు నాయకుడు సత్నాం సింగ్ పన్నూ చెప్పారు.

మాకు ఇచ్చిన రూటుతో మేము ఏకీభవించట్లేదు. మేము రింగ్ రోడ్డుమీంచి వెళతాం. మేము ఇక్కడే మరికొంతసేపు వేచి ఉంటాం. వెనక వస్తున్న రైతులు కూడా ఇక్కడకు చేరాక, అందరం కలిసి ర్యాలీ చేస్తాం అని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)