ఉజ్జయిని మహాకాళుడి కింద మరో పురాతన ఆలయ అవశేషాలు: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, FB/ Suresh Sharma
ఉజ్జయిని మహాకాళుడి కింద ప్రాచీనకాలంనాటి మరో ఆలయం ఉన్నట్టు తవ్వకాల్లో బయటపడినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.
మధ్యప్రదేశ్‌లోని ఈ ఆలయ ప్రాంగణంలో సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా కొద్దిరోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రధాన ఆలయానికి 500 మీటర్ల లోపల ఉన్న కట్టడాలను తొలగిస్తున్నారు.
అవంతి మాత మందిరం వెనుక భాగంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో శుక్రవారం ప్రాచీన ఆలయానికి సంబంధించిన పునాదులు, ఓ గోడ బయటపడ్డాయి.
అధికారులు వెంటనే పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చారు. పురావస్తు అధికారులు శనివారం ఆ అవశేషాలను పరిశీలించి వెయ్యేండ్ల క్రితం పారమార సామ్రాజ్యం కాలంలో నిర్మించిన ఆలయంగా గుర్తించారని పత్రిక చెప్పింది.
గోడ అవశేషాలపై భారత ప్రాచీన శిల్పకారుల ప్రతిభ ఇప్పటికీ సజీవంగా కనిపిస్తున్నదని పురావస్తు అధికారులు తెలిపారు.
గోడపై సుందరమైన నగిషీలు కనిపిస్తున్నాయి. విరిగిన స్తంభాలు కూడా బయటపడ్డాయి. భారత్‌పై ముస్లిం రాజుల దండయాత్రల కాలంలో పారమార రాజ్యంపై ఆల్తమిష్ దాడిచేశాడు.
ఆ దురాక్రమణలో మహాకాళేశ్వర్ ఆలయం ధ్వంసమైందని నాటి పారమార రాజు ఉదయాదిత్యుడి ఆస్థాన పండితులు తమ రచనల్లో గ్రంథస్తం చేశారు.
ఇప్పుడు బయల్పడిన ఆలయం అవశేషాలు ఆ రచనలను రుజువు చేస్తున్నాయని పురావస్తు శాఖ అధికారి శుభం తెలిపారని నమస్తే తెలంగాణ వివరించంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో కోటి దాటిన కరోనా కేసులు
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కోటి దాటినట్లు ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.
దేశంలో కరోనా కేసులు కోటి దాటాయి. గత 24 గంటల్లో 25,152 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 1,00,04,599కి చేరింది.
ఇందులో 95,50,712 మంది ఇప్పటికే కోలుకొని ఇంటికి చేరారు. 1,45,136 మంది కన్నుమూశారు. 3,08,751 మంది ఆసుపత్రులు, ఇళ్లలో చికిత్స పొందుతున్నారు.
అమెరికా తర్వాత కోటి కేసులు భారత్‌లోనే నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 30న కేరళలో తొలి కేసుతో ప్రారంభమైన కరోనా ప్రస్థానం ఎత్తుపల్లాలుగా సాగుతోంది.
మొత్తం కేసుల్లో 75%, మరణాల్లో 78% కేవలం పది రాష్ట్రాలకే పరిమితం అయ్యాయని ఈనాడు రాసింది.
అత్యధిక ప్రభావం నైరుతి రాష్ట్రాల్లోనే కనిపించింది. దేశంలో కరోనా ఆనవాళ్లు మొదలై ఇప్పటికి 325 రోజులైంది.
తాజా లెక్కల ప్రకారం చూస్తే దేశంలో రోజుకు సగటున 30,783 కేసులు.. 446 మరణాలు నమోదయ్యాయి.
29,386 మంది కోలుకొని ఇంటికెళ్లారు. గత 24 గంటల్లో కొవిడ్‌తో 347 మంది మృత్యువాతపడ్డారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 16 కోట్లకు చేరిందని ఈనాడు వివరించింది.

హైదరాబాదీలకు కొత్త ఏడాది నుంచి తాగునీరు ఉచితం
2021 నుంచి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు ఉచితంగా అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
కొత్త సంవత్సరం నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు.
జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబరు నెల బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదన్నారని పత్రిక చెప్పింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు శనివారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ అధికారులతో సమావేశమయ్యారు.
నగరంలో ఉన్న మొత్తం మంచినీటి నల్లా కనెక్షన్లు, నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు, విధివిధానాల రూపకల్పనపై మంత్రి సమీక్షించారని ఆంధ్రజ్యోతి రాసింది.
ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించిన సమాచారం ప్రజలకు సంపూర్ణంగా చేరేలా వాటర్‌బోర్డు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నగర ప్రజలందరికీ ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను పటిష్టంగా రూపొందించాలన్నారు.
రానున్న రెండు వారాల పాటు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించుకోవాలని, ఒకటి రెండు రోజుల్లో విధి విధానాలను రూపొందించి మరోసారి సమావేశం కావాలని సూచించినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

పొదుపులో ఏపీ స్వయం సహాయక సంఘాలు టాప్
దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఏపీ ఎస్‌హెచ్‌జీ మహిళలే అత్యధికంగా పొదుపు చేస్తున్నట్లు నాబార్డు నివేదిక వెల్లడించినట్లు సాక్షి కథనం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మళ్లీ జీవం పోసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపులో అగ్ర స్థానంలో నిలిచారు.
ఈ సంఘాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేశాయి. నిరర్ధక ఆస్తులు తగ్గిపోయాయి. ఇదంతా ఏడాదిన్నర కాలంలోనే జరిగిందని నాబార్డు నివేదిక వెల్లడించింది.
2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు నివేదిక రూపొందించింది.
దేశం మొత్తం మీద 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక పేర్కొంది.
2018–19 ఆర్థిక ఏడాదిలో 26.98 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.58,317 కోట్ల రుణాలు మంజూరు చేస్తే, 2019–20లో 31.46 లక్షల సంఘాలకు రూ.77,659 కోట్లు మంజూరైంది.
ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడం ఇదే తొలిసారి అని, అత్యధికంగా దక్షణాది రాష్ట్రాల్లోనే రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాంకు రుణాల మంజూరు ఎక్కువగా ఉందని, తద్వారా ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతోందని నివేదిక పేర్కొంది.
ఏపీలో ఏకంగా సగటున ఒక్కో సంఘానికి రూ.4 లక్షల రుణం మంజూరైందని ఈ నివేదిక స్పష్టం చేసిందని సాక్షి వివరించింది.
ఇవి కూడా చదవండి:
- క్రిస్టమస్ స్టార్: గురు, శని గ్రహాల అరుదైన కలయికను మీరూ చూడవచ్చు
- గాలీ ప్రాజెక్ట్: తిట్లన్నీ మహిళలను అవమానించేలా ఎందుకుంటాయి... కల్చర్ మారేదెలా?
- రైతుల నిరసనలు దేశాన్ని కుదిపేస్తుంటే, తెలుగు రాష్ట్రాల రైతులు ఏమంటున్నారు? వాళ్ల కష్టాలు ఏంటి?
- కొడుకు పోర్న్ కలెక్షన్ ధ్వంసం చేసిన తల్లిదండ్రులు.. పరిహారం చెల్లించాలన్న అమెరికా కోర్టు
- అయోధ్యలో రామాలయం నిర్మాణానికి రూ. 1,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాన్ ఏంటి?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నాసా స్పేస్ మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ రాజాచారి
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- అభిషేక్ బచ్చన్: కబడ్డీతో బాలీవుడ్ హీరో లవ్ అఫైర్.. ఈ గ్రామీణ క్రీడ పాపులర్ క్రీడగా ఎలా మారిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








