గురు, శని గ్రహాల అరుదైన కలయిక.. 800 సంవత్సరాలలో ఎన్నడూ లేని అద్భుతం

ఫొటో సోర్స్, DETLEV VAN RAVENSWAAY/SCIENCE PHOTO LIBRARY
గురు గ్రహం (జూపిటర్), శని గ్రహం (సాటర్న్) తమ తమ కక్ష్యల్లో ప్రయాణిస్తూ మెల్లగా ఒకదానికి ఒకటి చేరువగా వస్తున్నాయి. డిసెంబర్ 21 సాయంత్రం ఈ రెండు గ్రహాలు ఒకదానినొకటి దాటి వెళతాయి.
రెండు గ్రహాలు ఒక దానినొకటి దాటుతూ, ఒక చోట కలిసిపోయినట్లు కనిపిస్తాయి. అప్పుడు మన కంటికి పెద్ద వెలుగు కనిపిస్తుంది. రెండు గ్రహాలు ఒకే కక్ష్యలో (డబుల్ ప్లానెట్) ఉన్నట్లు కనిపిస్తాయి.
డిసెంబర్ నెలలో క్రిస్మస్ సమయంలో ఈ అద్భుతం జరుగుతుండడంతో, రెండు వేల సంవత్సరాల క్రితం ఆకాశంలో కనిపించిన బ్రహ్మాండమైన కాంతి 'స్టార్ ఆఫ్ బెత్లెహం' ఇదే అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవారు, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించేవారు ఆకాశంలో ఈ కలయికను వీక్షించవచ్చు.
భారత్ లో సాయంత్రం 6.30 నుంచి 7.30 మధ్యలో ఇది కనిపించే అవకాశం ఉందని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.
"సాయంత్రం పూట ఆకాశంవైపు చూస్తే ఆ రెండు గ్రహాలు దగ్గరగా వస్తున్న సంగతి తెలుస్తుంది. వాతావరణం ఎప్పుడు, ఎలా మారుతుందో తెలీదు కాబట్టి వెంటనే చూస్తే మేలు. మంచి అవకాశం కోల్పోకుండా ఉంటాం" అని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీకి చెందిన డా. కరోలిన్ క్రాఫోర్డ్ తెలిపారు.
సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ఆకాశంలో నైరుతి దిశగా ఈ రెండు గ్రహాలనూ చూడవచ్చు.
అయితే, సూర్యుడు చుట్టూ నిత్యం తిరిగే గ్రహాలు ఒకదానిని ఒకటి క్రాస్ చేసుకోవడం అనేది తరచూ జరిగేదే. కానీ ఈ కలయిక ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి అత్యంత సమీపంగా వస్తున్నాయి.
"ఇలాంటి సంయోగాలు కొత్తేమీ కాదు. కానీ గ్రహాలు మరీ ఇంత దగ్గరగా రావడం అరుదైన విషయమే" అని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రొఫెసర్ టిం ఓ బ్రియెన్ తెలిపారు.
జూపిటర్, శాటర్న్..రెండూ కూడా పెద్ద గ్రహాలు. ఆకాశంలో స్పష్టంగా, కాంతివంతంగా కనిపించే గ్రహాలు. ఈ రెండు గ్రహాలు గత 800 సంవత్సరాలలో ఇంత దగ్గరగా రాలేదు. "మళ్లీ మరో 400 ఏళ్లకు మనం ఎవ్వరం బతికి ఉండం. కాబట్టి ఇప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది" అని ప్రొఫెసర్ ఓ బ్రియెన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంది
''బృహస్పతి, శని గ్రహాలు చూడటానికి ఆకాశంలో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి''అని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్‌విచ్‌కు చెందిన ఎడ్ బ్లూమర్ అన్నారు.
ఈ రెండు గ్రహాలు ఒకదాని ముందుకు మరొకటి వచ్చీ.. ఈ రెండూ కలిసిపోతున్నాయా? అనే భ్రమను కలిగిస్తాయి.
''ఈ రెండు ఒకదానిలో మరొకటి కలిసిపోతున్నాయా అని మనకు అనిపిస్తుంది. దీన్ని ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే చూడొచ్చు''అని ఎడ్ చెప్పారు.
''భూమి నుంచి బృహస్పతికి మధ్య దూరం 800 మిలియన్ కి.మీ.లకు పైనే ఉంటుంది. బృహస్పతి, శనిల మధ్య కూడా దాదాపు ఇంత దూరమే ఉంటుంది. కానీ ఈ రెండు దాదాపు ఒకే పరిమాణంతో కలిసిపోతున్నట్లు మనకు కనిపిస్తాయి''అని ఎడ్ వివరించారు.
''ఈ రెండు కలిసే పరిణామాన్ని చూడటం చాలా సరదాగా అనిపిస్తుంది. మీ దగ్గర బైనాక్యులర్స్ ఉంటే బృహస్పతి చుట్టూ ఉండే నాలుగు చంద్రుళ్లను కూడా చూడొచ్చు''అని ఎడ్ తెలిపారు.
బృహస్పతి చుట్టూ తిరిగే ఈ చంద్రుళ్లను గెలిలియన్ చంద్రుళ్లుగా పిలుస్తారు. ఎందుకంటే వీటిని 1610లో తన కొత్త టెలిస్కోప్‌తో గెలిలియో కనుగొన్నారు.
శని, బృహస్పతిల కలయిక ప్రతి 19.6ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ''కానీ, ఈ 2020 కలయికకు ఒక ప్రత్యేకత ఉంది. 17వ శతాబ్దం తర్వాత ఇవి చాలా దగ్గరగా రాబోతున్నాయి. 397 ఏళ్ల క్రితం ఇలానే జరిగింది''
ఇవి కూడా చదవండి.
- హలాల్ పద్ధతిలో జంతువులను చంపొద్దంటూ ఈయూ కోర్టు తీర్పు.. ముస్లింల అభ్యంతరం
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నాసా స్పేస్ మిషన్ కమాండర్‌గా హైదరాబాదీ రాజాచారి
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- అభిషేక్ బచ్చన్: కబడ్డీతో బాలీవుడ్ హీరో లవ్ అఫైర్.. ఈ గ్రామీణ క్రీడ పాపులర్ క్రీడగా ఎలా మారిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








