రైతుల నిరసనలు దేశాన్ని కుదిపేస్తుంటే, తెలుగు రాష్ట్రాల రైతులు ఏమంటున్నారు? వాళ్ల కష్టాలు ఏంటి?

- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలపై పెద్ద చర్చ సాగుతోంది. కానీ, తెలుగు రాష్ట్రాల రైతుల్లో పెద్దగా కదలిక కనిపించడం లేదనే వాదనలున్నాయి.
అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతాంగం నిరసనలు ఒక స్థాయిలో సాగుతుండడం దానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఈ చట్టాలపై వెంటనే స్పందించకపోవడానికి, మార్కెట్ వ్యవస్థలో ఉన్న తేడాలే కారణం అని పలువురు వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
ప్రధానంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తులను అక్కడి ప్రభుత్వాలే కొనుగోలు చేస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దానికి భిన్నంగా మార్కెట్ మీద ఆధారపడాలని, ప్రభుత్వం కొంతమేరకే కొనుగోలు చేస్తుందని లెక్కలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో వరి అమ్మకాలపై రైతులతో బీబీసీ మాట్లాడింది. వారి పరిస్థితిని తెలుసుకుంది. మార్కెట్లో ఉన్న వైరుధ్యంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది.
దిగుబడులపై వరదలు, తుఫాన్ ప్రభావం..
ఆంధ్రప్రదేశ్‌లో 2020లో 402.25 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. గత ఏడాది కన్నా ఇది 28.38 లక్షల హెక్టార్లు ఎక్కువ. సీజన్ ప్రారంభంలో వాతావరణం అనుకూలంగా ఉండడంతో పంట సాగు పరిధి పెరిగింది. కానీ ఆ తర్వాత వరుసగా తుఫాన్లు, వరదలు వరి రైతులపై తీవ్ర ప్రభావం చూపాయి. పలు చోట్ల పంటకు నష్టం వాటిల్లింది. ఒక్క నివర్ తుఫాన్ వల్లే వ్యవసాయరంగానికి రూ.2,831 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ ప్రభుత్వం నిర్ధరించింది. అందులో అత్యధిక నష్టం వరి పంటకే వాటిల్లింది.
ప్రకృతి విపత్తుల కారణంగా దిగుబడులు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 2019లో ఒక్క ఏపీలోనే 8.23 మిలియన్ మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ఈ ఏడాది కూడా దాదాపుగా అదే స్థాయిలో దిగుబడి ఉండవచ్చని భావిస్తున్నారు. కొంత మేరకు పంట వరదల వల్ల నష్టపోయినా, సాగు విస్తీర్ణం పెరగడం వల్ల దిగుబడుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

పంటలో అత్యధికం ప్రైవేటు వ్యాపారులకే
పంట కొనుగోళ్లలో దాదాపుగా ప్రైవేటు వ్యాపారుల హవానే కనిపిస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు వెళ్లడానికి ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపడం లేదు.
దీని వెనుక కారణం ఏంటని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ రైతు కవురు ఏడుకొండలను బీబీసీ ప్రశ్నించింది.
"ధాన్యం కొనుగోలు కోసం రైతు భరోసా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. అక్కడికి మేము ధాన్యం నమూనాలు తీసుకెళ్లాలి. వారు ధాన్యం నాణ్యత పరిశీలించి, రకరకాల కారణాలతో కొర్రీలు పెడతారు. తర్వాత మాకు ఒక రైస్ మిల్లర్‌ని కేటాయిస్తారు. రైతు భరోసా కేంద్రంలో ఆమోదం వచ్చినా, అంతా రైస్ మిల్లర్ ఇష్టం ప్రకారం జరుగుతుంది. ధాన్యం రంగు మారింది, తాలు ఉంది, తేమ ఉంది అంటూ వాళ్లు ఎన్నో అడ్డంకులు చెబుతారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో మేము ధాన్యం వారికే తోలాల్సి ఉంటుంది" అని ఆయన చెప్పారు.
ధాన్యం బస్తాలను రైస్ మిల్లులకు చేర్చే పూర్తి బాధ్యత రైతుల మీదే ఉంటుందని, అక్కడకు ధాన్యం చేర్చాక అసలు టెన్షన్ మొదలవుతుందని ఏడుకొండలు చెప్పారు.
"మేము పండించిన పంటకు ప్రభుత్వం చెప్పిన ధరకు, మా చేతికి వచ్చే దానికి పొంతన ఉండదు. కనీసం రూ. 1400 తగ్గకూడదని చెబితే మాకు క్వింటాలుకు రెండొందలు తగ్గించి ఇస్తారు. ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో కూడా తెలీదు. కొన్నిసార్లు వారంలోపే వస్తే, కొన్ని సార్లు నెలలు దాటిపోతుంది. మేం రబీకి పెట్టుబడి పెట్టాలి. ఇలా ధాన్యం ఇస్తే డబ్బు ఎప్పుడొస్తుందో తెలీక కొందరు రైతులు ప్రైవేటు దళారులకు అమ్మేస్తూ ఉంటారు" అన్నారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఏమిటి
ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఖరీఫ్‌లోనే సుమారు 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఆ ధాన్యం సేకరణ నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2086 కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభినట్లు పౌరసరఫరాల శాఖ డ్యాష్ బోర్డ్ లెక్కలు చెబుతున్నాయి.
వీటిలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 427, పశ్చిమ గోదావరి జిల్లాలో 366, కృష్ణా జిల్లాలో 343 కేంద్రాలున్నాయి. వాటిలో డిసెంబర్ 17 సాయంత్రానికి 92,683 మంది రైతుల నుంచి 7.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
సేకరించిన ధాన్యం విలువ రూ. 1442 కోట్లు కాగా, అందులో ఇప్పటి వరకూ రైతులకు చెల్లించింది రూ. 800 కోట్లు. మరో రూ.640 కోట్ల వరకూ బకాయిలున్నట్టు ఆ రిపోర్ట్ చెబుతోంది.
ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాలలో సవాలక్ష ఆంక్షలు ఉండడంతో ధాన్యం అమ్మడం చాలా కష్టంగా ఉందని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రైతు వి. శ్రీకాంత్ బీబీసీకి చెప్పారు.
"ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవానికి పొంతన లేదు. నేను 12 ఎకరాలు కౌలు చేస్తున్నాను. మొన్నటి వర్షాలకు ధాన్యం కొంత రంగు మారింది. స్వర్ణ మసూరి పండించాను. బాగున్న ధాన్యంతో పాటూ రంగు మారిన ధాన్యం అమ్మకం కోసం రైతు భరోసా కేంద్రాలు, సహకార సొసైటీల చుట్టూ తిరుగుతున్నాను. అటు దాళ్వా పనులు చేసుకోవాలా లేక ఇటు పంట అమ్మకం కోసం పాట్లు పడాలా తెలీడం లేదు. పోలవరం కాఫర్ డ్యామ్ వల్ల డిసెంబర్ నెలాఖరుకి ధాళ్వా నాట్లు వేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ ఖరీఫ్ పంట అమ్మడమే ఇంకా పూర్తికాలేదు. అందుకే, రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు వెళ్లి, వారు ఇచ్చిన రేటుకే పంట అమ్ముకోవాల్సి వస్తోంది " అన్నారు.

తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి...
ధాన్యం కొనుగోళ్లలో ప్రైవేటు వ్యాపారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు రైతు పొలంలోనే ధాన్యం కొని తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంటారు. తెలంగాణలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది.
అయితే వ్యవసాయ మార్కెట్లలో గతంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేవని, ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు వారికే అమ్ముకోవాల్సి వస్తోందని బీబీసీతో మాట్లాడిన ఖమ్మం జిల్లా మధిర రైతు బోడేపూడి వీరేంద్ర అన్నారు.
"ధాన్యం పండించే వరకూ ఒక సమస్య. పంట చేతికొచ్చిందనే సంతోషం కన్నా దానిని అమ్ముకుని సొమ్ము చేసుకోవం ఎలా.. అనే టెన్షనే ఎక్కువ. దాదాపుగా అంతా వ్యాపారుల చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వ కొనుగోళ్లు నామమాత్రమే. తెలంగాణలో కొంత భాగం వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు చేసేవారు. కానీ రానురాను అది తగ్గిపోతోంది. ప్రస్తుతం సాధారణ రకం క్వింటాల్ కి రూ. 1300 వరకూ అమ్ముకుంటున్నాం. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం అయితే క్వింటాలుకి వంద వరకూ రైతుకి ప్రయోజనం ఉంటుంది. కానీ అది, లేక రైతు కష్టం దళారుల పాలవుతోంది" అని చెప్పారు.
దాదాపు అన్ని పంటలదీ ఇదే పరిస్థితి...
అత్యదికంగా సాగు చేసే వరితోపాటూ, ఇతర ప్రధాన పంటలు, వాణిజ్య పంటల్లో కూడా మార్కెట్ వల్లే రైతుకి ఎక్కువ నష్టం జరుగుతుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
దీనిపై బీబీసీతో మాట్లాడిన ఏఐకేఎస్ రాష్ట్ర నాయకుడు కే శ్రీనివాస్ రైతుకి విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకూ ప్రతీ చోటా గండమే అన్నారు.
"రైతులు నకిలీ, కల్తీ విత్తనాల దశ దాటిన తర్వాత పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించడం, అధిక వడ్డీ భారం భరించడం లాంటి సమస్యలున్నాయి. ఆ తర్వాత ప్రకృతి విపత్తులతో నిత్యం భయంతోనే బతుకుతుంటాడు. చివరకు అంతా బాగానే ఉండి, పంట చేతికి వచ్చాక రైతు చేతుల్లో ఏమీ ఉండదు. మార్కెట్ అంతా దళారులు, వ్యాపారులదే రాజ్యం. వరి పంట అయితే రైస్ మిల్లర్లు చెప్పినట్టే సాగుతుంది. ప్రభుత్వం కొనుగోలు చేసే పంట మూడో వంతు కూడా ఉండదు. మిగిలినదంతా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిందే. ఒక్కో ఏడాదిలో సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి ప్రైవేటు వారికి చేరుతుందని మా అంచనా. దాని ప్రకారం ఏటా రైతు రూ. 6 వేల కోట్ల కష్టార్జితం కోల్పోతున్నాడు. ఒక్క వరి మాత్రమే కాదు, ప్రత్తి, మిర్చి లాంటి ఇతర పంటలను కూడా కలుపుకుంటే ప్రైవేటు వ్యాపారులు ఏటా రూ. 15 వేల కోట్లకు పైనే లాభాలు దోచుకుంటున్నారు" అని వివరించారు.
కౌలుదారులకు మరింత కష్టం..
ప్రస్తుతం గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో దాదాపు సాగుదారులంతా కౌలుదారులే. భూముల యజమానులు సాగుకి దూరం కాగా, వారి స్థానంలో 80 శాతానికి పైగా కౌలుదారులే వాటిని సాగు చేస్తున్నారని రైతు సేవా సంస్థ, గుంటూరు ప్రతినిధి పి వెంకటేష్ బీబీసీకి తెలిపారు.
"పెట్టుబడి సేకరణ నుంచి పంట అమ్మకం, ప్రకృతి విపత్తుల మూలంగా పోయిన పంటలకు నష్టపరిహారం వంటి అన్ని అంశాల్లో కౌలుదారులకు అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వాలు పేరుకి కౌలుదారుల చట్టాలు చేసినా అవి ఆచరణలో అక్కరకు రావడం లేదు. దాంతో వారి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 30 బస్తాలు పండితే అందులో 15 బస్తాలు భూమి యజమానికే సరిపోతుంది. ఎకరాకి రూ. 25వేలు పెట్టుబడి పెడితే మిగతా పంట 15 బస్తాలకు కలిపి రూ.20వేలు కూడా రావడం లేదు. ఇక రెండో పంటలో మిగిలిన మొత్తమే రైతు శ్రమకు ప్రతిఫలంగా ఉంటుంది" అన్నారు.
రైతు నష్టపోకుండా చూస్తున్నాం..
మరోవైపు ప్రభుత్వం మాత్రం పంటలకు మద్ధతు ధర లేదనే కారణంతో రైతు నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యల గురించి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి బీబీసీతో మాట్లాడారు. రాష్ట్ర రైతులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు.
"రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం ధరలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వాటిని అమలు చేసేందుకు పూనుకుంది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే చర్యలు తప్పవు. గ్రేడ్ ఏ రకం పొడవు ధాన్యం క్వింటాల్ కి రూ. 1880, కామన్ రకానికి రూ. 1868 ఇవ్వాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మద్ధతు ధర వివరాలతో పాటుగా సంబంధిత సమాచారమంతా రైతులకు ఫోన్ల ద్వారా అందిస్తున్నాం. కొనుగోలు కేంద్రం వారు రైతు కళ్లంలో ధాన్యాన్ని పరిశీలించి, కొనుగోలు ధర నిర్ణయిస్తారు. ఇవన్నీ సక్రమంగా అమలు జరిగేలా వ్యవసాయ, పౌర సరఫరా. మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది " అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









